Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 6

    బయటున్న తిన్నెమీద భూపతిరెడ్డి ఏటవాలుగా ఆనుకుని వుంటే దామాచారి ఆయన కాళ్ళదగ్గర కింద కూర్చుని వున్నాడు. చంద్రరేఖ వాళ్ళిద్దర్నీ గమనించింది కానీ, అటువేపుకి తల మరల్చకుండా తలుపు తీసుకుని లోపలికెళ్ళింది.
 
    వాళ్ళని చూడగానే శశి పరుగెత్తుకొచ్చింది. ఆమె భూపతిరెడ్డి కూతురు. ఇరవై ఏళ్ళుంటాయి. ఈ మధ్యనే పెళ్ళయింది. ఒకే కూతురు కావడం వల్ల అల్లుడ్ని ఇల్లరికం తెచ్చుకున్నాడు భూపతిరెడ్డి.

    "రా అక్కా! మా అత్త పరిస్థితి ఏమీ బాగాలేదు. నెల రోజుల నుంచి పక్షవాతం. అంతకుముందు మతిలేనట్లు ఏమిటేమిటో మాట్లాడేది. ఒకరోజు కడుపులో నొప్పి అనేది. మరో రోజు వెన్నునొప్పి అనేది. ఇప్పుడు ఏకంగా పక్షవాతం వచ్చింది. కుడికాలూ, కుడిచేయీ చచ్చుబడి పోయాయి. డాక్టర్లేమో పక్షవాతం వచ్చింది. కుడికాలూ, కుడిచేయీ చచ్చుబడి పోయాయి. డాక్టర్లేమో పక్షవాతం కాదంటారు. మరి కాలూ, చేయీ ఎందుకు చచ్చుబడిపోయినట్లు?"

    శశి తన మేనత్త వేదవతి గురించి చెబుతూ ఆమెవున్న గదిలోకి తీసుకెళ్ళింది చంద్రరేఖని.

    చిన్నబల్బు నీరసంగా వెలుగుతోంది ఆ గదిలో.

    "ఏయ్! కదలొద్దు. కదిలితే కాల్చేస్తా" పడుకున్నదల్లా ఠక్కున లేచి వాళ్ళను చూసి అరిచింది వేదవతి.

    ఆమెకి సుమారు నలభై అయిదేళ్ళుంటాయి. నాలుగేళ్ళ క్రితం భర్త చనిపోతే పుట్టింటికి వచ్చేసింది. పిల్లల్లేరు. పుట్టింటికి వచ్చినప్పట్నుంచీ ఏదో ఒక జబ్బు. అప్పుడప్పుడూ ఇలా అరుస్తోంది.

    "నేను వేదవతీ - చంద్రరేఖను. ఊరికే నిన్ను చూసిపోదామని వచ్చాను" అని పక్కన కూర్చుంది.

    వేదవతి ఆమెను కిందనుంచి పైవరకూ చూసి సమాధానపడ్డట్టు మౌనంగా వుండిపోయింది.

    మరో పది నిముషాలవరకు చంద్రరేఖ ఆమెతో ఎంతో ఆప్యాయంగా అవీ ఇవీ మాట్లాడింది.

    ఆమె ఫ్రీగా మూవ్ అవుతోందని గ్రహించాక తనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తోంది చంద్రరేఖ.

    అంతకుముందే శశినీ, చిట్టినీ బయటికి పంపించింది. ఆ గదిలో వాళ్ళిద్దరూ తప్ప మరెవరూ లేరు.

    "ఎందుకలా మమ్మల్ని కదిలితే కాల్చేస్తానని హడలెత్తించావ్?" మొదటగా అడిగింది చంద్రరేఖ.
 
    వేదవతి అటూ ఇటూ కలియజూసి రహస్యం చెబుతున్నట్లు మెల్లగా మాట్లాడుతోంది.

    "ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఓ సేద్యగాడు వుండేవాడు. వాడు చీకట్లో వీలైనప్పుడల్లా ఏదో నెపంతో రాసుకుంటూ వుండేవాడు. ఆ భయం అలా మనసులో వుండిపోయింది. ఎవరైనా సరే దగ్గరకొస్తే మీద పడి పోతారేమోనన్న అనుమానం వచ్చేస్తుంది నాకు. అందుకే అలా అరుస్తుంటాను."

    అదన్నమాట సంగతి. చంద్రరేఖకు ఆమె పరిస్థితి బాగానే అర్ధమవుతోంది.

    "రాత్రులు నిద్ర బాగా పడుతోందా?"

    "ఆఁ నిద్రా పాడా! ఎప్పుడో తెల్లారగట్ట అలా కళ్ళు మూతలు పడతాయి. కళ్ళు అలా మూసుకుంటానో లేదో ఏమిటేమిటో కలలు పిచ్చిపిచ్చిగా"

    "ఏదైనా కల ఒకటి చెప్పు"

    "అవన్నీ గుర్తుంటేగా. కానీ తరచూ వచ్చే ఒక కల మాత్రం గుర్తుంది. అదేమిటంటే - నా కాళ్ళమధ్య ఒక పెద్ద పాము. అది కాళ్ళ దగ్గర చేరగానే మరుక్షణం పాముతోపాటు నేనూ ఆకాశంలోకి ఎగురుతాను. అలా ఆకాశంలో తిరిగి, తిరిగి అలసిపోతాను. అంతే కల, ఇదే అప్పుడప్పుడూ వస్తూ వుంటుంది."

    వేదవతికి ఆ కలే ఎందుకు వస్తుందో చంద్రరేఖ విశ్లేషించుకుంటోంది.

    పాము మగతోడుకి ప్రతీక. ఆకాశంలోకి ఎగరడమంటే సెక్స్ లో పరాకాష్టకు చేరుకోవడం.

    కలలో ఏ వస్తువూ ఊరికే కనపడదు. ప్రతిదానికీ కారణముంటుందని ఆమెకి ఆశ్రయమిచ్చిన డాక్టర్ చెప్పగా వింది చంద్రరేఖ. ఆమె స్వతహాగా తెలివైంది గనుక డాక్టర్ దగ్గర నేర్చుకున్న అనేకానేక విషయాలకు తను తెలుసుకున్న ప్రపంచజ్ఞానాన్ని జోడించి రోగి ఏ జబ్బుతో ఎందుకు బాధపడుతున్నాడో ఖచ్చితంగా గ్రహించగలుగుతోంది.

    వేదవతిని పీడిస్తున్న జబ్బేమిటో ఆమెకి తెలిసిపోయింది. మరింత నిర్ధారణ కోపం కొన్ని ప్రశ్నలు వేస్తోంది. వేదవతి గురించి ఊళ్లో వాళ్ళు చెప్పగా కొంక విన్నది గనుక ఎలాంటి ప్రశ్నలు అడగాలో ముందే ప్రిపేర్ చేసుకొచ్చింది.

    "వేదా! నీకు మనుషుల్లో నచ్చనిది ఏమిటి?"

    "తొందర"

    "నచ్చింది ఏమిటి?"

    "నిదానం"
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS