Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 59


    ఆలోచనల కంతరాయం కలిగిస్తూ వంట వాడు అడిగాడు - "ఏం చెయ్యమన్నారండి సాయంత్రం కూరలు?" అని.
    "నీ కూరలూ, నువ్వూ పొయ్యిలో తగులడండ్రా, ఇడియట్!"
    "బాగుంది బాబూ. మరి అమ్మగారు సినిమా కెళ్ళిపోయారు. ఎవర్నీ అడగకుండా ఏం చెయ్యను? చేస్తే ఆనక తినేటప్పుడూ నన్నే తిడతారు."
    "ఏమిట్రా నీ అతివాగుడూ?" బల్లమీదున్న పేపర్ వెయిట్ విసిరేశాడు కోపంలో నారాయణ. అది వాడి ముఖంపై కొట్టుకుని అప్పటికప్పుడే రూపాయంత బొప్పి కట్టింది.
    అదివరకు రెండు మూడు హోటళ్ళలో పనిచేసి ఉన్న పట్నవాసంవాడేమో, వాడికీ కోపాని కేం లోటులేకపోయింది. "ఏటయ్యోయ్? చెయ్యి జేసుకుంటున్నావ్. నేను తల్చుకుంటే ఈ రాజమండ్రీలో లేబర్-లేబరంతా వచ్చి పడద్ది, నీసంగతి తేల్చటానికి. నేనేం తప్పుజేశానని కొడతావ్? పారేయ్. నా జీతం నాకు. ఇప్పుడే పోతాను."
    నారాయణ యుక్తా యుక్త జ్ఞానం కోల్పోయాడు. రౌద్రాకారంతో అతడిమీదకు వెళ్ళబోతూండగా మిగిలిన నౌకర్లు వచ్చి అడ్డుపడి ఆపారు. వాడికి రావలసిన జీతం సరిచూచి గుమాస్తా యిచ్చి పంపేశాడు, త్వరగా.
    ఉప్పెనగా పొంగివచ్చి, బయటపడకుండా కుతకుతలాడిన ఆవేశం, ఆగ్రహం శ్యామలను చూడగానే కట్టలు త్రెంచుకుంటూ బహిర్గతమయ్యాయి.
    జరిగిన సంగతంతా వీధిలోనే చేరవేశారు పని మనుష్యులు శ్యామలకు. అటువంటి టిక్కెట్ లేని సినిమాలంటే వాళ్ళకసలే సరదా.
    "అయితే వంటవాడి నెగరగొట్టేశారన్నమాట! ఎవరు చేస్తారు?" అని రుసరుస లాడుతూ వచ్చినామెకు "ఎక్కడికి తగులడ్డావ్?" అనే భర్త ప్రశ్న ఎదురైంది.
    ఆవేశం అవివేకానికి తావిస్తుంది. ఫలితంగా యుక్తా యుక్త విస్మరణ జరుగుతుంది. ఆప్తుల మధ్యనే, అతి సన్నిహితుల మద్యనే అతి అవమాన కరమైన, హీనమైన మాటలు దొర్లుతాయి. అదే జరిగింది శ్యామలా నారాయణల విషయంలో. రెచ్చిపోయిన నారాయణ నౌకరును పరాభవించి నట్టే భార్యనూ పరాభవించడానికి వెనుకాడలేదు. శ్యామలకు కళ్ళు తిరిగిపోయాయి. 'తనను నెత్తిన పెట్టుకునే భర్తేనా యిలాగైపోయాడు? తన కోరిక నోటిలో మాటగా వుండగానే తీర్చే వాడు. తనకోసం స్వజనంతో విడివడి వచ్చినవాడు. ఇక్కడికి రాగానే యిలాగైపోయాడేమిటి?'
    దెబ్బతిన్న అహం అశ్రురూపంలో వెలువడింది. పరిస్థితి అంతవరకూ వచ్చాక గాని నారాయణలో విచక్షణా జ్ఞానం మేలుకోలేదు. ఎవరికి వారే తమలో తాము సిగ్గుపడిపోతూ అభోజనంగా గడిపారు.
    ఇక నారాయణ ముందు తన ఆటలు సాగవని గ్రహించింది శ్యామల. 'తను కాకినాడ వెళ్ళిపోతే ఏమైనా మారతాడా? ఊఁహు. పోతే పొమ్మంటాడు. అసలు లాభం వుండదు. అతడు పూర్తిగా మారిపోయాడు. ఏది దారి?'
    మర్నాడు ఉదయం లేచిన శ్యామలకు చాలా నీరసంగా ఉంది; రాత్రి భోజనంలేక. లేచేసరికి కాఫీ లేదు. వంటవాడు ఉంటే మంచంమీదికే అందించుతున్నాడు; మరి యివ్వాళ లేడు. 'అయ్య బాబోయ్, వంట!' తలుచుకుంటేనే గుండె ఆగినంత పనైంది.
    నౌకర్ని ఒకడిని పిలిచి కాఫీ పెట్టమంది. మరొకడిని పిలిచి ఎవడైనా వంటవాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. అప్పుడే నిద్రలేచి వరండాలో కూర్చున్న నారాయణ విన్నాడు.
    "అక్కర్లేదు. వెళ్ళకురా" అన్నాడు.
    "మరి వంటెవరు చేస్తారు?" తీవ్రంగా ప్రశ్నించింది శ్యామల.
    "నువ్వేమయ్యావ్?"
    "నేనేం కూలిదానను కాను."
    "నీ నిఘంటువులో బహుశః ఆ ఒక్క పదమే ఉండి ఉండవచ్చు. కాని ఆత్మీయత, ఆప్యాయత, బాధ్యత అనే మరో మూడు పదాలున్నాయి. అవి లేని ఆడది సంసారానికే అనర్హం."
    కస్సుమని లేచింది శ్యామల. అసలే ఆమెకు వివేకం, సహనం అంతంతమాత్రం. ఇప్పుడవసలు ఛాయామాత్రంగానైనా లేకుండా పోయాయి. "బెదరిస్తున్నారా, నన్ను? ఇలాటి ముష్టికాపురం నా కక్కర్లేదు. నా నలభై వేలూ యిలా పారేయండి. పోతాను."
    తాపీగా అన్నాడు నారాయణ: "నీ కట్నం, నీకు నేనివ్వవలసిన మనోవృత్తీ, విడాకుల చీటీ అన్నీ తర్వాత పంపిస్తాను; ఒక నెలలోగా. ప్రస్తుతం నువ్వుమాత్రం వెళ్ళు."
    అదిరిపడింది శ్యామల. "విడాకుల చీటీ! ఇందుకా? ఇందుకా వివాహం?"
    "మరి? నీమాట బాగుందా? ముష్టి కాపురమా? మన కాపురానికేం లోటు వచ్చింది? చూడు, శ్యామలా. ఒకేమాట చెప్తున్నాను. నువ్వింత ఇల్లూ వాకిలీ పట్టకుండా తిరిగేం దుకే పట్నవాస కాపురం కోరుకున్నావని తెలుస్తే అసలు అక్కడినుంచి విడిపోయి వచ్చేవాడినే కాదు. అక్కడ ఉన్నప్పటికంటే స్వేచ్చగా, ఆనందంగా మనం ఒకరికొకరం దగ్గరవ్వగలమని ఆశించాను. కాని అసలు నీకు ఇక్కడకు వచ్చిన దగ్గర్నుంచీ భర్తంటూ ఒకడున్నాడన్న సంగతికూడా గుర్తున్నట్టు లేదు. కాని అది చాలా తప్పు. అనర్ధహేతువు.
    "అటువంటి జీవితం కాదు; అటువంటి షోకులు కాదు, శ్యామలా, నేను కోరేది. నిన్ను పూర్తిగా యింట్లో పడివుండమని నేననటం లేదు. కాని ముందు నీ బాధ్యతలు నెరవేర్చు. ముందు ఇల్లూ, సంసారమూ. ఆపైన సరదాలూ, షోకులూ. అప్పుడు నేనేమీ అనను. కాని ఇటువంటి స్వేచ్చావిహారాలకుమాత్రం నా అనుమతి ఉండదు. నీ యిష్టం. ఏదో ఒకటి తేల్చుకో" అంటూ తన గదిలోకి పోయి తలుపులు మూసుకున్నాడు.

                                                         67

    శ్రీహరి ఆశించినట్లుగానే శాంతిలో కొంత మార్పు వచ్చింది. రాజా క్షేమవార్త విన్న తర్వాత ఆమె హృదయభారమంతా పటాపంచలైపోయింది. ఎక్కడో ఒక చోట, అతడు క్షేమంగా ఉన్నాడు. చాలు, అంతే చాలు. అంతకంటే తాను కోరేదేమీ లేదు. అతడి జీవితాన్ని సుఖవంతం చేయమని నిస్వార్ధతతో భగవంతుడిని ప్రార్ధించేది.
    ప్రతిదినం సాయంత్రంవేళలలో కారు మీద తండ్రితోనూ, పాపతోనూ వాహ్యాళి వెళ్ళి వచ్చేది. పగలంతా తల్లికీ, వదినకూ సాయపడుతూండేది. తండ్రికి సపర్యలు హేసేది. ఆయన ప్రక్క కూర్చుని భారత భాగవతాలు గంటలతరబడి చదివి విన్పించుతుంది. ఇంకా తీరిక ఉంటే శాంతివనమంతా తిరుగుతూ కుసుమ సౌందర్యారాధనతో, వృక్షచ్చాయలలో కూర్చుని గడిపేస్తుంది.
    ఇప్పుడు శాంతినికేతన్ గుర్తు వచ్చినా హృదయం వ్యధాభరితం కాదు. ఒక అపురూప విద్యానిలయంగా, తనకు జీవితార్దాన్ని వివరించి చెప్పిన మహత్తర ప్రదేశంగా గుర్తు వస్తుంది. ఇప్పుడామెకు గోవిందరావుపై కినుక లేదు. ఒక మానవుడు; తన స్వభావానికి సరిపడనివాడు. రాజాపై కోరిక లేదు. ఒకనాటి చెలికాడు; సుగుణాల ప్రోవు. తనకు అతీతుడైన, తనకు అందరాని ఛందమామ! అయితే, విచారం లేదు. జయపై అసహ్యం లేదు; ఆమె ఒక అహంభావి. శ్యామలపై ద్వేషం లేదు; ఆమె స్వార్ధం ఆమెది; తనకేల? తన విషయమై చింత అసలే లేదు; ఒక తెలివితక్కువది - అంతే. న్దరూ భాగవత్స్రుష్టిలోని భిన్నరూపాలు. ఒక్కొక్క తరహా మానవ స్వభావానికి ప్రతినిధులు. వారిలో తానూ ఒకతె! ఎవరినీ ద్వేషించవలసిన, ఎవరిని చూచీ ఆశ్చర్యపడవలసిన ఆగత్యంలేదు. ఇది ప్రపంచం! హృదయం కల్లోలదూరమై స్పటిక స్వచ్చతతో భాసిస్తూంది. అందుకు కారణమైన ఆ దయామయునికి అభినందనలు!
    అప్పుడప్పుడు మనోరమనుండి ఉత్తరాలు వస్తాయి. అవి క్షేమవార్తలూ, స్నేహపూర్వక సహాలూ; సందేశాలూ. కలిసి ఉన్నది అల్పకాలమే అయినా అత్యధికమైన ఆత్మీయత ఏర్పడింది. ఈ హృదయానుబంధ రాగలతలు ఎక్కడ ఏ కారణాన ఎలాగా పెనవేసుకుపోతాయో అనూహ్యం. భగవన్మాయ చిత్రాతిచిత్రం! నేలపై కలువకూ, నింగిపై చంద్రుడికీ సంబంధం; మంటిపై పద్మనికీ, మింటిపై సూర్యునికీ అనుబంధం!
    శనివారం మధ్యాహ్నం బలరామయ్య ఎవరో వ్యాపారులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడాయనకు బాగా స్వార్ధం చిక్కి వర్తక వ్యాపారాలన్నీ స్వయంగా చూచుకోగలుగుతున్నారు. ప్రశాంతి నిద్రపోతూంది. పద్మా, లక్ష్మీదేవీ ఏదో పిండివంట తయారీలో నిమగ్నులై ఉన్నారు. శ్రీహరి సాయంత్రం ఆరూ ఏడు గంటలకు కాని రాడు ఆఫీసునుంచి. శాంతికి ఏమీ తోచకుండా ఉంది. డ్రైవరును వద్దని కారు తీసుకుని ఒన్తరిగాఎన్ బయల్దేరింది. "రాజమండ్రి వెళ్తున్నాను. సినీమా చూచి వచ్చేస్తాను. నేనూ, పెద్ధన్నయ్యా కలిసే వచ్చేస్తాం సాయంత్రం" అని రామన్నతో మాత్రం చెప్పి బయల్దేరింది. అలా ఏకాంతంగా విహారార్ధం వెళ్ళిపోవటం ఆమెకు మామూలే. ధవళేశ్వరం ఆనకట్టదగ్గర నదీతీరాన కూర్చుంటే ఒకనాడు అక్కడ కూర్చుని రాజాతో అనేక విషయలు మాట్లాడటం తలపుకు వస్తుంది. అందులోనే ఒక తృప్తీ, హాయీ లభిస్తాయి. దేవాలయానికి వెళ్తే కలకత్తాలో రాజాతో కలిసి వెళ్ళిన కాళీఘాట్, దక్షిణేశ్వరపు రాధామాధవులు - అన్నీ గుర్తువస్తాయి. 'డ్యా మయుదిన్ పరమాత్ముడు హఠాత్తుగా నాకిక్కడ రాజా కన్పించేట్లు చేయకూడదూ?' అనే ఆశాభావం లోపల మెదులుతుంది. చిన్న పిల్లల కోర్కెవంటి తన కోర్కెకు తనకే నవ్వు వస్తుంది. 'ఎక్కడున్నా రాజాను చల్లగా చూడు. మనశ్శాంతి చేకూర్చు' అని నిండు మనస్సుతో ఆ దైవాన్ని ప్రార్దిస్తూ అంజలి ఘటించి తృప్తిగా  ఈవలకు వస్తుంది.
    నేడూ అలాగే బయల్దేరింది. సినీమాకని యింటిదగ్గర చెప్పిందేకాని ఏమో? తీరా అక్కడికి వెళ్ళాక మనస్సెలా మారితే అలాగ. నిజానికి ప్రకృతి అందాలను ఆస్వాదించడంలో గల ఆనందం ఏ సినీమాను తిలకించడంలోనూ లభించదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS