Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 63


                                    71

    అన్ని ప్రముక పత్రికలలోనూ రాజా కోసం ప్రకటనలు పడిపోయాయి.

                                 
    'డియర్ రాజా,
    ఎక్కడ ఉన్నా వెంటనే నీ క్షేమ సమాచారాలు తెలియజెయ్యి. అడ్రస్ వ్రాయి. రెక్కలు గట్టుకువచ్చి వాలతాము. నీ గురించిన చింతతో ఇక్కడెవారికీ సుఖశాంతులు లేవు. అర్ధం చేసుకున్నావు కదూ? మన చిన్ననాటి చెలిమీ, కలకత్తా స్నేహం అన్నీ గుర్తు తెచ్చుకుని కోపం మరిచిపో.
    నీ శ్రీహరి, నారాయణ.' ఫలితం లేకపోయింది. శ్రీహరి కలకత్తా వెళ్ళి ఆ చుట్టుపట్ల ప్రదేశాలన్నీ చుట్టి వచ్చాడు. లాభం కలుగలేదు. నారాయణ చిత్తూరు వేపు వెళ్ళి అంతా ఆరాలు తీశాడు. అతడు రావటం లేదు కాని అప్పుడప్పుడు తన శిస్తు డబ్బు మదనపల్లికి తెప్పించుకుంటున్నాడని చెప్పారు. అడ్రస్ మాత్రం వివరం లేదు. 'కేరాఫ్ పోస్టుమాస్టరు!'
    మదనపల్లి అంతా రెండు రోజులు తిరిగి నిరాశతో తిరిగి వచ్చాడు నారాయణ. "రాజా ఆచూకీ తెలిసింది. కాని కలుసుకోలేదు" అన్నాడు.
    అందరూ కారణ మడిగారు.
    "అతడు కలకత్తానుండే ఎవరో శశి అనే టైపిస్టు గర్ల్ నో, రిసెప్షనిస్ట్ నో తీసుకొచ్చా డట. ఆమెకు మదనపల్లి హాస్పిటల్ లోనే నర్సు పని ఇప్పించి, ఏ జబ్బూ లేనిదే ఆ వంకతో ఆ హాస్పిటల్ లో చేరాడట. త్వరలోనే ఇద్దరూ వివాహం చేసుకుంటారట."
    అందరికీ ఒక్క క్షణం గుండెలు కొట్టుకోవడం ఆగిపోయి, తిరిగి అతి వేగంగా స్పందించ నారంభించాయి.
    "అతడటువంటివాడు కాదురా" ఆనందు శ్రీహరి గుండెలు పిండుతూన్న బాధతో.
    "ఏమో? ఎటువంటివాళ్ళయినా ఎలా గైనా మారవచ్చు. ఆ శశి ఎవరో? మంచి పిల్లేనేమో? మనకేం తెలుసు? ఇంతకూ మనం దురదృష్టవంతులం" అంది లక్ష్మీదేవి నిరాశగా.
    "అయినా నేనొకసారి కలుసుకుని వస్తాను. ఎవరో చెప్పినది నమ్మటానికి వీలులేదు" అన్నాడు శ్రీహరి.
    "అవును. వెళ్ళండి" అంది పద్మ.    
    "వద్దు!" అతి మెల్లని స్వరంతో, చాలా స్థిరంగా చెప్పింది శాంతి. వెంటనే అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది.
    "శాంతీ!" శ్రీహరి బాధగా పిలిచాడు. "నువ్వెప్పటికప్పుడు ఇలాగే తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నావు."
    వెనుకకు తిరిగి అంది శాంతి: "ఇదివరకు అంతే. కాని ఇప్పుడు కాదు. శశి విషయం ఒకసారి అతనే నాకు స్వయంగా చెప్పారు"    
    "ఆఁ!" తల బ్రద్దలై పోగలదని అనుకున్నాడు శ్రీహరి. కాని బాగానే ఉంది.
    "అదేం శని ఉందో దీని నెత్తిమీద!" లక్ష్మీదేవి విచారంగా కన్నీరు కార్చింది.
    'రాజా కన్పించలేదు' అనే వార్తకంటే, మదనపల్లిలో ఉన్నాడనే వార్త విషబాణమై గ్రుచ్చుకుంది శాంతి హృదయంలో శశి గురించి ఒకనాడు రాజా చెప్పిన కధనమంతా గుర్తు వచ్చింది శాంతికి. అవును. అప్పుడా ఆలోచన లేకపోవచ్చు. శశికి నిష్కల్మషంగానే సాయపడి ఉండి ఉండవచ్చు. కాని తర్వాత పరిస్థితులతడిని మార్చివేశాయేమో? శాంతి, జయ - ఇద్దర్నీ మూర్ఖులుగా, స్వార్ధపరులుగా చూచాడతడు. ఆ అసహ్యంతో శశికి దగ్గరై బహుశః ఆమెలో ఏ సుగుణాలైనా చూచి, జీవితాన్నామెతో స్థిరపరుచుకున్నాడేమో?
    ఎంతటి అదృష్టవంతురాలో ఆ శశి! ఏ బంగారు పుష్పాలతో భగవంతుని పూజించిందో రాజా పొందుకోసం!' నిరీక్షణ సమాప్తమైంది. ఆశ సమసిపోయింది. మిగిలింది బాధ మాత్రమే. చాటుగా తనలో తాను క్రుళ్ళి క్రుళ్ళి ఏడ్చింది. ఎవ్వరికీ ఏమీ వివరంగా చెప్పలేదు. బాధనంతనూ తనలో తానే దిగమ్రింగి ఊరుకుంది. రోజులు దొర్లిపోతున్నాయి. శాంతివనంలో శాంతి ఒక పిచ్చిదానిలా, మూగ దానిలా తిరగసాగింది. ఎవరికీ నోరు విప్పి ఏమీ చెప్పదు, అయినా అందరికీ తెలుసు ఆమె బాధ.
    'ఎందుకు నాకీ బాధ? అప్పుడు జయతోనే అతడి వివాహమయి ఉంటే ఏంచేసేదాన్ని? ఏం చేయగలను?' అని తనలో తనే తర్కించుకుంది. 'అప్పుడతడిని సంతోషంగా ఎలా అభినందించగలిగాను?' అని ఆలోచించుకుంది. 'లేదు. సంతోషంగా అభినందించలేదు. ఆత్మవంచన చేసుకున్నాను. ఏడ్చినా ప్రయోజనం లదు గనుక నవ్వడానికి ప్రయత్నించాను. కని జయతో అతడి పెళ్ళే జరిగి ఉంటే యిలాగే బాధపడి ఉందును. ఏ ఆత్మహత్యో చేసుకుందును' అని తలపోసింది.
    'ఎంతటి మార్దవ హృదయుడు! ఎంత కాలం తనకోసం హృదయద్వారాలు తెరిచి ఉంచాడు? ఎంత దీర్ఘకాలం తనకై నిరీక్షించాడు! ఏ శనిదేవతో తన నెత్తిపై తాండవమాడి అతడిని గుర్తింపనీయకుండా అడ్డు పడింది. లేకుంటే అన్నయ్య చెప్పినట్టు రాజాతో పరిచయమున్న ఎవరైనా అతడిని ప్రేమించ కుండా ఉంటారా? ఎంత శిలా హృదయం తనది! ఇంతటి పాషాణ హృదయమూ యిలా సమ్మెటపోట్లతో బ్రద్దలు కావలసి ఉంది! కావలసిందే; ఈ శాస్తి కావలసిందే. రాజాను, అన్నను, తల్లిదండ్రులను అందరినీ నిరాశపరిచిన నాకీ శాస్తి కావలసినదే.'
    లావణ్యం తగ్గి ఆనాటి కానాడు కృశిస్తూన్న శాంతిని చూచి అందరి హృదయాలూ తరుక్కుపోయేవి. అంతకూ తనే కారణమని శ్యామల బాధపడేది. పద్మ శతవిధాల అనునయించ ప్రయత్నించేది. ప్రశాంతి ముద్దు మాటలతో పలుకరించేది. కాని అందరికీ ఒక్క శుష్క హాసమే సమాధానమయ్యేది. అసలే తక్కువగా మాట్లాడే శాంతినుంచి యిప్పుడు పూర్తిగా మాటలే కరువయ్యాయి.
    ఒకనాడు శ్రీహరితో అంది శాంతి-"ప్రశాంతికి పేరు మార్చిమరొక పేరేదైనా పెట్టు, అన్నయ్యా" అని.
    "ఏం?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు శ్రీహరి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS