ఆలోచనలతో ఎప్పుడో నిద్రపట్టేసింది. మెలకువ వచ్చేసరికి టైమ్ ఎనిమిది దాటుతోంది.
అప్పుడే గది తలుపు తట్టిన శబ్దమయింది. చంద్రిక త్వరగా లేచి ఓసారి అద్దంలో చూసుకొని, బట్టలు సరి చేసుకుని తలుపు తెరిచింది.
సీత లోపలికొచ్చింది నవ్వుతూ.
"ఇప్పుడే నిద్రలేచావా అక్కా!"
"అవును!" అంది చంద్రిక ఆమె లోపలకు రాగానే మళ్ళీ తలుపు మూసివేస్తూ.
"నేను పాడు చేయలేదుకదా నీ నిద్ర?" అడిగిందామె.
"ఊహు! ఇంతకు ముందే మెలకువ వచ్చింది-"
"నాకు రాత్రంతా నిద్రపట్టలేదక్కా"
"ఎందుకని?"
"నేను ఇలాంటివి నాలుగు శతదినోత్సవాలు చూశానక్కా. ఆ నాలుగింట్లోనూ నాకు చిన్నవేషాలే! అసలింక నాకెప్పటికయినా పెద్ద వేషాలు దొరుకుతాయా అన్న అనుమానంపట్టుకుంది ..... "దిగులుగా అందామె.
"దానికంత బాధపడడం ఎందుకు? అదృష్టం వుంటే ఠకీమని పైకివచ్చేస్తావ్! అదృష్టం లేనప్పుడు నువ్వెంత బాధపడినా ప్రయోజనంఉండదు!"
"అది నిజమేననుకో! కానీ అలా అని చెప్పి ఆలోచించకుండా ఉండలేం కదా!" జీవం లేని నవ్వు నవ్వుతూ అందామె.
చంద్రికకు ఆమెను చూస్తే జాలి కలిగింది.
తనకంటే ముందునుంచీ ఆమె ఈ రంగంలో వుంది. ఇంతవరకూ ఆమెకు ఒక్కటి కూడా గుర్తింపుకలిగే పాత్ర లభించలేదు.
చంద్రిక టూత్ బ్రష్ తీసుకుని బాత్ రూమ్ లోకి నడిచింది. ఆమె తిరిగి వచ్చేసరికి సీత ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది.
"అక్కా! సురేష్ గారు మాట్లాడతారట నీతో - "ఫోన్ చంద్రికకు అందిస్తూ అందామె.
చంద్రిక ఫోన్ అందుకుంది.
"హలో, సురేష్ గారూ!"
"నమస్తే!"
"మధ్యాహ్నం మీరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు."
"థాంక్యూ వెరీమచ్! ఇంకెవరెవరు?"
"మీరు, హీరోగారూ, శ్రీరంగం, సృజన, డైరెక్టరుగారు, ప్రొడ్యూసరుగారూ, మ్యూజిక్ ప్రసాదరావుగారూ - అంతే!"
"సరే"
"పన్నెండు గంటలకు నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకెళతాను!"
"సరే!"
అతను ఫోన్ పెట్టేశాడు.
"ఏమిటక్కా?" అడిగింది సీత.
"సురేష్ గారింట్లో డిన్నర్ ఉందిట మధ్యాహ్నం!"
"ఓహో!"
చంద్రిక బెల్ నొక్కి హోటల్ బాయ్ ని పిలిచింది.
"రెండు కాఫీ తీసుకురా"
బాయ్ కాఫీ తీసుకొచ్చాడు ఇద్దరూ కాఫీ తాగారు.
"నేను స్నానంచేసివస్తానక్కా" లేచి నిలబడింది సీత.
"సరే"
"మన ప్రయాణం ఇవాళ రాత్రికేనా?" అడిగిందామె.
"ఇంకా అనుమానం ఏమిటి? నేను రేపు మధ్యాహ్నంకల్లా తిరుపతిలో షూటింగ్ లో ఉండాల్సిందే! లేకపోతే వాళ్ళ షెడ్యూల్ దెబ్బతింటుంది."
సీత వెళ్ళిపోయింది.
చంద్రిక స్నానంముగించి రడీ అయేసరికి తలుపు తీసుకుని వర్ధనరావ్ వచ్చాడు. అతనుకొద్దిగా తూలుతున్నాడు.
"షంద్రికగారూ! నేను మిమల్ని షాలెంజ్ షేషాను గుర్తుందా!" అన్నాడు కుర్చీలో కూలబడిపోతూ.
విస్కీవాసన ఆ గదంతా అలుముకుంది.
"ఏమని?" అడిగింది చంద్రిక.
"అదే! ఇషారి మన సినిమాలోనేనే మిమ్మల్ని డామినేట్ షేస్తానని...."
"అవును! ఇప్పుడేమయింది?"
"దయచేసి నన్నుక్షమించండి! నేను ఆ షాలెంజ్ విత్ డ్రా చేసుకుంటున్నాను....."
చంద్రికకు నవ్వాగలేదు.
"సరే అలాగే విత్ డ్రా చేసుకోండి!"
అతను లేచి నిలబడ్డాడు. "థాంక్యూ" అనేసి తూలుతూ బయటకునడవబోయాడు.
"ఈ మాట చెప్పడానికి ఇంత అర్జంటుగా వచ్చారా?" నవ్వుతూ అంది చంద్రిక.
అతను మళ్ళీ వెనక్కు తిరిగాడు.
"పొద్దున్నే ఊరినుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. అందరూ మందు కొట్టేసిమాట్లాడుకుంటూంటే నేను నా చాలెంజ్ విషయం చెప్పానువాళ్ళకు. వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? అలా అనడం తప్పన్నారు. మీలాంటి రియల్ ఆర్టిస్ట్ ని చాలెంజ్ చేయకూడదని కోప్పడ్డారు. క్షమాపణ చెప్పుకోమన్నారు. అందుకని వచ్చేశాను!" అతను అలాగే నెమ్మదిగా తడబడుతున్న అడుగుల్తో వెళ్ళిపోయాడు.
చంద్రికకు ఆశ్చర్యంకలిగింది. అతను ఉదయం నుంచే తాగేందుకు అలవాటుపడ్డాడని తనకుతెలీదు.
ఈ ఫీల్డులో తాగనివాళ్ళు చాలా తక్కువ. కానీ సాధారణంగా ఎవరయినా మధ్యాహ్నంనుంచీ ప్రారంభిస్తారు.
ఇలా ఉదయం నుంచి తాగడం ప్రారంభించేవాళ్ళు ఇద్దరో ముగ్గురో వున్నారు. వాళ్ళ చేష్టలగురించి అందరూ కధలుకధలుగా చెప్పుకునినవ్వుకొంటూంటారు.
ఇప్పుడిప్పుడే హీరోగా పేరు తెచ్చుకుంటున్న వర్ధమానరావ్ కూడా వాళ్ళజాబితాలో చేరడం చంద్రికకు నచ్చలేదు.
ఇలా విపరీతమయిన తాగుడికి అలవాటుపడిన వాళ్ళుకొద్ది రోజుల్లో పూర్తిగా తెరమరుగయిపోవడం తనకు తెలుసు.
మధ్యాహ్నం పన్నెండున్నరకు డిన్నర్ కెళ్ళడానికి కార్లు వచ్చాయ్.
డిన్నర్ పూర్తయాక......మళ్ళీ హోటల్ కి చేరుకుంది చంద్రిక.
ఎ.సి.ఆన్ చేసి డయిరీతీసి అప్పటి వరకూ జరిగిన విశేషాలన్నీ రాసుకుంది.
ఎందుకోతెలీదుగాని డయిరీ రాయడం తనకెంతో ఆనందం కలిగిస్తుంది.
అంతేకాదు. ఎప్పుడయినా మనసు బాగోనప్పుడు పాతడయిరీలు చదువుకుంటే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది.
చిన్ననాటి స్నేహితులు, స్నేహితురాళ్ళు, తనతో చనువుగా మెదిలిన బంధువులు అందరూ తనకా డయిరీల్లో కనపడతారు.
ఎన్నో మధుర స్మృతులువాటిల్లో దాక్కునివుంటాయ్. మనసుని ఆనందపుటంచుల్లో విహరింపజేసే సంఘటనలు ఎన్నో అలరిస్తాయ్ తనను. ఆ సాయంత్రంచంద్రిక టీ పార్టీకి హాజరైంది.
ఆ ఆఫీసు హాల్లో ఆ చిత్రంలోని తన స్టిల్ ఒకటిచాలా పెద్దదిగా ఎన్ లార్జ్ చేసి ఎదురుగ్గా గోడకు అమర్చారు.
