Previous Page Next Page 
ముత్యాల పందిరి పేజి 12


    రాములిమీన రుశి యిట్లంటన్నందుకు అవతలోండ్లు కోపమయిన్రు.
    "ఆయన అంటేనే నియత్ పోతాది? ఫర్వలే. సెప్పనియ్యన్రి" అన్నడు రాములు నగుత. కాని నాని దోస్తులూకోలేదు.
    అవతలోండ్లు, యివతలోండ్లు మాటలను కున్నరు. పెద్దగ లొల్లి సేసిన్రు.
    బావనారుశి లేసి నిలుసున్నడు. "నాకోసానికి మీ లెవళ్ళు కొట్లాడొద్దు. నా మనుసుల బాధ సెప్పుకున్న కాని, నా కెవలిమీన కోపం లేదు. ఇప్పటి సంది మీరంత కలిసి పని చెయ్యన్రి. సంగంకు లాబాలు తేన్రి. సాలోని బతుకు జరమంచి గుండెతట్టు చెయ్యన్రి. అంతే సాలు. మిమ్ముల నింకేమడుగ. మీరంత మంచిగుండన్రి! సుకము గుండన్రి" అంట మందికి దండం పెట్టి సంగంల కెల్లి బయిలెల్లిండు.
    అడుగు పడతం కష్టంగుంది. దమ్మురాడం బాదగుంది. అట్లనే సిన్నగ నడుసుకుంట, ఒక్కడు పోతున్నడు. సెయ్యి పట్టుకునేటోండ్లు కూడ లేరు. ఆక్కుంట, ఆక్కుంట అట్లనే నడుస్తుండు.
    సడాకు మోడ్ల కెల్లి లక్ష్మయ్య వస్తుండు.
    "ఇంటికి పోతున్నవా, బావ?" అంటడిగిండు లక్ష్మయ్య.
    లక్ష్మయ్యను రుశి ముందుగాల సరిగ గుర్తు పట్టలే. పచ్చడం మంచిగ తీసుకోని, కండ్లమీన సెయ్యి పెట్టుకోని సూసిండు.
    "ఎవలు? లచ్మయ్యా?"
    "అవ్ సంగంల రాములున్నాడు?"
    "ఉన్నడు, పో!"    
    సిన్నగ మాటాడతన్నగాని, దగ్గు వచ్చి ఉండె. కొంచెంసేపటి దన్క ముకం పైకి ఎత్తలేక పోయిండు.
    "ఇంటిదన్క పడగొట్టొస్తం. పోదం, పా!" అంట సెయ్యి పట్టుకున్నడు లక్ష్మయ్య.
    "ఒద్దు, లచ్మయ్య! నే పోగలుగుతలే! నీ పని సూసుకో!"    
    "పర్వలే, బావా."
    "నే పోతనంటున్న కద, లచ్మయ్యా? నువ్వు సంగంకు పో, ముందుగాల" అంట వాని సెయ్యి యిదిలిపిచ్చుకున్నడు.
    "అయితే పోవాల్నా?"
    "పొమ్మంటున్న కద?" అని నడుసుకుంట పోయిండు.
    లక్ష్మయ్య సంగంకు పోయిండు.
    కొంచెం దూరం పోయెతలికి బావనారుశికి నీరసంత నడుస్తం కష్టమయింది. ఒక్కతాన బండమీన సెయిపెట్టి నిలుసున్నడు.
    మల్ల పెద్ద దగ్గొచ్చి ఉండే నిలవడతం కూడ కష్టమయితన్నది. అట్ల దగ్గుత, దగ్గుతనే బండ మీన తల వాలిసిండు.
    ఎండ నడుమ కెల్లి సక్కగ పడుతున్నది.
    బావనారుశి ముకం ఎండకు మాడుతున్నది.
    వాని సేతుల కట్టె కిందకు జారి పడినది!

                                     5

    "అంద చందములేని ఆడకూతురికి
    అంద మేరూపరుచు ఆ పత్తి చెట్టు
    పాడి పంటాలున్న బంగారమిచ్చు
    పైడి పత్తిని పెంచ బంగారు వెచ్చు
    పాలు పెరుగూలున్న పాపల్లకొరకు
    పత్తి నూలూ దీయ పాతల్లకొరకు
    కవ్వమాడని యిల్లు కదురు తిప్పని కొంప
    మొగ్గ మూలేనూరు మరి గానరాదు
    రాటాల మోతమ్మ రవ్వలా మోత
    ఏకుల్ల రాటాము కాల్ల సంకెల్లూ
    కలవారి అల్లూని కాల్ల సంకెల్లూ
    ఏకేకు ఒక బార ఎల్లుండి సంత
    నా యేకు లయిపోయె నాకేమి సింత
    పుంజమ్ము నూలుకు పోగు తక్కువ    
    కొండమీద పొద్దన్నది కొట్టబోకత్త
    శేనివారొస్తారు చెప్పబోకత్త!"    
