"ఇప్పు డొచ్చిన కద, నర్సయ్యా! ఇప్పుడింక యాడకు బోను. యాడకు బోను! నీ తానె ఉంట!" అన్నడు చంద్రం. అట్లంటుంటే వాని కండ్లల నీల్లు తిరిగినయి. ఇద్దరు లోపల కెల్లిన్రు.
నర్సయ్య నాయన కాడెయ్య మంచంమీద పండుకొని ఉన్నడు. కండ్లు మూసుకొని ఉన్నడు.
"నాయన! సెంద్ర య్యొచ్చిండు, సూడు!" అంట పిలిసిండు.
కాడెయ్య కండ్లిప్పి సూసిండు. చంద్రం కనిపిచ్చిండు. వానిని సూడటం తానె కాడెయ్య సేతుల మీద సిన్నగ లేస్తన్నడు.
"లెవ్వొద్దు, నాయన! కదిల్తె దగ్గొస్తది!" అంట నర్సయ్య మల్ల పండబెట్టిండు.
"నాయ నిట్లున్నడేంది? ఏమయినది?" అంట, గుబులు వట్టి అడిగిండు చంద్రం.
"నెల దినాల సంధి పెయ్య మంచిగ లేదన్నా! ముందుగాల దగ్గుత పెద్ద కష్టమయ్యుండె. బెబ్బర బుడ్డలు తిన్నంక కొంచెం తక్కవయ్నది. రొమ్ముల నొప్పిగిట్ట అట్లనే ఉంది. కాళ్ళకు నీరు పట్టింది."
"నాయ నిట్లున్నడంట తెలిస్తే అప్పుడే వస్తుంటి, నర్సయ్య! నేను ఆడెట్లుండ గలుగుత?" అంట కండ్లు తుడుసుకున్నడు.
ఈదమ్మ వీండ్లున్న అర్రల కొచ్నది. "ఎవలాడున్నోల్లు?" అంటడిగింది.
"సెంద్ర య్యొచ్చిండమ్మా!" అన్నడు నర్సయ్య.
"అట్ల ఎన్నేండ్ల కొచ్చినవు, బాబు? మేమంట గురుతున్నమా?"
"అట్లెట్ల గురుతుండరమ్మ? ఈ ఊరొచ్చినంక మీ ఉప్పె తిని బతికిన. సచ్చెడి దన్క మరుస్తనా, అమ్మ?" అన్నడు చంద్రం.
"మరుస్తవం టసటంలే, సెంద్రయ్యా! అట్లెట్ల మరుస్తవు నువ్వు? నువ్వంత నా కెరికెనే, బిడ్డా! అయిన కాని, యాదో మనుసుల బాద సెప్పుకునెతందు కట్లన్న. అంతనే!"
"ఈ మొగ్గం పన్ల నేర్పినదంత నే నీడనే, యీ యింట్ల మీతానె నేర్సిన నమ్మా! కడుపు కోసానికి కష్టం సెయ్యటంల ఎంత దొరతన మున్నదో, అరుసుకున్నది యీడనె నమ్మా! నీ తానె!" అన్నడు చంద్రం.
చంద్రం గదువలు పట్టుకొన్నది యీదమ్మ. ఆమెకు కండ్లల కెల్లి నీల్లొచ్చినయి.
"సెంద్రయ్యా! యిట్ల బక్కగయిన వేంది, బిడ్డ? అన్నం గిట్ట మంచిగ తినటంలే?"
"తింటున్న కద?"
"ఏంది తింటున్నవ్? జొన్నరొట్టె యాడ కెల్లొచ్చింది నీకు?"
"లే. జొన్నరొట్టె తింటములే. సేసుకునేతందుకు పుర్సతు లేకుంటుండె!'
"అవ్, నాకంత ఎరికెనే కద? అందుకోసానికే, అన్న, కష్టాలకు కాబట్టినంత తినాలె. గుడ్డ లేకున్నా పర్వలే! యిల్లు లేకున్న పర్వలే! కాని, బువ్వ లేకుంటేగిన కష్టం సేసెటోడు బత్క లేడు. అందుకోసానికే, బిడ్డా, మంచిగ తిను! మంచిగ పని సెయ్యి! యిన్నవా? నీకోసానికి యియ్యాల మంచిగ సేయిపిస్త!" అన్నది యీదమ్మ.
ఈదమ్మ, చంద్రం మాటాడుకుంటుంటే నర్సయ్య ఆడికెల్లిపోయిండు. ఈదమ్మ, జర సేపయినంక యాదుజేసుకున్నది.
"ఈడు ఎటనో పాయెనూ!" అంట సాగదీసుకున్నది.
"ఏందమ్మ, పిల్చినవ్?" అంటొచ్చిండు నర్సయ్య.
"అన్న యీడుంటే నువ్వేడకు బోయినవ్?"
"లె లే అమ్మా! తెలుగోండ్ల గోపయ్యున్నడు లే, ఆడు పేటకు శేపలు గొంచుబోతున్నడు, అమ్మెతందుకు. వానిత మాటాడతన్న!" అన్నడు నర్సయ్య.
"శేపలు గొంచుబోతున్నాడు? మంచి గున్నయా?"
"మంచిగనే ఉన్నయి."
"అట్లయితే, జర లోపలకు పిల్వు. అన్నొచ్చిండు కద? మంచిగ కూరలు సెయ్యాలె" అన్నది యీదమ్మ.
తెలుగోండ్ల గోపయ్య శేపల గంప తెచ్చుకోని వచ్చిండు.
"పేటకు బోతున్నావుర, గోపయ్య?" అంటడిగింది.
"అవ్వమ్మ!"
"మల్ల ఏమేమి గొంచుబోతున్నవు, జర సూపియ్!"
"ఎయి కావాలన్న యిండ్లనే ఉన్నయ్, సూడమ్మా! ఇగ్గో, రొయ్యలున్నయి, పరక శేప లున్నయి, ఉసికె దొంతెలున్నయి, మాల పెంకిరి లున్నయి, మల్ల, సందమాఁవఁలు, మార్పుగాండ్లు, జల్లలు, కొర్రమట్టలు, వాల్గ శేపలు, బొమ్మిడి శేపలు, పొట్టు రొయ్యలు అన్నున్నయి. మంచి శేపంట యిండ్ల లేకుంట లేదు" అన్నడు తెలుగోండ్ల గోపయ్య.
"అట్లనా, గోప?" అంట గదువకు సేయి పెట్టుకోని వాని దిక్కుకే సూసి నగింది యీదమ్మ. "ఎన్నడు నేర్సినవురా, మాటలు?" అన్నది.
గోపయ్య నవుకున్నడు.
"కోడిని కోస్తమనుకున్న కాని, నువ్వొచ్చి నంక యియ్యె తీసుకొనాలంటనుకున్న. కోడిని రేపు కోసుకుంటంలే" అంట యీదమ్మ కూర కోసానికి కాబట్టెడి శేపలు తీసుకోని వాన్ని తోలింది.
పొద్దు నెత్తిమీకి లేసినంక అందరు బువ్వలకు కూసున్నరు. వీండ్లిట్ల కూసున్నరు; అట్ల వాకిట్ల బండి వచ్చింది.
నర్సయ్య పోయి సూసిండు.
అక్క, బావ, పిల్లలు బండ్ల కెల్లి దిగిన్రు.
ఇంట్లకు ఒక్కరుకురికి "అక్క, బావొచ్చిన్రు!" అంట అరిసిండు.
బిడ్డను సూసెతందుకు కాడెయ్య మంచం మీకెల్లి లేస్తుండు.
"కాళ్ళల్ల బలం లేకున్నప్పుడట్ల లేస్తవేంది? బిడ్డ లోపలి కొస్తున్నది కద?"అన్నది యీదమ్మ.
"ఎన్నేండ్లకు సూసిన సక్కె! నువ్వు పెట్టిన జొన్న సంకటి యిప్పటికి యాదొస్తనే ఉంటది. ఆ బలం లేకుంటే నీట్ల కాకుండుంటి నక్కా!" అన్నడు చంద్రం.
"ఇన్నేండ్ల సంది, నువ్వు యిల్లెట్ల మర్సినవో, అనుకున్న, సెంద్రయ్యా! అక్కను సూసె తందుకంట ఒక తేపయిన వస్తవనుకుంటి!"
"లేదక్క! నేను వస్తమంటనే అనుకుంటి. కాని ఊర్ల పాంటె తిరుగుతుంటే రాలేకుంటి" అన్నడు.
"నాయన నీకోసానికి, మంచం మీ కెల్లి ఉరుకుతుండు!" అన్నది యీదమ్మ.
పున్నమ్మ నాయనతాన పోయింది.
కాడెయ్య బిడ్డను చేతులకు తీసుకున్నడు.
గోలెవుల నీల్లుపోసి పెట్టిండు నర్సయ్య.
అక్క, బావ, పిల్లలు తానం సేసి బువ్వ కొచ్చిన్రు.
ఎప్పటికి మంచంమీన కూసుని తినేటాయన, ముసిలాయిన కాడెయ్య కూడ పిలగాండ్లతనే కూసుని బువ్వ తిన్నడు.
చంద్రం పుట్టినంక, యిసాంటి మంచిరోజు ఎన్నడు రాలే. అక్కొచ్చింది. బావొచ్చిండు.
అక్కకు ముగ్గురు బిడ్డలు! ముగ్గురు మంచి గున్రు. 'ఇల్లంట యిట్లుండాలె!' అనుకున్నడు చంద్రం.
"ఇగ్గో, నర్సయ్యా! అక్క మనింట్ల కొచ్చి శానేండ్లయినది కద? అందుకోసానికే, మంచి పూనా కొంగుత, రాజమాలంచు నెట్టి గద్వాల సీరె సాంతంగ సేసి అక్కకు కట్టబెట్టలే!" అన్నడు.
"సూసినావు, అమ్మ?" అన్నది పున్నమ్మ.
"సెంద్రయ్యకు నువ్వంటే అట్లుంటది, బిడ్డా!" అన్నది యీదమ్మ.
"అయితే, యింకేమీ నేర్పినవ్, సెంద్రయ్య?" అంటడిగింది పున్నమ్మ.
"సన్న పన్లల్ల, జేరే పన్లన్ల, రేషంల శాన నేర్పిన నక్క! ఒత్తులు మలుపుత, పువ్వులు తీసి పెద్ద పీతాంబరాలు నేస్త. గట్టి కొంగు పీతాంబరాలు నేస్త. కుప్పణం తీస్త. పింజెరమీద తీరతీర్ల పనోంసల్ల నేస్త."
"ఇసాంటి పెద్ద పనులు యండ్లకెల్లి నేర్పినవు, బిడ్డా?" అంటడిగిండు కాడెయ్య. "ఒక్క జాగాల కాదు; శాన జాగాల్ల, శాన మంది తాన నేర్పిన. గద్వాల పోయుంటి. ఆడ సమచ్చరమున్న. గట్టి పన్లు శాన ఆడనే నేర్పిన. మంచి పనాండ్లున్నరు. ఆమన గంటికి పోయుంటిని. ఆడ రేషం పని మంచిగయితున్నది. అది నేర్సిన. ఇంకో జాగాలపోయి యింకోటి నేర్సిన. అట్ల మల్ల, యియ్యి కాకుంట సాదా రకాల్ల కూడ శానున్నయి. గపండ్లోండ్లు, గొల్లోండ్లు గిట్ట కట్టేటి సీర్లు, దోతులు మస్తుగున్నయి. ఒక్క తీరా. ఒక్క తోకను?" అన్నడు చంద్రం.
"హవ్, బిడ్డా! నా సిన్నతనంల అసొంటియి శాన నేసిన. కొలికి మొంగి సిరెంట, పచ్చీసు కాణాలంట, పగడసార వొల్లెలంట, ఉల్లిపూల సీరలంట!"
"గనె నేను సెప్పెటియి! జొన్నల రాసి, దగ్గుల పుటం, శిటికె సీరె, గరికపోసల సీరె-యిట్లున్నయింక!" అన్నడు చంద్రం.
"గరికెపోసల సీర ఎట్ల నేస్తరన్నా? అంటడిగిండు నర్సయ్య.
"ఏమిలే, నర్సయ్యా! కొలికి కొలికి ఎరుపు, రొండు కొలుకులు తెలుపు లెక్కన సరింబేక నెయ్యాలె. అంతనె!"
"గరికెపోసల సీరె మంచి గుంటది, తమ్ముడా! పూనాకొంగు, రాజమాలంచు గద్వాల సీరె నీ పెండ్లికి నేసిత్తువుగాని, నీ మనుసు కుదురు గున్నప్పుడు ఎప్పుడన్న గరికెపోసల సీరె ఒక్కటి నేసిస్తే సాలు" అన్నది పున్నమ్మ.
"అట్లనే, అక్కా!" అన్నడు చంద్రం.
"అట్లనన్న పెండ్లి జర తొందరల సేసుకొనాలె, తమ్ముడా!" అన్నది పున్నమ్మ.
"పిల్లను సూడరాదు?" అన్నడు బావ.
"పిల్లల కేమి? యాడబడితే ఆడున్నరు. మేన సుట్టరికం గిట్ట ఏమన్న ఉంటుండొచ్చు కద?"
"ఇగ్గో, సేంద్రయ్య! నా లెక్క నువ్వు కూడ మేనపిల్లను సేసుకున్నవంటే, ఎనక సిరి శాన కష్టమయితది. ఇప్పుడె సెప్తున్న!" అన్నడు బావ.
"అట్ల?"
"హవ్! మీ అక్క లెక్క ముచ్చట్లెక్కన కావాల్నంటది!"
"ఒక్క సీరె కోసానికి యిట్లంటున్రా?" అన్నది పున్నమ్మ.
"మల్లనే సేటి సీరెలు నీ కొరకనుకున్నావు?"
"హవ్ లే! సాలోండ్ల పిల్లలకు సాలినంత గుడ్డ యాడి కెల్లొస్తది?" అన్నది పున్నమ్మ.
ఆయాల పొద్దు మీకంత కాడెయ్య తానె కూసున్నడు చంద్రం. కాడెయ్య మాటలు యింటంటే యాడ్నించో నాయన సెప్తన్న ట్టె అనిపించింది.
కాలు, సెయ్యి ఆడనన్ని దినాలు ఎవలు యాడున్న ఫర్వలేదు కాని, సెయ్యల బలం తగ్గినంక, గొంతుల గింత గెంజి పోసెటోండ్లు లేనప్పుడు కన్నవోండ్ల నెప్పటికి యాదు చేసుకుంటనే ఉంటరు. కొడుకు సేతుల్త తిన్న గెంజి బువ్వ ఎప్పటికి పాయసాన్నమె!
కాడెయ్యను సూసినంక, ఎప్పటికీ నాయననే కండ్ల ముంగల కనిపించ్త ఉన్నడు.
ఇన్నేండ్ల ఎనకసిరి తనకోసానికే యిట్ల ఉన్నట్లయినది.
"బతికి నన్నేండ్లు ఎట్లను బతికేటోండ్లం కాము, బిడ్డా! ఏమి పెట్టకున్న, సెయ్యకున్న కాని మా బతుక్కు సివరి దినాల్ల మీరంత ముంగలుంటే అంతే సాలు, సెంద్రయ్యా! తేలిగ్గ కండ్లు మూసుకుంటం. కన్నోండ్ల మనుసులు ఎరికెవ ట్టెటి బిడ్డలు అందరి కుండరు, సెంద్రయ్యా! అట్లుంట వాండ్ల పున్నెం!" అంట కండ్లుతడుపుకున్నది యీదమ్మ.
ఈ మాటల్త చంద్రం కడుపుల సెయ్యెట్టి కదిపినట్లయినాది.
అమ్మ గురు తొచ్చినది. నాయన గురుతొచ్చిండు.
అమ్మ యీదమ్మ లెక్కన; నాయన కాడెయ్య లెక్కన-తనకోసానికే కండ్లల వత్తులేసుకొని వాకిల్ల కావలి కాస్త రేయంత సూస్తున్నట్టుంది. వాండ్లిద్దరి నడమ, ఆముదం దీపం లెక్క ముత్తాలు!
చంద్రం, కాడెయ్య మంచంమీద తలవాల్చి ఒక్కటే ఏడుపు.
వాని తరీక ఎవ్వరి కేమెరికయటం లేదు. ఎవ్వరడిగిన సెప్పలేదు.
పున్నమ వాని తాన కూసుని, బుజంపట్టి లేవదీసినది. "ఏమయింది, సెంద్రయ్యా? నాకు సెప్పవా మల్ల?" అంట గుచ్చి గుచ్చి అడిగింది.
"అమ్మ, నాయన గురు తొచ్చిన్రు" అన్నడు చంద్రం.
"యాడున్నరు? ఎట్లున్నరు?"
"ఉయ్యాలవాడల!"
అందరు ముకాలు సూసుకున్నరు. చంద్రం యిన్ని దినాలల్ల దాసుకున్న, యిప్పుడు బాధంత తెలిసినది.
చంద్రం మొత్తమంత సెప్పిండు వాండ్లకు. అప్పటికి వాని గుండె బరువు కొంత తగ్గింది.
* * *
