Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 60


                                    68

    రాత్రి తొమ్మిది గంటలకు గుమ్మం ముందు ఆగిన కారులోనుంచి శాంతి దిగుతూంటే ఆశ్చర్యపోయారు నారాయణా, శ్యామలా. కొడంత ఆనందంతో ఎదురేగాడు నారాయణ.
    "ఒక్కత్తెవూ వచ్చేవేమిటే, ఈ సమయంలో?" ఆత్రుతగా అడిగాడు.
    చిన్నగా నవ్వింది శాంతి. "మ్యాటినీకి వచ్చా నన్నయ్యా. మధ్యలో కరెంటుపోయి ఆలస్య మైంది. ఒక్కత్తెనూ యిప్పుడింటికి వెళ్ళలేను."
    "రేపు వెళ్దువుగానిలే. ఇక్కడెవారూ లేరనా యిప్పటికిప్పుడు వెళ్ళిపోవటం? నడు, భోజనం చేద్దువుగాని."
    "సినీమా కాంటీన్ లో బాగా టిఫిన్ వేశాను. ఏమీ వద్దన్నయ్యా."

                                 
    "అదేం? ఇక్కడికి వస్తూ అదేం పని?" కొంచెం కినుకగా అడిగాడు నారాయణ.
    బలవంతంగా నవ్వింది శాంతి. "ఎప్పుడో మధ్యాహ్నమనగా వచ్చానా, మరి? ఆకలికి ఉండలేక. అంతేకాని యింకేమీ కాదు."
    అంతవరకూ శ్యామల తనతో ఒక్కమాట కూడ మాట్లాడకపోవడం గమనించింది శాంతి. తానే ముందుగా పలుకరించింది - "ఏం వదినా, కులాసా?" అంటూ.
    "ఆ" అంది శ్యామల ముక్తసరిగా.
    "పోనీ, కాస్త కాఫీ అయినా యియ్యి, శ్యామలా" అన్నాడు నారాయణ.
    మనస్సులో యిష్టం లేకపోయినా నారాయణ ఆజ్ఞాపాలనం చేయకపోతే ఏమవుతుందో బాగా తెలిసిన శ్యామల అయిష్టంగా లోనికి నడిచింది.
    "ఇంటిదగ్గరంతా బాగున్నారా, శాంతీ?"
    "ఊఁ."
    "అయితే ఇన్నాళ్ళకు నన్ను చూడాలన్పించిందా?" నిష్ఠూరంగా అన్నాడు.
    నవ్వింది శాంతి. "ఆ ప్రశ్న నిన్ను నువ్వు వేసుకో, అన్నయ్యా."
    కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. తిరిగి శాంతే అంది: "ఏవో కలతలు రాకుండా ఉంటాయా ఎవరికిమాత్రం? అవే మనస్సులో పెట్టుకుకూర్చోవటం దేనికి? నువ్వు ఆ మధ్య మన వూరు వచ్చావట పనిమీద. ఇంటికి రాలేదని అందరం ఎంత బాధపడ్డామో, తెలుసా? పైకి గంభీరంగానే ఉన్నారు కాని నాన్నగారావేళ భోజనం చేయలేదు. అమ్మా, పెద్ద వదినా ఏడ్చేశారు. నువ్వు అలా చెయ్యవలసింది కాదన్నయ్యా! ఇంటికి వచ్చి వెళ్ళవలసింది."
    "ఏమిటో ముఖం చెల్లలేదు, శాంతీ. నాకూ రావాలనే ఉంది."
    శ్యామల కాఫీ తెచ్చింది. "వంటవాళ్ళెవరూ లేరా, వదినా?" అంది కాఫీ అందుకుంటూ శాంతి.
    "ఏమో? మీ అన్నయ్యనే అడుగు." అక్కసుగా అంది శ్యామల.
    ఏదో ఉందని గ్రహించిన శాంతి మరి రెట్టించలేదు,
    శ్యామల భర్త వైపు తిరిగి, "అర్ధరాత్రి వరకూ కానివూళ్ళలోకూడ షికార్లుకొట్టే చెల్లెల్ని ఏమీ అనరేం? అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు? నాపై పడే చిరాకంతా ఏమైపోయింది?" అనడిగింది.
    శాంతి ముఖం మాడిపోయింది. ఏమో అనబోయి మళ్ళీ ఏదో తోచి మాట్లాడక ఊరుకుంది.
    నారాయణకు చాలా కోపం వచ్చింది. "నీకంతే అర్ధమైంది. ఇష్టముంటే మాట్లాడు. లేకపోతే నోరుమూసుకు ఫో యిక్కడినుంచి. నోటికొచ్చినట్టు వాగకు. శాంతి ఎటువంటిదో తెలుసా నీకు?"
    "ఆహా. తెలియకేం!" విసురుగా అని తన గదిలోకి పోయి పడుకుంది శ్యామల.
    వదిన స్వభావం తెలిసినదే గనుక శాంతి ఏమీ అనుకోలేదు. నారాయణమాత్రం దాచుకో కుండా విషయమంతా చెప్పేశాడు. బొత్తిగా నా అనేవాళ్ళెవ్వరూ దగ్గరలేక ద్రిగ్గుళ్ళుతూన్న అతడికి ఇవ్వాళ చెల్లెల్ని చూడగానే ప్రాణం లేచివచ్చింది. "అలా పిచ్చి ఆవేశంలో ఎందుకు ప్రవర్తించానో, ఎలా మీనుండి విడిపోయి వచ్చానొ ఆలోచిస్తే యిప్పుడు నాకేమీ అర్ధం కావటం లేదు, శాంతీ. వచ్చిన దగ్గర్నుంచీ బాధ పడని క్షణం లేదు."
    అంతా వినిన శాంతి అంది: "పోనీ, ఆ గొడవ. ఏదో అయ్యిపోయింది.  మీ యిద్దరి మధ్యా అయినా సామరస్యం లేకుంటే ఎలాగ? చిన్నదాన్ని అంటున్నందు కేమీ అనుకోవద్దు కానీ - క్రొత్త గనుక ఒకరి నొకరు అర్ధం చేసుకోవటానికి చాలా కాలం పట్టవచ్చు. ఓర్పుతో అర్ధం చేసుకో యత్నించాలే కాని అలా గొడవలు సృష్టించుకోవటం ఏమంత మంచిది?"
    "ఏం చెయ్యమంటావు, శాంతీ? సున్నితంగా సరసంగా సంభాషించటం, ప్రవర్తించడం దానికి చేతకాదు. నాకు కోపం ఆగదు. బలవంత మార్గమే శరణ్యమౌతూంది."
    "ప్చ్." నిట్టూర్చింది శాంతి. "వదిన కేమిటో అటువంటి స్వభావం. కాని ఎప్పటికైనా మారుతుందనే నా ఆశ. పెద్ధవాళ్ళు దగ్గరుంటే యింత విషమించకపోనేమో?"
    "నిజమే. కాని యిక ఆ ఆశ లేదుగా?"
    "అలాగనకన్నయ్యా. ఆ అవకాశం ఉందనే ఆశిద్దాం. కాని ఎలాగైనా నీకు ఓర్పు అవసరం. చూడూ, ఒకసారి ఆవేశంలో కోపోద్రేకాలలో నీచంగా తూలనాడుకుని మరొకసారి నువ్వే సర్వస్వం అనుకుంటూ సంసారం చేయటం - ఏమంత మంచిది చెప్పు? భార్యాభర్తల మధ్య సున్నితమైన రాగబంధమేకాని మరే కలతలూ రాకూడదు. వచ్చినా సామరస్యంతో సరిదిద్దుకోవడం సంస్కార విద్యా లక్షణం కాని హీన, స్థితికి దిగజారిపోకూడదు."
    దీర్ఘంగా నిట్టూర్చాడు నారాయణ, "నిజమే! చిన్నదానవై చాలా తెలివిగా చెప్పావ్" అంటూనే అంతలో నవ్వుతూ "మా బావగారెవరో కాని చాలా అదృష్టవంతులు!" అన్నాడు.
    శాంతి అవధులు దాటిన ఆశ్చర్యంతో విస్ఫారిత నేత్రాలతో అవలోకించింది అన్నను. ఇదివరకెప్పుడూ అతడంత సరసంగా సంభాషించలేదు.
    "నువ్వు చాలా మారావ్, అన్నయ్యా" అంది మందస్వరంలో.
    విన్పించుకొనట్టు తన సంభాషణనే పొడిగించాడు నారాయణ. "అయితే రాజాతో జయపెళ్ళి నిశ్చయమైపోయిందా?"
    శాంతి ముఖం ఉదాసీనమైపోయింది. "తెలియదన్నయ్యా."
    "అరే! తెలియకపోవటమేమిటి? ఆవాళ నువ్వేగా అతడి పెళ్ళి కుదిరిందని అభినందించావ్?"
    "అవునులే. కాని మళ్ళీ ఆ ప్రసక్తేం లేదు మరి. జయ వెళ్ళిపోయింది. రాజాకూడా వెళ్ళిపోయారు. బహుశః కుదిర్చివుంచుకున్నారేమోనే అంది బాధాపూరితమైన మనస్సులోనుండి వెలువడుతూన్న స్వ్రరాన్ని అతిసాధారణంగా ధ్వనించేటట్టు ప్రయత్నపూర్వకంగా మలుస్తూ. లేకపోతే అసలు విషయం బయటపడితే అసలే అంతంత మాత్రంగా ఉన్న అన్నయ్య సంసారం మరింత కలుషపూరితమౌతుందని భయపడింది. సంభాషణ యింకా ఎంత దూరం వెళ్ళుతుందోనని భయపడి "ఇక పడుకుందాం. నిద్రవస్తోంది" అంటూ లేచింది.
    నారాయణ యింకా ఏమో అడగాలను కున్నాడు శాంతిని. కాని అడుగలేకపోయాడు. తానూ లేచాడు పడుకోవటానికి.
    మర్నాడు ఉదయం అన్నా చెల్లెళ్ళిద్దరూ హాల్లో కూర్చున్నారు కాఫీ తీసుకుంటూ, శాంతి మెల్లగా అసలు సంగతి బయటపెట్టింది. "రాత్రి ఆ సమయంలో నీకు చెప్పి ఆందోళన కలిగించలేక చెప్పలేదన్నయ్యా. ఒక విషయం జరిగింది."
    "ఏమిటది?" ఆత్రంగ అడిగాడు నారాయణ.
    "నిన్న మధ్యాహ్నం నేను సినీమాకు వద్దామనే బయల్దేరాను. వీలైతే అన్నయ్య వస్తాడు, లేకుంటే సాయంత్రం కలిసివెళ్దాం; వచ్చేవరకూ ఉండమని చెప్పటానికి ధవళేశ్వరం వెళ్ళాను వాళ్ళ ఆఫీసుకు."
    "ఊఁ. వెళ్తే?" శాంతి సజలనేత్రాలను చూచి కలవరపాటుతో ప్రశ్నించాడు నారాయణ.
    కళ్ళు తుడుచుకుని చెప్పలేక చెప్పలేక చెప్పింది శాంతి. "అన్నయ్య ఉదయం ఆఫీసుకు వచ్చేటప్పుడే ట్రంక్ రోడ్డుమీద సెంట్రల్ జైల్ దగ్గర లారీతో స్కూటర్ గ్రుద్దుకుని యాక్సిడెంటైందట."
    "ఆఁ!" గుండెలు వేగంగా కొట్టుకుంటూండగా ఖంగారుగా లేచి నిలబడ్డాడు నారాయణ. "ఏమైంది? బాగున్నాడా?"
    "బాగానే వున్నాడు. ప్రమాదం లేదుకాని బలమైన దెబ్బలే తగిలాయి. మోచేతిమీదా, నుదుటిమీదా పెద్ద దెబ్బలు. రక్తాలు కారి పోయాయట. స్పృహలేని స్థితిలో డాక్టర్ రమేష్ నర్సింగ్ హోమ్ లో జేర్చారట ఎవరో. కట్లుకట్టి, అన్నయ్యకు స్పృహ వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండైందట. స్పృహవచ్చాక 'యింటికి కబురు పెట్టవద్దు. మా నాన్నగు నీరస స్థితిలో వున్నారు. బాధ పడతారు. తట్టుకోలేరు' అంటూ గొడవ పెట్టాడట. ఏం చెయ్యాలో తోచక డాక్టరూ, అన్నయ్య స్నేహితులూ ఆలోచిస్తూన్న సమయంలో నేను వెళ్ళాను. నాకు ఆఫీసులో సంగతి తెలిసి వెంటనే కారు నర్సింగ్ హోమ్ కు త్రిప్పానన్నమాట. గుండె బేజారైపోయిందనుకో, కట్టుతో పడివున్న అన్నయ్యను చూస్తే."
    నారాయణకు కళ్ళ నీళ్ళు తిరిగిపోయాయి. ఏమీ మాట్లాడలేకపోయాడు.
    తిరిగి శాంతి అంది: "రాత్రివరకూ అన్నయ్య దగ్గరే వున్నాను. 'నాకేం ఫర్వాలేదు. ఏదో వూరు వెళ్ళానని చెప్పు. వారం రోజులుపోయాక యింటి కొచ్చేస్తాను. అప్పుడు తెలిసినా ఫర్వాలేదు. నువ్విప్పుడు వ్ల్లిపో యింటికి' అన్నాడు. కాని వదిలి వెళ్ళగలనా?"
    "ఏంజేశావు మరి?"
    "ఒక మనిషిని యింటికి పంపాను. కారుకు కొంచెం రిపేర్ వచ్చిందనీ, అన్నయ్యతోపాటు స్నేహితులింట్లో వున్నాననీ, తెల్లవారి వస్తామనీ కబురంపి నేనిక్కడి కొచ్చాను."
    "అన్నయ్యకు తెలుసా?"
    "తెలుసు. కాని వస్తే నీకు కోపం వస్తుందేమోనని సంశయించి వద్దన్నాడు. నేనే సాహసించాను."
    దీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది నారాయణ హృదయంనుండి. "నేను వస్తే అన్నయ్య మాట్లాడుతాడా?"
    "మాటాడటమేకాదు, సంతోషిస్తాడు కూడ."
    "అయితే పద!"
    "అన్నయ్యా" అంటూ వెళ్ళి కన్నీళ్ళతో అన్నయ్య తలదిక్కున కూర్చుని తల నిమర సాగాడు నారాయణ.
    ఆశ్చర్యంగా కళ్ళు విప్పాడు శ్రీహరి. బహుకాలానికి సోదరుడిని చూడగానే శ్రీహరి నేత్రాలు కూడసజలమయ్యాయి. "వచ్చావా, తమ్ముడూ?" అన్నాడు కడకెలాగో కంఠం సరిజేసుకుని.
    "వచ్చానన్నయ్యా, వచ్చాను. నన్ను క్షమించగలవా?" గాద్గదికంగా అడిగాడు.
    "అవేం మాటలురా?" చిరునవ్వుతో తమ్ముడి చెక్కిళ్ళపై అశ్రువులు తుడిచాడు.
    "ఇప్పుడెలాగుందన్నయ్యా?"
    "దెబ్బలు బాగా నొప్పిచేశాయి. బహుశః టెంపరేచర్ కూడా వుండివుండవచ్చు. కంగారు లేదులే. అదే తగ్గిపోతుంది."
    డాక్టర్ రమేష్ వచ్చాడు - "ఎలా ఉంది, శ్రీహరీ" అంటూ. పరీక్ష చేసి "ఫర్వాలేదు, తగ్గిపోతుంది. కట్టు మళ్ళీ రేపు మారుస్తాను" అంటూ నారాయణ వైపు తిరిగి, "నిన్ననే మీకు కంబురంపుదామనుకున్నాను. శ్రీహరి అంగీకరించలేదు" అన్నాడు.
    నారాయణ మాట్లాడలేదు. తలవాల్చి నిల్చున్నాడు. "స్కూటర్ పాడైందా?" అడిగాడు నారాయణ.
    "బాగా" అంటూ రమేష్, శ్రీహరి వైపు తిరిగి "ఇదుగో, నిన్న మీరు దెబ్బలు తగిలిన షాక్ లో ఉన్నారని చూపించలేదు. దారే పోయే వాళ్ళెవరో నోట్ చేశారట లారీ నంబరు" అని చీటీ ఇస్తూంటే నారాయణ అందుకోబోయాడు. చటుక్కున శ్రీహరే అందుకుని చింపిపారేశాడు చీటీ. అందరూ ఆశ్చర్యంతో చూచారు.
    శ్రీహరి అన్నాడు: "యాక్సిడెంట్ అయి నంత మాత్రాన డ్రైవర్లదే తప్నుకునే అవివేకం పోవాలి. నేను రైట్ పాత్ మీదే వస్తున్నాను. లారేకూడా తనకు సరైనా సైడ్ నే  వెళ్ళుతూంది. రెండెడ్లబండి ఒకటి  లారీకి అడ్డు వచ్చింది. మన బళ్ళవాళ్ళకి పెద్ద రోగమేమిటంటే వాళ్ళు బండిలో హాయిగా పడుకుని నిద్రపోతుంటారు. ఎడ్లు వాటి చిత్త ప్రకారం, నచ్చిన ధారిని నడుస్తాయి. మనుష్యులకే బుద్ధి లేనప్పుడు ఇహ పాపం వాటికేం తెలుస్తుంది? ఆ లారీ బండిని తప్పుకోవడంలో 'రాంగ్ సైడ్' కొచ్చి ఆ స్పీడ్ లో నా స్కూటర్ ని రాసుకుంటూ పోయింది. 'బాలెన్స్' తప్పిపోయి నేను క్రింద పడ్డాను. అంతే. తర్వాత సంగతి నాకు తెలియదు. పాపం ఇందులో లారీ డ్రైవర్ తప్పేముంది?"
    "సరే. తప్పులేదు. పోనీ నువ్వు పడిపోయావు కదా? నీ అతీ గతీ కనుక్కోకుండా అలా పారిపోవటమేనా?" అడిగాడు డాక్టర్.
     నవ్వాడు శ్రీహరి. "పాపం! వాడికి జాలి ఉంటే ఉండవచ్చు. కాని ఏం చేస్తాడు? మనస్సు నలా రాయి చేసుకుని ముందుకు పోవడమే మంచిది. మన ప్రజ లెంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నారంటే దేనికీ కారణం ఆలోచించరు. పడినవాడిమీద అందరూ సానుభూతి కురిపించే స్తారు. డ్రైవరుమీద విరుచుకుపడి చావగొట్టేస్తారు. ఆఖరికి ముష్టివాడుకూడ -వాడు మెయిన్ రోడ్డుమీద అందరికీ అడ్డువచ్చి బిచ్చం అడుక్కుంటాడు - ఇటువంటివిషయంలో 'రూల్' గురించి విశదంగా చర్చిస్తాడు. అసలు వాహనాలెక్కి తిరిగేవారి ఆధిక్యాన్ని చూచి సామాన్యులు తమ బాధసూయలను ఆ విధంగా వెళ్ళగ్రక్కుతారు. అందువల్ల అన్ని ప్రమాదాలలోనూ చోదకులను నిందించవలసిన పనిలేదు. ఒక కుక్క వచ్చి నడిరోడ్డు పై నిల్చుని, వచ్చే వాహనాలను సగర్వంగా తిలకిస్తుందేకాని తప్పుకోదు. కారుకు సైడివ్వకుండా రిక్షావాలా కారు ఎదరే త్రొక్కుకు పోతాడు. మరో కాలేజీ స్టూడెంట్ ట్రాఫిక్ రూల్సుకూడ గమనించకుండా సైకిలుమీద కారు స్పీడుతో పోటీ పడతాడు. సరే, మనకు కొన్ని కొన్ని మంచి రద్దీ సెంటర్సు లో కూడ కాన్ స్టబుల్స్ కరవౌతారు. ఇలాటి దుస్థితిలో డ్రైవర్ని నిందించకూడదు, జాలి పడాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS