Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 10


    టీ పార్టీలో అందరూ తన నటనను ప్రస్తుతించే వాళ్ళే.
    అక్కడి నుంచి వచ్చేసేముందు సురేష్ ఆమెని ఆ వూళ్ళోని ఓ ప్రముఖ వ్యక్తికి పరిచయంచేశాడు.
    "వీరు ధనుంజయరావుగారు. ఈ టౌన్ లో చాలాముఖ్యమయిన వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే హి ఈజ్ కింగ్ మేకర్! మీ పిక్చర్ చూశాక ఈయనమీ ఫాన్ అయిపోయారు! ఆ రోజునుంచి మిమ్మల్ని కలుసుకుని అభినందనలు తెలపాలని కోరిక."
    "నమస్కారమండీ!" రెండు చేతులు జోడించాడతను.
    చంద్రిక ప్రతి నమస్కారం చేసింది.
    "మీరు మాట్లాడుతూండండి!" అంటూ సురేష్ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
    "నిజానికి సురేష్ గారు నా గురించి సరిగ్గా ఎక్స్ ప్లెయిన్ చేయలేకపోయారు. నేను మీ ఫాన్ ని అయాననడం కంటే మీ మీద అభిమానంతో పిచ్చాడినయానని చెప్తే సమంజసంగా వుండేది. ఈ చిత్రం చూశాక అసలు రెండు రోజులు నేను సరిగ్గా నిద్రపోలేదంటే నమ్మండి. వెంటనే మద్రాస్ వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని అనుకున్నాను. కానీ ఈలోగా సురేష్ గారు కలిసి ఎలాగూ కొద్దిరోజుల్లో మీరే శతదినోత్సవానికి ఇక్కడికి రాబోతున్నారని చెప్పారు. అందుకని ఆ ప్రయాణంరద్దుచేసుకున్నాను......"
    "మీ అభిమానానికి చాలా థాంక్స్!" అంది చంద్రిక చిరునవ్వుతో అందరూ హోటల్ కెళ్ళేందుకు సంసిద్దమయ్యారు.
    "వస్తానండీ! నమస్తే!" అనేసి తనూ బయటకి నడిచింది చంద్రిక.
    ధనుంజయరావ్ ఆమెతోపాటే కారు దగ్గరకు నడిచాడు.
    "మిమ్మల్ని డిన్నర్ కి ఆహ్వనించాలని అనుకున్నానండీ! మరినాకలాంటి అదృష్టం ఎప్పుడు లభిస్తుందో తెలీదు" అన్నాడు బ్రతిమాలుతోన్న స్వరంతో.
    "అవన్నీ ఎందుకులెండి! మీకున్న అభిమానంచాలు" అంది చంద్రికకార్లో కూర్చుంటూ.
    "ఊహు! అ;ఆ కొట్టిపారేయకండి! ఏనాటికయినా మీరు ఈ చిన్నకోరిక తీర్చాల్సిందే!"
    చంద్రిక జవాబుగానవ్వి వూరుకుంది.
    "మద్రాస్ వచ్చినప్పుడల్లా మీకభ్యంతరం లేకపోతే మిమ్మల్ని కలుసుకుంటాను"
    "ఓ! తప్పకుండా"
    "థాంక్యూ"
    కారు బయలుదేరింది. భోజనాలు ముగిశాక బట్టలన్నీ సర్దేసుకుంది చంద్రిక. సీతకూడా వచ్చి ఆమెతో మాట్లాడుతూకూర్చుంది. రాత్రి పదకొండింటికి స్టేషన్ కి చేరుకున్నారందరూ. రైలు సిద్దంగా వుంది ఫ్లాట్ ఫారం మీద.
    ఫస్ట్ క్లాస్ కోచ్ లో ఎక్కి కూర్చునేలోగానే చాలామంది జనంమూగిపోయారు బయట.
    సృజన డోర్ దగ్గరేనిలబడి జనంవేపు చేతులు వూపింది. ఎవరో ఆమెను ఏతో బూతుమాట అన్నారు.
    దాంతో కోపం వచ్చింది సృజనకు.
    "చెప్పు తీసుకొని కొడతాను ఇడియట్" అంది వాడివేపు కోపంగా చూస్తూ.
    ఆ మాటలు విని ఇంకెవరో హేళనగా అరిచారు. అందరూ గట్టిగా నవ్వారు.
    సృజనకు ఏం చేయాలో తోచలేదు. ఆ గొడవంతా గమనిస్తున్న శ్రీరంగం ఆమె దగ్గరకు నడిచాడు.
    "అసలు మిమ్మల్నివీళ్ళ దగ్గర నిలబడమని ఎవరు చెప్పారు? మీ కంపార్టుమెంట్ లోకి వెళ్ళి మీ దారిన మీరుండలేరూ? మేమంతా ఎందుక్కూర్చున్నామనుకున్నారు లోపల? చంద్రిక గారు ఎందుకు బయటకురావటంలేదు.....?"
    "నాకేం తెలుసు కోతిమూక అని! అభిమానంతో వచ్చారుగదాని కనిపించారు" అందామె లోపలకొచ్చేస్తూ.
