"అటువంటి పేర్లు ఎందుకు? నా పోలికే దానికీ ఎందుకు?"
అదిరిపడ్డాడు శ్రీహరి. ఇటువంటి విరక్తీ, వేదాంతమూ ఎంత ప్రమాదకరమో అతడికి తెలుసు. కాని ఏమని ఓదార్చగలడు చెల్లెల్ని? విడిపోయిన కుటుంబమంతా కలిశారు. ఏ అశాంతీ లేదు; అందరూ శాంతినిలయంలోనే ఉంటున్నారు. కాని అందరికి శాంతి ప్రసాదియైన శాంతి, శాంతినిలయానికి ప్రాణమైన శాంతి, శాంతివనానికి జీవకళయైన శాంతి హృదయమే అశాంతి స్థావరమై పోయింది.
"రాజాను పోనీ స్నేహితుడిగా ఒకసారి చూచి వస్తాను. అదికూడా నీకు అభ్యంతరమా, శాంతీ?" అనడిగాడు శ్రీహరి.
"నాకు అభ్యంతరమూ, అసూయా లేవు, అన్నయ్యా. పోనీ, అలాగే వెళ్ళు. కాని నిన్ను చూడటంతో శాంతి కుదురుకున్న ఆయన మనస్సులో తిరిగి అశాంతి రేగవచ్చు. శశి అపోహ పడవచ్చు. అందుకే నిన్ను వద్దన్నది. ఎక్కడో ఒకచోట సుఖంగా ఉన్నారుగా? అంతే చాలు. ఇంతవరకూ మనం ఆయనకు తెచ్చిన కష్టాలు చాలక యింకా ఎందుకు చెప్పు? ఆయన జీవితంలో మన జోక్యం పనికిరాదు. అదే నేను చివరకు నిర్ణయించుకున్నది."
వింటూన్న శ్రీహరి బాష్పపూరిత నేత్రాలను శాంతి చూడకుండా త్వరత్వరగా మరొకవైపుకు త్రిప్పుకున్నాడు.
72
మనోరమ దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. కొండంత ఆశతో విప్పిచూచింది శాంతి.
"శాంతీ,
ఏమిటంత మౌనం దాల్చావ్? నువ్వు నాకు ఉత్తరం వ్రాసి రెండు నెలలు దాటింది; తెలుసా? రాజా దగ్గర్నుంచి కూడా ఉత్తరాలు లేవు. అడ్రస్ తెలీదు. నీకు తెలిస్తే అడ్రస్ యియ్యి.
నాలుగు నెలల క్రితం రాజా ఒకసారి మా యింటికి వచ్చాడు. రెండు రోజులు ఉన్నాడు. కాని అతడిలో యిదివరకటి చాయలెక్కడాలేవు. ఆ స్నేహసంభాషణే లేదు. చాలా మౌనంగా, ముక్తసరిగా ఉన్నాడు. ఇదివరలో నీ విషయంలో చాలా కుతూహలంగా మాట్లాడేవాడు. 'బాగానే వున్నా'రన్నమాట తప్ప మరేమీ నీ విషయాలు మాట్లాడలేదు. లోకంలోని విషాదమంతా అతడిలోనే మూర్తీభవించినట్టు ఉన్నాడు. ఊళ్ళన్నీ తిరిగి చూస్తున్నానని చెప్పాడు. తర్వాత మళ్ళీ అతడి సమాచారమే తెలియలేదు.
ఈ మధ్య మదనపల్లి శానిటోరియంలో ఉన్నట్టూ, జబ్బు చేసినట్టూ నమ్మకంగా తెలిసింది. కాని వెళ్ళి చూడాలంటే బావకెక్కడా తీరికలేదు. అయినా ఈ ఢిల్లీనుంచి వెళ్లడమంటే అంతదూరం మాటలా? ఉత్తరం వ్రాస్తే జవాబులేదు. అందుకున్నట్టు రసీదు వచ్చింది. నాకు చాలా బాధనిపించింది.
శాంతీ, నీ మనస్సు పాషాణం. స్త్రీ హృదయానికి ఉండే కోమలత్వం నీలో లేదు. మగువ లకు మాణిక్యభూషణమైన జాలి నీలో లేదు. రాజా నాశనానికి నువ్వే కారణం. నిరంకుశమైన నీ ఈ ప్రవర్తనకు నేను క్షమించినా, రాజా క్షమించినా, మరెవరు క్షమించినా భగవంతుడు మాత్రం క్షమించడు. శాంతీ, క్షమించడు!
మనోరమ."
నిర్జీవంగా నవ్వుకుంది శాంతి. శానిటోరియంలో ఉన్నారు గనుక జబ్బు చేసిందని నమ్మింది మనోరమ!
జవాబు వ్రాయాలనిపించలేదు. కాని అల్లకల్లోలమై పోయిన మనస్సుతో, ఆలోచనల మార్పుకోసం కారు తీసుకు బయల్దేరింది.
ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర చెట్టు క్రింద కారాపి దిగి తాళంవేసి నడిచి వెళ్ళుతూండగా తన కారు వెనుకనే ఆగిన కారునుండి దిగుతూన్న డాక్టర్ రమేష్ కన్పించాడు.
"హల్లో! గుడీవినింగ్."
"గుడీవినింగ్." విస్మయంతోనే సమాధాన మిచ్సింది శాంతి.
"ఏమిటిలా వచ్చారు?" ప్రక్కనే నడుస్తూ అడిగాడు డాక్టర్.
"కాలక్షేపానికి అప్పుడప్పుడు వస్తూనే వుంటాను. మీరు?" తిరిగి అడిగింది. "ప్రాక్టీస్ తగ్గిపోయిందా?" అంది నవ్వుతూ.
గలగలా నవ్వేశాడు డాక్టర్. "మీ దయవల్ల అలా జరగలేదు. మీ పాదమహిమేమో, మీరు మా నర్సింగ్ హోమ్ లో వుండి వెళ్ళినప్పటినుంచీ అసలు ఎక్కడా తీరికే వుండటం లేదు."
శాంతి మాట్లాడలేదు.
"ఇప్పుడే నర్సింగ్ హోమ్ కని బయల్దేరాను. మెయిన్ రోడ్ మీద మీ కారు కన్పించింది. అసలు నేను మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీ కారు వెనుకే నాదీ త్రిప్పి పోనిచ్చాను."
ముఖ కవళికలను మరుగునపరిచే ప్రయత్నంలో మౌనంగా భూమివైపు చూస్తూ నడక సాగించింది శాంతి.
"పార్క్ లో కూర్చుందామా?" అడిగాడు రమేష్.
శాంతి మాట్లాడలేదు. ఒక్కసారి ముఖమెత్తి చూచి తిరిగి వాల్చేసుకుంది.
పార్క్ లో కొద్దిసేపు కూర్చున్నారు యిద్దరూ. చాలాసేపు మౌనమే రాజ్యం చేసింది. వాహ్యాళిగా వచ్చేపోయే పలువురితో నిండిపోయి ఉంది పార్కు.
"అలా నది దగ్గర యిసుకమీద కూర్చుందామా?" అన్నాడు రమేష్.
మౌనంగా లేచింది శాంతి. ఒక్కసారి చుట్టూ చూచి, "అవసరమంటారా? ఇక వెళ్ళిపోదాం" అంది.
రమేష్ ముఖం మాడిపోయింది. "ప్లీజ్. ఒక్క పావుగంట వ్యవధి ఇవ్వండి. మీతో అనవసరంగా మాట్లాడాలి."
"సరే." నిస్సహాయంగా అటు నడిచింది శాంతి.
"థాంక్స్" అన్నాడు రమేష్ సంతోషంగా.
గోదావరిలో నీరు బాగా తగ్గిపోయింది. ఇసుక తిప్పలు బయటపడ్డాయి. ప్రవహించలేక ప్రవహించలేక ప్రవహిస్తున్నట్టుంది నది.
"శాంతీ!" మెల్లగా ప్రారంభించాడు రమేష్. "నాకు చతురతతో మాట్లాడటమూ, కవిత్వమూ రాదు."
బలవంతంగా నవ్వింది శాంతి. "అవును. డాక్టర్లకు కవిత్వం దేనికీ?"
రమేష్ కూడా నవ్వాడు. "అలా అట పట్టించకండి మరి. నా మనస్సులో మాట సూటిగా చెప్తున్నాను. మిమ్మల్ని మొదటి సారిగా చూచినప్పుడే నా హృదయాన హత్తుకు పోయారు. మీ అభిప్రాయం తెలుసుకొని మీవాళ్ళ నడిగిస్తాను."
శాంతి ముఖం గంభీరమైపోయింది. ఇసుకలో గీతలు గీస్తూ కూర్చుంది.
