"నువ్వు ఎప్పుడూ కోరుకొనేది?"
"బొమ్మలతో ఆడుకోవాలని"
"నీకు నచ్చిన డార్క్ డైలాగ్ ఒకటి చెప్పు"
"చింత చచ్చినా పులుపు చావడం లేదు"
ఆమె సమాధానాలు విని ఇక ప్రశ్నలు వేయవలసిన అవసరం లేదనిపించింది చంద్రరేఖకి. వేదవతి జబ్బుకి మూలం ఏమిటో తెలిసి పోయింది. బయటున్న చిట్టిని, శశిని లోపలికి రమ్మని పిలిచింది.
"సరే! నే వెళతాను వేదవతీ. ఆఁ చెప్పడం మరిచేపోయాను. నేనో గొప్ప మందుని హిమాలయాల్లోంచి తెప్పించాను. అయితే దాన్ని ఇంతవరకూ ఎవరిమీదా ప్రయోగించలేదు. అది బాగా పనిచేసిందనుకో, కాలూ, చేయీ నీ స్వాధీనంలోకి వచ్చేస్తాయి. వికటించిందనుకో -వారం రోజుల్లో చచ్చిపోతావ్. మరి ఆ మందు నీకివ్వమంటావా?" అని చిట్టి వైపు చేయి చాచింది చంద్రరేఖ.
వేదవతి ఆలోచనలో పడ్డట్టు రెండు నిముషాలు ఏమీ మాట్లాడలేదు. ఈలోగా చిట్టి తన సంచిలోంచి ఓ మందుసీసాను తీసి చంద్రరేఖకి ఇచ్చాడు.
చివరికి వేదవతి -ఓ నిర్ణయానికి వచ్చింది. "సరే! ఆ మందు నాకివ్వు" అంది కాలూ, చేయీ లేకుండా బతకడంకంటే చావడం ఎంతో నయం.
ఇదంతా గమనిస్తున్న శశికి చెమటలు పడుతున్నాయి. ఏం కాబోతోంది ఇప్పుడు? తన మేనత్తకి బాగవుతుందా? ఏకంగా చచ్చిపోతుందా?
చంద్రరేఖ ఏమీ మాట్లాడకుండా సీసా మూతతీసి మందునంతా నోట్లో కుమ్మరించింది.
వేదవతి మూసిన కళ్ళు తెరవలేదు. మందు గొంతులోంచి దిగుతున్నా ఆమెలో ఏ చలనమూ లేదు.
చంద్రరేఖతోపాటు చిట్టి, శశికూడా కళ్ళార్పకుండా ఆమెనే చూస్తున్నారు.
ఆమె మృత్యువుతో పోరాడుతున్నట్లు ఆమె ముఖకవళికలే చెబుతున్నాయి.
చావుతో పోరాడటం ఎంత భయానకం!
ఒకటీ, రెండు...... అయిదు నిమిషాలు గడిచాయి.
వేదవతి కళ్ళు తెరిచింది. శక్తినంతా కాళ్ళల్లోకి తీసుకుంటున్నట్లు ఆమెలో కదలికలు.
ఆశ్చర్యం -అధ్భుతం. ఆమె మంచంమీదనుంచి దిగి రెండు అడుగులు వేసింది. కుడిచేతిని రెండుసార్లు విదిలించింది ఆమెకి కాళ్ళూ చేతులూ వచ్చేశాయి. పక్షవాతం పోయింది.
ఆనందం గుండెల్లోంచి తన్నుకొస్తున్నట్లు శశి కళ్ళల్లో నీళ్ళు, చంద్రరేఖ పెదవులమీద విజయగర్వంతో కూడుకున్న చిరునవ్వు.
"చంద్రా! నాకు బాగై పోయింది. చూడు -చేతులూ, కాళ్ళు ఎలా ఊగుతున్నాయో" వేదవతి సంభ్రమాశ్చర్యాలతో చెప్పింది.
"మందు గొప్పగా పనిచేసింది. ఇక నీకు వచ్చిన సమస్యలేదు" చంద్రరేఖ ఆప్యాయతతో భుజం చరిచి" ఒంటరిగా వుండొద్దు. నీ మకాం ఇక ఈ ఇంట్లోవద్దు. అదిగో ఆ పెంకుటింట్లోకి మారిపో, తోడుగా వుండడానికి ఓ కుర్రవాడ్ని పనిమనిషిగా వుంచుకో. ఇక ఏ జబ్బూ నీ దరిజేరదు ఏ దుష్టశక్తి నీ దగ్గరికి రాదు" అని చంద్రరేఖ శశివైపు తిరిగి "మీ నాన్నతో చెప్పి నీ మేనత్తకు నేను చెప్పినట్లు అన్నీ అరేంజ్ చేయమను" అని బయలుదేరింది.
భూపతిరెడ్డి ఇంటినుంచి బయటపడ్డాక చిట్టి ఎంతో క్యూరియాసిటీతో అడిగాడు. "అక్కా! వేదవతి జబ్బేమిటి? కుర్రసేద్యగాడ్నికాపలా పెడితే దుష్టశక్తి ఏదీ దరిజేరదు అన్నావ్. నీకు దెయ్యాలు, భూతాలుమీద నమ్మకం లేదుగదా"
చంద్రరేఖ అర్ధమైనట్టు నవ్వి, " అది మానసికమైన జబ్బు. దానికి మందు ఆమెకు మగతోడు కావాలి అంటే భూపతిరెడ్డిలాంటివాడు ఒప్పుకుంటాడా? అదే దెయ్యమని చెబితే సరేనంటాడు. ఆయాచితంగా డబ్బు లొచ్చేవాళ్ళకి ఇలాంటి మాయరోగాలు వస్తుంటాయి. వేదవతికి భర్త చనిపోయాడు.
" ఆమె తత్త్వానికి మగతోడు చాలా అవసరం. కానీ ఆ ఇంట్లో అందుకు వీలుకాదు. ఆ కారణంవల్లే ఆమె తనకు తానే జబ్బులు ఆపాదించుకుని మగాడికి దూరంగా వుండాలని ప్రయత్నించింది. కాని వీలైంది కాదు. చివరికి కాలూ చేయీ పడిపోయింది. తీరని కోరిక కలలాగా వచ్చి బాధపెడుతోంది అందుకే ఇల్లు మార్చమని చెప్పాను."
"మరి ఆ మందు ఇస్తూ మందు పనిచేయకపోతే వారం రోజుల్లో చచ్చిపోతావని ఎందుకున్నావ్? ఆ మందు తాగించడానికి అంత బిల్డన్ అవసరమా?"
