పిల్లలెవరూ లేరు. ఆమెకు వున్నదల్లా చిట్టి మాత్రమే. చిట్టి స్త్రీనో, పురుషుడో తెలియదు. మగాడిగానే వుంటాడుగానీ స్త్రీని తనలో దాచేసుకున్నట్టు స్త్రీ లక్షణాలు కూడా బాగానే వుంటాయి.
ఓ ప్రొఫైల్ లో పురుషుడుగా కనిపించే చిట్టి మరో ప్రొఫైల్ లో స్త్రీలా అనిపిస్తాడు.
ఏ దిక్కూలేని చిట్టి ఓ రోజు ఆ వూరు వచ్చాడు. ఎవరూ లేని చిట్టిని తనతోనే వుండిపొమ్మంది చంద్రరేఖ. అప్పట్నుంచీ ఒకరికి ఇంకొకరు తోడు.
"ఏరా చిట్టీ -మనమంటే గిట్టని భూపతిరెడ్డి మనకోసం కబురంపడం ఆశ్చర్యంగా లేదూ" అని అడిగింది చంద్రరేఖ నడక వేగాన్ని కాస్తంత తగ్గించి.
"ఆశ్చర్యంగాక మరేమిటి? నన్నడిగితే ఇది తొమ్మిదో వింత" అన్నాడు చిట్టి.
ఆశ్చర్యాన్నంతా గొంతులో కూరడంతో అతని సన్నని గొంతు మరింత సన్నగా పలికింది.
భూపతిరెడ్డి ఆ వూర్లోకంతా మహారాజు. వూర్లోని ముప్పాతిక భూములు ఆయనవే. ఆయన మాట వేదంగా చెల్లుబాటవుతుంది.
అలాంటి భూపతికి చంద్రరేఖ బద్దవిరోధి.
కన్యాకుమారినుంచి చంద్రరేఖ వచ్చాక ఓ రోజు ఆమెనుచూశాడు భూపతిరెడ్డి ఎక్కడెక్కడా ఎలా వంపులు తిరిగితే మగాడు పిచ్చివాడు అయిపోతాడో అలాంటి వంపు సొంపుల్ని తన శరీరంలో దాచుకున్న ఆమెను చూడగానే ఆయన మరులుగొన్నాడు.
రెండు మూడు రోజులు ఆమెమీద మొహంతో కాలిపోయాక ఇక వుండబట్టలేక దామాచారిని పిలిచాడు. దామాచారికి ముప్పై అయిదేళ్ళు వుంటాయి. దెయ్యాలు తోలడం, దుష్టశక్తులు పనిపట్టే దామాచారి ఆ వూరు చుట్టుపక్కలకంతా మాంచి పేరుమోసిన భూతవైద్యుడు.
భూపతిరెడ్డికి అతను నమ్మినబంటు. కనుకే దామాచారిని పిలిచి తన ప్రేమనంతా చెప్పుకున్నాడు.
"ఎలాగైనా సరే. ఆ చంద్రరేఖ నాకు కావాలి. మంత్రమే వేస్తావో, తంత్రమే వేస్తావో నాకు తెలియదు. రేపు పౌర్ణమి. అది నా ఒళ్ళోపున్నమి లాగా పరుచుకోవాలి"అని ఓ సాయంకాలం భూపతిరెడ్డి తన మనసులోని మాట చెప్పాడు.
వెంటనే దామాచారి రాయబారం వెళ్ళాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడి చివరికి తను వచ్చిన పని బయటపెట్టాడు.
ఆ మాట నినగానే చంద్రరేఖ తోకతొక్కిన పాములాగా లేచింది. "ఏమిటేమిటి - మీ కామందుకి నేను కావాల్సి వచ్చానా? నచ్చిన ఆడదాని కోసం ఎలాంటి ఘోరం చేయడానికైనా వెనుకాడని అలాంటి నీచుడ్ని నేను తాంబూలం పెట్టి పిలవాలా!
ఎంతమంది మగాళ్ళని ఏ విధంగా హింసించి, వాళ్ళ భార్యలతో గడిపాడో నాకు తెలియంది కాదు. కాబట్టి ఇంకెప్పుడూ ఇలాంటి ఊసులు తేవద్దు" అని దులిపేసింది. దాంతో దామాచారి నిశ్శబ్దంగా అక్కడినుంచి నిష్క్రమించాడు.
ఆమె తిరస్కారంతో భూపతిరెడ్డికి తలకొట్టేసినంత పనయింది. అవమానభారం ఆయన్ను ఇప్పటికి కూడా బాధపడుతూనే వుంది.
తనని కాదన్న చంద్రరేఖను దెబ్బతీయాలని ఆయన సరైన సమయంకోసం ఎదురుచూస్తూనే వున్నాడు. గతంలో ఆమెను ఏదోవిధంగా ఇబ్బంది పెట్టాలని చూశాడుగానీ వీలైంది కాదు. కుర్రకారు సపోర్టుఅంతా ఆమెకుంది. అంతేకాకుండా ఆమె కన్యాకుమారి నుంచి వచ్చాక డాక్టర్ గా మారిపోయింది. వూర్లో ఎవరికి ఏం జబ్బువచ్చినా ఆమె మందూ మాకులూ ఇచ్చి నయం చేస్తుంది కాబట్టి ఆమె అంటే అందరికీ అభిమానముంది.
అయినా భూపతిరెడ్డి తన పగను మాత్రం చల్లార్చుకోలేదు. అనువయిన సమయంకోసం వెయిట్ చేస్తున్నాడని ఆమెకూ తెలుసు.
అలాంటి భూపతిరెడ్డి సాయంకాలం దామాచారితో కబురంపితే మొదట ఆశ్చర్యపోయిందామె.
"భూపతిరెడ్డి విధవ అక్క వేధవతి పరిస్థితి ఏమీబాగాలేదు. వెంటనే నిన్ను వెంటబెట్టుకు రమ్మన్నాడు" అని దామాచారి తను వచ్చిన పని చెప్పాడు.
వస్తున్నానని చెప్పి అతనిని పంపించేసి చంద్రరేఖ బయల్దేరింది. మరో అయిదు నిముషాలకి చంద్రరేఖ, చిట్టి భూపతిరెడ్డి ఇంటికి చేరుకున్నారు.
అతిపరెద్ద బంగళా. ఎప్పుడో కట్టిన భవనం కావడంవల్ల కొత్తగానే వుంటుంది. పాతకాలపు హీరోయిన్ వెనకటి అలవాటు మానుకోలేక అతిగా అలంకరించుకున్నట్టు వుంటుంది ఆ భవనం.