    ఆమె వెళ్ళిపోయాక శ్రీరంగం వర్ధనరావుతో అంటున్నాడు.
    "ఇప్పుడీవిడ కోసం ఎవరొచ్చారని? ఇంకా తనకేదో గ్లామర్ వుందని, తనకోసం ప్రేక్షకులు పడి చస్తున్నారనీ భ్రమలో వుంది. ఎవరూ చూడకపోతేతనే అందరూ చూసేలా అతిగా ప్రవర్తించటం. వాళ్ళు తననిగమనించకపోయినా, తనేకావాలని చేతులు ఊపటం, మాట్లాడటం వాళ్ళు ఏదయినా అంటే ఏడవటం" వర్దనరావ్ నవ్వుతున్నాడు.
    చంద్రికకు నవ్వువచ్చింది.
    "నిజమే అక్కా! సృజనగారికి కొంచెం పిచ్చి ఉందేమోననికూడా అనుమానం కలుగుతూ వుంటుంది అప్పుడప్పుడు" అంది సీత నెమ్మదిగా.
    రైలు కదిలింది.
    నైట్ లైట్ వేసి బెర్త్ మీద పడుకుంది చంద్రిక.
    "మళ్ళీ రేపట్నుంచీ ఎవరిగొడవ వాళ్ళదే! ఎప్పుడో ఏ సెట్ మీదో కలుసుకోవటం, రెండు నిముషాలు మాట్లాడుకుని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవడం- కదక్కా!"
    "అంతే" వప్పుకుంది చంద్రిక.
    ఆ తరువాత కొద్దిక్షణాల్లోనే ఆమెకు నిద్రపట్టేసింది.
    
చంద్రిక ఉదయం మద్రాస్ లో తన ఇంటికి చేరుకునేసరికి ఎనిమిదిన్నర అయిపోయింది, ఇంటి తలుపులు బార్లా తెరిచేఉన్నాయ్.
    బయట హాల్లో జగన్నాధం, అతని స్నేహితులు నలుగురు కూర్చుని పేకాడుతున్నారు.
    ఆ హాలంతా కాల్చినసిగరెట్ పీకలతోనూ, బూడిదతోనూ నిండిపోయివుంది.
    మరో పక్క గుట్టగా పడున్నమద్యం సీసాలు.
    చంద్రికను చూడటంతోనే కంగారుపడిపోయాడు జగన్నాధం.
    చంద్రిక అతన్ని గమనించనట్లే మేడ మెట్లెక్కి తన గదిలోకి వచ్చేసింది.
    కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా
 ఆమె దగ్గరకొచ్చి పిల్లిలా నిలబడ్డాడు జగన్నాధం.
    "నువు ఇవాళ సాయంత్రం వస్తానన్నావు కదమ్మా!" ఆప్యాయంగా అడిగాడతను.
    అతను మాట్లాడుతుంటే బ్రాందీ వాసన వికారంగా తగులుతోంది.
    "నేను సాయంత్రం వస్తానుకదాని రాత్రంతా తాగుతూ పెకాడ్తూ కూర్చున్నారన్నమాట! అంతేనా?" కోపం అణుచుకుంటూ అంది చంద్రిక.
    "అబ్బే! రాత్రంతా ఎక్కడమ్మా! పొద్దున్నే పాపం వాళ్ళేదో పనిమీద వస్తేనూ......నేనే బలవంతం చేసి....."
    "నా దగ్గర అబద్దాలు చెప్పవద్దని మీకు అదివరకోసారి చెప్పాను. నేను మీ కూతురిని నాన్నా! పరాయిదాన్ని కాదు. నా దగ్గరెందుకు అబద్దాలు? నేనేమైనా మిమ్మల్ని హింసించావా? దండించానా?"
    జగన్నాధం తలవంచుకున్నాడు.
    అతనికేం మాట్లాడానికీ తోచలేదు. ఆమె ఎదుటినుంచీ ఎలా తప్పించుకోవాలా అన్న ఆలోచనలో పడ్డాడు.
    హఠాత్తుగా అతనికి గుర్తు వచ్చింది. అంతకుముందు రోజే ఓ ప్రొడ్యూసర్ చంద్రికకోసం వచ్చాడు.
    ఆమె లేదని తెలిసి తన అడ్రస్, ఫోన్ నెంబరూ ఇచ్చివెళ్ళాడు. ఆమె రాగానే తనకు ఫోన్ చేసి చెప్పమని మరీ మరీ చెప్పివెళ్ళాడతను.
    ఇప్పుడా ప్రసక్తి తెచ్చి తను నెమ్మదిగా జారుకోవచ్చు అక్కడనుంచి.
    "అన్నట్లు నిన్న అయన ఎవరో ప్రొడ్యూసర్ వచ్చారు నీకోసం! నువురాగానే తనకు ఫోన్ చేయమని చెప్పారు" అన్నాడతను.
    "పేరేమిటి?" అడిగింది చంద్రిక.
    "ఏమో! గుర్తులేదు! ఆయన విజిటింగు కార్డు ఇచ్చారు. ఇప్పుడే తెస్తానుండు" అంటూ తన గదిలోకెళ్ళి ఓ విజిటింగ్ కార్డు తెచ్చి ఆమెకిచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS