ధర్మ చక్రం
కుమారి కోడూరి కౌశల్యా దేవి
.jpg.jpg)
రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రతరంగా సాగుతున్న రోజులవి. అప్పట్లో దేశానికి ఆయువు పట్టయిన స్వర్ణ గంగా డాం ను అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నది భారత దేశ సైన్యం. అదను చూచి దేశంలో ప్రవేశించి కైవసం చేసుకోవడానికి శత్రువులు వచ్చి ఇరవై మైళ్ళ దూరంలో విడిసి ఉన్నారు.
నది విపరీతమైన వరదలతో పరవళ్ళు తొక్కుతున్నది. బలమైనా గాలి వీస్తూ, చిరు చినుకులు పడుతూ చికాకుగా ఉన్న ఆ సాయంత్రం, గౌతమ్ టీ తీసుకుంటున్న సమయంలో అతని డేరా కు వచ్చాడు మేజర్ సుయోధన్? "ఏం భాయ్! ఏమైనా విశేషమా?" నవ్వుతూ ప్రశ్నించాడు గౌతమ్.
సుయోధన్ నవ్వలేదు. "విశేషమే" అన్నాడు గంబీరంగా.
గౌతమ్ కలవరపాటుతో ప్రశ్నించాడు: "ఏమైనా వార్త తెలిసిందా?"
"ఊ! పద. ఇక్కడ కాదు. అలా ఏకాంతంగా కొండల మీదకు పోయి మాట్లాడు కుందాము. చాలా రహస్యము."
"పద."
ఇద్దరూ రైఫిల్స్ తీసుకుని వేటకు పోతున్నట్లుగా కొండల మీదికి పోయారు. ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశం లో సాగింది సంభాషణ. సుయోధన్ ప్రారంభించాడు:


"ఇంతకూ ముందే నైట్ పెట్రోల్ నారాయణ్ శర్మ వార్త తెచ్చాడు."
"ఏమిటది?' త్వరగా చెప్పు."
"శత్రువులు మూటా ముల్లె కట్టుకుని వెనక్కు పోతున్నారట!"
"వెరీ గుడ్! మన సత్తా తెలిసి ఉంటుంది."
"కాదు. అలా నమ్మి మనం ఏమరి ఉండగా హటాత్తుగా అర్ధరాత్రి వేళ నది దాటుతారట. ఏర్పాట్లు కూడా మంచి దిట్టంగానే ఉన్నాయట!"
కనుబొమలు ముడి వైచాడు గౌతమ్.
తిరిగి సుయోధన్ అన్నాడు : "మన సేనలను ఆయత్త పరచడానికి వ్యవధి సరిపోతుందో , లేదో? వార్త చాలా ఆలస్యంగా అందింది."
"నారాయణ్ శర్మ నాకు కనిపించలేదేమిటి?" గౌతమ్ ప్రశ్న.
"పాపం , చాల శ్రమ పడ్డాడట. కొద్ది సేపు విశ్రాంతి కావాలన్నాడు . సరే, వెళ్ళమన్నాను."
గౌతమ్ చాలాసేపు యోచించి అన్నాడు: "సరే. ఖంగారు దేనికి? తప్పక మనమే గెలుస్తా మని నా ధైర్యం. దైవవశాత్తు పరిస్థితి చేయి జారిపోయినా ఫర్వాలేదు. అత్యవసర పరిస్థితులలో డామ్ పేల్చి వేయమని మనకు ప్రభుత్వం నుంచి ఉత్తరవు ఉండనే ఉన్నది కదా!"
"అవును, కాని యుద్ద భూమిలో ఎవరి కెవరం? హటాత్తుగా అప్పటి కప్పుడు ఆ పని సాధ్యం కాదేమో నని , నా భయమంతా. చూడు, ప్రకృతి కూడా నేడెలా పగ బట్టిందో" అన్నాడు మేఘావృతమైన ఆకాశం కేసి చూచీ, దృష్టికి దూరాన పొంగులు వారే ప్రవాహం తో కనిపిస్తున్న నదిని తిలకించీ. "నదికి విపరీతమైన వరద తగిలింది. వంతెన కూ, నదికీ అరడుగు దూరం మాత్రమే ఉన్నది. ఎప్పుడు ఏమి కూల్చేస్తుందో అన్నట్టు హోరెత్తుతూ మహా ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈరోజు అమావాస్య. ఈ మేఘాలొకటి. వాన కూడా ఆ సమయాని కింకా అధికం కావచ్చు.' అంటూ అనుమానం వెలిబుచ్చాడు.
"అవును. ఆ క్షణం లో కుదరదు. అయితే, ప్రత్యేకంగా ఒక వ్యక్తీ ని ఇప్పటి నుండే అందుకు నియమిస్తే? సిద్దంగా ఉండి అవసరమైతే ఆ పని కానిస్తాడు."
అర్ధయుక్తంగా నవ్వాడు సుయోధన్. 'అవును. కాని ఇంత ప్రమాదభరితమైన ఈ పనికి ముందుకు వచ్చేవాడు లేడు. నది వరద లో రకరకాల పాములు కొట్టుకోస్తున్నాయట. అదీకాక, పగలే ఈ పని సాధ్యం కాదు. ఇక మన వాళ్ళలో శత్రు పక్షం వాళ్ళు కొందరున్నట్టు మనం చూచాయగా పసి కట్టాము. అందువల్ల ఈ బృహత్తర కార్యాన్ని సామాన్యులకు ఒప్పజేప్పడం బహిరంగ పరచడం కూడా నా కిష్టం లేదు."
'అవును . అదీ నిజమే." తల పంకించాడు గౌతమ్ . "మరైతే మనిద్దరి లో ఒకరం ఆ పనిని పైన వేసుకోవాలి. రెండవ వారు సైన్యాన్ని నడిపించాలి."
ఇద్దరూ మరొకసారి చుట్టూ చూచి, ఎవరూ లేరని నిర్ధారించుకొని , కర్తవ్య నిర్ణయం చేసుకొని విడిపోయారు.
* * * *
అర్దరాత్రీ . ఎల్లెదలా గాడాంధకారం, పెను గాలీ, వానా. నది భయంకరంగా గర్జిస్తూ విలయ తాండవం చేస్తున్నది. అటువంటి సమయం లో ఒక మానవాకారం ప్రాణాలకు తెగించిన ధైర్యంతో, అతి చాకచక్యంగా వంతెన అడుగు భాగం చేరి, డైనమేట్లు అమర్చి, తిరిగి దూరంగా సురక్షిత ప్రదేశం చేరుకున్నది. కొంత తడవు వేచి ఉన్న అనంతరం ఆ ఆకారం మెల్లగా నది ఒడ్డుకు వచ్చి పరిశీలించింది. సైనిక శిభిరాలన్నిటి నీ చూచింది. అలా కాలికి వచ్చినట్టు తిరుగుతున్న ఆ ఆకారాన్ని మరో ఆకారం వచ్చి కలిసింది. ఇద్దరూ బాగా నది ఎగువ కు వెళ్లి జాగ్రత్తగా చూచారు. ఒక ఆకారం చటుక్కున టార్చి లైటు ఫోకస్ చేసింది. ఆ వెలుగులో దూరాన రెండు మానవాకారాలు కనిపించాయి. ఒకటి వెంటనే పరుగు తీసింది, అయిపూ ఆజా లేకుండా. రెండవ మనిషి తన చేతిలోని ఏదో వస్తువును ఆ పరవళ్ళు తొక్కుతున్న నదిలోకి విసిరేశాడు. ముగ్గురూ కలియ బడ్డారు. కాల్పులు సాగించు కున్నారు.
శిభిరాల లోని జనమంతా వచ్చేశారు. ఆ కాల్పులు విని. అప్పటికే ముగ్గురి లో ఒక వ్యక్తీ నదిలో పడి కొట్టుకు పోతున్నాడు. మిగిలిన వారిని అందరూ గుర్తు పట్టారు -- గౌతమ్ , సుయోధన్!
ఈ గౌతమ్ దేశద్రోహి. మన రహస్య పత్రాలేవో శత్రువు కిచ్చేస్తున్నాడు. నన్ను చూచి వాడు పారిపోయాడు నదిలో పడి. వీడికి నారాయణ్ శర్మ అండ! వాడూ పారిపోయాడు."
విపరీతావేశంతో చెప్పాడు సుయోధన్. అందరూ గౌతమ్ పెడ రెక్కలు విరిచి కట్టారు. "ద్రోహీ! నీ నేరం నా పైన తోస్తున్నావా?' అంటూ గౌతమ్ గింజుకున్నాడు. ఎవరూ అతడి మాట నమ్మలేదు.
సైనిక న్యాయ స్థానం లో కేసు విచారణ లో ఉండగా గౌతమ్ పారిపోయాడు! అతడి పై అనుమానం నిర్ధారణ అయింది అధికారులకు. ఒక వంక యుద్ధం హోరాహోరీ గా సాగుతున్నది. మూడు రోజుల అనంతరం , యుద్ధం జరుగుతుండగా- శత్రువులు నదిని దాటుతుండగా హటాత్తుగా డైనమైట్ పేలింది. శత్రువులు సర్వనాశన మయ్యారు. ఆ మర్నాడు ఆ ప్రాంతాలలోనే గౌతమ్ పట్టు బడ్డాడు. "ఆ డైనమెట్ నేనే పెల్చాను. సుయోధన్ మోసగాడు" అని చంటి పిల్ల వాడులా వాదించిన అతడి మాట ఎవరు నమ్ముతారు? సుయోధన్ సమయోచిత ప్రజ్ఞ వల్ల దేశం రక్షింప బడిందని అతడిని ప్రభుత్వం గౌరవించింది. గౌతమ్ కు జన్మాంత శిక్ష పడింది. నారాయణ్ శర్మ పై అరెస్టు వారంటు అలానే ఉండిపోయింది.
* * * *
కాలచక్రం నిరంతర పరిభ్రమణ శీలి! ఎవరి కొరకూ, దేని కొరకూ నిలిచి పోదు. ఏళ్ళకు ఏళ్ళు గతిస్తూనే ఉన్నాయి.
1
మానవ కోటికి సూర్యోదయ మయింది. బాల భాస్కరుని బంగారు కిరణాలలో ఆనంద లాస్యం చేస్తున్నది. అనాధాశ్రమం అంతా. ఎప్పుడో నూటికీ, కోటికీ ఒక్కనాడు మాత్రం , ఏ కొద్ది పాటి సందడి సంబరాలకో నోచుకొన్న ఆ ఆశ్రమ వాతావరణం నేడు ఎల్లెడలా కళకళ లాడిపోతున్నది. ప్రతి ఒక్కరి వదనం లో ఏదో ఉత్సాహం, ఆనందం, ఆవేశం.
ఏడు గంటలకు ప్రార్ధన సమయంగా గంట వినపడింది. అందరు బాలబాలికలూ బిలబిల లాడుతూ సమావేశ మందిరంలో చేరిపోయారు. ప్రార్ధన ముగిసింది. శరణాలయాదికారి నారాయణ స్వామి, కమిటీ మెంబర్లు శరణాలయం ముఖ్య పోషకులు , పట్టణం లోని ప్రముఖ వ్యక్తులు మొదలైన వారంతా చిరు నగువులు చిందిస్తూ ఆసీనులై ఉన్నారు. నారాయణ స్వామి కూర్చున్న ఆసనం నుండి లేస్తుండగానే నిశ్శబ్దంగా ఉన్న ప్రేక్షకులు మరింత నిశ్శబ్దంగా అయిపోయి, అతడి మాటల కోసం చెవులు దొరగించి కూర్చున్నారు.
"మహామహులారా! దాతాలారా! ఆశ్రమ వాసులారా!" పట్టపగ్గాలు లేని సంతోషంతో సంబోదిస్తూ ఒక్క క్షణం ఆగాడు నారాయణ స్వామి. "మన ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి ఇప్పటికి సరిగా పదమూడు సంవత్సరాలైంది. అనాధ బాలబాలికలను సంరక్షించి, శక్తి మేరకు ప్రయోజకులను చేయడమే నా ధ్యేయం. ఈ అనాధశ్రమంలో మొదట చేరిన బాలుడు ధర్మారావు."
కరతాళధ్వనులు మిన్ను ముట్టాయి.
"ఇటు రా ధర్మారావ్!"
నారాయణ స్వామి పిలవగానే , మొదటి వరస లో కూర్చున్న ధర్మారావు నమ్రతతో లేచి వేదిక పైకి వచ్చాడు. అధ్యక్షులకూ, ఆహూతులకూ, సభ్యులకూ, వినమ్రంగా వందనం చేసి, చేతులు కట్టుకుని గంబీరంగా నిలబడ్డాడు.
నారాయణ స్వామి తిరిగి తన ఉపన్యాసం ప్రారంభించాడు. "ఈ ధర్మారావు పదేళ్ళ వయస్సులో ఇక్కడ చేరాడు. ఈ అనాధ శ్రమం ప్రారంభించిన కొత్తల్లో -- కొత్తగా ఏదైనా పని చేసేటప్పుడు ఎదురయ్యేలాగానే చాలా ఇబ్బందులు-- ఇటు ఆర్ధికంగా నూ, అటు వ్యావహారికంగా నూ , మరొక వంక వ్యక్తిగతం గానూ కూడా ఎదురయ్యాయి. అయినా ఎట్లాగో నిలవదోక్కుకుని, ఆశ్రమానికి అండదండలు కూర్చుకుని ఆయువు పోశాము. పిల్లలకు ఆదరువూ, ఆశ్రయమే గాక, విద్యాభ్యాసం, కూడా లభించేటట్టు దైవం అనుగ్రహించాడు. ఆ విధంగా ఈ ఆశ్రమానికి ఆరంభం నుండీ ఎదురైనా కష్ట నిష్టూరాలన్నీ నిర్వాహకులతో పాటు, ఆశ్రమ వాసులకు కూడా ఎరురయ్యాయి. అటువంటి వాటినన్నిటిని సరుకు చేయక దీక్షతో ఒక్క సంవత్సరం కూడా పరీక్ష తప్పకుండా ప్రప్రధమంగా ఉత్తీర్ణుడవుతూ , ప్రభుత్వ ఉపకార వేతనాలను పొందుతూ పట్టభద్రుడయ్యాడు ధర్మారావు. చదువు పూర్తీ కాగానే, సెంట్రల్ జెయిల్ సూపరింటెండెంట్ పదవి వచ్చింది. సార్ధక నాముడై పదుగురి మెప్పూ పొందాలని ఆశీర్వదిస్తున్నాను."
ప్రేక్షకులు సంతోషంగా చప్పట్లు చరిచారు.
"ఈ ఆశ్రమం తో పదమూడేళ్ళ అనుబంధం కల ధర్మారావు వెళ్ళిపోతున్నాడు.....' నారాయణ స్వామి కంఠం గద్గదికమయింది. కొద్ది క్షణాల పాటు తనను తాను సంబాళించుకుని తిరిగి ప్రారంభించాడు, నారాయణస్వామి , బొంగురు పోతున్న కంఠం తోనే. "ధర్మారావు దినదినాభివృద్ధి ఎంత ఆనందదాయకంగా ఉన్నదో, అతడు ఇక కొద్ది రోజులలో -- గంటలలో మనను వదిలి దూర ప్రదేశానికి వెళ్లి పోతున్నాడంటే అంత విచారంగా ఉన్నది. ఈ సంస్థకు ధర్మారావు జ్యైష్ట కుమారుడు; గర్వకారకుడు. ఇచ్చటి బాల బాలికలందరికీ ఆదర్శ ప్రాయుడు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. చిరంజీవి ధర్మారావు ను ఎల్లప్పుడు సార్ధక నాయదేయుడు గానే చేసి, కీర్తి ప్రతిష్టలు కలిగించ మని భగవంతు ని ప్రార్ధిస్తున్నాను" అని ముగిస్తూ , ఆగకుండా స్రవిస్తున్న అశ్రుధారలను ఉత్తరీయంతో ఒత్తుకుంటూ కూర్చుని పోయాడు నారయణ స్వామి.
తన పోషణ లో ఉన్న ఒక అనాధ బాలుని పై అతడి కంత ప్రత్యెక ప్రేమాభి మానాలేమిటా అని అందరూ ఆశ్చర్య పోయారు.