"మాట్లాడరేం, శాంతీ? నే నన్నివిధాలా మీకు తగినవాడినని నిర్ధారించుకునే అడిగాను."
జీవంలేని నవ్వు నవ్వింది శాంతి. "మీ రిటు వంటి ప్రసంగ మేదో చేస్తారని నాకు తెలుసు. అందుకే వెళ్ళిపోదామన్నాను."
రమేష్ వదనంలో నిరాశ తాండవించింది. "ఏమండీ? అనర్హుడినా?"
తిరిగి అలాగే కళాకాంతులు లేని నవ్వు నవ్వింది శాంతి. "ఒక పక్షమే ఆలోచించారు. ఉభయ పక్షాల అర్హతా ఆలోచించవద్దూ?"
"అంటే?" ఈసారి అతడి కనుకొలకు లలో ఆశ్చర్యం దోబూచులాడింది.
"మీ అర్హతకు నేను తగినదాన నౌవో కాదో ఆలోచించారా మరి?"
"హాస్యం వద్దు, శాంతీ. నిజం మాట్లాడండి."
"ఎక్కువ మాటలు వద్దు, డాక్టరుగారూ ఇలా చెప్పవలసివచ్చినందుకూ, మిమ్మల్ని చిన్న బుచ్చుతున్నందుకూ చాలా విచారంగా ఉంది. నా జీవితానికి వివాహ ప్రసక్తి లేదు."
"శాంతీ!" త్రుళ్ళిపడ్డాడు రమేష్.
"అవును. ఆవేశపడకండి. అంతకంటే ఏమీ చెప్పలేను."
"కాదు, శాంతీ. చెప్పాలి. ఏమిటా కారణం?" "..... ..... ....."
"వివతగనివాడనా? నాపై నమ్మకం లేదా?"
"అదేమీ కాదు. కేవలం నా విషయమైతే చెప్పడాని కెటువంటి అభ్యంతరమూ ఉండదు. కాని అందులో ఇతరుల విషయాలుకూడ పెనవేసుకుపోయి ఉన్నప్పుడు వాటిని బహిరంగ పరచడానికి నా కెటువంటి హక్కూ లేదనుకుంటాను" అంటూ లేచింది.
రమేష్ కూడా లేచాడు. "మీవి చాలా ఉత్తమ గుణాలు." బరువుగా విశ్వసించాడు. "అయితే ఎవరినైనా ప్రేమించారా?"
"ప్లీజ్. ఇక ఆ విషయం వదిలేయండి."
"అంతేనంటారా?" నిరాశగా ఆఖరిసారిగా ప్రశ్నించాడు.
"క్షమించండి. అన్నివిధాలా నాకంటే అధికురాలైన వదినగారు రావాలని కోరుకుంటున్నాను."
"వదిన!" అంటూ గొణుక్కున్నాడు. "శాంతీ!" మెల్లగా పిలిచాడు. "మన స్నేహం, పరిచయం అల్పమే అయినా నేను మిమ్మల్ని మరిచిపోలేను. కాని మనం పరాయివాళ్ళంగానే ఉండిపోతాంగా?"
"అవును."
"ఈ పరిచయానికి గుర్తుగా మీమండి అపురూపమైన వస్తువేదైనా - మిమ్మల్ని ఎప్పుడూ అపురూపంగా గుర్తుతెచ్చేది కావాలి."
శాంతి మాట్లాడలేదు.
"ఇవ్వలేరా?"
"ఇస్తాను." హాండ్ బాగ్ తెరిచి అప్పటి కప్పుడు, మళ్ళీ ఇసుకలో కూర్చుని, ఒక కాగితం మీద అందమైన స్త్రీ 'స్కెచ్' గీసేసింది. అరమోడ్పు కన్నులతో, అరచేత అరవిచ్చిన కలువలతో అంజలి ఘటించి ఉంది. ఆ వదనంలో శాంతి పోలికలు స్పష్టంగా ద్యోతక మౌతున్నాయి. ఆ కాగితంమీద, జడలోనుండి తీసిన ఒక తెల్ల గులాబీ, వ్రేలినుండి తీసిన ముత్యపు ఉంగరం పెట్టి అందించింది రమేష్ కు శాంతి.
అందుకొంటూ ఆశ్చర్యంగా అన్నాడు రమేష్: "శాంతీ!"
"అవును తీసుకోండి."
అతడడిగినది అత్యల్పం. ఆమె యిచ్చినది అనల్పం. ఇద్దరి చేతులూ వణికాయి. ఎందుకో ఇరువురి నేత్రాలనుండీ రెండు కన్నీటి బొట్లు రాలి పడ్డాయి.
కళ్ళ కద్దుకుని పదిలంగా దాచుకున్నాడు రమేష్, ఆ మూడు వస్తువులనూ.
సూర్యాస్తమయమైంది నదీ తరంగాలలో కదలిక అధికమైంది.
"ఇక వెళ్దాం" అంటూ లేచిన శాంతి చేతిలో బాగ్ క్రింద పడిపోయింది. తీసి అందిస్తూ రమేష్ అందులో ఫోటో చూచాడు. "ఇతడు రాజా కదూ?" అనడిగాడు కలవరంతో.
"మీకెలా తెలుసు?"
"శాంతీ!" చాలా దీనంగా ఉంది రమేష్ గొంతు. "అతడివేనా మీరు ప్రేమించినది?"
"మీకెలా తెలుసో చెప్పారుకాదు." మాట మార్చింది.
"మీరు బాధపడరు కదా?"
అదొకమాదిరిగా నవ్వింది. "ఎంత బాధనైనా తట్టుకోగలను."
కొంచెంసేపు తటపటాయించి చెప్పాడు రమేష్. "నాకో కజిన్ సిస్టర్ ఉంది. పేరు శశి."
ఆశ్చర్యంగా తలెత్తింది శాంతి.
"ఆమధ్య నేను మదనపల్లి వెళ్ళినప్పుడు అతడిని చూపించింది. చాటుగా చెప్పింది, తన కాబోయే భర్త అని."
శాంతి నిశ్చలంగా వింది. దెబ్బలు తిని తినీ బొప్పికట్టిన హృదయం మరో దెబ్బకు ఏమీ అయిపోలేదు.
కారు దగ్గరకు వెళ్ళాక, "మీ పెళ్ళికి పిలుస్తారు కదూ?" అనడిగింది రమేష్ ను.
"తప్పక. కాని, శాంతీ, మరొక్కసారి ఆలోచించండి. అతడి దారిన అతడు సుఖంగా ఉంటే మీరెందుకు జీవితాన్ని పాడుజేసుకోవాలి?"
శాంతి మాట్లాడలేదు. లోపల అనుకుంది. 'రాజా సుఖంగా ఉండవలసిందే. ఎప్పటికి అతడు సుఖంగానే ఉండాలి.' మనసారా దైవాన్ని ప్రార్దించింది.
"శాంతీ, ఒక్క మాట!"
కారు తలుపు తెరుస్తూన్న శాంతి ఆగింది.
"అంత అవసరం రాకూడదు కాని, ఎప్పుడైనాసరే, ఎక్కడైనాసరే, ఎటువంటి పరిస్థితిలోనైనా, అవసరమని తోచినప్పుడు నా సహాయం, అది ఎటువంటిదైనాసరే - అడగడానికి సంకోచించవద్దు. సంబంధమే అక్కర్లేదు; ఆత్మీయతకు అనుబంధం చాలు."
"థాంక్స్." బరువుగా కారెక్కింది శాంతి. ఒకదాని వెనుక ఒకటి రెండు కార్లూ సాగిపోయాయి.
పృథివిలో ప్రేమ స్వరూపం బహుముఖాలు. అనురాగస్రవంతి అనంతం.
ఇంటికి వచ్చాక రాత్రి తన గదిలో కూర్చున్న శాంతి జరిగినదానిని గురించి చాలాసేపు ఆలోచించకుండా ఉండలేకపోయింది. 'ఏమిటీ జీవితం? రాజా, గోవిందరావు, జయ, రమేష్, మనోరమ - ఎందరో ప్రవేశిస్తున్నారు. ఏమిటీ పరిచయాలకు అర్ధం? ఏమిటీ అనుబంధాల ఆంతర్యం? ఏమిటీ సంబంధాలలో అంతరార్ధం? హుఁ. ఏమీలేదు. జీవితానికే అర్ధం లేదు. నిరర్ధకమైన ఈ జీవనస్రవంతి బహుదారి, బహుముఖి. అంతే.' నిస్పృహ, నిరాశ అధికమైనకొలదీ అన్నీ నిరర్ధకంగానే కన్పిస్తాయి!
