Previous Page Next Page 
ముత్యాల పందిరి పేజి 14

                                      
    మరుసటి దినం మబ్బుల్ల బయిలెల్తున్నడు చంద్రం.
    పున్నమ్మ వాని సంచిల గుడ్డలు గిట్ట మంచిగ సరిదివెట్టి, పక్కకు ముప్పయి రూపాలు, ఎవల్లకు తెలకండ దాసిపెట్టింది.
    కాడెయ్య మంచంమీద లేసి కూసోని యీదమ్మను పిలుస్తయాదో సెప్పిండు.
    ఈదమ్మకు సరిగ యినరాలే. సేతుల సిన్న ముల్లె బట్టుకోని ఆడికొచ్చినది.
    "ఏందో సెప్పబడితివీ?"
    "కాదే, వానికి సద్దిగిట్ట కట్టిస్తన్నావ, లేద?" అంటడిగిండు.
    "ఇగో, యిండ్లనే కట్టిన!" అంట ముల్లె వానికి సూపిచ్నది.
    ఇంట్ల అందరితాన సెలవు తీసుకోని బయిలెల్లిండు చంద్రం. రొండు ఆమడ దవ్వు నడిసి నంక, ఆడి కెల్లి బస్సు మీద పోవాలె. ఎప్పుడన్న లారీలు గిట్టొస్తే మంచిగ పోవచ్చు, కాని దినాము రావుకద?
    చంద్రం నడుసుకుంట పోతున్నడు.
    దార్ల ఒక్కతాన మంచినీల్ల భాయితాన కర్లె కాయల సెట్టు నీడల కూసోని, యీదమ్మ తల్లి కట్టిచ్చిన సద్ది తిన్నడు. ఇంక, ఏరె కట్టిచ్చిన జొన్నరొట్టె ముక్క మిగిల్నది. మల్ల అప్పటికి తినేటందుకు దాసుకున్నడు.
    చంద్రం మల్ల నడుస్తున్నడు, నడుస్తనే ఉర్కుతున్నడు.
    ఎండ నెత్తి మాడ్పతున్నది. గాలి రయ్యిమంట సెవులల్ల కొడ్తున్నది. పెదాలు నాల్కత తడుపుకుంట, సెవఁట్లు తుడుసుకుంటున్నడు. వానికి యీ కష్టమేమి తెల్వదు. నడుస్తనే ఉన్నడు!
    వాని కండ్ల ముంగల కనిపించెటి దొక్కటే! ఉయ్యాలవాడ! ఊరుకు యివతల పెద్ద ఊడల మర్రి. మర్రికింద పిల్లలు, పిలగాండ్లు ఉయ్యాల లూగుతుంటరు. ఇంక ముందుకు పోతే ముత్తాలమ్మ గుడి. గుడి పక్కకు నీల్లకుంట. ఇంక ముందుకు పోతే సాలె గురువు సదాకుం సడాకు సివర్ల మాలి పటేలిల్లు.
    ఇంక పోవాలె. ఇంక పోవాలె. గల్లిలు దాటాలే. పోలీస్ పటేలిల్లు దాటాలే. నాగయ్య గుడిసె సూడాలే. యోగయ్య పడ్డ ఎగురుతుంటే సూడాలే! యాదగిరి యింటితాన పడుగుల బండ మీద పావురాల్లను సూడాలే!
    ఆడికెల్లి కుడిసేయి బాలంగ పోతే యింకోగల్లి వస్తది, ఆ గల్లిల, కొనాకు-ఆడ, ఆన్నె-
    వాకిలి తెరిసుంటది. ఆడి కెల్లి మొగ్గం సప్పుడినొస్తది. రాటం తిప్పకం యినొస్తది. నాయన-నాయన మొగం నేస్తుంటడు. పక్కకు అమ్మ, అమ్మ కండెలు వట్టిస్తుంటది. ఇదారికి నడమ ముత్తాలు! అమ్మ, నాయన, ముత్తాలు!
    ఇట్లనుకుంటం తానె చంద్రం కండ్లల కడ్వల్ల నీల్లు! చంద్రం కండు తుడుసు కున్నడు. నడుస్తున్నడు.
    చంద్రం బస్సు ఎక్కిండు. బస్సు జోరుగపోతున్నది.
    చంద్రం బస్సు దిగిండు.
    చంద్రం సీకట్ల అడుగుపెట్టిండు! ముంగలికి ఉరికిండు.
    ఉయ్యాల్ల మర్రిని సూడలేదు. ముత్తాలమ్మ గుడి సూడలేదు. నీలకుంట కనిపియలేదు.    
    చంద్రం ఊర్ల నడుస్తున్నడు. తెలిసినోళ్ళు కాసిచ్చిన్రు. కాని వాండ్లు వీనిని సూడలే. చంద్రం వాండ్లత మాటాడలే. ముంగలకె పారిండు.
    గల్లిల కొచ్చిండు. గల్లిల కొనాకు-ఆడ, ఆన్నె!
    నడుం వంగిన అవ్వ లెక్కున్నది గుడిసె.
    వాకిలి తోసిండు. తెరిసిపెట్టె ఉన్నది. గర్రుమంట సప్పుడు సేసింది.
    "ఎవలాడ?"
    ఏండ్లెనెక యిన్నమాట మల్ల యియ్యాల సెవుల్ల బడినది. చంద్రం కడపల అడుగుపెట్టిండు.
    అంత సీకటి. ఒక్క మూల దీసోడల దీప మున్నది. దాన్ని మింగె సీకటి సుట్టు ఉన్నది!
    సంచి గుమ్మములనె వెట్టిండు చంద్రం.
    "పలకవూ?" అన్నది అమ్మ.
    "నేనమ్మా! సెంద్రయ్యను, నీ బిడ్డను!" అంట అమ్మతాన ఉరికిండు చంద్రం. సేతుల్త సుట్టుకొని బుజం మీద వాలిండు.
    సుంకులమ్మ కు ఏడుపు ఆగలేదు.
    "ఏడవకమ్మా! మిమ్ములవిడిచి యింక యాడికి పోవమ్మా!" అన్నడు. సుంకులమ్మ మాటాడెతందుకు నోరులేదు.
    "నాయవేడున్నడమ్మా?" అంటడిగిండు చంద్రం. సుంకులమ్మ మాటాడలేదు.
    మల్ల మల్ల అడిగిండు. అమ్మ మాటాడలేదు. అమ్మ మనుసులల్ల లేదు!    
    గుండె బద్దలు కొట్టుకొంట అమ్మమీద పడి ఏడుస్తున్నడు చంద్రం. నాయన ఏమయిందో సెప్పెటోండ్లు లేరు వానికీ!
    ఆముదం దీపం అట్లనే ఉన్నది. దాన్ని మింగె సీకటి సుట్టు ఉన్నది!    
    
                                     7

    పిట్ట లెక్క సారొచ్చి అత్త యింట్ల వాలింది ముత్తాలు.
    "మూడు దినాల సంది వత్తమనుకుంటనే రాలేకుంటి, అత్తా!" అన్నది.
    అత్త మాటాడలేదు. ఆమె నోట్ల కెల్లి మాట రాలే.
    పచ్చడం తీసి ముకంల సూసింది. అత్త మంచిగ నిదరవోతున్నది.
    'ఈయాలప్పుడు అత్త నిదరపోటవేంది?' అనుకున్నది ముత్తాలు. అనుకున్నది కాని, ఆమె లేపలే. 'ఏండ, సంది దొరకని దేందో యియ్యాల్నె దొరికినట్లున్న దామెకు! నే నేంటికి సెదర గొట్టాలే?' అనుకున్నది ముత్తాలు. 'అత్త లేసెడి దన్క వాకిలిగిట్ట ఊకి, పెండనీలు సల్లి, పొయ్యిల నిప్పెయ్యాలె!' అంటనుకోని పొరకట్ట కోసానికే దేవులాడింది. దేవులాడుతుంటేనే ఎరికయింది. వాకిలిగిట్ట మంచిగ ఊకినంక పెండత నీలుసల్లి, ముగ్గువెట్టి ఉండే!
    'వాకిలిగిట్ట సేసుకోని మల్ల పండుకొన్నాది? పెయ్యసుస్తున్నద, యేంది? అచ్చ పోని, గెంజి కోసానికన్న పొయ్యి మిడకాలె కద?' అనుకుంట లోపల కెల్లినది.
    పొయ్యితాన ఒకాయన కూసుని నోటిత గాలి ఊత్తున్నడు.
    ఎన్నేండ్ల ఎనకసిరయిన, ఎట్లున్నగాని బావను ముత్తాలు గురుతుపట్టగల్తది. వాని దిక్కుకు సూస్త, అట్లనే ఎనక నిలుసున్నది.
    ఆమె సూపుకు, ఆమె మనసుకు నడమ ఏండ్లు దాటుత ఉన్నయి.
    ఆమె కండ్లెంబడి రాలిన ముత్తాల బొట్లు రొండు చంద్రం యీపుమీన పడ్డయి! అయ్యె, ఆ ముత్తాల బొట్లు, చంద్రం ముకంను ఎనక్కు తిప్పినయి,
    "ముత్తాలు!" అన్నడు చంద్రం. అన్నడే కాని, ఆమె కండ్లల సూసెతందుకు వానికి ముకం సెల్లలే. ముద్దాయి లెక్క, ఆమె ముంగల తల దించుకున్నడు.
    ముత్తాలు ఆడవె కూలపడ్డది.
    శానసేపటి దన్క యిద్దరు మూగగున్నరు.
    "అయినాండ్ల నందర పొడగొట్టుకున్న, ముత్తాలు!' అంట కండ్లు తడుపుకున్నడు చంద్రం.
    ముత్తాలు కండ్లు తుడుసుకున్నది.
    "లే, బావ! నిన్నింతదంక, పొడగొట్టుకోని దేవులాడివోల్లం మేము! పోని, కొస పానాల్ల మమ్ముల సూసెతందుకన్నా యియ్యాలొచ్చినవు, బావ! అంతెసాలు! మా బతుకుల్ల యియ్యాల పండుగొచ్చినట్ల ఉన్నది" అన్నది ముత్తాలు.
    ఇన్నేండ్ల సంది యింత దయ పొడగొట్టుగుం టొచ్చినట్లు యిప్పుడు గురుతయినది చంద్రానికి.
    ఏదన్న గాని, సొమ్ము సేతుల ఉన్నప్పుడు దాని యిలువను మనిసి ఎరికెవట్టడు. ఎనకసిరి ఎరికె పట్టెతలికి అండ్లున్నదంత కొంచెం, కొంచెం తరుగు పట్టేస్తది; సేతుల్ల మన్నే మిగుల్తది!
    చంద్రం అట్లనే, తల దించుకనే కూసున్నడు.
    "బావ! ఇన్నేండ్ల సంది ఏడుస్తనే ఉన్నం, ఇప్పడింక, అయ్యన్ని మరువకుంటే యీడ బతకలేం కద? లెవ్వు, పొయ్యితాన నేను కూసుంట" అన్నది ముత్తాలు.
    చంద్రం గుండె నిండినది. "నామీద నీకింత దయేంటికి, ముత్తాలు?" అంట ఆమె సేతు లందుకోని కండ్ల కద్దుకున్నడు.
    "దయేంది, బావ? నీ నీడకోసానికే దేవులాడె టోల్లం! నివ్వె మమ్ముల సల్లగ సూడాలె" అంట సేతులు ఎనక్కు తీసుకొన్నది.
    ఇంతట్ల సుంకులమ్మ పక్కమీకెల్లి లేసి, తడుముకుంట తడుముకుంట యీడి కొచ్చింది.    
    'అబ్బ! యియ్యాల యంత పొద్దుదంక ఎట్ల పండుకొనుంటి? నూలు డబ్బలు మరాసు కెట్ల అందిస్త?' అనుకుంట లోపలకు సూసినది.
    ఆండ్ల కెల్లి పొగొచ్చి కండ్లను మూస్తంది.     
    'ఇండ్ల పొగ యాడి కెల్లొచ్చింది?' అనుకున్నది.
    మల్ల యింతట్లనే పొయిల మంట కాబట్టి పది. ముత్తాలు ఆడ కూసుని ఉన్నది.
    "ఎప్పుడొచ్చినవు, బిడ్డా?" అంటడిగింది సుంకులమ్మ.
    "ఇప్పుడె వచ్చిన నత్త!" అన్నది ముత్తాలు.
    "నీ కింత కష్టమేంటికి, బిడ్డా? నేనింక బతికున్న కద?" అంట లోపలకు వస్తన్నది సుంకులమ్మ.
    వస్తంటే, కట్టె పొగకు కండ్లు కాపడక, సేతుల్త తడుముకుంటున్నది. చంద్రం ఆమె సెయ్యి అందుకున్నడు.
    "అమ్మా!" అన్నడు చంద్రం.
    సుంకులమ్మ వాని ముకంల దగ్గిర్ల కండ్లెట్టు కొని సూసింది.
    "ఇండ్లకు నువ్వు రావొద్దమ్మ! అన్ని నీకు నే తెస్త" అన్నడు.
    సుంకులమ్మ ముత్తాలు వంకకు సూసినది. "బావెట్లంటన్నడో సూసినవు, బిడ్డ? ఇన్నేండ్లకు వాని కండ్లకు మనం కాబట్టినం!" అన్నది.
    "అట్లన కత్త! పాపం సేసినోండ్లం మనం! అందుకోసానికే బావ మన కండ్లకు కనిపియ్య లేదు! అది వాని తప్పు కాదత్త!" అన్నది ముత్తాలు.
    సుంకులమ్మ కొడుకు సేతుల్ల వాలి ఏడ్సినది. చంద్రం అమ్మను చిన్నగ నడిపించుకుంట పోయి, బయట యావపెట్టుకింద బండమీద కూసొవెట్టి, ముకం కడుక్కునేతందుకు నల్ల బూదె, పుల్ల, సెంబుల నీల్లు తెచ్చి ఆడ వెట్టిండు. ఎనక సిరి ఆయననే అమ్మ సెయ్యి పట్టుకోని లోపలకు తీస్కచ్చిండు.
    ఉడుకు పాలు గిన్నెల తెచ్చి అత్త తాన నెట్టింది ముత్తాలు.
    "ముందుగాల బావ కియ్యి, బిడ్డా!" అన్నది సుంకులమ్మ.
    "లే, అమ్మ! నీ ఎనకెనె మేమంత! నే తాపిస్త, తాగు" అన్నడు.
    "మీ నాయననె యియ్యాల మల్ల లేసొచ్చి నట్లుంది, బిడ్డ!" అన్నది సుంకులమ్మ' బిడ్డ!" అన్నది సుంకులమ్మ.
    "ఆయన్ను సంపుకున్న పాపం నాదమ్మ!" అన్నడు చంద్రం.
    ముత్తాలు మునివేళ్ళత బావ నోరు మూసింది.
    ఉయ్యాలవాడల మల్ల ఆయిటికా రొచ్చి నట్ల అయింది! మోడయిన బతుకుల్ల కొత్త సిగుళ్ళు పూసినయి. సుంకులమ్మ మల్ల లేసి తిరుగుతున్నది యింట్ల.
    చందం పొద్దంత యింట్లనే ఉంటడు, యాడికి పోడు. వాని దోస్తులంత ఒక్కొక్కరే సూసిపోయిన్రు. మామ సూసిపోయిండు. అత్త కూడ ఒక్కతేప వచ్చిపోయింది.
    ముత్తాలు రొండు దినాల కొక్కతేప వచ్చి పోతనే ఉంది.
    మామ కార్కానాలనె నాగయ్య కొలువున్నడు. యాదగిరి ఊర్లనే అమీన్ కసేరిల అటెండరు పన్ల ఉన్నడు. యోగయ్య యింటితానె మొగ్గం నేసుకుంటున్నడు. మాలి పటేల్ సచ్చిపోయినంక తన దోస్తె పటేలయిండు. పోలీస్ పటేలు కొడుకు పెండ్లి సేసుకోని యిల్లటం పోయిండు. సాలె గురువు యాడబోయిండో, ఏందో ఎవ్వల్లకు ఎరికె లేదు.
    ఊరు శాన మారింది. సరకారు దిక్కుకెల్లి పైసలు శాన కర్సువెట్టి సడాకులు మంచిగ సేసిచ్చిన్రు. బాయిలు తవ్విపిచ్చిన్రు. జివాల కోసానికి దవాఖాన పెట్టిపిచ్చిన్రు. పొలాలకు మంచి యిత్తులు, ఎరువులు గిట్టయిచ్చేటికి గిట్ట మల్ల శాన అసీసులు పెట్టిన్రు. ఎవకుండెటి యీది బడి యిప్పుడు పెద్దగ సేసిన్రు. పాత అయ్యవారిని తీపిచ్చి, యింకో ఊరికెల్లి కొత్తాయన్ను తీస్కచ్చి ఏసిన్రు. పాత అయ్యవారు బువ్వకు లేక ఊర్ల యింటింటికి పోయి ఆడుక్కుంట బతుకుతున్నడు. పంచాయతి ఆపీసుతాన పత్రికలు, పుస్తకాలు గిట్ట సదుకునెడి గ్రంతాలయం పెట్టిపిచ్చిన్రు.
    మామ రొండో కార్కాన కూడ మంచిగ పని చేస్తన్నది. నేతగాండ్లకోసానికి సంగం పెట్టి పిచ్చిన్రు. సంగం ఆపీసుకొరకు పెద్ద బవంతి లెక్క మిద్దె యిల్లు కట్టిపిచ్చిన్రు.
    లక్ష్మయ్య మామ యిప్పుడు సంగం పెసిడెంటు!
    చంద్రయ్యను శానమంది, కార్కానాల పనికి రమ్మంట పిలిసిన్రు. లక్ష్మయ్య కూడ కబురుసేసిచ్చిండు.
    చంద్రం యాడికి పోలే. ఇంట్లనే, నాయన మొగ్గం సామాండ్లని మిద్దె మీ కెల్లి దించి, మంచిగ కడిగి, బొట్లు పెట్టి, ఎంకయ్యకు పూజసేసి పని శురు సేసుకున్నడు.
    కొడుకు పన్ల దిగడం సూస్తే సుంకులమ్మకు శాన ముచ్చటయింది. ఇన్నేండ్ల సంది కొడుకు ఊర్లల్ల నేరిసిన యిద్దె ఆమెకు తెలుస్తవచ్చింది.
    "సాలోండ్ల పరువు నిలబెట్టినవు, బిడ్డ!" అంట మెచ్చుకుంది కొడుకును. వానికి కాబట్టిన కండెలు తానె రాటంతాన కూసుని మంచిగ పట్టి యిస్తన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS