డాక్టర్ రోజూ వచ్చి చూస్తున్నాడు. వెళ్ళుతున్నాడు. గాయాలు బాగా తగ్గుముఖం పట్టాయి.
ఎందుకో శాంతికి తిరిగి ఈ మధ్య తరుచుగా రాజా గుర్తు వస్తున్నాడు. 'ఇటువంటి ఉపద్రవాలే వస్తే యింత అపురూపంగా చూచుకోవటానికి పాపం రాజా కెవరున్నారు? ఎవరు చూస్తారు?' అనవరతం యిదే ప్రశ్న అంతరంగంలో వేధించసాగింది. ఎంత వద్దనుకున్నా అవే ఆలోచనలు. తీరి కూర్చుని ఈ మనస్సు చేసే ఆలోచనలు అన్నీ కావు. ఎక్కువగా కీడును శంకించే ఆలోచనలే వస్తాయి; అదేం పాపమో!
70
అడపా తడపా నారాయణ గుమస్తాయో, నౌకరో వచ్చి క్షేమసమాచారాలు కనుక్కుని వెళ్ళుతూనే ఉన్నారు, వచ్చిన ప్రతివారిద్వారా లక్ష్మీదేవి ఏదో ఒకటి కొడుకుకూ, కోడలికీ పంపిస్తూనే ఉంది. బలరామయ్య చూచీ చూడనట్టు ఊరుకుంటున్నాడు.
ఆదివారం ఉదయం బలరామయ్య వర్తక సంబంధమైన పనిమీద ఎక్కడికో వెళ్ళాడు. ఊళ్ళో లేడు. శ్రీహరి బలహీనతవల్ల ఇంకా నిద్ర లేవలేదు. తలకు స్నానంచేసి శాంతి తోటలో తిరుగుతూంది. అప్పుడే పట్నంనుంచి నారాయణ గుమాస్తా ఆదరా బాదరా వచ్చాడు.
"శ్యామలమ్మగారి కీసారి నిజంగా జ్వరం వచ్చిందండి."
ఆమాటలు వినగానే శాంతికి ముందు నవ్వు వచ్సింది- 'నిజంగా జ్వరం రావటమేమిటీ?' అని. 'మేము అక్కడున్నప్పుడు జ్వరం నటించింది కదా! అది మనస్సులో పెటుకుని అంటున్నట్టున్నాడు' అని గ్రహించింది.
"ఏమిటి జ్వరం? ఎప్పట్నుంచి?"
"మూడు నాలుగు రోజుల్నుంచి కొంచెం బాగుండలేదనే అంటున్నారండి. అది మామూలే నని అయ్యగారు పట్టించుకోలేదు. నిన్న ఒంటిమీద అక్కడక్కడా పొక్కులు లేచాయి. మశూచికమన్నారు. భయపడి కాకినాడ కబురంపారు పుట్టింటికి. 'మామగార్ని అవమానించిన నారాయణగారు క్షమాపణ కోరేవరకూ ఆ గడప ఎవరూ త్రొక్క'మన్నారు."
"కూతురికి అంత జబ్బు చేస్తే అలాగన్నారా?" ఆశ్చర్యపోయింది శాంతి,
"అసలు అంటురోగమని భయపడ్డట్టున్నారండీ."
"అవును. వుంటారు. అటువంటి వాళ్ళూ వుంటారు" అంది శాంతి.
"ఇవ్వాళ తెల్లవారేసరికి బాగా ఎక్కువై పోయిందండి. శ్యామలమ్మగారు భయపడిపోయి ఏడుస్తున్నారు. అయ్యగారు ఏదైనా హాస్పిటల్ లో జేర్పిస్తానంటున్నారు. నేనే భయపడి ఎవరికీ తెలియకుండా యిలా వచ్చాను."
"ఎంతపని జరిగింది!" చాలా విచారించింది శాంతి. "పద, లోపలికి. అమ్మ్గగారితోకూడ చెప్ధువుగాని. నేనీలోగా తయారై వచ్చేస్తాను" అంటూ "డ్రైవర్! కారు సిద్ధం చెయ్యి. పెట్రోలూ, ఆయిలూ అన్నీ వున్నాయికదూ? రేడియేటర్ లో వాటరుందో లేదో చూడు" అని ఆజ్ఞాపించింది.
విషయం విన్న అందరికీ బాధ కలిగింది.
"మనం వెళ్తే మాత్రం, యిష్టపడుతుందంటావా, శ్యామల?" సంశయంగా అంది లక్ష్మీదేవి.
"ఇటువంటి స్థితిలో పడక ఏంచేస్తుంది? అయినా వెళ్ళడం మన ధర్మం. జబ్బు మనిషి ఎవరూ వెళ్లకుంటే ఏమైపోతుంది? అన్నయ్య ఒక్కడూ ఎంత బాధపడిపోతాడు!" అంది శాంతి.
"అయినా అటువంటి జబ్బున్నచోటికి నువ్వెందుకు? చిన్నపిల్లవు. మీ నాన్నగారొచ్చాక అడిగి నేను వెళ్తాన్లే" అంది లక్ష్మీదేవి.
శాంతి వినలేదు.
"మామగారికి కోపం వస్తుందేమో?" అంది పద్మ.
శాంతి నవ్వింది. "నాన్నగారికి శాంతిమీద కోపం రాదు, వదినా" అంటూనే కారెక్కింది.
"చెప్పినమాట ఒకనాడు విన్నది గనుకనా? ఎంత తోస్తే అంత" అని విసుక్కుంది లక్ష్మీదేవి.
శాంతిని చూచి శ్యామల ఒక విధంగా, నారాయణ ఒకవిధంగా ఆశ్చర్యపోయారు.
"ఎందుకే వచ్చావ్?" అన్నాడు నారాయణ.
"బాగుంది. మా వదినకు జబ్బుచేస్తే నేను రానేమిటి మరి?"
"ఎలా తెలిసింది?"
"ఎలాగో తెలిసింది కాని, ఎలాగుంది వదినా?" అంటూ వెళ్ళి ఆమె ప్రక్కలో కూర్చుంది.
"వద్దు, శాంతీ. నా మాట విను. వెళ్ళిపో. ఇది అంటూ జాడ్యం. మేమెలాగో పడతాం. ఏ నర్సింగ్ హోమ్ లోనో జేర్పించాలని అనుకుంటున్నాను" అన్నాడు నారాయణ.
"ఇంకా నయం అయినవాళ్ళ మెందుకు మరి? ఇక నువ్వు మాట్లాడకు" అంటూ "కాఫీ యిచ్చారట్రా?" అంది నౌకర్లను.
"ఇంకా లేదు."
"అయితే ముందు నేను కాఫీ తయారు చేస్తాను. గుమాస్తాగారూ, మీరు వెళ్ళి డాక్టర్ రమేష్ ను పిల్చుకురండి. నాలుగు రోజులనుంచీ ఒంట్లో బాగుండకపోతే ఏం చేస్తున్నారు మరి అందరూ?" ఇల్లంతా గడగడలాడించేసింది శాంతి. ఆమె తెలివికి ఆశ్చర్యపోయాడు నారాయణ,.
శాంతి మాటలు చెళ్ళున తగిలినట్లయ్యాయి యిద్దరికీ కూడ. ఒకనాడు బలరామయ్య జబ్బు విషయమై పద్మ అలా మాట్లాడినందుకే తామిద్దరూ రాద్ధాంతం చేశారు.
"ఏమిటి, వదినా, ఎలా వుందసలు? మాట్లాడవేమిటి?"
"ఒకనాడు మాట్లాడింది గనుకనా నీతో?" అన్నాడు నిష్ఠురంగా నారాయణ.
"ఇదుగో, అన్నయ్యా, నువ్విలా మాట్లాడావంటే ఒప్పుకోను. ఒక అలా అనకు" అంటూ శ్యామలను లేవదీసి పక్క మార్పించింది.
"నీచేత యిలా చేయించుకోవడం సిగ్గుగా వుంది, శాంతీ" అంది కడకెలాగో శ్యామల.
"ఆహాఁ. ఎందుకో? మరి నా కవసరమైతే నువ్వు చెయ్యవన్నమాట?"
"ఎప్పుడు చేశాను? తిన్నగా మాటకూడ ఆడలేదు" అంది కనుకొలకులలో నీళ్ళు చించుతూండగా శ్యామల.
"సరే. నువ్విప్పుడవన్నీ మాట్లాడకు. గతం నాస్తి శుభ్రంగా పడుకో డాక్టరు వస్తాడు."
మధ్యాహ్నానికి లక్ష్మీదేవీ, శ్రీహరీ, పద్మా, బలరామయ్యా కూడ దిగారు. ఎవరు వచ్చినా బలరామయ్య మాత్రం వస్తాడని ఊహించని అందహ్రికీ పరమాశ్చర్యమైంది. సిగ్గుతో కుంచించుకుపోయారు నారాయాణా, శ్యామలా కుటుంబం అనేక బాధలలో ఉన్నప్పుడు ఓదార్పు లేకపోగా, ఎదురు మరిన్ని కలతలను రేపారు తామిరువురూ. కాని తనకు చిన్నజ్వరం రాగానే ఏదో మహా కష్టం సంభవించినట్టు అందరూ ఆదుకోవడానికి వచ్చేశారు!
"నువ్వు రావడం సంతోషమే కాని పాపతో ఎందు కొచ్చావక్కా? నే నేమైపోతాను?" అంది శ్యామల కన్నీళ్ళతో పద్మను.
"ఫర్వాలేదు. జాగ్రత్తగా ఉండచ్చు" అంది పద్మ.
"అయినవాళ్ళ కొచ్చినప్పుడు తప్పుతుందా మరి?" అంది లక్ష్మీదేవి.
బలరామయ్యకూడ ఒకసారి మంచం దగ్గరికి వచ్చి పలుకరించి వెళ్ళాడు.
తండ్రి పాదాలమీద వాలిపోయి భోరుమన్నాడు నారాయణ - "నన్నీవిధంగా క్షమిస్తారని అనుకోలేదు" అంటూ.
"చాల్లే. లే. వివేకంగా బ్రతుకు" అన్నాడు గంభీరంగా బలరామయ్య. "నిన్ను క్షమించడానికి కాదు నేను వచ్చినది. శాంతికోసం వచ్చాను."
వెక్కిపడుతూ ఆన్నాడు నారాయణ: "కలతలు రేపినదానికి శిక్ష పడింది. అన్నయ్యను కొట్టిన ఈ చేతికిమాత్రం యింకా ఏమీ జరగలేదు."
"చాల్లేరా. అదేం ధోరణి?" శ్రీహరి వాత్సల్యపూర్వకంగా వారించాడు. "మరి నాకు మొన్న యాక్సిడెంటు ఎందుకు జరిగిందంటావ్? అలా అన్నిటికీ అన్వయించుకు బాధపడకూడదు. ఏదో జరిగిపోయింది. ఇప్పుడు సర్దుకుపోతే చాలదూ?"
అందరూ రావడంతో నారాయణకు భయం తగ్గిపోయింది. నిశ్చింతగా ఉన్నాడు. ఇదివరకులా కాకుండా గృహ విషయాల గురించి బాధ్యతతో మెలగుతూ మాట్లాడుతున్నాడు.
ఒకనాడు ప్రత్యేకంగా అన్నాను అడిగాడు-"ఆ మధ్య శాంతి పెళ్ళి ప్రయత్నాలు చేశారు?" అని.
శ్రీహరి నవ్వాడు. "నువ్వు చాలా మారావురా. ఇటువంటి విషయాలు ఇదివరకెప్పుడైనా నీకు కావలిసొచ్చాయా?" అంటూ మాట తప్పింపజూచాడు.
కాని నారాయణ వదలలేదు. "ఆ మధ్యన రాజాతో మాట్లాడినట్టున్నారు. ఎందుకు కుదరలేదు?"
"ఒకసారి శాంతి వద్దన్నది. శాంతినికేతన్ లో చదువుకు వెళ్ళిపోయింది. తర్వాత యిక ఆ ప్రసక్తి రాలేదు." అసలు విషయం దాచేశాడు శ్రీహరి. కాని దాస్తున్నట్లు నారాయణ కూడ గ్రహించాడు. ఆ రోజు రాత్రి శాంతి వనంలో శాంతి రాజాల సంభాషణ యింకా అతడి చెవులలో నిలిచిపోయే ఉంది ముఖ్యంగా గోవిందరావు ఎవరో తెలుసుకోవాలనుంది. కాని అడగడానికి దైర్యం చాలటంలేదు. శాంతీ రాజా, శాంతీ గోవిందరావుల విషయమై శ్యామల వెనుక అతడి కనేకం చెప్పింది. అవన్నీ అప్పుడు నిజమని నమ్మాడు. కాని యిప్పుడిప్పుడు గ్రహించాడు - అసూయాద్వేషాల మూర్తి అయిన ఆమె మాటలలో నిజం ఎంత ఉండగలదో!
కొంతసేపు పోయాక "డాక్టర్ రమేష్ గురించి నీ అభిప్రాయమేమిటి?" అనడిగాడు అన్నను.
శ్రీహరి నవ్వేశాడు. "నీ అభిప్రాయం నా కర్ధమైంది. రమేష్ మనకు క్రొత్తవాడు కాదు. నాకిదివరకే తెలుసు. కాని, చూడు, శాంతి విషయంలో మామూలు పద్ధతులు పనికిరావు. దానిది ప్రత్యేకమైన స్వభావం. కాస్త చదువూ, అందం ఉన్నవాడెవరైనా సరిపోతాడనుకోవటానికి శాంతి అందరివంటిది కాదు. నీకూ తెలుసు."
"అవును."
డాక్టర్ వచ్చాడన్న వార్త రావడంతో సంభాషణ నిలిచిపోయింది. లేచి లోపలికి వచ్చారు.
శ్యామలకు బాగా తగ్గిపోయింది. ఇంకా స్నానం చేయించలేదు; కొద్ది రోజులలోనే అదీ పూర్తి అవుతుంది. బలరామయ్యా, పద్మా, ప్రశాంతీ వెళ్ళిపోయారు, శ్యామలకు బాగా తగ్గాక. ఇక అక్కడ ఉన్నది శాంతీ, లక్ష్మీదేవీ, శ్రీహరీ. శ్రీహరి అక్కడ ఉండే ఆఫీసుకు వెళ్ళి వస్తున్నాడు. శాంతి అతడిని మళ్ళీ స్కూటర్ ఎక్కనివ్వ్డడంలేదు. తానే కారులో ఉదయం దిగబెట్టి, సాయంత్రం మళ్ళీ తీసుకువస్తూంది.
"నువ్వసలు నాకు చెల్లెలివి కాదే. అమ్మవు కావలసింది" అనేవాడు హాస్యంగా శ్రీహరి.
"అవును కాని అంతా అమ్మవంటి అదృష్ట వంతులుంటారా?" అంది శాంతి. నవ్వుతూనే అన్నా అందలి గంభీరాన్ని గుర్తించాడు శ్రీహరి.
"నీకేం లోటమ్మా? నువ్వు అమ్మకంటే అదృష్టవంతురాలవు" అన్నాడు తల నిమురుతూ.
బలరామయ్య రెండు ఊళ్ళ మధ్య వస్తూపోతూ ఉన్నాడు.
శ్యామలను చూచి రమేష్ "ఎల్లుండి స్నానం చేయించేయవచ్చు" అన్నాడు. వెళ్ళుతూ వెళ్ళుతూ శాంతిని చూచి "అసలు క్రెడిట్ అంతా మీది. చాలా శ్రద్దగా సేవ చేశారు. మీకన్నీ తెలుసు. శ్రీహరికి యాక్సిడెంటయినప్పుడు నర్సింగ్ హోమ్ లో చూచానుగా మీ జాగ్రత్త అంతా?" అన్నాడు. శాంతి నవ్విఊరుకుంది.
డాక్టర్ని సాగనంపి వస్తూన్న నారాయణకు శాంతీ, శ్యామలల ప్రత్యేకమైన సంభాషణ విన్పించింది.
"నీపై చాలా స్పెషల్ లైకింగ్ చూపిస్తున్నాడు డాక్టరు" అంది శ్యామల.
"ఓహో!" అంది శాంతి నిర్లక్ష్యంగా.
"ఏమమ్మా? తగినవాడేగా?"
ఒక్కసారి వదిన వదనంలోకి పరీక్షగా చూచింది శాంతి. "కానీ, ఈసారి నువ్వు రాజా విషయంలో పడ్డంత శ్రమ పడక్కర్లేదులే, వదినా. అతని కిష్టమున్నా నా కిష్టం లేదు. నా కసలిక వివహంమీద కోర్కె లేదు."
శ్యామల నిర్ఘాంతపోయిందేమో సమాధానం రాలేదు. తిరిగి శాంతి మాటలే విన్పించాయి. "చూడు, వదినా, అప్పట్లో రాజాకూ, నాకూ స్నేహం తప్ప మరేమీ లేదు. లేనిపోని సంబంధం అంటగట్టావ్ నువ్వు. ఒకసారి తెలివితక్కువవల్ల దూరం చేసుకున్నా తిరిగి దగ్గరౌదామనుకున్నాను. అతడూ అలాగే అనుకున్నాడు.
"కోటి క్రొత్త కోర్కెలతో ఒకరికోసం ఒకరు నిరీక్షించాం. ఉత్తరాలు వ్రాసుకున్నాం. అందుకు పెద్దన్నయ్య అనుమతి ఉంది; అతడే ప్రోత్సహించాడు కూడ. కాని అవే నువ్వుమాయం చేశావ్. ఎందుకో నాపై నీకంత కక్ష నాకు తెలియదు. బొత్తిగా సంస్కార హీనమైన పని చేశావ్. దానితో మా ఆశలన్నీ మాసిపోయాయి. తన ఉత్తరానికి జవాబివ్వలేదనే కోపంతో రాజా నన్ను తప్పుగా అంచనా వేసుకున్నాడు. ఆ కోపంలోనే జయతో వివాహానికంగీకరించారు. గుండెలు పగిలేంత బాధ ననుభవించాను. అయినా అణుచుకున్నాను. రాజా సుఖంగా ఉంటే అంతే చాలనుకున్నాను. అందుకే మనఃపూర్వకంగా అభినందించాను. కాని ఒకటే తెలివితక్కువ పని చేశాను. నిన్ను గట్టిగా అడిగి ఆ ఉత్తరం తీసుకోలేకపోయాను, మళ్ళీ అది చూపి జయ మనస్సు విరిచేశావ్. బొత్తిగా అటువంటి రాక్షసకృత్యాలు చేస్తానని అనుకోలేదు. రాజా బాధతో అవమానంతో వూళ్ళుపట్టి పోయాడు. ఎక్కడున్నాడో కూడ తెలియదు. నాతో పరిచయమైన దగ్గర్నుంచీ అతడి హృదయానికి శాంతి లేదు.
"నీకంటే చిన్నదాననైనా, తక్కువ చదువుకున్నా - వదినా, ఒక్కమాట చెప్తున్నాను. మానవులం మానవత్వంతో మెలగాలి. ఒకరికి ఉపకారం చెయ్య ప్రయత్నించాలి; లేకుంటే వూరుకోవాలి. అపకారం చేసి, బాధపడేవాళ్ళని చూచి సంతోషించడం రాక్షసకృత్యం, మానవ లక్షణం కాదు."
చాటునుండి వింటూన్న నారయణ చలించి పోయాడు. భార్యపట్ల క్రోధాసహ్యాలతో నిండి పోయిందతడి మనస్సు చరచరావచ్చి "ఛీ, శాంతీ! నీకు బుద్దిలేదూ? ఇటువంటి ఘాతుకురాలికా, సేవచేయడానికొచ్చావ్? ఈ చేసినది చాలుకానీ, నడు ఇప్పుడైనా. ఇటువంటిదానికి ఏం చేసినా పాపమే" అన్నాడు.
శాంతి ఆశ్చర్యంతో, పశ్చాత్తాపంతో అంది: "ఏదో ఆవేశంలో అనేశాను. నువ్వు వింటున్నా వనుకోలేదు. అసలు మీ యిద్దరి మధ్యా కలత లొస్తాయనే యింతకాలం దాచిపెట్టాం."
శ్యామల కన్నీళ్ళతో అంది: "నిజంగా రాక్షసినే శాంతీ. దేవతలు గనుక నన్ను మీరు యిలా కరుణిస్తున్నారు. నా పాపానికి నిష్కృతి లేదు. నాకు శాస్తి జరుగలేదు. ఈ మహామారినన్నెత్తుకుపోలేదు."
"ఛీ!" కోపంగా అరిచాడు నారాయణ. "సిగ్గులేక యింకా మాట్లాడుతున్నావ్! నీలాటి వాళ్ళంత తేలికగా ఛస్తారా? ఆ అమాయకురాలు నిన్నేంచేసిందని అంత అపకారం తలపెట్టావ్? పైగా లేనిపోనివన్నీ కల్పించి చెప్పేదానవు. ఎన్నైనా క్షమించాను కాని ఈ ఘోరాన్ని మాత్రం క్షమించలేను. ఫో నీకూ, నాకూ యిక ఏ సంబంధమూ లేదు."
"అన్నయ్యా! అంతంత మాటలు వద్దు." నారాయణ చేతులు పట్టుకుంది శాంతి. "వదిన కసలే ఆరోగ్యంగా లేదు. ఈ స్థితిలో కష్ట పెట్టకు. మాట్లాడకు."
కేకలు విని వచ్చిన శ్రీహరీ, లక్ష్మీదేవీకూడ విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. లక్ష్మీదేవి కూతుర్ని కోపపడింది. "జరిగిపోయిందాని కెంత అనుకుంటేమాత్రమేమిటి? మరి మాట్లాడకు. అసలే జబ్బుతో వున్న దాన్ని ఏడిపించకు" అని కొడుకును మందలించింది. శ్రీహరి తమ్ముడిని బయటకు తీసుకుపోవటానికి ప్రయత్నించాడు. కాని సాధ్యపడలేదు.
"కాదమ్మా ఇలాటి రాక్షసి కుటుంబంలో వుంటే అన్నీ అనర్దాలే. ఇదిక మనకు వద్దు" అని అరిచాడు. నారాయణ.
"అత్తయ్యా, నన్ను క్షమించండి." శ్యామల బావురుమంటూ లక్ష్మీదేవి కాళ్ళను చుట్టేసింది. "బుద్ధి తక్కువగా ప్రవర్తించాను. అందర్నీ విడదీశాను. ఇంకెన్నడూ అలాటి పాపపు పని చెయ్యను" అంటూ లెంపలు వాయించుకుంది.
"అన్నయ్యా!" శాంతి, నారాయణ చెయ్యి పట్టుకుంది. "ఆవేశంలో అన్నాను కాని లేకుంటే ఈ విషయం ఎప్పటికీ నీకు తెలిసేది కాదు. ఇప్పుడు ఏమనుకునీ లాభమేమిటి? పశ్చాత్తాప పడ్డవాళ్ళను ఏమీ అనకూడదు. వదినను మరే మైనా అంటే నాపైన ఒట్టే!"
చెల్లెల్ని దగ్గరగా తీసుకుని కన్నీరు కార్చాడు నారాయణ. "శాంతీ, నాన్నగారెంత ఆలోచించి పెట్టారో నీకీ పేరు! అందరిపాలిట శాంతివే అయ్యావు. నీకుమాత్రం అశాంతి కలుగనిస్తానా? రాజా ఎక్కడున్నా వెదికి పట్టుకునే పూచీ నాది."
