Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 8


    మరో నిమిషం మాట్లాడక తప్పలేదామెకి. తర్వాత డైరెక్టర్ మాట్లాడాడు.
    "ఈ బందరు పట్టణానికో ప్రాముఖ్యత వుంది. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి ఎంతో గొప్పది. ఏ చిత్రమయినా ఇక్కడ విజయవంతం అయిందంటే ఆంద్రదేశమంతా విజయవంతమైనట్లే భావించుకుంటాం. ఎవరు చిత్రం రిలీజ్ చేసినా ముందు బందర్ లో టాక్ ఎలా ఉందో గమనించాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు చిత్రాలకు ఎగ్జామినేషన్ సెంటర్ మచిలీపట్నం......."
    ప్రేక్షకులంతా తప్పట్లుకొట్టేశారు. అందరూ థియేటర్ లోంచి బయటకొచ్చారు.
    కార్లు సిద్దంగా ఉన్నాయ్. చంద్రికతోపాటు సృజన, సీత కూడా ఓ కారులో కూర్చున్నారు. మూడు కార్లూ వేగంగా బయల్దేరినయ్.
    రోడ్డు అదివరకంత రద్దీగా లేకపోయినా ఇంకా కొద్దిమంది జనం సినిమా హాల్ ఎదురుగా నిలబడే ఉన్నారు.
    "ఇంకో గంట టైముంది విజయవాడ ఫంక్షన్ కి కదూ!" అడిగింది సృజన.
    "అవును......" అంది చంద్రిక.
    "ఆ ఫంక్షన్ తరువాత ప్రోగ్రాం ఏమిటి?"
    "ఏమో! తెనాలి కూడా వెళదామంటున్నారు!"
    "ఈ రాత్రి నిద్రపోనీరా ఏమిటి?" నవ్వుతూ అందామె.
    మరి కొద్ది నిమిషాల తర్వాత కార్లు విజయవాడ బయల్దేరినయ్.
    అక్కడా అంతే!
    హాలు చుట్టుపక్కల ఇసుకవేస్తే రాలని జనంతోనిండిపోయింది. ఇంటరల్ అయి చాలాసేపు అవడంవల్లహాలంతా ఈలలతోనూ, కేకలతోనూ దద్దరిల్లిపోతోంది. అందరూ హల్లోకెళ్ళి స్టేజిమీద కనిపించేవరకూ గొడవ తగ్గలేదు.
    డైరెక్టర్ మైకులో మాట్లాడాడు "ఈ విజయవాడ పట్టాణానికో ప్రాముఖ్యత వుంది. ఇక్కడ ప్రేక్షకుల అభిరుచి ఎంతో గొప్పది. ఎవరు చిత్రం నిర్మించినా ముందు ఆ చిత్రం గురించి ఇక్కడి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో గమనిస్తారు. ఈ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో గమనిస్తారు. ఈ ప్రేక్షకులకు ఆ చిత్రం వచ్చిందంటే ఇంక అంధ్రప్రదేశ్ లో ఆ చిత్రం అన్నిచోట్లా విజయం సాధించిందన్నమాటే!"
    చంద్రికకు నవ్వొచ్చింది. ఆ తర్వాత కృష్ణా రెసిడెన్సీ హోటల్లో విందుజరిగింది. చంద్రికతన గది చేరుకునే సరికితొమ్మిదిన్నర అయిపోయింది. పగలంతా కారు ప్రయాణాలు చేస్తూండటం వల్ల ఎంతో అలసటగా వుందామెకు.
    తర తరగా బట్టలు మార్చుకుని మంచంమీద పడుకుండి పోయింది. ఎంతసేపు ప్రయత్నించి నిద్ర పట్టటంలేదు.
    విందు సమయంలో వర్ధనరావ్ అన్నమాటలు గుర్తుకొచ్చినవు వచ్చింది.
    "హీరోగా నాకిది మూడోచిత్రం! మొదటి రెండూ ఫ్లావ్ అయాయ్. ఇది సక్సెస్ అయిందిగాని మీరు హీరోయిన్ అవడంవల్ల నన్నసలు కనబడనీయకుండా డామినేట్ చేసి పారేశారు....."
    "మీ రోల్ అలాంటిది! యాక్షన్ కి స్కోప్ లేదు. అంతేగాని నేను డామినేట్ చేసిందేమీ లేదు...." అంది తను.
    అతను వప్పుకున్నాడు "అయినా సరే! నేను మీతో పోటీకిదిగదల్చుకున్నాను"
    "ఈసారి మీతో నటించేటప్పుడు మిమ్మల్ని డామినేట్ చేసి పారేస్తాను! చూస్తూండండి!" అన్నాడు నవ్వుతూ.
    "సరే! అలాగే చేయండి!" అంది తను.
    నిజానికి అతని నటనలో పనేమీ లేదు. అతని పర్సనాలిటీ కూడా బాగానే ఉంటుంది అందగాడు కూడా.
    కానీ ఇవన్నీ ఉన్నా పైకి రాలేకపోయినవాళ్ళు ఎంతోమంది. వీటితో పాటు అదృష్టం కూడా కావాలి. అన్నీ కలసిరావాలి.
    తనకి ఈ బ్రేక్ రావడానికి ఎన్నిరోజులు పట్టింది?
    తనకంటే ఎక్కువ ప్రతిభ ఉన్నవాళ్ళు, తనకంటే ముందునుంచీ అవకాశాలు దొరకక అవస్తలు పడడంతనకు తెలీదూ?
    ఆమెకు హఠాత్తుగా తన తల్లి గుర్తొచ్చింది. ఆమె తననో గొప్పనటిగా చేయాలనిపడ్డ అవస్థలు తనకు తెలుసు. అసలామె జీవితమే కళకు అంకితమయిపోయింది. అందుకే బాధలమయంగా తయారయింది. తనకున్న ఆస్థినీ, అంతస్థునీ కాదని తల్లిదండ్రుల నెదిరించి నాటకాల్లో ఉత్తమ నటుడిగా పేరు సంపాదించిన తన తండ్రిని ప్రేమించివివాహం చేసుకుంది.
    ఇద్దరూ కలసి నాటకరంగం కోసం పడ్డ పాట్లు తనకూ కొంచెం కొంచెంగా గుర్తున్నయ్.
    కాని తెలుగు నాటకరంగం ఎంతటి అనాదరణ పొందుతుందో, నాటకరంగం కళాకారులను ప్రజలెంతచిన్నచూపు చూస్తారో తెలుసుకునేసరికి ఆమె కృంగిపోయింది.
    ఎంతమంది దీపం పురుగుల్లా ఈ దిక్కు మాలిన నాటకాల్ని ఆశ్రయించి ఆస్తులు పోగొట్టుకుని, జీవితాలు నాశనంచేసుకుని మసి అయిపోయారో ఆమె కళ్ళారా చూసింది.
    ఒకరిద్దరు ఆమెకు తెలిసిన స్త్రీలు నాటకాల్ని నమ్ముకుని తమని తాము పోషించుకోలేక క్రమేపీ వ్యభిచారిణులుగా మారిన సంగతి ఆమెకు ఎంతో ఆవేదన కలిగిస్తూండేది.
    చివరకు తమకే ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తం అయేసరికి తండ్రి ఓ చిన్న ఉద్యోగంలో చేరడం, అతను సంపాదించే చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడడంతో ఆమె కృంగి కృశించిపోయింది.
    అన్ని బాధల్లోనూ ఆమె ఏనాడూ తన తల్లిదండ్రులదగ్గరికి వెళ్ళలేదు. ఎలాంటి సహాయమూ పొందలేదు.
    అప్పుడే ఆమెలో పట్టుదల ప్రవేశించింది. తనను ఓ పెద్దసినీతారగా చేయాలన్నకోరిక ప్రారంభమయింది.
    ఆ రోజు నుంచీ అహర్నిశలూ అదే ఆలోచన ఆమె ఒకపూటే భోజనం చేస్తూ తనకు మాత్రం ఏ లోటూ రాకుండా పెంచింది.
    చదువు చెప్పించింది. మంచి బట్టలుకొనేది. మొదటినుంచీ తన దృష్టి నటనవేపు మళ్లించింది. తన తండ్రి నటించిన నాటకాల్లోని ఫోటోలు చూపేది. ప్రతి సినిమాకు తీసుకెళ్ళేది. అందులో నటీనటుల నటన గురించి చర్చించేది. ఇలాతనకు తెలియకుండానే తన ఆలోచనలన్నీ నటన వేపే కేంద్రీకరింపచేసింది.
    తమ స్కూల్లో ఓసారి టీచరు చిన్నపిల్లలందరితోనూ నాటకం వేయించాలనుకుంటే ఆమె ససేమిరా వప్పుకోలేదు.
    "ఈ నాటకరంగం మాత్రం మాకొద్దు. మా చంద్రిక ఏనాటికీ నాటకాలు వేయదు. కనీసం నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగడానికి వీల్లేదు....." అంది విరక్తిగా.
    తను నిరాశ చెందింది. అది నెరవేరనేలేదు. ఈలోగా ఆమె ఒక్కసారయినా స్టేజిమీద నటించాలని తన కోరిక. ఆరోగ్యం పాడయిపోయింది.
    అప్పుడే తనకూ సిద్దార్ధకూ పరిచయమవడం, తామిద్దరూ వివాహంచేసుకోవాలని నిర్ణయించుకుని ఆమె అనుమతి కోరడంజరిగింది. కానీ ఆమె ఒప్పుకోలేదు.
    "చంద్రిక మహానటి అవుతుంది సిద్దార్ధా! అక్ప్పతి వరకూ ఆమె వివాహం చేసుకోకూడదు. నేనూ అప్పటివరకూ మొండిగా ప్రాణాల్తో ఉంటాను. అన్ని పేపర్లలోనూ, పత్రికల్లోనూ, దానిఫోటో చూశాక గానీ నా జీవితం అంతంకాదు - "అంది ఆవేశంగా.
    ఆమె మాటల్ని ఇద్దరూ గౌరవించారు. తరువాత ఆమె చనిపోయింది.
    తనను తీసుకుని మద్రాస్ చేరుకున్నాడు తండ్రి. నాటకరంగంనుంచి సినిమారంగం ప్రవేశించిన అనేకమందిని కలుసుకుని తనకు సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నాలు ప్రారంభించాడు.
    ఆ రోజులు తలుచుకుంటే వళ్ళంతా భయంతో గగుర్పొడుస్తుంది.
    చివరకు మొదటిఅవకాశం ఎలా వచ్చింది? తన తండ్రిపలుకుబడి వల్లా? తన నటనా శక్తివల్లా? అదృష్టంవల్లా? ఊహు! అవేమీ కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS