"నేను బ్రతికాను కదా? ఇక గొడవ దేనికీ? అతడినికూడా బ్రతకనిద్దాం."
"నిజమే." అంగీకరించాడు డాక్టరు.
"అన్నయ్యా, నువ్వింత మంచివాడవు గనకనే నన్నింత తేలికగా క్షమించగలిగావు" అంటూ నారాయణ, శ్రీహరి వక్షాన్ని అశ్రువు లతో తడిపేశాడు.
డాక్టర్ మెల్లగా అక్కడినుంచి తప్పుకున్నాడు.
"శాంతీ!" శ్రీహరి చెల్లెల్ని పిలిచాడు.
"ఏమన్నయ్యా?"
"రాత్రి భోజనం చేశావా?"
"ఆఁ!"
"నేను నమ్మను. అంత నీరసంగా ఉందేం ముఖం?"
"చేశానన్నయ్యా."
వింటూన్న నారాయణ మనస్సు ఏమిటోగా అయిపోయింది. తన చెల్లెలు తన యింటికి వచ్చి ఆకలితో పడుకుంది. కారణం తనకు తెలుసు. తనను పలుకరించనైనా పలుకరించని శ్యామల చతి భోజనం ఆమెకు తినాలన్పించలేదు. అన్న తృప్తికోసం మాత్రం అబద్ధం ఆడింది.
మెల్లగా అన్నాడు: "శాంతీ, నేను అన్నయ్య దగ్గరుంటాను. నువ్వింటికి వెళ్ళు."
"వెళ్తాను. కాని ఎవరి కేం చెప్పను? సాయంత్రంవరాకూ నమ్ముతారు. ఆపైన?"
"ఒక పని చెయ్యి." శ్రీహరి అన్నాడు "అమ్మా, నాన్నగారూ కంగారు పడిపోతారు. పద్మకుమాత్రం చెప్పు. రేపొకసారి తీసుకురా. చూచి వెళ్ళుతుంది. ఇక్కడ మా ఆఫీసును సూపరింటెండెంట్ ఇంజనీర్ 'విజిట్' చేయటానికి వస్తున్నాడు. అందుచేత తీరిక లేకుండా ఉన్నానని చెప్పు. వారం రోజులు పోయాక కొంచెం తేలికపడతాను; ఇంటి కొచ్చేస్తాను. అప్పుడిక నే నెదురుగానే ఉంటాను గనుక తెలిసినా ఫర్వాలేదు. బాధపడినా వెంటనే తేరుకుంటారు."
"సరే." వెళ్ళిపోయింది శాంతి.
"జాగ్రత్తమ్మా. జాగ్రత్తగా వెళ్ళు." హెచ్చరించాడు శ్రీహరి వెనుకనుంచి.
"అలాగే."
"ఉండు. పోనీ యింటికెళ్ళి నేను గుమాస్తా నెవర్నైనా తీసుకొస్తాను. కూడా తీసుకు వెళ్దువుగాని" అన్నాడు నారాయణ.
"వద్దు. అదే వెళ్ళగలదు" అన్నాడు కలవరపాటుతో శ్రీహరి.
"వద్ధన్నయ్యా. వెళ్ళగలను" అంది జాలిగాశాంతి.
గ్రహించిన నారాయణ మరి మాట్లాడలేదు. తన గాలి సోకినట్లు తండ్రికి తెలియరాదు!
69
శాంతి చెప్పిన మాటలను తేలికగానే నమ్మారు తల్లీ, తండ్రీ. చాటుగా అసలు విషయం విన్న పద్మ భోరున విలపించింది. శాంతి ఊరడించలేక సతమతమై పోయింది.
"చూడు, వదినా. అందరూ వింటే యింకా బాధ, అవసరమైన ఆందోళన. రేపు ఒక్కసరి ఏదో కారణం సృష్టించి యిద్దరం వెళ్ళి చూచివద్దాం. ఇవ్వాళే వెళ్తే అమ్మకు అనుమానం రాగలదు. చిన్నన్నయ్య జాగ్రత్తగా చూస్తాడు; ఫర్వాలేదు. అన్నయ్యకేం ప్రమాదం లేదు. నా మాట విను. ప్రమాదమైతే నేను మాత్రం అందరినుంచీ రహస్యంగా ఉంచి ఇంత ధైర్యంగా ఉండగలనా?"
మర్నాడు ఉదయం ఇంగ్లీష్ పిక్చర్ మార్నింగ్ షో అని చెప్పి ఏడు గంటలకే బయల్దేరింది శాంతి. ఆమె కెప్పుడూ ఏ ఆటంకమూ లేదు, ఇష్టానుసారం ప్రవర్తించటమేకాని.
"అమ్మా, వదిననుకూడా తీసుకువెళ్తాను. పాపం, తను సినీమా చూచి చాలా రోజులైంది" అంది.
"అలాగే తీసుకెళ్ళు. వెళ్ళిరండి. ఈమాత్రం భాగ్యాని కాంత బ్రతిమాలటం దేనికి?" అంది లక్ష్మీదేవి. "పాపను ఉంచేయండి. అది మిమ్మల్ని సినీమా చూడనిస్తుందా?" అంది తిరిగి.
శాంతీ, పద్మ ముఖముఖాలు చూచుకున్నారు.
"నిన్ననే శాంతికోసం ఏడ్చింది, రోజంతా కన్పడకపోయేసరికి" అంది పద్మ.
"ఫర్వాలేదు. మధ్యాహ్నాని కొచ్చేస్తారుగా? పసిపిల్ల నలిగిపోతుంది. వద్దు. అదీకాక శాంతీ, ప్రశాంతీ యిద్దరూ వెళ్ళిపోతే తాతగారూరు కుంటారా?" అంది లక్ష్మీదేవి. పాపం, ఆవిడకేం తెలుసు, అసలు సంగతి? స్వచ్చంగా తేలికగా నవ్వుతూంది.
ఇక పట్టుపట్టితే అనుమానం వస్తుందని భయపడింది శాంతి. వదినకు కనుసైగ జేసింది వదిలేయమని. అర్ధం జేసుకున్న పద్మ మరి మాట్లాడలేదు.
తలమీద, చేతులమీద పెద్ద కట్లుతో నీరసంగా ఉన్న శ్రీహరిని చూడగానే పద్మ కన్నీరు ఆపుకోలేకపోయింది. భార్య బాధ చూచిన శ్రీహరి కూడా నిగ్రహం కోల్పోయాడు. "ఫర్వాలేదు, పద్మా. బాధపడకు" అన్నాడు తల నిమురుతూ.
"మనం ఎంతఅదృష్టవంతులం! భగవంతుడు చల్లగా చూచాడు" అంది పద్మ వెక్కెక్కి పడుతూ.
"అవును. అదృష్టవంతులం. అందుకే నవ్వాలి మరి. ఏడవకూడదు. ఏదీ, నవ్వు?"
కళ్ళు తుడుచుకుని నవ్వింది పద్మ.
"పాపను తీసుకురాలేదేం?" అడిగాడు శ్రీహరి.
శాంతి చెప్పింది.
"పోనీలే. అదీ మంచిపనే. నలుగు వచ్చేయనూ?" అన్నాడు శ్రీహరి.
అప్పటికి కాస్త సర్దుకున్న పద్మ మరిది ఆ గదిలోనే ఉండడం చూచి నివ్వెరపోయింది. నారాయణ సిగ్గుతో తల వాల్చుకున్నాడు.
"నిన్న శాంతి వెళ్ళినదగ్గర్నుంచీ నన్ను వదలనేలేదు" అన్నాడు శ్రీహరి తమ్ముడి వైపు చూస్తూ భార్యతో.
విషయం ముందే శాంతిద్వారా విని ఉన్న దవ్వడంవల్ల పద్మ ఏమీ ఆశ్చర్యపోలేదు.
"శ్యామల కులాసా?" అని ప్రశ్నించింది చిరుదరహాసంతో.
"ఆ." ముక్తసరిగా అన్నాడు నారాయణ.
కూర్చుని మాట్లాడుకుంటూంటే డాక్టరు వచ్చాడు. చూచి "టెంపరేచర్ లేదు. ఇవాళ భోజనం పెట్టండి" అన్నాడు.
"పదండి. మీరూ భోజనాలు చేద్దురుగాని. మీరు చేసి అన్నయ్యకు తెచ్చిపెట్టవచ్చు" అన్నాడు నారాయణ.
పద్మ మాట్లాడలేదు.
శాంతి అంది: "అన్నయ్యకు తెచ్చిపెడదాం. మేంకూడా ఎందుకులే. ఇంటికి వెళ్ళిపోతాం మధ్యాహ్నం. పాపం చిన్న వదిన అందరికీ చెయ్యలేదు."
"శాంతీ!" బాధగా అన్నాడు నారాయణ. "మొన్న రాత్రి వేసిన శిక్ష చాలు నాకు. ఇంకానా? నువ్వెందుకలాగంటున్నావో నాకు తెలుసులే. దాని జోలి నీకెందుకు? నేను బ్రతికే ఉన్నాను. నడవండి."
"వెళ్ళండి, శాంతీ" అన్నాడు శ్రీహరి. "మనం మళ్ళీ యిలా కలవాలనే ఈ యాక్సిడెంటు జరిగిందేమో? వెళ్ళండి." ముగ్గురూ బయల్దేరారు.
కారు గుమ్మంలో ఆగడం చూడగానే హాల్లో ఉన్న శ్యామల లోపలికి వెళ్ళిపోయింది. పద్మా.శాంతీ ముఖముఖాలు చూచుకున్నారు. కాళ్ళు కడుక్కుని లోనికి వెళ్ళిన పద్మే పలుకరించింది - "ఏం జేస్తున్నావ్, శ్యామలా?" అని.
"ఏం చెయ్యడం లేదు. ఎప్పుడొచ్చారు?"
"గంటపైన అయ్యింది. ఆస్పత్రికొచ్చాం" అంది శాంతి.
"ఓహో!" అంతే గాని బావగారి కెలాగుందని ఆమె అడుగలేదు. ఇంటి విషయాలూ అడగలేదు.
"వంటైందా?" అన్నాడు నారాయణ వచ్చి.
"మామూలుగా అయ్యింది. మరి వీళ్ళొస్తారని నాకు తెలియదుగా?" అంది శ్యామల.
"సరే. ఇప్పుడైతేనేం? చెయ్యి."
"మేం చేస్తాంలే. ఇంతవరకూ పనితోనే అలిసిపోయినట్టున్నావ్ నువ్వు" అంటూ పద్మా, శాంతీ చెరో పనీ అందుకున్నారు.
శ్యామల చాలా ముక్తసరిగా ఉంది. తూచి తూచి మాట్లాడింది. అది చాలా బాధాకరంగా ఉన్నా శాంతీ, పద్మా పైకి ఏమీ మాట్లాడలేదు. త్వరగా భోజనాలు కానిచ్చి, ఫ్లాస్కులో కాఫీ పోసుకుని, కేరియర్ లో అన్నం పెట్టుకుని హాస్పిటల్ కు బయల్దేరారు.
"మీ జయపెళ్ళి ఏమైంది?" అడిగింది శ్యామల కుతూహలంగా పద్మను.
పద్మకు కోపం వచ్చింది. అయినా పైకి కన్పించనీయకుండా "పెళ్ళా? ఏమో దానికి పెళ్ళని అనుకోలేదే? ఎంత కట్నం పొయ్యనిదే పెళ్ళి కొడుకు వస్తాడు? అందరూ మీ బావగారివంటి ఉదారహృదయులుంటారా? పెళ్ళి కుదరడం ఒకెత్తు. అవ్వడం ఒకెత్తు. ఎవరైనా చేసుకుందా మనుకున్నా చెడగొట్టే పుణ్యాత్ములుంటారు" అంది.
మర్మగర్భమైన ఆ మాటలలోని పూర్తి అర్ధం ఒక్క శ్యామలే గ్రహించింది. ముఖం మాడిపోయింది. నారాయణకేమీ అర్ధం కాలేదు. కాని జయా రాజాల వివాహప్రయత్నం విఫలం కావడానికి ఏదో చెప్పుకోదగ్గ కథే ఉందని గ్రహించాడు.
శ్రీహరికి అన్నం పెట్టాక అందరూ కబుర్లలో పడ్డారు. "మరిదిగారిలో యిప్పట్లో ఈ మార్పు రాగలదని అనుకోలేదు" అంది పద్మ నవ్వుతూ.
"మీ అందరే నాలో ఈమార్పు తెచ్చారు, వదినా. కాని ఎవరూ మార్చలేని పాషాణముంది, చూశావా, యింట్లో? ఆ శిల కరిగితే కాని మళ్ళీ మనం ఎప్పటిమాదిరిగా ఉండలేం" అన్నాడు నారాయణ.
"ఛ అవేం మాటలు?" శ్రీహరీ, పద్మాకూడ మందలించారు.
శ్రీహరి మెల్లగా అన్నాడు తమ్ముడితో: "ఒక వ్యక్తిని మంచి అయితే అనుసరించాలి. చెడు అయితే మార్చ యత్నించాలి. కాని మనల్ని మనం విస్మరించకూడదు. ఇదే నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మానవులం - లేని మంచిని సాధించాలి కాని, ఉన్న మంచినికూడా కలుషితం చేయకూడదు."
నారాయణ గౌరవం ప్రకటిస్తూ అధోవదను డయ్యాడు.
"సాయంత్రం పెందరాళే అన్నయ్యకు భోజనంపెట్టి, మనం వెళ్ళిపోదాం" అంది శాంతి. పద్మ అంగీకరించింది.
"నేను వెళ్ళి తెస్తాను. బహుశః చిన్నవదిన చెయ్యదు" అని శాంతి మళ్ళీ తాను ఒక్కత్తీ వెళ్ళిపోయింది కారు డ్రైవ్ చేసుకుంటూ.
తిరిగివచ్చిన శాంతి రహస్యంగా చెప్పింది వదినతో: "నా అనుమానం నిజమే అయ్యింది. ఆవిడ్ జ్వరం వచ్చిందని ముసుగుదన్ని పడుకుంది. నేనే వంటచేసి, అన్నయ్యకు కారియర్ తెచ్చాను. చిన్నన్నయ్య ఎదుట లేకపోవడంతో నోటికికూడ హద్దులేకపోయింది. దిక్కుమాలిన గొడవొచ్చి పడిందనీ, ఎంత దూరానున్నా ఈ జిడ్డు తప్పడం లేదనీ యేమేమో అంది."
"పోనీలే, మరి. అవసరం. ఎలాగో ఓలాగు భరించాలి. గట్టిగా అనకు. నారాయణ వింటే మళ్ళీ గొడవపడతాడు. మనగురించి పోట్లాడుకున్నారంటే మనకే సిగ్గు" అంది పద్మ.
"ప్చ్! లాభంలేదు, వదినా. ఏ హోటల్ నుంచైనా తెచ్చుకుంటే చిన్నన్నయ్య నవమానించి నట్లౌతుంది. ఎలాగూ యిక ప్రమాదంలేదు కనుక యింటికి తీసుకుపోదాం. రోజూ ఏదోవేళ అక్కడికే వచ్చి చూస్తూండమందాం."
"వీలుపడుతుందంటావా?"
"పడకేం? ఉండు. నేను డాక్టరుతో మాట్లాడివస్తాను."
కన్సల్టింగ్ రూం లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళింది శాంతి. ఆమె మాట్లాడేతీరూ, ఇంగ్లీషు ఉచ్చారణా అన్నీ చూచి "మీరేం చదివారు?" అనడిగాడు కుతూహలంగా రమేష్.
"చాలా తక్కువ."
"తెలివైనవారు. తక్కువతోనే ఎక్కువ సాధంచారన్నమాట!"
అతడి సంభాషణా చతురతకు చకితయై చూచింది శాంతి.
"సరే. మీరడిగారుగనుక అంగీకరిస్తున్నాను. అలాగే వచ్చి చూస్తాను. తీసుకుపొండి. నాకెంత వర్కో చూశారా? దీన్నంతనూ 'వయొలేట్' చేసి రావాలి అక్క్డడకు" అన్నాడు బావయుక్తంగా చూస్తూ.
"థాంక్యూ వెరీమచ్" అని లేచింది శాంతి.
సంగతి విని నారాయణ చాలా బాధపడ్డాడు.
"ఇందులో నువ్వు బాధ పడవలసిందేం లేదన్నయ్యా. మేము రోజూ యిలా ఆవూరూ, ఈ ఊరూ మధ్య నాన్నగారికి తెలియకుండా తిరగ లేం కదా? అందుకు అన్నయ్య ఆయన కళ్ళెదుట వుంటే ఏ బాధాలేదు. డాక్టర్ అక్కడికే వచ్చి చూస్తారు."
"అలాగే!" విధిలేక అంగీకరించాడు నారాయణ.
శ్రీహరి "నువ్వూ రారా" అని పిలిచాడు తమ్ముడిని.
"వస్తాను" అన్నాడు నారాయణ.
"మీ సిస్టర్ చాలా తెలివైనది, శ్రీహరీ" న్తూ సాగనంపాడు డాక్టర్ రమేష్. స్టీరింగ్ దగ్గర ఉన్న శాంతి ఒక్కసారి అతడి ముఖంలోకి చూచి ముఖం త్రిప్పేసుకుంది. తనకే తెలియని ఒక్క నిట్టూర్పు బయల్వెడలింది. శ్రీహరీ, పద్మా, నారాయణా మనస్సులో అనుకున్నారు-'ఎంత తెలివైనది కాకుంటే ఎటువంటి పరిస్థితి నైనా యింత గుంభనంగా నెట్టుకువస్తుంది!" అని.
ఊరి పొలిమేరల్ల్లో ఆపమని నారాయణ కారు దిగిపోయాడు. "ఇప్పుడు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కాదు. మరోసారొచ్చి నాన్నగారి క్షమాపణ వెడుకుంటాను. అమ్మను ఏమీఅనుకోవద్దను. ఇంతవరకూ మీకు సాయంగా వచ్చాను. అంతే" అన్నాడు. శ్రీహరి ఎంత నచ్చజెప్పినా లాభం లేకపోయింది.
శ్రీహరి కారు దిగగానే శాంతివనంలో రేగిన గగ్గోలు యింతా అంతా కాదు. తల్లిదండ్రులూ, నౌకర్లూ అందరూ కంట తడిపెట్టారు. శ్రీహరి నీరస స్వరంతోనే అందర్నీ ఓదార్చాడు.
"ఎంత గట్టి గుండె, శాంతీ, నీది!" అని ఆశ్చర్యపోయారు తల్లీ, తండ్రీ.
నారాయణ యింటికి వెళ్ళారని తెలిసి ముందు మండిపడినా, అతడితో కలిగిన పరివర్తన విన్నాక కొంచెం చల్లబడ్డాడు బలరామయ్య. అందులోనూ వెళ్ళినది సాక్షాత్తూ శాంతి గనుక ఆయనకు కోపం రాదు.
