సుంకులమ్మల మల్ల కొత్త ఊపిరి వచ్చినది.
తీరు తీర్ల వన్నెల్ల, తీరు తీర్ల పనొరసల్ల చంద్రం నేసెడి సనుగులు సూసి లక్ష్మయ్య మనసుల మెచ్చుకున్నడే కాని, వానివల్ల తనకు లాబం ఏమి లేకుండేతలికి వానిమీద ఆసే వదులుకున్నడు.
ఊర్ల అంత తన్ను దొంగ లెక్క సూస్త రనుకున్నడు కాని మల్ల మంచిగనే సూస్తన్నందుకు చంద్రంకు బాగనిపించింది.
ముత్తాలు కాని, అమ్మ కాని, మామ కాని ఎవ్వరు బటువు ఏడున్నదంట అడగలే. అదె శాలను కుంట, దేవునికి మొక్కుకున్నడు చంద్రం!
చంద్రం యింట్ల యిప్పుడు రొండు తీర్ల మొగ్గాలున్నయి. ఆండ్ల ఒకటి పింజెర మొగ్గం. బొగిడి, లాయిరి, పువ్వు, పిందె, నెమిలి, అంస ఏదన్న కాని మంచిగ పడతయి.
చంద్రం పనితనం ఊర్లనే కాదు, సుట్టు పట్టుల శాన మంది సవుకార కెరికయి పని సేపిచ్చుకునేతందు కొస్తున్నరు. రాములు, లక్ష్మయ్య కూడ, లగ్గసరి రోజుల్ల రొండు మూడు పీతాంబరాలకు ఆడరిచ్చి సేపిచ్చిన్రు.
పెద్ద పన్లకయితే, సుంకులమ్మ తాన ముత్తాలు కూడ కూసోని మంచిగ సాయం చేస్తున్నది.
ఆయాల, బువ్వ తిన్నంక యాదో కాకితం తెచ్చుకొని ఆండ్ల సుక్కలు వెట్టుకుంట సూసుకుంటుండు చంద్రం.
"ఏంది, బావ?" అన్నది ముత్తాలు.
"పనొరస ఏస్తన్న!" అన్నడు చంద్రం.
"ఏంటికి?"
"సీర కోసానికె!"
"ఎసొంటి సీరె, బావ?"
"నీ అసొంటి సక్కటి సీర, ముత్తాలూ!"
"పక్క గుండెటిది నేనెనా, సీరెన?"
"నీ అసొంటి సక్కని పిల్లకు, మల్ల సక్కటి సీరెనె ఉండాలె కద?"
"అట్ల?" ముత్తాలు నవుకున్నది.
"ముత్తాలు!" అన్నడు చంద్రం.
"ఏంది. బావ?" అన్నది ముత్తాలు.
"ఇన్నేండ్ల ఎనకసిరి మల్ల మనం యీడ కూసుంటే నాకు యాదొస్తున్నది, ముత్తాలు!"
"ఏంది, బావ?"
"మన సిన్నతనం, మన ఆటలు, మన పాటలు! మర్రితాన ఉయ్యాల్లు, కుంటల తానాలు....."
ముత్తాలుకు కండ్లెంబడి నీల్లు వచ్చినయి.
"నువ్వట్ల ఏడిస్తే నామీన ఒట్టు!"
"లేదు, బావ!"
"మల్ల నే నీడుంటే నీకు నీల్లేంటికి సెప్పు?"
"లేదు, బావ! ఉత్తనె."
"నీ మనుసంత నా కెరికెనె, ముత్తాలు! నీ కండ్లల దుమ్ముకొట్టి పారిపోయినోన్ని నేనె!"
"లే, బావ! అట్లెప్పుడనొద్దు!"
"నీ పాటలు, నీ యాటలు అన్ని మల్ల కొత్త ఊపిరిస్తన్నయి, ముత్తాలు! ఆ పాట మల్ల ఒక్క తేప పాడు!"
"ఏ పాట?"
"ఎప్పటికి నీకు నచ్చెడిది!"
"ముత్తాల పందిట్ల ముగ్గు లెయ్యంగ
రతనాల పందిట్ల రంగు లెయ్యంగ
ముత్తాలు మెడలనే......."
"ఆగిన వేంది, బిడ్డ? పాడు!" అంటొచ్చింది సుంకులమ్మ. "సిగ్గయితున్నాది? అయితే నే పోతలే!" అన్నది.
"లే, అత్త!"
"లేకుంటే అదేంది, మల్ల?"
"ఇగ్గో, సెంద్రయ్యా! మన ముత్తాలుకు మంచి సీ రొకటి నేసి కట్టిపియ్యాలి, బిడ్డా!" అన్నది సుంకులమ్మ.
ముత్తాలు నవుకున్నది.
ముత్తాలు దిక్కుకు సూసి చంద్రం నగిండు.
"అట్లనే, అమ్మ!" అన్నడు.
"ఎసొంటి సీరె నేస్తవ్?"
"ముత్తాల పందిరి సీరె!" అప్పుడు చంద్రం.
ఆ మాటత ముత్తాల కండ్లల రవ్వ లెలిగి నయి.
సుంకులమ్మ ముత్తాల్ను గదువలు పట్టుకొని ముద్దులాడింది. "ఇన్నావు, బిడ్డ! నీ బావ యిన్నేండ్లు ఊరిడిసి పోయిన కాని, నీ కోసానికే యింత యిద్దె నేరిసిండు, ఎరికెనా?" అన్నది.
చంద్రం ముకం దించకోని కాకితంల సూస్తండు.
"సూడు, సెంద్రయ్యా! ముత్తాల పందిరి సీరంట అట్లిట్లుంటే కాదు! శాన మంచిగ నెయ్యాలె. ఊర్లల్ల నువు నేరిసిన పనితనమంత యిండ సూపియ్యాలె. ఆ సీరె కడితె, నా బిడ్డ ముత్తాలు పెండ్లి పందిట్లున్న లెక్క కండ్లు కలకల్లాడాలె!"
"అట్లనే, అమ్మ!" అన్నడు చంద్రం.
"ఈమె సీరె కోసానికే మంచి పత్తి అరుసు కోని నేను తెస్త. గిర్కకేసి, యిత్తులు తీస్త. మంచిగ ఏకులు వడత. మల్ల రాటానికి సన్నగ దారం తీస్త. తాతల సంధి సేస్తన్న యిద్దెల ఎంత పనితన మున్నదో యిండ్ల సూపిస్త. ఈ సేతుల్ల యింక బలమున్నది యీమెకోసానికె, బిడ్డా! సన్నగ, రొండు నూర్ల నెంబరు దంక దారం తీయగలుగుత!"
"నా కోసానికి నువ్వింత కష్టం సెయ్యడం మంచిగ లేదత్తా! పిన్నాండ్లం మేము మీకు సెయ్యాలె!" అన్నది ముత్తాలు.
"అట్ల కాదు, బిడ్డా! ఇది నా ముచ్చట!" అన్నది సుంకులమ్మ.
"నీ ముచ్చట తానె చేస్తమమ్మ! ఆ దారంలనె మన మనుసుపెట్టి చేస్తం! 'సాల్నా? పన్నెండు మూర్ఖ సీరల, కట్టు జెరుగుకూడ గట్టిదెనేస్త! యిన్నవా? కమ్మిల నెవిఁళ్ళు తీస్త, అంచల్ల రేషం, జెరీపెట్టి అంసలు దీరస్త, ముద్దు ముద్దుగ ముచ్చెర కొలుకులు దీస్త. సీర బొడ్డుల దళ్ళుతీసి నడమ ముత్తాలు అతుకుత" అన్నడు చంద్రం.
సుంకులమ్మ కోడలి బుజాల మీద వాలి పోయింది.
ముత్తాలు సంతోసంత కండ్లు మూసుకున్నది.
"సీరెమీకి మంచి రైక కనుము కూడ కావాలె, బిడ్డ!" అన్నది సుంకులమ్మ.
"అట్లనే, అమ్మ!" అన్నడు చంద్రం.
సుంకులమ్మ ఆయాల్నె శెల్కల్ల తిరిగి, ముత్తాల పందిరి సీరె కోసానికి మంచి పత్తి ఎంచుకున్నది. దూది జరా కప్పుమీదుంటది. మెత్త గుంటది. కాయ సిన్నగుంటది. గంపల్లల్ల తెచ్చి యింట్ల ఏసిన్రు.
సుంకులమ్మ అయ్యన్ని మంచిగ ఎండల యేసి, కట్టెత కొట్టి దూలిగిట్ట అంత పోయినంక, గిర్క తెచ్చి యిత్తులు దీసింది. మల్ల యండ్ల ఏసి, సేతుల్త యిప్పింది. దూదేకులాయన్ను పిలిసి, మంచిగ ఏకిపిచ్సింది. దూదేకులా యనను పిలిసి, మంచిగ ఏకిపిచ్చింది. ఏకినంక, గింత బరుగు తీసుకోని తొడమీన పత్తినెట్టి ఆరిశేత్త గిట్ల తాల్సింది. ఏకులయినది. రాటం తాన కూసోని, ఏకును తోలు పొత్తిలవెట్టి ఎడమసేత సిన్నగ బారతీస్త కదురుమీద వోసింది.
దినాలకు దినాలు గడుస్తన్నయి. సుంకులమ్మ అట్లా బారలు తీస్తనే ఉంది. చంద్రం, సీరె పనొరసల రకరకాల తీర్లు కొత్త నమోనాల యింక ఎట్లెట్ల తీసేడిది సూసుకుంట, కాకితంల సుక్కలు వెట్టుకుంటనే ఉన్నడు.
ముత్తాలు అత్తను సూస్త మసునుల మొక్కుకుంటనే ఉన్నది. ఆమె ఏమన్న సాయం చేస్తనన్న అత్త సెయ్యని యటంలే.
పట్నం కెల్లి ఒకాయన లక్ష్మయ్యతా నొచ్చిండు.
లక్ష్మయ్య తానకి వచ్చెటోండ్లు దినాము శానమందుంటరు. ఈ పట్నమాయన లెక్కనా? ఆయన వచ్చినంక శానసేపట్లనే కూసొ వెట్టి, తన పన్లన్ని సూసుకున్నంక, అప్పు డాయన దిక్కు కోచ్సిండు లక్ష్మయ్య.
"పట్నం కెల్లి వచ్చినారు?"
"హవ్" అన్నడాయన.
"ఏమిటికొరకు?"
"రాములిసయంల జర అరుసుకునెతందుకొచ్చిన!"
"ఏందది?"
"ఆయన్ను మీరు మంచిగ గురుతుపడతరా?"
"అవ్. మా సంగం సెక్కరట్రి కద?"
"ఆయన యింక ఏం పని సేస్తడు?"
"బట్టల యాపారం. నేసిస్తడు, అమ్ముతడు!"
"వాని దే వూరు?"
"పేటల ఉండేటోడు. ఇప్పుడు పట్నంల పెద్ద దుకనం పెట్టిండు."
"ఈడుండదా, మల్ల?"
"ఉంటడు కాని, శాన్దినాలు ఆడనే ఉంటుండు."
"లంబడ తండత వానికేమి సమ్మంధం?"
"ఏమి లేదు."
"ఆయన మీకేమి కావాలె?"
"ఇంక ఏమి కాడు."
"మనిషి ఎసొంటోడు?"
"శాన మంచోడు."
"ఇంకేమన్న సెప్పగల్తరా?"
"ఏమి లేదు."
"మంచిది! మల్లొస్త!" అంట బోయిండు. రాములు లోపల కూసోని యిదంత యింటనే ఉన్నడు.
"ఇన్నావు, అల్లుడ?" అన్నడు లక్ష్మయ్య.
"ఇన్న, లచ్మయ్య!" అన్నడు పేట దొర రాములు.
"నీమీద పోలీసోండ్లనిగా సూసినవా?"
"లే, లచ్మయ్య! నేను బెంకుల అప్పుకోసానికి దరకాస్తు వెట్టిన, అందుకోసానికి అన్ని అరుసుకునేతందు కొచ్చిండు. అంతనే మామ!" అంట నగిండు రాములు.
"అట్లనా?" అన్నడు లక్ష్మయ్య.
"ఆవ్, మల్ల! వీండ్ల ముకాలు సూస్తే గురుతు వట్టలెవ్వా?" అంట మల్ల నగిండు.
ఇద్దరు లెస్సగ నవుకున్నరు.
"ఇది యిన్నవా, లచ్మయ మామ?" అన్నడు రాములు.
"ఏంది, అల్లుడ?"
"ఇగ్గో, ఈడ సంగం బంగ్లా కట్టకంల మనం యిద్దరం శాన దబ్బు తిన్నమంట సెప్పు కుంటున్రు."
"ఎట్ల ఎరికె వట్టిన్రు?"
"పాముల్లె కండ్లు, సెవులు ఒక్కతానె ఉండేటోల్లు శానమందుంటరు!"
"అచ్చ పోనియ్! ఏడ్సెటొల్ల లెక్క మన కేంది? వాండ్లకు ఎట్ల లాబం చేసుకునేడిది తెలవదు. అట్లా లాబం చేసుకునేటోండ్లను సూస్త ఏడుస్తనే ఉంటరు."
"మంచిగ సెప్పినవు!"
"రాములు!"
"ఏంది, మామ?"
"ఇన్నేండ్ల సంది నువ్వు ఒప్పకుంటనే ఉన్నవు. ఇయ్యాలా సెప్పు! నా బిడ్డను నివ్వు చేసుకుంటవా, లేద? నువ్వు చేసుకుంటే నాకు ఏన్గ బలం, రాములూ! అందుకోసానికే, యిన్ని దినాలు నీకొరకే బిడ్డ నట్లుంచిన, ఇంకెన్ని దినాలు, సెప్పు? మా సెందిరిగాడు కూడ ఊర్ల కొచ్చిండె. వానికే ముత్తాలును చేసుకొనాలంట మా అక్క ఆసపడతన్నది. నిన్ను చూసిన సంధి, నీకె యి య్యాల్నంట నాకు మనుసయితున్నది. ఏమంటవు, సెప్పు?" అంటడిగిండు లక్ష్మయ్య.
"అట్లనే, మామ! నీ మాటెట్ల కాదంట? నా మంచి సెడ్డలు నీ కన్ని ఎరికెనే. ఇద్దరం కలిస్తే యాపార మింక మంచిగ చేసుకునొచ్చు!"
"అవ్, రాములు! అందుకోసానికే, కద? బామ్మనాయన్ను పిలిసి, లగ్గం పెట్టి యాల్నా?"
"అట్లనే, మామ! నా అసొంటోనికి నీ బిడ్డ దొరకడం పున్నెమే కద?" అంట మామకు మొక్కిండు రాములు.
సుంకులమ్మ వడికిన నూలు మాల్నూలు కంటే మంచి గుందంట. అందరు మెచ్చుకుని పోయిన్రు. ఇంట్లనున్న శెయ్యాసు మీదనె ఆసువోసింది.
చంద్రం పడుగుచేసి, సరిచేసుకోని, అచ్చు అతుక్కోని, మొలగట్టుకోని, లచ్చ న్లేసుకోని, మొగ్గం జొరిండు. బద్దాటేసి కమ్మి శురుచేసిండు. పనోరస కాకితం పక్కన వెట్టుకోని, నేసుకుంట వచ్చిండు.
ముత్తాలు వచ్చి, సీరె సూసుకుంట పోతనే ఉంది. ఎప్పుడెప్పుడయితదంట దినాలు ఎందుతనే ఉన్నది.
పది మూర్ల సీరె నేసకం అయ్యింది.
గీ పని పట్టుకొని కూసుంటే, సనుగు దినెడిదన్క ఏరె సరి ఎక్కిచ్చె తందు కీలులేదు కద? అందుకోసానికి శాన గిరాకులు అట్లనే ఆపుకుంట వచ్చిండు చంద్రం.
మాలి పటేల్ పెండ్లం సీతమ్మ, కోడలు కొరకు కాట్రేకు సీరె నెయ్యాలంటొచ్చింది.
"కాట్రేకు సీర్లు పడుసోల్లు నెయరాదు, సీతమ్మ!" అన్నది సుంకులమ్మ.
"అట్లనా, సుంకులమ్మ? నా కెరికె లేకుండె."
"పర్వలే! కూసా, అమ్మ! పేదోండ్లం మా యింట్ల నూలుపెట్టమీనె కూసొనాలె!"
"అదె మీ బాగ్గెం!" అంట నగింది. మల్ల అన్నది: "సుంకులమ్మ! నాగయ్య తల్లి ఉన్నదిలే, అంతమ్మ, ఆమె ఏమన్నదోయిన్నావు?"
"ఏంది?"
"ముత్తాలుకు పెండ్లంట!"
"అట్ల?"
"పదేను దినాల్లంట! పేట దొర రాము లున్నడులే, వానికె యిస్తడంట కద?"
"అట్ల?" అన్నది సుంకులమ్మ ఇంకేమి ఆనలే.
"మేన పిల్లడు యీడుంటే, ఎవనికొ యీడ మేంది? ఇయ్యాల పైనున్నదంట సుట్టరికాలు తెంపుకుంటారు?" అన్నదామె.
సుంకులమ్మ మాటాడలే.
కొంచెంసేపున్నంక ఆమె ఎలిపోయింది.
సుంకులమ్మ ఆడనే కుప్పల కూలపడ్డది!
పొద్దాలింది.
"అమ్మ!" అంట పిలిసిండు చంద్రం.
"మొగ్గం మీద సీకట్ల సీరె మంచిగ కనిపియ టంలే. ఎక్క తెస్తావమ్మ?" అంట మల్ల పిలిసిండు.
సుంకులమ్మ మాటాడకుండనే లేపి ఎక్కతెచ్చి దీసోడమీద వెట్టింది.
"ఎందమ్మ, అట్లన్నవు?" అంటడిగిండు చంద్రం.
"ఏందిలె, బిడ్డ!"
"నాకు సెప్పరాదు?"
"సెంద్రయ్యా! ఇప్పుడు కూడ నీకన్నా ఆమె జరుగుతుంది!"
"ఏందమ్మ? ఏమాయె?"
"ఎట్ల చెప్పాలె, బిడ్డ, ఈ నోటిత? మీ మామ ముత్తాల్ను నీకు కాకుండ చేస్తండు!"
"ఏం చేస్తున్నాడమ్మా?"
"ముత్తాలుకు పెండ్లి నిశ్చయం సేసిండట!"
చంద్రం కండ్లు మూసుకున్నాడు. చక్కరయినట్లు ఉన్నడు. మొగ్గం నిలుపులు బట్టు కోని అట్లనే తలవాల్సుకున్నడు.
"సెంద్రయ్యా!" అన్నది సుంకులమ్మ.
"పోనిలే, అమ్మ! ముత్తాలు ఆడనే సుకంగుంటది. ఈడ కండెలు వట్టా, ఆసువోయా. యింకేమున్నది? కలోండ్ల యిండ్లల బువ్వన్నం తింటది. మనింట్ల కలితాగి ఎట్ల సుకపడత డమ్మ?" అన్నడు.
"బిడ్డా!" అంట వాని సేతుల్ల వాలి కండ్లు తడుపుకున్నది.
ఎక్క సిన్నగ ఎలుగుతున్నది.
అరేయి చంద్రం మొగ్గం నెయ్యలే. సుంకులమ్మ బువ్వ వండలే.
* * *
