Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 7


    పోలీసులు జనాన్ని అతి కష్టం మీద వెనక్కునెట్టి సన్నని దోవ రాకపోకల కోసం ఏర్పరచారు. ఆ ఇరుకు త్రోవలోనే మార్కెట్ వేపు పోయేజనం, వాహనాలు అతికష్టం మీద ముందుకి నడుస్తున్నాయి.
    అకస్మాత్తుగా ఏ కారు వచ్చినా జనమంతా అదేనటీ నటులున్నకారు అనుకుని చుట్టుముట్టేయడం, పోలీసులు విజిల్స్ కొడుతూ, లాఠీలతో మళ్ళీ వారిని వెనుకకునెట్టేయడం జరుగుతోంది.
    మరి కొద్ది నిమిషాల్లో ఓ పోలీస్ జీప్, దానివెనుకే ఓ కారు వేగంగా జనంలోకి చొచ్చుకొచ్చినయ్.
    క్షణంలో పోలీసులు చెవులు పగిలేలా విజిల్స్ వేస్తూ లాఠీలు గాలిలోకి లేపి జనాన్ని వెనుకకు నెట్టివేయడం ఆ కార్లో సినీతారలు థియేటర్ ఆవరణలోకి చేరుకోవడం జరిగిపోయింది.
    కార్లో కిటికీ దగ్గరే కూర్చున్న చంద్రికను చూసి జనం సంతోషంతోకేకలు వేశారు. చంద్రిక కారు దిగుతూ ఓసారి రోడ్డువేపు చూసింది. అక్కడి దృశ్యం ఆమెకు భయం ఆనందం రెండూ కలిగించింది. సముద్రంలా కనబడుతున్నారు జనం, రోడ్లు, షాపులు, ఇళ్ళు, భవనాలు అంతా నిండి పోయి చీమలపుట్టల్లా కనబడుతున్నారు.
    ఇంతమంది జనం కేవలం తమను చూడడానికే వచ్చారు. ఇంతమంది ప్రేక్షకుల అభిమానం పొందిన తామెంత అదృష్టవంతులు? ఒక్క కళాకారులకు తప్ప మరెవరికి లభిస్తుందీ గౌరవం? మరెవరు పొందగలరీ ఆదరణ.
    ఆ సినిమాహాల్ మేనేజరు గదిలోకి నడిచారందరూ.
    తన ప్రక్కనే కూర్చున్న నటి యమున ఆమె హాజరయిన ఓ సినిమా శతదినోత్సవవేడుక గురించి డైరెక్టర్ కి చెప్తోంది.
    ఆమె హృదయంలో సంతోషం పొంగి పొరలుతోంది.
    ఇది తనకు మొదటి విజయవంతమైన చిత్రం. ప్రపధమంగా తను కధానాయికగా నటించిన చిత్రం.
    గత రెండేళ్ళుగా తను ఏవేవో చిన్నపాత్రల్లో నటించింది.
    ఆ చిత్రాలు కూడా అంతంతమాత్రంగానే ప్రదర్శింపబడినయ్. చివరకు ఓ కొత్త డైరెక్టర్ తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.
    అయితే ఆ సినిమా సగంలోనే ఆగిపోయింది. భాగస్తులలో వివాదాలొచ్చి పూర్తిచేయకుండానే విడిపోయారు.
    అయితే తన పేరు మాత్రం హీరోయిన్ ల లిస్ట్ లో కెక్కేసింది. దాంతో ఇప్పుడీ చిత్రంలోకూడా కధానాయిక పాత్రలభించడం.....చిత్రం వందరోజులాడడం జరిగింది. ఈ చిత్రంలో తన నటనకు టాక్ తననో బిజీ ఆర్టిస్ట్ గా మార్చేసింది.
    ఎవరో కూల్ డ్రింక్స్ తెచ్చి అందరికీ అందించారు. బయటనుంచీ జనం కేకలు, ఈలలు ఎక్కువైపోయినయ్.
    హాలు మేనేజర్ వచ్చి ప్రొడ్యూసర్ తో ఏదో చెప్పాడు.
    "జనం గొడవ చేస్తున్నారట, ఓసారి బాల్కనీలోకెళ్ళివారికి కనబడితేవాళ్ళు వెళ్ళిపోతారు....." అన్నాడతను అందరినీ ఉద్దేశించి.
    వెంటనే అందరూ లేచి మేడమీదకు బయల్దేరారు. చంద్రిక ఇంకా కూల్ డ్రింక్ తాగుతూండడం చూచి" మీరు నెమ్మదిగా రండి! ఫరవాలేదు" అన్నాడు వర్ధనరావ్ నవ్వుతూ.
    అతనా చిత్రంలో హీరోగా నటించాడు. సీత కూడా అతనితోపాటు వెళ్ళిపోయింది.
    చంద్రిక, డైరెక్టర్, రామనాధం, హాలుమేనేజరు మిగిలిపోయారక్కడ.
    జనం కేకలు అరుపులు మరింత ఎక్కువగా వినిపించసాగినయ్. సృజన వెంటనే మెట్లుదిగి వచ్చేసింది.
    రామనాధం పక్కనే కూర్చుని తనకు గుంటూర్లో జరిగిన సన్మానం గురించి చెప్పసాగింది.
    ఆమె చెప్పే ప్రతి మాటా శ్రద్దగా వినసాగాడతను.
    అతను మచిలీపట్నంలోని ప్రముఖ వర్తకుడు, ధనవంతుడు. ఏ సినీతారలొచ్చినా ఏరాజకీయ నాయకులొచ్చినా  మరే ప్రముఖ వ్యక్తులొచ్చినా అతనింట్లోనే ఆతిధ్యం.
    అతనికి రెండు మేడలున్నాయ్. అరడజను కార్లు వున్నాయ్. వాటిల్లో ఓ కారు, ఓ మేడ కేవలం అతిధులకోసమే కేటాయించబడినయ్.
    అతను సినిమాలుచూడడు, రాజకీయాలజోలికి పోడు, మరే విషయమూ అతనికి అవసరంలేదు.
    అతనికి ఒకే ఒక్క పిచ్చి ఉంది. పేపర్ లో తనపేరు వేయించుకోవడం దానికోసం అతను ఇలాంటి ఉత్సవాలన్నింటిలోనూ పాల్గొంటాడు.
    స్వతహాగా అతను పిల్లికి బిచ్చం పెట్టడు. కానీ అది తనఫోటో పేపర్ లో వచ్చేవిషయమైతే ఎన్నివేలయినా ఖర్చు చేయగలడు.
    కేవలం ఆ పిచ్చికోసమే అతను సినిమాలకూ, రాజకీయాలకూ సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాడు. సంవత్సరంపొడుగునా ఎంతోమంది అతిధులకు ఆతిధ్యమిస్తూంటాడు.
    ఈలోగా శ్రీరంగం పరుగుతో వచ్చాడక్కడికి.
    "చంద్రికగారూ! మీ పాపులారిటీకి నా జోహార్లు! నేను అనేక శతదినోత్సవాలు తిరిగాను గానీ 'చంద్రికరావాలీ' అంటూ హీరోయిన్ కోసం జనం కేకలు వేయడం, మేమంతా ఉన్నా మీరే రావాలనిపట్టుబట్టడం ఏనాడూ జరగలేదు."
    చంద్రిక ఆశ్చర్యంగా చూసిందతనివేపు.
    "ఏం జరిగింది?"
    "మీరు వెంటనేవచ్చి కనపడకపోతే ఈహాలు కాస్తా ఎగిరిపోతుందిగాల్లోకి! త్వరగా పదండి!"
    అతనలా చెపుతూండగానే బయట నుంచీ మళ్ళీ కేకలు ఎక్కువైపోయినాయ్.
    "అదిగో చూశారా! మీ గురించే ఆ గొడవంతా"
    చంద్రిక, సృజన ఇద్దరూ మెట్లెక్కి బాల్కనీలోకి నడిచారు. తను ముందుకు నడిచిపెద్ద పెట్టున హర్షధ్వానాలు చేస్తున్న జనసమూహం వేపు చూస్తూ చేయి వూపింది.
    వారందరినీ చూస్తోంటే గుండెలు వేగంగా కొట్టుకోసాగినయ్ ఆమెకి.
    వారి అభిమానం చూస్తోంటే ఆనందంకంటే ఎక్కువ ఆశ్చర్యం కలుగుతోంది.
    తనేనాడూ ఊహించని పరిణామం ఇది. అసలు తారాపధానికి చేరుకోవాలని ఉవిళ్ళూరేవాళ్ళు రెండే రెండు కారణాలవల్ల ఆ వేపు ఆకర్షింపబడతారు.
    మొదటిది గ్లామర్. రెండోది డబ్బు. కనీసం తన అభిప్రాయం ఇది. తనూ ఈ రెండింటికోసమే ఈ పరిశ్రమలో అడుగు పెట్టింది.
    అయితే తనకు మొదటి ఆకర్షణ డబ్బు. రెండోది గ్లామర్. ఏ తారకయినా లభించేది ఈ రెండేనని ఇంత వరకూ తన నమ్మకం.
    కానీ ఇప్పుడు ఈ రెండింటికన్నా విలువైనది మరొకటి ఉందని తెలిసింది. అది ప్రేక్షకుల అభిమానం.
    ఇది తనకెంతటి పరవశత్వం కలిగిస్తోందో అనుభవమయింది ఇప్పుడు.
    చంద్రిక వెనుకకువచ్చేసింది.
    జనమంతా కదిలివెళ్ళిపోసాగారు.
    "పదండి హాల్లోకి వెళదాం!" అంటూ వారికి స్టేజివేపు దారి చూపారెవరో.
    హాల్లో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. నటీనటులందర్నీ చూడగానే పెద్ద పెట్టున హర్షధ్వానాలు చెలరేగినాయ్.
    ఒక్కొక్కరూ రెండేసి మాటలు మాట్లాడుతున్నారు మైకుముందు. చంద్రిక వంతు వచ్చేసరికి ప్రేక్షకుల ఆనందం కట్టలు తెగింది.
    ఆమె మాట్లాడే ప్రతి మాటకూ తప్పట్లు.
    "ఇంకాసేపు మాట్లాడాలి" అంటూ కేకలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS