Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 1


                          వెలుగు వెన్నెల గోదారీ
                                                                                     పోరంకి దక్షిణా మూర్తి

                          
    "అయ్యా, అయ్యా! రండయ్య! నేనిత్తాను కొనండయ్యా! పచ్చట్లో ఏసుగుంటే రుసోత్తాది. బంగారం లాటి కొత్తిమీరి. కొనండయ్యా!"
    "కానీ కెన్ని కట్ట లిస్తావ్?'
    "అందరికీ నాలుగు. తవరి కయిదిత్తానయ్యా!"
    "ఆహా! మరి అందరికీ యిలాగే చెప్తావా?"
    "తవరి పాదాలు సాచ్చి! అబద్దాలాడ్డం మా కులం లోనే లేదయ్యా!"
    "అబ్బో! మాటలు నేర్చిన పిల్లవే! నీ కేల్లాటి మొగుడోస్తాడో ఏమో!"
    "పొండయ్యా ! నా పెళ్ళి వూసు మీకేందుకో?" మొగం తిప్పుకున్నాది.
    "శృంగార నాయుకవు కాదగిన దానివే !" అనుకున్నాడు బాలయ్య గోరు.
    సావంచాయని మించి లేపోయినా , కారు నలుపు మట్టు క్కుకాదు. పడుసుతనం సొగసంతా ఒళ్లిరుసుకొకపోయినా , దాన్లో నిదరోయినట్లూ లేదు. ముదర పసూపు రంగు పరికినీ కట్టుకుని, ఎర్రటి కండువా పయిటేసుకున్నది . కొట్టోచ్చినట్టున్న నీలం రంగు రయిక కూతంత ఒత్తిగిలి సూత్తన్నాది . కొత్తి మీరి కాడల బంగారం సేతులకి పులుపు కున్నాది. ఎండ ఏడికి మొగం కందిపోయినాది. ముత్తాల్లాటి సేవటబొట్లు తలుక్కు మంటున్నాయి. గుండ్రపాటి మొకపు మీదున్న అర్ధరూపాయి కాసంత కుంకపు బొట్టూ కొంచెం కొంచెం కరిగి, ఒయ్యారంగా ముక్కు దూలం మీదికి జారతన్నాది.
    అలానే సూత్తా నిలుసుండిపోయాడు బాలయ్య గోరు.
    ఆవోదాన్లు గారి ఆవుదూడల్ని పాకేంపుకి తోలు కేల్తావున్న రావణయ్య గాడు --
    రాజుగారి తోటలో తను మామిడి పింది లేరుకుంటూ వుంటే -- అయేల , సందేల మాయి మబ్బులు కమ్ముకొత్తావుంటే -- తోట కట్టబడి ఆడు దాపుకొత్తావున్నా లెక్క సేయక పొతే -- పిల్లి కూనలా సల్లగా ఒచ్చి ఆడు కొంగట్టుకు లాగినప్పుడు --
    బాలయ్య గోరు తనేంపు సూత్తంటే , అదంతా మల్లా గురుతుకొచ్చి ఒల్లంతా సిగ్గొచ్చి సుట్టేసినాది రావులమ్మ కి.
    తను అందిచ్చిన కొత్తిమీరి కట్టలు సేత్తోనే పట్టుకొని, తనేంపే గుచ్చి గుచ్చి సూత్తన్న బాలయ్య గారి సూపులు లోనకే గుచ్చుకు పోవడంతో --
    "మొగోల్లందరూ తన్నిలా సూత్తారేవో?' అనుకున్నాది.
    బాలయ్య గారు అక్కన్నిం చెల్లిపోయారు.
    "ఆరికి కోపం ఒచ్చిందేవో?' అనుకున్నాది రావులమ్మ.
    పెదాలు బిగబట్టి నాలిక్కోరుక్కున్నాది.
    తడితడిగా ఉన్న సేతులెత్తి సిగ గోక్కున్నాది. మనసులోనే తను లెంప లేసుగున్నాది.
    సేరాల్ని లేసి నిల్చుని గుడ్డ దులుపు కున్నాది. గంప నెత్తి నెట్టుకుని గుడిసి కే లి పోయినాది.
    సందేలయింది కాని, పాలకాయిళ్ళీంకా యిల్లకి రాటం లేదు.
    సింతసెట్టు మీంచి దూకి, సిగురెత్తి సోత్తంటే, వున్న పలాన్ని వూడి పడ్డాడు రవణయ్య.
    దాని సిగ తడివి నవ్వాడు.
    అది మల్లా నవ్వలేదు. సరిగందా, ఆడ్ని యిదిలించుకున్నాది.
    కళ్ళింత సేసి తేరిపారి సూత్తన్నా---
    సీకట్లో సెంతకొచ్చి సెరినా ----
    గడ్డి మోపెత్తుతూ పరాసకంగా - ఒంటి మీద సెయ్యేసినా --
    రవణయ్య మావ మీద దానికేం కోపవొచ్చీది కాదు. పై పెచ్చు మంచి సర్దాగా వుండేది. మాటా మాటా కలిపీది.
    "మాటాడితేనే ముత్తాలు రాల్తాయెంటే పిల్లా?"
    "ముత్తాలు కావు మావా, నీ మూతి పళ్ళు రాల్తాయి."
    "ఒరబ్బో! సరసం లో నువ్వూ తగిండానవే! ఎయ్యే!"
    కొంగుక్కట్టిన సింతసిగురు మూటట్టుకో బోయాడు . రావులమ్మ అంకలేదు.
    "ఇప్పుడయితే తప్పించుగుంటన్నావు కానీ రేపు లగ్గం కాని నీ పని సేబుతా!"
    "సీస్సీ! నీతో పెల్లా? పరువున్న ఆడదేవుత్తీ సత్తే నీ సేంతకీ రాదు!"
    "ఓసోస్!" నవ్వాడాడు.
    "సిగ్గుండద్దో?"
    "ఏవేం?"
    "అయేల , సావన పున్నం నాటి రేతిరి -- నేకల్లారా సూల్లె దనుకున్నావా?"
    అదిప్పటికి కళ్ళక్కట్టినట్టున్నాది --
    గంగన్న గాడి పెళ్ళాన్ని ఆడు తాటి తోపు లోకి తీసి కేడతా వుంటే ------
    కొత్తగా కాపరాని కొచ్చింది గందా , దానికి యీడితో ఏం పనుందో?
    బుద్దుండద్దో?
    స్సీ!

                         


    అప్పన్నించీ రవణయ్య పేరు సెబితే రావులమ్మ సివాలేత్తేత్తాది.
    ఈ అదున్లో ఆడు గబుక్కుని పట్టబోయాడు. సర్రుని లగేత్తింది రావులమ్మ.
    ఎనకాతలే తరువుదారంటే, పుంతకాడే బాలయ్య గోరున్నారయ్యే! ఉసూరుమని ఎనక్కి తిరిగాడు రవణయ్య.
    సెట్ల పైకి సేరి పిట్టలు గోల సెత్తన్నాయి. తాడి సెట్లక్కట్టిన కుండలు మసక మసగ్గా కనిపిత్తావున్నాయి.
    ఇరిగిన తాటి వోసం మీద కాళ్ళు సాసుక్కూకున్న బాలయ్య దొరగారి దాపు కెల్లి --
    "దండాలయ్య గారూ!" అన్నాది.
    ఉలిక్కిపడ్డాడాయన. తలతిప్పి సూశాడు నవ్వి --
    "కొత్తిమీరి తెచ్చేవేమిటే?"
    "కాదండయ్యా! సింత సిగురు కోసుగొత్తన్నా!"
    బోది మలుపులో ఒంపుల్తిరిగి పడతన్న నీల్లల్లా గలగలా నవ్వింది రావులమ్మ.
    ఆ సందె ఎలుగు లో బంగారు బొమ్మలా నవ్వినాది.
    "నోరు జారి అనేశాను. కోపం సేయకండయ్యా!"
    "కోప వెందుకే?"
    "తవర్ని సీదరించాను. మన్నించడయ్యా!"
    "ఓస్! అదా? ఏం ఫరవాలేదులే!"
    అప్పుడు రావులమ్మ సూసిన సూపు, మరింత ఎల్తురుంటె బాలయ్యగారిక్కని పిచ్చేదే!
    నల్లని ఆ సందేల, రావులమ్మ సూడ ముచ్చటగా వున్నాది.
    "నీకు పెళ్ళేప్పుడే రావీ?"
    "లగ్గం నాడు రెత్తిరండయ్యా!"
    "చమత్కారివే!"
    నవ్వుకున్నాది.
    "నీకో మాంచి మొగుణ్ణి చూపిస్తాను చేసుకుంటావుటే?"
    సిగ్గులో వంకర్లోయినాది.
    "రవణయ్య గాడెలా వుంటాడే?"
    "స్సీ!"
    "నువ్వంటే పడి చస్తాడే!"
    "సత్తే పీడే యిరగడవుద్ది!"
    "వాడికేం వే? నిక్షేపం లాంటి వాడు. కోరమీసమూ, ఒంపులు తిరిగిన కండలూ, నిడివైన ఛాతీ! ఏనుగు లాంటి మనిషి కాదుటే!"
    "ఆడి వూసేత్తకండయ్యా! తెల్లూ, జేర్రిలూ పాకినట్లుంటాది నాకు!"
    "ఆహా! నీకోసం సీమదొర దిగివస్తాడా ఏం?"
    "ఎవుత్తికి తగ్గోడు దానికి దొరుకుతాడు లెండి! ఆ రవణయ్య గాణ్ణి మట్టుక్కేవరూ సత్తే సేసుకోరు. ఆడి గోనవే సెడ్డ గొనం. సిగ్గు మాలినోడు."
    నవ్వుకున్నాడు బాలయ్య గోరు. దాని తిట్లు ఆరికి యిన సొంపుగా వున్నాయి.
    గేదెల్ని తోలుకొచ్చి గట్రాటలికి కట్టేశాడు ఎంకన్న. కుసిన్ని గడ్డి పరకలు పెరుక్కొచ్చి అటి ముందు ఏశాడు. ఆరిపోయిన సుట్ట పీకి దూరంగా యిసిరేసి దిమ్మకాడికి కొచ్చాడు. ఒల్లిరుసుకొని, సేతులు కట్టుకొని బాలయ్యగారెనకాతలే నిలుసున్నాడు.
    రావులమ్మ కేసి తేరిపార సూత్తన్నాడు .
    ఆ కల్లల్లో సాగ సయిన కోరికి -----
    సేతి యిరుపుల్లో ఏదో గట్టి నమ్మకవు --
    మనుసయిన వూసేదో లోన ముసురు కొచ్చి ఒల్లంతా సిగ్గు పులువుకున్నాది రావులమ్మ కి.
    ఉన్నట్టుండి సీకటి కమ్ముకోచ్చింది. బాలయ్యగారక్కన్నించి లేగిశారు.
    "ఒరేయ్ వెంకన్నా!"
    ఉలిక్కిపడి అయ్యగారి కాళ్ళ కాడి కొచ్చాడు
    "నే వెళ్ళి పోతున్నాను కానీ, పుంతమ్మట పాములు తిరుగుతూ వుంటాయి. పాలు పితికేశాక , దీన్ని తీసుకెళ్ళి వాళ్ళింటి దగ్గర దిగబెట్టు!"
    పెళ్ళి కాని కన్నె పిల్ల -- ఆడితో సీకట్లో పుంత దాడ్డవే?
    "మనసులో అలోసన్లు అయ్యగారి కంత సప్పునెల్లా తెలిసినాయో?"
    "అమ్మో!' అనుకున్నాది రావి. ఉలకా లేదు, పలకా లేదు.
    "ఫరవాలేదే ! మీ అయ్యతో మాట్లాడి చైత్ర మాసంలో లగ్గం పెట్టిస్తాలే!"
    "సిన్నబాబు గారు మా దొడ్డ దొర!" అనుకున్నాడు,ఎంకన్న.
    "మా మంచోరు!' అనుకున్నాది రావి!
    మాయిడి తోటనీ , నీల్లబోదినీ , కాలవవతల మూల పొలాన్నీ, సీకట్లో ఆళ్ళీద్దర్నీ యిది లేసి -- సేరసేరా నడిసెల్లిపోయారు బాలయ్య గారు.
    ఆ వూరంతా కలిసి ఎయ్యి గడప కూడా వుండదు. అటిలో యనవండోరి లోగిల్ని మించింది అసలే లేదు. పెద్ద దివానం లాటి యిల్లు. పురుషోత్తవుగోరు సేవటోడిసి గడించిన సొత్తు, మొగపిల్లల్లేరని సెప్పి పెద్దల్లుడు గోర్ని యింటి కాడే వుంచుకున్నారు. సత్తేన్నారాయిన గోరు మామని మించిన దొడ్డాయిన. అరి పెద్ద కొడుకు బాలయ్య గోరు. పెద్ద సడుగులు సదూకున్నా, యింటిని కనిపెట్టుకు నుండి, పై నించి ఎగ సాయిప్పన్లు నూత్తా వుండేవోరు. తండి గారితో సెప్పి, ఎంకన్న ని అరె పాలేరు తనానికి కుదిరిశాడు. అప్పన్నించీ ఆడు ఆ యిల్లే కనిపెట్టుగునున్నాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS