
73
శ్రీహరికి జబ్బు చేసినప్పుడు మ్రొక్కుకున్న మ్రొక్కుబడి తీర్చటానికి సత్యనారాయణస్వామి దర్శనానికి కుటుంబమందరూ అన్నవరం వెళ్ళారు. త్రిమూర్తుల ఏకమూర్తీ, లక్ష్మీసమేతుడూ, అద్బుతదైవమూ అయిన ఆ లక్ష్మీనారాయణుని దర్శనంతో శాంతి మనస్సు తాత్కాలికంగా ఉపశమనం పొందింది. 'అన్నవరం దేవుడవు, అన్న ప్రతి వరం ప్రసాదిస్తావట. నా హృదయానికి శాంతి నివ్వలేవా? ఏ పాపం చేశానని యిలా బాధిస్తావు?' అని మనసులోనే ప్రశ్నించింది దైవాన్ని. 'రాజా జీవితానికైనా సుఖశాంతులు ప్రసాదించు' అని కోరింది. అన్నలూ, వదినలూ, తల్లీ, తండ్రీ వ్రతాలు చేసుకుంటూంటే ప్రక్కన కూర్చుని ముగ్ధురాలై చూచింది.
దర్శనమూ, వ్రతాలూ పూర్తయేసరికి మధ్యాహ్నం పన్నెండైంది. భోజనాలు చేసి, రెస్ట్ హౌస్ లో విశ్రామించారందరూ. శాంతి మాత్రం కెమీరా తీసుకుని చుట్టుపట్ల సుందర దృశ్యాలన్నీ ఫోటోలు తీసుకోసాగింది.
"నన్నుకూడా తీయవే, ఓ ఫోటో" అన్నాడు శ్రీహరి వెనుకనుంచి వచ్చి నవ్వుతూ.
"నిజంగా తీస్తాను. దా పాపనెత్తుకునిల్చో."
"బాగా తియ్యాలమ్మోయ్!" అంది పద్మ కూడా వచ్చి.
"ఏమిస్తావ్ బాగా తీస్తే?"
"కోరుకో" అన్నాడు శ్రీహరి.
"అడగనా?"
"ఊఁ."
"అయితే శాంతి ఆశ్రమం చూద్దాం. ఇక్కడి కాట్టే దూరం లేదుట." నవ్వుతూ నవ్వుతూనే సంభాషణ చాలా దూరం పోయింది.
అదిరిపడ్డాడు శ్రీహరి. "అదేం కోరిక, శాంతీ?" అన్నాడు హీనస్వరంతో.
"అవునన్నయ్యా. అక్కడ చాలా బాగుంటుందని విన్నాను. నాకు నచ్చితే కొన్నాళ్ళక్కడ వుండాలనుంది."
"శాంతీ!" గుండెలు పగలే బాధలో క్షీణ స్వరంతో పిలిచాడు. "నువ్వేమైపోతున్నావో యేమిటో నాకేమీ తెలియడం లేదు. వద్దమ్మా నామాట విను. ఈ కోరిక వద్దు. 'శాంతి' మనస్సంబంధమైనది. అది లేనినాడు ఎక్కడున్నా ఒక్కటే."
"అంతేనా? తీసుకెళ్ళవా?"
"తీసుకెళ్ళను, శాంతీ. ఇచ్సిన మాట. తప్పినా సరే, తీసుకెళ్ళను. ఇక్కడినుంచి యింటికిపోయి రేపే తిరుపతి వెళ్దాం. ఆ శ్రీనివాసుడి దర్శనంతో మన బాధలన్నీ కడుక్కుపోతాయని నాకు గట్టి విశ్వాసముంది. మనకు తిరుపతి మ్రొక్కుకూడా వుందిగా?"
"అవును, శాంతీ. ఇక తర్కించకు. నీ సంగతి మాకు తెలుసు." అనునయిస్తూ చెప్పింది పద్మ.
74
తిరుపతి ప్రయాణం చాలా సరదాగానే జరిగింది. కారు కొండ ఎక్కుతూంటే అనుభవ మయ్యే ఆహ్లాదం, చూపట్టే సుందర దృశ్యాలు ఏదో అతీతలోకంలోకి తీసుకుపోతాయి మనస్సును. సకల బాధలూ మరిచిపోతాం. నాలుగు గోడల మధ్యనా కూర్చున్నప్పుడు ఉండే అహమూ, స్వార్ధమూ అటువంటి పరిస్థితులలో తాత్కాలికంగా తప్పుకుంటాయి.
"ఏమి ఈ ప్రకృతి వైభవం! ఇసుకరేణువు, గులకరాయి, గడ్డిమొక్క మొదలుగా ఎడారులూ, పర్వతాలూ, మహారణ్యాలూ, నదీనదాలూ, మహా సముద్రాలూ గల ఈ భగవత్స్రుష్టిలో మనమెంత? మన జీవితమెంత? ఈ అల్ప జీవితంలో యింత పోరాటం, కక్షలు, క్రౌర్యాలు ఎందుకు? ఈ జీవితం ఏమైపోతేనేం, బాధ దేనికి?' అనే ఒకవిధమైన వేదాంతభావం ప్రవేశిస్తుంది మనస్సులో. ఈ నిత్యం అనిత్యంగా, అశాశ్వతం అతీతంగా, అనంతంగా అనుభవమౌతుంది. ఈ స్వార్ధ ద్వేషాసూయా పూరిత మైన ప్ర్రపంచంనుండి, ఈ ధనమూలమిదమైన జగత్తునుండి ప్రకృతి ఒడిలోకి పారిపోయి ఆ పర్వతసానువులలోని రేణువులలో ఒకరేణువుగా, రాళ్ళలో ఒక రాయిగా, ఆ తరుమూలాలలో ఒక తరువుగా, ఆకులలో ఒక ఆకుగా, పూవులలో ఒక పూవుగా, ఆ జలపాతాలలో ఒక బిందువుగా లీనమై పోవాలని కోరుకుంటుంది హృదయం. అందునా అది కళాత్మక హృదయమైతే మరీ బాధ పడుతుంది-ఆ ప్రకృతిలోకి పారిపోలేక, లౌకిక సంబంధాలను సడలించుకోలేక.
ప్రయాణ బడలికతో బలరామయ్యా, లక్ష్మీదేవీ, పద్మా, ప్రశాంతీ, శ్యామలా, నారాయణా వెంటనే పడుకున్నారు కాటేజ్ లో.
వెన్నెలలో వింత శోభతో అలరారుతూన్న ఆ పర్వతాలనూ గంధపు చెట్లనూ తిలకిస్తూ చాలాసేపు కాటేజ్ వరండాలోనే నిల్చుంది శాంతి. దేవాలయం ముంగిట జరుగుతూన్న హరికథా కథనం దూరశ్రవణ యంత్రాలద్వారా చాలా దూరం విన్పిస్తూంది. విచిత్ర దీపాలంకరణతో శోభిల్లుతూన్న దేవాలయ గోపురం మనస్సులో మహాప్రశాంతిని కలుగజేస్తూంది. 'చాలు. ఈ తృప్తి చాలు. నాకే చింతా లేదు. ఏది ఏమైనా ఫర్వాలేదు. ఎక్కడున్నా, ఏ పరిస్థితులలో ఉన్నా నీ దివ్యమంగళ రూపన్ని మనసున నిలిపి, నీ మహిమను స్మరిస్తూ నీలో ఐక్యమై పోయే రోజు కోసం నిరామయంగా నిరీక్షించగలను, భగవాన్! నిరీక్షించగలను' అనుకొంటూ తృప్తిగా నిదుర పోయింది.
ఉదయమే శుచిగా సుస్నాతులై శ్రద్దా భక్తులతో దైవదర్శనానికి వెళ్ళారు. ఆపాద మస్తకం వజ్రకవచంతో మెరిసిపోతున్న ఆ శ్రీనివాసుడిని చూచి పరవశమైపోయారు. రత్నాల హారాలతో, పచ్చలు పొదిగిన వైకుంఠ హస్తంతో, ధగద్దగాయమానంగా వెలుగొందుతూన్న శంఖుచక్రాలతో, నవరత్న ఖచిత కిరీటంతో, ధవళనామాలతో విరాజిల్లుతూన్న ఆ గంభీర విగ్రహాన్ని, భువనమోహన రూపాన్ని గాంచి తన్మయులై పోయారు.
"తిరిగి నీ సన్నిధిలోనే మా శాంతమ్మ పెళ్ళి చేయటానికొస్తాం. అప్పుడే మళ్ళీ నీ దర్శనం. ఆ భాగ్యం త్వరగా కలిగించు, తండ్రీ" అని మరీ మరీ మ్రొక్కుకుంది లక్ష్మీదేవి. బలరామయ్య గారు కూడా అలాగే మ్రొక్కుకున్నారు. "నా 'శాంతి' శాంతి నిలయానికి ప్రాణం. నాకు ప్రాణం. నాతల్లి జీవితం ఆనందమయం చెయ్యి, ప్రభూ!"
శ్రీహరీ, నారాయణాకూడ అనేకమైన కోరికలు కోరుకున్నారు మనస్సులో. అందులో ముఖ్యమైనది ఒక్కటే. 'తండ్రిగారి సంతానమైన ముగ్గురిలో మేమిద్దరం సుఖంగా వున్నాం. ఇక మిగిలినది శాంతి. అమాయకురాలు. నీ పరీక్ష లకు తట్టుకోలేదు. మాకంటే అదృష్టవంతురాలిగా, ఆనందమాయ జీవితం గడిపేటట్టుగా అనుగ్రహించు, శ్రీనివాసా! ఆమె మనోభీష్టం నెరవేర్చు.'
శాంతి మనసున ఏ కోరికా లేదు. నీరువలె నిశ్చలంగా, స్ఫటికంవలె స్వచ్చంగా, కుసుమం వోలె కోమలంగా ఉంది ఆమె హృదయగతస్థితి. మేఘశకల దూరమైన స్వచ్చ వినీలా కాశంలాగా బాధాంధకార దూరమైన అంతరంగం అతి నిర్మలంగా ఉంది. ఆమె మనస్సులో మెదులుతూన్న కోరిక ఒక్కటే - 'నీ పాదాలపై అన్ని పుష్పాలు పవిత్రత నందాయి. వాటిలో నన్నొకతెగా ఎప్పుడను గ్రహిస్తావు?'
మ్రొక్కుబడులు సమర్పించి, దర్శనం చేసుకొనివచ్చి తృప్తిగా విశ్రామించారు బసలో. మధ్యాహ్నం పన్నెండైంది. సాయంత్రమే తిరుగుప్రయాణం. శాంతికి అసలక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనుంది. ఎక్కడా తృప్తి తీరనేలేదు. కాని తప్పదు. వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచంలో ప్రియమైన వెప్పుడూ అరుదుగానే లభిస్తాయి; మధురమైన క్షణాలు కొలదిగానే ఉంటాయి. అందీ అందకుండానే మురిపిస్తాయి.
కాటేజ్ వెలుపలికి వచ్చి ఆలోచిస్తూ మెల్లగా శంఖుమిట్ట ఎదుట ఆళ్వార్ టాంక్ ఒడ్డున నడక ప్రారంభించింది. ఏడు కొండల మీద, కటికరాళ్ళ మధ్యన నిత్యపూర్ణమైన ఈ సరస్సు! ప్రక్కనే పూలతోట! ఎంతాశ్చర్యం! భాగావత్సృష్టిలో అసలు ఆశ్చర్యంకానిదీ, విచిత్రంకానిదీ ఏముందీ?
