Previous Page
శాంతినికేతన్ పేజి 66


    నడిచి నడిచి చంద్రగిరి వైపుగా మెట్లదారి ఉన్న ప్రదేశాన్ని చేరుకుంది శాంతి. ఎన్ని నేత్రాలైనా చాలవు అక్కడి పర్వత దృశ్యాలు  చూడటానికి. నల్వంకలా మహోన్నత శృంగాలు, వివరం తెలియని చిత్రవిచిత్రమైన సువాసనలు, దూరాన కన్పించే చంద్రగిరి కోట చూడాలేగాని వర్ణించలేం.
    ప్రకృతి పర్యవేక్షణలో లీనమైన శాంతి చూపులు క్రమంగా తనలాగే చూడవచ్చిన వ్యక్తులపైకి తిరిగాయి. అట్టేమంది లేరు; ఏడెనమండుగురు తప్ప. సిమ్న్టు సోఫాలో కూర్చున్న ఒక యువకునితో ఒక యువతి నిల్చుని మాట్లాడుతూంది. అరే! అతడు రాజా కాడూ? కొద్దిగా చిక్కి ఉన్నాడు. అవును. అతడే! ఆమె? శశి కావచ్చు. తల తిరిగిపోయింది శాంతికి. కాని వెంటనే తమాయించుకుంది.
    'మాట్లాడటమా? లేక వెళ్ళిపోవటమా? వెళ్ళిపోతేనే మంచిది. అతనితో మాట్లాడితే తన మనస్సెలా మారుతుందో, అతడి మనస్సేమై పోతుందో?' రెండడుగులు వేసింది. కాని మనస్సంగీకరించలేదు. 'రాజా! ఒకనాటి స్నేహితుడు! ఉత్తముడు! ఇన్నాళ్ళు ఏ వ్యక్తికోసం పరితపించానో ఆ వ్యక్తీ యివాళ కనిపిస్తే మాట్లాడక పోవటమా? రాజా విషయంలో నాకు స్వార్ధమే కాని ఏమీలేదా? అతడునావాడు కానంత మాత్రాన నాకు అతడి యోగక్షేమాలతో నిమిత్తం లేదా? కాదు, కాదు. ఉంది. అతడెవరి వాడైనా, ఎక్కడున్నా అతడు బాగుండటమే నాకు కావలసింది. అవును. అంతే' అనుకుంటూ అటు నడిచింది.
    "రాజశేఖరంగారూ?" మెల్లగా పిలిచింది.
    ఆ యువతీ యువకులు త్రుళ్ళిపడి చూచారు.
    "ఓ శాంతీ!" అన్నాడు రాజా  ఆశ్చర్యంగా. వదనంలో వేయి జ్యోత్స్నలు వెలుగొందాయి. వెంటనే ఆరిపోయి అమవస చీకట్లతో ముఖం మలినమైంది.
    "గుర్తున్నానా?" హీనస్వరంతో అడిగింది. ఎంత అణుచుకొన ప్రయత్నించినా నేత్రాలు బాష్పపూరితం కాకమానలేదు.
    "ఎంత మాట! మీరు గుర్తుండకపోవడమా, శాంతీ! రండి. కూర్చోండి. ఈమె శశి."
    "ఊహించాను. వెనకొకసారి చెప్పారుగా?"
    శశి వెంటనే రివ్వునలేచి వెళ్ళిపోయింది. ఒక్క మాటకూడా మాట్లాడలేదు. చూచేవా రిద్దరూ ఆశ్చర్యపోయారు.
    "అదేం, ఆవిడట్లా వెళ్ళిపోతారు?" అంది శాంతి.
    "శశీ!" రాజా పిలిచాడు.
    "ఇంకెందుకు? మీ శాంతి వచ్చిందిగా? అసలే నాతో మాట్లాడేది అంతంతమాత్రం. ఇక యిప్పుడు! మాట్లాడతారా?" అంటూనే విసవిసా నడిచిపోయింది శశి.
    లేచి వెళ్ళబోతూన్న శాంతిని రాజా మాటల తోనే అడ్డుపడి ఆపాడు. "పోనీండి."
    "ఊరుకాని వూరు. పాపం ఎక్కడికి పోతారు? నేను వచ్చినందువల్ల ఎంత పని జరిగింది!" విచారించింది శాంతి.
    "ఫర్వాలేదు. ఏం జరగలేదు. శ్రీహరి బాగున్నాడా? అమ్మా, నాన్నగారూ... ..."
    "అంతా బాగున్నారు. కాటేజ్ లో ఉన్నారు. కాని, రాజశేఖరంగారూ, ఇంటికి వెళ్ళాక ఆమెకూ, మీకూ మధ్య ఏమైనా కలతలు వస్తాయేమో? ఇదివరకు జరిగినవి చాలక మళ్ళీ మీ సంసారంలో కూడా నావల్ల ... ..."
    "శాంతీ!" ఆశ్చర్యావమానాలతో అన్నాడు రాజా. "ఆమె ఎవరనుకుంటున్నారు? శశి. హాస్పిటల్ నర్సు. అంతే. మీరేమేమో మాట్లాడు తున్నారు. నాకర్ధం కావటం లేదు."
    శాంతి అప్రతిభురాలై చూచింది. మాట్లాడలేకపోయింది.
    తిరిగి రాజా అన్నాడు: "ఆమధ్య కొన్నాళ్ళ పాటు వూళ్ళన్నీ తిరిగాను. అప్పుడే ఆరోగ్యం దెబ్బతిన్నది. డాక్టర్లని కన్సల్ట్ చేస్తే మొదట రోగమేమిటో నిర్దారించలేకపోయారు. తర్వాత ఎక్స్ రే తీశారు. అంతా బాగానే ఉంది. కాని శరీరంలో క్షయ ప్రారంభదశలో ఉన్నట్టు అనుమానంగా ఉందన్నారు."
    "రాజా!" అదిరిపడి రాజశేఖరం చేయి పట్టుకుంది శాంతి. ఆమె అతడి నావిధంగా సంబోధించడం యిదే ప్రధమం. ఆపుకున్నా ఆగకుండా కన్నీళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. "దీనికంతకూ నేనే కారణం. నేనే కారణం" అంది పలుమార్లు రోదిస్తూ.
    "లేదు, శాంతీ. ఇద్దరమూ కారణమే. సరే. ఆ జబ్బు భయంతో రాజమండ్రీ శానిటోరియమ్ లో ఉన్నాను కొన్నాళ్ళు. కాని అక్కడికి రైతులు సరిగా డబ్బు పంపించడంలేదు. అందుకని మళ్ళీ వచ్చి మదనపల్లి శానిటోరియంలో చేరాను. ఇక్కడకు నా పొలాలూ అవీ దగ్గర్లో ఉంటాయి. డబ్బు అవసరమైనప్పుడు స్వయంగానైనా తెచ్చుకోవచ్చునని. ఇప్పుడేమీ లేదు. బాగానే ఉన్నాను. ఇవ్వాళో రేపో డిశ్చార్జి చేస్తారు."
    వింటూన్నశాంతి నేత్రాలు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. చనువుగా ఆమె చెక్కిళ్ళు ఒత్తాడు రాజా.
    "ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయినట్లేనా?" ఇంకా వెక్కెక్కి పడుతూనే ఉంది శాంతి.
    "అసలేమీ లేందే? ముందుజాగ్రత్తకోసం ఉన్నాను. ఎంత విరక్తిలో ఉన్నవాడికైనా ప్రాణం పోయే జబ్బుంటే భయం సహజం కదా!"
    "వద్దు, రాజా, వద్దు. అటువంటి మాటలు వద్దు. మీరు కలకాలం సుఖంగా ఉండాలి. అయితే మా అన్నయ్యలు వేయించిన పత్రికా ప్రకటన మీరు చూడలేదా?"
    "చూశాను." విరక్తిగా నవ్వాడు. "ఏ ముఖంతో రాను?"
    "ఎందుకు మీకంత అభిమానం, రాజా? బుద్దితక్కువవాళ్ళు ఏదో అన్నదానికి అంత బాధపడటం దేనికి? మీరు వెళ్ళిన ఆ రోజు నుంచి ఈక్షణంవరకూ ఎంత పరితపించి పోయాయో తెలుసా?"
    రాజా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కూర్చుని తన చేతిలో ఉన్న ఆమె చేతివ్రేళ్ళ సౌకుమార్యాన్ని వీక్షిస్తున్నాడు. చూస్తూన్నవాడల్లా హఠాత్తుగా ఏదో గుర్తువచ్చినట్లు ఆ చెయ్యి వదిలేసి కొంచెం దూరంగా జరిగాడు. "శాంతీ! మీకు వివాహం ... ..."    
    అతడి నేత్రాలలోకి సూటిగా చూచింది శాంతి. "మిమ్మల్ని మరిచి చేసుకోగలననే అనుకున్నారా?"
    "లేదా, శాంతీ?" ఆనందంగా ప్రశ్నించాడు.
    "లేదు. కాని మీరు మదనపల్లిలో ఉన్నారని తెలిసి చిన్నన్నయ్య వచ్చాడు నెల్లాళ్ళ క్రితం. త్వరలో మీరు శశిని వివాహం చేసుకుంటారని ఎవరో నర్స్ చెప్పిందట. దానితో ఇక మిమ్మల్ని కలుసుకోనుకూడా కలుసుకోకుండా వచ్చేశాడు."
    "నర్సు చెప్పిందా?" ఆశ్చర్యంగా అడిగాడు. "ఇంకెవరు? శశి అయ్యుంటుంది."
    "కావచ్చు. అదే అందరం నమ్మాం. శశి కజిన్ బ్రదర్ డాక్టర్ రమేష్ కూడా అలాగే చెప్పాడు. అతడికి శశి స్వయంగా చెప్పిందట, మీతో తనకు త్వరలో వివాహమని. మరీ అంత స్థిరంగా తెలిశాక నమ్మకుండా ఎలాగుంటాము? ఇక మీ దగ్గరకు వచ్చినా మీ మనస్సును బాధపెట్టడమే అవుతుందని ఎవరూ రాలేదు. ఎక్కడైనా మీరు సుఖంగా ఉంటే చాలని ఇక మేం జోక్యం కలిగించుకోలేదు. ఇప్పుడు కూడ అసలు మాట్లాడకుండా వెళ్ళిపోదామనే అనుకున్నాను. కాని వెళ్ళలేకపోయాను. ఇది వరలో మీకు తెచ్చిన అనర్ధాలన్నీ చాలక ఇప్పుడు మళ్ళీ శశిని మీకు దూరం చేశాను. క్షమించగలరా నన్ను?"
    మెల్లగా అన్నాడు రాజా: "అవును ఏదైనా వినగానే నమ్మకం కలగడం సహజం. కాని కన్పించిన ప్రతివారితో ప్రణయంలో పడేంత హీనుడిని కాదు, శాంతీ. ఈ హృదయం ఒకసారి ఒకరికి దత్తమైంది. ఇక అందులోనుండి ఆ ప్రతిమ చెరగదు. ఇవ్వాళ నా పుట్టినరోజు. ఎక్కడున్నాసరే ప్రతి పుట్టినరోజుకూ వచ్చి తప్పకుండా ఆ శ్రీనివాసుని పాదాలవద్ద వ్రాలడం నాకు నియమం. అలాగే ఈ రోజూ వచ్చాను. డాక్టర్ అసలు వద్దన్నాడు. కాని నేను వినలేదు. అయినా అంత ప్రమాదమేమీలేదు కదా! కడకు అంగీకరించాడు. మా సంభాషణంతా వింది శశి. ఎలా వచ్చిందో మరి? నేను కొండమీద బస్సు దిగగానే నన్ను వచ్చి కలుసుకుంది. తన కేదో మ్రొక్కుబడి ఉందని చెప్పింది."
    మౌనంగా వింటూంది శాంతి.
    "కాని, శాంతీ, ఆమెకు లోపల నాపై ఆశ ఉందని ఇదివరకే అనుమానపడ్డాను. ఇప్పుడది బలపడింది. నేను ఉద్యోగం ఇప్పించి నందుకు అభిమానమని అనుకున్నాను మొదట. కాని యివ్వాళ తెలిసింది. ఆమెకా అభిప్రాయం ఎలా కలిగిందో? ఆశ్చర్యంగానే ఉంది మరి! కలకత్తానుంచి కూడా యిలాగే నన్ను వెంబడించిందన్నమాట! ఎంతటిది శశి!"
    "స్వార్ధపరురాలు!" అంది శాంతి ఏవగించుకుంటూ. "నేనైతే మనఃపూర్వకంగా సంతోషంగా అభినందించేదాన్ని. ఉపకారం చేసిన వారిని అంత తేలికగా ఎలా మాట్లాడగలిగింది?"
    నవ్వాడు. "తెలుసు, శాంతీ, నీలో అటువంటి గొప్ప సుగుణా లున్నాయని. అందుకే నువ్వు నాదానివి. ఇక మనం ఎప్పటికీ దూరం కావద్దు. కష్టంలో, సుఖంలో ఎప్పుడూ ఒకటి. తెలివితక్కువవల్ల ఇదివరకు దూరమైనా యిప్పుడు దూరం కావద్దు" అని ఆమె చేతులు తన చేతులలోకి తీసుకున్నాడు.
    "రాజా!" ఆశ్చర్యానంద విస్ఫారిత నేత్రాలతో అంది శాంతి. "నాలో ఏ మాలిన్యమూ లేదా? నన్ను మనఃస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా?"
    "లేదు, శాంతీ, లేదు. నీలో ఏ మాలిన్యమూ లేదు. అప్పుడు నువ్వేదో భ్రమపడ్డావు. అంతే. అది మాలిన్యం కాదు. నేను పొరపడ్డాను. పూర్వపు శాస్త్రాలు పదేళ్ళ బాలకు కాని ఇరవయ్యేళ్ళ యువతికి కాదు. పరాయివానిని కన్నెత్తి చూస్తేనే మాలిన్య మంటుతుందనుకోవటం పొరపాటు. హృదయం వికసించాక దాన్ని ఎవరూ బంధించలేరు. ఇష్టానుసారం వ్యక్తిని ఎన్నుకోవటంలో తప్పులేదు. ఆ ఎన్నికమార్గంలో కొన్ని కొన్ని అనుభవాలు జరుగక తప్పదు. అదే నీవిషయం లోనూ జరిగింది. కొందరు దానిని కప్పిపుచ్చుతారు, నీవు నిర్మల హృదయంతో చెప్పివేశావు. ఏమీ తెలియని పసిపిల్లవంటిదానవు నువ్వు అప్పుడు. నిన్నేమాలిన్యమూ అంటలేదు. నాకు తెలుసు."
    "రాజా!"
    "అవునుమ్, శాంతీ. మరి మాట్లాడకు. నిన్ను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను. ఆ ఉద్దేశ్యంతోనే శ్రీనివాసుడు మనల్నీ పవిత్ర ప్రదేశంలో సమాగమపరిచాడు. నీరసంగా వుండీ భక్తి శ్రద్దలతో తన దర్శనార్ధం వచ్చినందుకు నాకు వెలలేని రత్నాన్ని జన్మదిన కాన్కగా యిచ్చాడు."
    ప్రియ సమాగమంలో మైమరిచిపోయి ఉన్న యిద్దరూ "శాంతీ!" అనే పిలుపు విని ఉలిక్కిపడ్డారు. రాజా చేతులలో ఉన్న తన చేతులను త్వరగా వెనక్కు లాక్కుంది శాంతి.
    శ్రీహరి!
    "రాజా!" అంటూ వచ్చి గట్టిగా కౌగలించేసుకున్నాడు శ్రీహరి. ఇద్దరికీ మాటలు కరవయ్యాయి. కన్నీళ్ళు వర్షంలాగా స్రవించ సాగాయి.
    "రాజా! ఏవార్తా తెలియనీయకుండా ఎలా వుండగలిగా విన్నాళ్ళు! నన్నెందుకింత బాధ పెడుతున్నావు?" అడిగాడు శ్రీహరి. "శాంతి నీకోసం చిక్కి శల్యమైపోయింది చూడు."
    కళ్ళు తుడుచుకు నవ్వాడు రాజా. "ఏమైతే నేం? ఏడుకొండలవాడు మనల్ని కలిపాడు. అంత కంటే ఇప్పుడేమీ చెప్పలేను. నిన్ను కలిసిన సంతోషంలో మాటలు రావడంలేదు."
    "అవును. నడవండి కాటేజ్ కి. శాంతి కనిపించక అందరూ కంగారు పడుతున్నారు. వెతుక్కుంటూ వచ్చాను నేనిప్పుడు."
    అప్పుడు తెలిసివచ్చింది శాంతికి. 'తాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయటకు వచ్చింది కాటేజ్ నుంచి. ఇప్పుడు సాయంత్రం నాలుగైంది! వచ్చేముందు ఎవరికీ చెప్పనైనా లేదు.'
    
                                                        75

    తిరుపతి కొండమీదే వైభవంగా జరిగింది శాంతీ రాజశేఖరుల కళ్యాణం. బలరామయ్యా, లక్ష్మీదేవీ తృప్తితో ఆనందబాష్పాలు ఒలికించారు. ఆ ఆనందంలో ఆనందంగా శ్రీ వేంకటేశ్వరుల వారికి కళ్యాణం జరిపించారు.
    "ఏ ఒడిదుడుకులూ లేకుండా శాంతితో బాటు మా శాంతినిలయాన్నీ, శాంతివనాన్నీ ఏలుకొమ్మని అర్ధిస్తున్నాను బావగారూ" అన్నాడు శ్రీహరి నూతన సంబోధనతో రాజశేఖరాన్ని.
    ఆ పిలుపుకు రాజా దేహం పులకరించింది. "మనం ఎప్పుడూ ఆత్మీయులమే, బావా. ఇవ్వాళ క్రొత్తగావచ్చిన దేమీ లేదు. మనమధ్య క్రొత్తగా దూరాలూ, అభ్యర్ధనలూ వద్దు. మామూలుగా వుందాం. శాంతివనంలో వుండటం నాకూ సంతోషప్రదమే. ధన్యుడిని."
    "మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, శాంతీ" అని మనోరమ టెలిగ్రాం పంపించింది.
    "ఇక మా శాంతమ్మగారికి శాంతినికేతన్ అక్కర్లేదు. మేమూ అక్కర్లేదు. మనస్సునే శాంతినికేతన్ గా మార్చి మరులుగొలిపే వరుడు దొరికాడు" అని పరిహాసమాడారు పద్మా, శ్యామలా.
    శాంతినిలయం సాక్షాత్తూ శాంతి నిలయమైంది. నూతన దంపతులను చూచి తలిదండ్రులూ, అన్నలూ, వదినలూ అందరూ ఆనందసముద్రంలో ఓలలాడారు.
    శార్వరీ రాత్రి శాంతివనంలో సంతోషంగా విహరిస్తూన్న ఆ దంపతులను చూచి ప్రతిచెట్టూ, మొక్కా, ఆకూ కూడ తమ చెలిజీవితం సార్ధకామైనదని సంతోషంలో తల లాడించి అభినందించాయి.
    "శాంతీ! నా జీవితానికి శాంతిప్రదాయినివి" అన్నాడు రాజా.
    "రాజా! నా హృదయసామ్రాజ్య రాజాధిరాజులు మీరు. ఇందుకు సూత్రధారుడైన శ్రీహరి అన్నయ్యకు ఎప్పుడూ కృతజ్ఞురాలను" అంది అర్ధనిమీలిత నేత్రాలతో.
    వెనుకనున్న రామన్న "చిన్నమ్మోయ్! నా బహుమానం సంగతి మరిచిపోమాక" అన్న మాటలు విని సిగ్గుపడుతూ తలవాల్చిన శాంతిని కొంటెగా చూచాడు రాజా. ఆ దంపతులను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నట్టు శాంతి శిరీష తన కోమల పుష్పాలను శిరస్సులపై రాల్చింది.
    


                                 --సమాప్తం--


 Previous Page

WRITERS
PUBLICATIONS