    ముత్తాలు అట్లనే పాటయినుకుంట కూసున్నది. అట్ల, ఒక్కతాన కూసున్నప్పుడల్ల సెంద్రయ్య బావనె గురుతొస్తడు. ఎప్పటికి కండ్లు తడుస్తనే ఉంటయి.
    'యాడున్నడో, ఏందో? ఊర్లకెల్లి ఏంటికి పోవాలె? అమ్మను, నాయన్ను, నన్ను ఎందుకిట్ల ఏడిపియ్యాలె?
    'బటువు గొంచుబోయిండో, ఏమొ? అట్లెట్ల పోతడు, దొంగ లెక్క? పోనీ, వానికి కావాల్నంటే నేనేయిస్తుంటి కద? ఒక్క బటువు కోపానికి అందర్ని యీడ యిడిసి, ఏంటికి పోవాలె?
    'నాయన అడగనన్న లేదు కద! అమ్మ అడిగుండె - "యాడ బెట్టినవ్, బిడ్డ?" అంట. అప్పుడన్నది కద, "లే, అమ్మ! గాడ బయలుతాన మర్రికింద ఉయ్యాలూగుతుంటే సేతికెల్లి జారిపోయిందమ్మ! నేనె పాడగొట్టు కున్న!" అన్నది.
    'అమ్మ ఇంక ఏమన్లే. "అచ్చ! ఫర్వలే, తల్లి! గది పోతే మల్ల యింకోటి సేయిపిస్త కద! గుబులుపడకు" అంటన్నది.
    'బావ ఊరిడిసి ఏండ్ల యితున్నది కద, అప్పటి సంది మల్ల ఎవలిక్కూడ దాని సంగతి తెలవదు కద!'
    మల్ల యిట్లనుకుంటంముత్తాలుకు మంచిగని పియ్యదు.
    'సెంద్రయ బావ దొంగెట్లయితడు? బటువు కావాల్నంట అడుక్కొనే పోయిండు కద? తన సేతుల్తనే యిచ్చి ఉండే కద? మల్ల బటువు దొరికిచ్చుకోని ఊరిడిసి ఎట్ల పోతడు? ఎందుకోసానికి?'
    ఇట్లనే ఏందేందో అనుకుంట కూసున్నది ముత్తాలు. 'తన బాద సెప్పుకునెతందుకు పక్కన ఎవలన్న ఉంటే ఎట్లుంటుండె!' అనుకున్నది.
    ఇంతట్ల వనమోల్లరు కాంతమ్మ ఉక్కుంట వచ్చిం దాడికి.
    "ఏందె, ముత్తాలు! యిట్ల కూసున్నవు, కొత్త కోడలు లెక్క? నీ కోసాని కందరు సూస్తున్రు. రారాదు?" అంట బుజంపట్టి కుదిపినది. సేతుల్త లేబట్టినది.
    "ఒస్త, కాంతమ్మా, పా!"
    "మల్ల జల్ది రావాలె. బతకమ్మను వాలా రించెడి దియాల్నె కద!" అన్నది కాంతమ్మ.
    "నడువ్!" అంట పోయింది ముత్తాలు.
    ఇట్ల జరసేపన్న బాద మరవచ్చంట ఆస, ఆమెకు.
    తొమ్మిదిదినాలు బొడ్డెమ్మ పండుగ సేసినంక బతకమ్మ పండుగ శురు అయినది. ఊర్ల ముత్తయిదులు, కన్నె పిల్లలు అంత కలిసి తీరుతీర్ల పూలు తెచ్చిన్రు. గుమ్మెడి పువ్వంట, గోరెంట పువ్వంట, పిరంగి బంతంట, పట్నం బంతంట, మల్ల తంగెడు పూలు, రుద్రాచ్చెపూలు, తంగెపూలు, బంతిపూలు యిసొంటి తీర్లపూలు లెస్సగ తెచ్చి, సక్కగ తీర్చి కుప్పలు నెట్టిన్రు. వయసోల్లు, పడుసోల్లు అందరు, వన్నె వన్నెల సీరలు వయ్యారంగ కట్టుకొని, తీరుతీర్ల సింగారాల్త సిన్న సిన్నగ అడుగులేసుకుంట, బతకమ్మ సుట్టు తిరుగుత, పాడుత, ఆడుత ఉన్నరు.
    ముత్తాలుకు బతకమ్మ పండుగ శాన యిష్టం. పండుగ తోమ్మిద్ధినాలు యాల తప్పకుండ పోయి బతకమ్మకు మొక్కుతది. వన్నె వన్నెల పూలు, తీరు తీర్లపూలు కుప్పలు వోసి, మంచిగ ఆడుత, పాడుత మొక్కుకునటం కన్న యింకేమి కావాలె? పువ్వులకు మొక్కేటి పిల్ల కనకనే, ఆమె మన నట్ల పువ్వు లెక్కుంటది. తొమ్మిది దినా లిట్ల ఆడి, బతకమ్మకు పాటలు పాడి సివరి పొద్దు అందరు పోయి వానిని భాయిల కాని, కుంటల కాని వాలారిస్తరు. దినా ముండేది దొక లెక్క, వాలారింపు దొక లెక్క! ఆ దినం శాన మంచిగుంట దందరకు. శాన ఉశారు గుంటరు. అచ్చట్లు, ముచ్చట్లు మంచిగా ఆటుకుంటరు; సేసుకుంటరు. అందుకోసానికి వాలారింపుకు కొందరు పోతరు.
    ముత్తాలు కాంతమ్మత నడుస్తున్నది.
    ఊరు బయల్ల పెద్ద మర్రి సెట్టున్నది. మర్రి సెట్టుకు కొంచెం దూరంల నీల్ల కుంట ఉన్నది. ఆ కుంటల నీల్లె శెల్కలకు వెట్తరు. ఆ కుంటల నీల్లె బర్రెలకు వట్తరు. అండ్ల నీల్లల్లనె పిల్లోండ్లు జాలాట లాడతరు. అండ్లనే బతకమ్మను వాలారిస్తరు.
    బతకమ్మత వచ్చినాండ్లంత, సీరెలు కొంచెల పైకి లేబట్టుకోని నీల్లల దిగిన్రు. ముత్తాలు దిగన మండె. కాంతమ్మ ఊకోలేదు. ముత్తాలు కూడ దిగినది.
    బతకమ్మకు మొక్కుకున్నది ముత్తాలు.
    వాలారించడం అయ్నది.
    కుంటాల మూకలు, సేతులు గిట్ట కడుక్కొని అందరు బయలెల్లిన్రు.
    "రారాదె, ముత్తాలు?" అంట తొందర సేసింది కాంతమ్మ.
    "వస్తన్నవే!" అంట తనుకూడ ముకం, సేతులు మంచిగ కడుక్కోని, సీరె కొంగుత ముకం తుడుసుకుంటుండగ కాలి కేందో గుచ్చుకున్నది.
    "ఏందమ్మ, యిట్ల గుచ్చుకున్నదీ?" అంట ముందుకు వంగొని బురదల కాలు తడుము కున్నది. అది సేతికి తగిల్నది.
    సెయ్యి కడుక్కొని సూసింది ముత్తాలు.
    బురదల కాలికి గుచ్చుకున్నది బటువు!
    తెల్లగ మెరుస్తున్నది. నౌజ్జిరం రాయి ఏఫైచ్చిన బటువు. నాయన సేసిచ్సిన బటువు లెక్క ఉన్నది.
    'హవ్! ఇసాంటిదె నా బటువు. ఆ దినం,సేంద్రియ బావ నాతాన తీసుకోని తన ఏలికి పెట్టుకున్నడు. ఈడ పొడగొట్టుకు నుండొచ్చు' అనుకుంట, దాన్ని కండ్లకు అద్దుకోని ఏలికి పెట్టుకొనకుంట, కొంగుకు కట్టుకోని పోయ్నది.
    "అత్తా, ఓ అత్త!" అంట గుడిసెల కురి కొచ్చినది ముత్తాలు.
    "రా, బిడ్డ! ఈడ రా!" అంట పిలిసింది సుంకులమ్మ.
    సుంకులమ్మ అచ్చు అతుక్కుంట ఉండగ ఆడి కొచ్చినది.
    "ఏంది, బిడ్డా ; ఉరుక్కుం టొచ్చినవు? కూసా యీడ."
    "బటువు దొరికిన దత్తా! ఆడ, కుంటల!" అన్నది ముత్తాలు.
    "బటువు దొరికినాది?"
    "అవ్, అత్తా! నాదె! బావ గొంచుపోలేదత్తా! ఈడ్నె ఉంది! బావ గొంచుపోలే!" అన్నది ముత్తాలు.
    సుంకులమ్మ కోడలు ముకంల సూసినది.
    "ఈ బటువు ఎవలిది?"
    "నాదె, అత్తా?"
    "బావ గొంచుపోడమేంది?"
    ముత్తాలు అత్త ముకంల సూసేతలికి నీల్లు గిర్రుమంట తిరిగినయి. "అత్తా!" అంట సుంకులమ్మ బుజంమీద వాలి ఎక్కెక్కి ఏడ్స తన్నది.
    "ఏంది, బిడ్డా? ఏడ్సత వేంది? నీ సొమ్ము మంచిది. మల్ల నిన్నెతుక్కుం టొచ్చినది. యిండ్ల బావ గొంచుపోడమేంది?"
    "లేదత్తా! నా పుట్టింరోజు కోసానికె, నాయన యీ బటువు సేపిచ్చిండు. బటువు మంచిగున్నదంట, అమ్మ నడుక్కోని ఏలికి పెట్టుకున్న సెంద్రయ బావకు సూపిచ్చె తందుకు ఉరుక్కుంట పోయన, అత్తా! బావ కనిపిచ్చిండు. ఒక్క తేప ఏలికి వెట్టుకుని యిస్తనన్నడు. ఇచ్చిన, మల్ల ఆటల్ల నేను మరిసిన. బావ కూడ మరిసిండు. అంతనే, అత్తా! ఆ యాలనె బావను సూసిన. మల్ల సూడలే అత్త. బటువు ఎవని కిచ్చినవంట అడిగిండు నాయన. నేను మాటాడలేకుంటి నత్తా! 'నువ్వు వాని కిస్తవంట నా కెరికెనె, వాడు దాన్ని దొరికిచ్చుకోని ఊరిడిసి పోయిం'డంట నాయన అగ్నడత్త! గామాటలు నేనే యినలేకుంటి నత్తా!" అన్నది ముత్తాలు.
    సుంకులమ్మ గుండెల్ల, ఏండ్ల సంది దాసు కున్న బాధంత ఒకతేప లేసొచ్చినది.
    "ఎంతన్నాలం జరిగింది, సెంద్రయ్యా! నా కడుపున పుట్టి, యిన్నేండ్లకు ఊర్ల అందరి కండ్లకు దొంగవయినావు, బిడ్డ? ఎసాంటి పాపం సేసుకున్నరా, నేను!" అంట సుంకులమ్మ ఒక్కటే ఏడుపు.
    "ఇదంత నేనె సేసిన నత్తా! నా బటువు కోసానికే బావను అంద రట్లన్నరు. ఇంత జరిగి నంక, బతికేడిదికంటే యండ్లనన్న పావడం మంచిగుంట దత్త!" అన్నది ముత్తాలు.
    సుంకులమ్మ కండ్లు తుడుసుకున్నది.
    "పోనిలే, తల్లీ! బాదపడకు. జరిగేటియన్ని మన కోసానికే అంటనుకోవద్దు! జరిగెవోటిల తెలీకున్న కాని, ఎట్లనో మనం యిరుక్కొని పోతుంటం. ఈ బూమిల సిత్రమిది, బిడ్డా! లే, కండ్లు తుడుసుకో!" అన్నది సుంకులమ్మ.
    అత్త పాదాలకే కండ్లు తుడిసినది ముత్తాలు.
    
                                   6

    "సందాళ నెట్టు తల్లిగా! ఇంత బువ్వ పెట్టమ్మా! పున్నె ముంటది మా యమ్మ! సామి సూడగలగనీ! ఇంక నాలుగు మూడిండ్లు పోవాలె తల్లిగా! గొప్పవార్లు దహనం సెయ్యాలె. నీ సీరబట్టుకుంట తల్లీ!"
    జంగమాయిన అడుక్కునెతందుకు గలంల కొచ్చి నిలుసున్నడు.
    "ఓ జంగమయ్య! ఇప్పుడు కాదు. అప్పటికి రా మల్ల. జర అన్నంగిట్ట పెట్టిపిస్త" అంట యింట్ల కెల్లొచ్చిండు నర్సయ్య.
    "మంచిదయ్య! మల్లొస్త" అంట జంగమాయన పోయిండు.
    జంగమయ్య అట్ల పోంగనే యీ దిక్కు కెల్లి చంద్రం వచ్చిండు.
    "రా అన్న! నీ కోసానికే సూస్తన్నం! నువ్వు దేశం పోయి యిన్నేండ్లాయె! అప్పటిసంది మమ్ముల సూడకుండ ఎట్లున్నవ్? మాకయితే దినాము యాదొస్తున్నవ్. నువ్వు యాడున్నవో, ఏమి సేస్తున్నవో మాకేమి ఎరికె లేకుండె. ఏమి చెయ్యాలె?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS