63
ప్రశాంతి యిప్పుడు మరీ అందంగా బలంగా ఉండి ముద్దొస్తూంది. ఇప్పుడిప్పుడే బాగా ప్రాకడం నేర్చింది. ఎన్నిసార్లు ముస్తాబు చేసినా వెంటనే దుస్తులు మాపేసుకుంటుంది, నేలపైన ప్రాకి. మేనకోడలికి నిత్యం గౌన్లు మార్చి మార్చి తొడగడం, పౌడరువేసి శుభ్రంగా ఉంచడంతోనే సరిపోతూంది శాంతికి.
పాప 'అత్త, అత్త' అని పకపకా నవ్వుతూంటే శాంతి మురిసి ముగ్ధయై విచారమంతా మరిచిపోతుంది.
ప్రశాంతి అప్పుడప్పుడే 'అమ్మ - అత్త - తాత - మామ్మ - నాన్న' అంటూంది. శ్రీహరి కోపపడితే 'తాత' అంటుంది - 'తాతగారికి ఫిర్యాదు చేస్తా' ననే భావం తోపించుతూ.
"అస్తమానూ బట్టలు పాడుజేసుకుంటున్నావ్! అత్తయ్యకు పని కల్పిస్తున్నావ్!" అని పద్మ కోపం నటిస్తూ తీవ్రంగా చూస్తుంది.
పాప ముఖంలో తిరస్కారం కన్పిస్తుంది. 'నీలెక్కేమి'టన్నట్టు "అత్త!" అని శాంతిని చుట్టుకుపోతుంది. అందరూ నవ్వుకుంటారు.

"అవునమ్మా. మనిద్దరం ఒకటి. అమ్మజట్టు వద్దు" అంటుంది శాంతి ప్రశాంతిని దగ్గరకు తీసుకుని. అత్త ఒళ్ళో కూర్చుని 'టా టా' అంటూ అమ్మను ఉడికిస్తుంది ప్రశాంతి.
అసలు ప్రశాంతి తల్లిదగ్గరకు వెళ్ళేదే తక్కువ. ఎప్పుడూ శాంతిచేతులలోనే ఉంటుంది. ఉదయం స్నానం చేయించిన దగ్గరినుంచీ పౌడరురాసి దుస్తులు వేయడం, పాలు పట్టడం, బిస్కట్లివ్వడం, భుజంపై వేసుకు నిద్రింపజేయడం అంతా శాంతి పనే. ఆ పనులు యింకెవరైనా చేసినా ప్రశాంతికి బాగుండదు. చికాగ్గా ఏడుస్తుంది. శాంతి దగ్గరో, తాతగారి దగ్గరో పడుకుని నిద్ర పోతుంది కాని పద్మ లేవదీసినా ఏడుస్తుంది, కాళ్ళూ చేతులూ కొట్టుకుని.
ఇరవై యొక్కేళ్ళ శాంతికీ ఏడూ నెలల ప్రశాంతికీ అంత దోస్తీ. ఆ యిద్దరి పోట్లాటా ఒక్కటే విషయంలో.
"తాతయ్య నాదీ" అంటుంది శాంతి, పాపను కవ్విస్తూ హాస్యంగా తండ్రిమీద చెయ్యివేసి.
"నాది. నాది. తాత. తాత" అని విరుచుకుపడుతుంది ప్రశాంతి.
"నీదే లేవే" అని శాంతి ఒప్పుకునేవరకూ ఊరుకోదు; అరవడం మానదు.
అది చూచి లక్షీదేవీ, శ్రీహరీ, పద్మా నదరి ముఖాలూ ఆనంద ప్రఫుల్లమైపోతాయి.
"ప్రశాంతే లేకపోతే నాన్నగారేమై పోదురో? అదే యిప్పుడాయనకు సంతోష కారణం" అంది శాంతి ఒకనాడు అన్నతో.
"నేనూ అదే అనుకుంటాను, శాంతీ. పసి పిల్లలు లేని యిల్లు ఇల్లేకాదు. ముగ్ధహాసాలతో అనేక విచారాలు మరిచిపోవచ్చు. నాకు దీన్ని చూస్తూంటే నీ పసితనం గుర్తుకు వస్తుంది. అప్పుడు నువ్విలాగే ఉండేదానవు. ఇప్పుడు నువ్వు ప్రశాంతి నెలా ఒక్క క్షణం వదిలి ఉండలేవో, అప్పుడు నిన్ను నేనలా వదలలేక పోయేవాడిని."
నవ్వింది శాంతి. "ఇప్పుడుమాత్రం వదలగలరా నన్ను నువ్వూ, నాన్నగారూను?" "నిజమే, శాంతీ!"
64
మధ్యాహ్నంవేళ శాంతి, పాపను ఎత్తుకుని తోటలో తిరుగుతూండగా నల్లకారు దూసుకు వచ్చింది తోటలోకి. ఆగిన కారులోంచి శ్రీహరీ, డైవరూ దిగారు.
"1438! లక్కీ నంబర్!" అంటూ కారు దగ్గరికి వచ్చింది శాంతి నవ్వుతూ.
"ఊఁ. లక్కీ గర్ల్ కి లక్కీ నంబర్!" అని ప్రతిహాసం చేశాడు శ్రీహరి. "బాగుందా?" అనడిగాడు.
"ఏమే పాపా, బాగుందా?" అనడుగుతూ ప్రశాంతిని తలుపుతీసి కూర్చోబెట్టబోయిన శాంతి వెనుకనుంచి తల్లికేక విని ఆగిపోయింది.
"ఇప్పుడే క్రొత్తగా వచ్చింది. పూజ చేసి, టెంకాయ కొట్టాక కాని ఎక్కరాదు" అంది లక్ష్మీదేవి. అప్పటికప్పుడే పూలూ, పసుపూ, కుంకుమా, హారతి కర్పూరం అన్నీ సిద్ధపరచ బడ్డాయి. చేతికర్ర సాయంతో అక్కడకు వచ్చిన బలరామయ్య "కొబ్బరికాయ శాంతి వృక్షానివి తీసుకురా" అని ఆజ్ఞాపించాడు రామన్నను. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత వరకూ శాంతి వృక్షం కాచిన కొబ్బరికాయలన్నీ దేవునికే అంకితమయ్యాయి కాని మరేవిధంగానూ వినియోగింపబడలేదు!
"నాన్నా!" అన్నాడు శ్రీహరి. ఆశ్చర్యం దోబూచులాడుతున్న ఆ కంఠంలో ప్రశ్న కూడా ఉంది.
గ్రహించాడు బలరామయ్య. "అవును శాంతికోసమే యిప్పుడీ కారు కొన్నది. ఈ కారు వచ్చినవేళ మంచిదై శాంతి జీవితం చక్కబడాలని ఆశిస్తూ ఆ కాయ తెమ్మన్నాను. నా కోరిక తీరితే ఈ కారులోనే తిరుపతి వెళ్దాం. శ్రీనివాసుని సమక్షమందే శాంతి వివాహం చేద్దాం."
"చాలామంచిఊహ, నాన్నా" అన్నాడు శ్రీహరి భగవంతుని తలచి నమస్కరిస్తూ. లక్ష్మీదేవి కూడా మనస్సులో ఏం తలుచుకుందో, లెంపలు వేసుకుని దణ్ణం పెట్టుకుంది. శాంతి మన స్సులో ఆనంద విషాద భావాలనేకం చెలరేగాయి. అశ్రుపూరిత నేత్రాలను ఎవరూ చూడకుండా ప్రక్కకు తిరిగి ఒత్తుకుంది. 'నా జీవితాని కిక సుఖమూ, శాంతీ ఎక్కడ!'
అందరూ ముందుగా దైవాన్ని పూజించి తర్వాత కారుకు శ్రద్దగా పూజ చేశారు. రామన్న వలిచి తెచ్చిన కొబ్బరికాయను శ్రీహరి కొట్టగానే ఒక్క దెబ్బకే అందంగా రెండు చెక్కలైంది.
"శుభం!" అన్నారు బలరామయ్య తృప్తిగా.
లక్ష్మీదేవీ, శాంతీ, పద్మా హారతి ఇచ్చారు. హారతి యిచ్చి పళ్ళెం క్రింద ఉంచబోయేసరికి పోస్టుమన్ ఉత్తరాలు తెచ్చాడు. అన్నిటిలో ముందు శ్రీహరి దృష్టి నాకర్షించినది కలకత్త్హా నుండి వచ్చిన ఉత్తరం. అది మోహన్ రావు వ్రాశాడు శ్రీహరికి. ఆత్రంగా విప్పి చదివాడు.
"శ్రీహరి గారికి-
క్షేమం. వెనుక మీరొకసారి రాజశేఖరం విషయమై నాకూ బెనర్జీకి ఉత్తరాలు వ్రాశారు. అప్పుడు తెలియదని వ్రాయవలసి వచ్చింది. ఆ చనువు పురస్కరించుకునే ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
ఈమధ్య నేను మా తల్లిగారిని యాత్రలకు తీసుకువెళ్ళాను. నాకు అలహాబాదులో రాజశేఖరం కన్పించాడు. కొద్దిగా చిక్కినట్లున్నా బాగానే ఉన్నాడు. ఉల్లాసంగా మాట్లాడాడు. కాని అతడిలో ఏదో మానసిక బాధ ఉన్నట్టు నాకు అన్పించింది. అతడిని ఎంత అడిగినా చెప్పలేదు. మరీ తర్కించి, బలవంతంగా చెప్పించగలంత స్నేహం అతడితో నాకు లేదు. ఎక్కడ ఏమీ చేయటంలేదట. సరదాగా ఊళ్ళు తిరుగుతున్నానని చెప్పాడు.
నేను మీ ఉత్తరం సంగతి అతడికి చెప్పాను. 'వెదుక్కోవడం దేనికి? ఆందోళన అనవసరమని శ్రీహరికి వ్రాయండి' అన్నాడు. మరి అతడు మీకు వ్రాశాడో లేదో నాకు తెలియదు. ఇంతే సంగతులు.
భవదీయుడు,
మోహన్."
అందరి హృదయాలూ సంతోష తరంగితమై, వదనాలు ఆనంద ప్రపుల్ల విస్ఫారితములైనాయి. శాంతికి కలిగిన సంతోషం వర్ణనాతీతం. అందరూ ఉన్నారన్న సంగతి కూడా మరచి అపరిమితానందంతో ప్రశాంతిని గాఢంగా ముద్దు పెట్టుకుంది.
"దేవుడు దయామయుడు" అన్నది లక్ష్మీదేవి ఆనందబాష్పాలు ఒత్తుకుంటూ.
"ఎంతకాలానికి తెలిసింది వార్త! నాలుగు నెలలకు ఈనాడు!" అన్నాడు శ్రీహరి ఆనంద విచారాలతో మిళితమైన బరువు విశ్వాసం విడుస్తూ. "ఏమే, శాంతీ, లక్కీకారు కదూ?" అన్నాడు చెల్లెల్ని హాస్యంగా.
శాంతి సిగ్గుతో తలవాల్చింది.
"పెద్దవారు;దైవతుల్యులు - మామగారు నిండు హృదయంతో యిచ్చిన దీవెనా, చేసిన ఆలోచనా ఫలించకుండా వుంటాయా మరి?' అనుకుంది పద్మ మనస్సులో.
ఆ రాత్రంతా శాంతికి నిద్రలేదు. ప్రాణ స్నేహితుడైన రాజామా, పరమదయాళువైన శ్రీ విష్ణువునూ స్మరించుతూనే గడిపింది. ఉదయమే లేచి సుప్నాతయై శ్రద్దగా దేవుని పూజిస్తున్న కూతుర్ని చూచి లక్ష్మీదేవి ఆశ్చర్య చకిత అయింది. కాని ఆమె ప్రశ్నించలేదు. కుమార్తె మనోగత భావాలు ఆమె గ్రహించ గలిగింది. తానూ మనస్సులోనే దైవప్రార్ధన చేసింది. కుమార్తె అభీష్టసిద్ధి కలగాలని మానస ఆశీర్వదించింది.
65
"బాబూ!" ఏదో విషయం సంప్రతిస్తూన్న శ్రీహరీ, బలరామయ్యా ఉదయమే వచ్చిన క్రొత్త వ్యక్తిని చూచి ఆశ్చర్యపడ్డారు.
"నేను నారాయణగారి గుమాస్తానండి." అన్నాడతడు నమస్కరించి. తండ్రీ కొడుకు లిరువురూ ఆశ్చర్యపోయారు. 'ఏం క్రొత్త తగవు బయల్దేరుతుందో?' అనికూడ భయపడ్డారు.
ఆ వ్యక్తి ఓ సూట్ కేస్ వారిదగ్గర ఉంచుతూ, "ఇందులో వ్యాపారానికి సంబంధించిన రికార్డంతా వున్న్హదటండి. వ్యాపారం మిమ్మల్నే చూచుకోమన్నారు. ఇదివరకు తొందరపడ్డందుకు క్షమించమన్నారు" అన్నాడు.
కలో, నిజమో అని ఆలోచంచసాగారు శ్రీహరీ, బలరామయ్యా.
చివరకు శ్రీహరి మెల్లగా అన్నాడు: "ఇప్పుడు దాని ప్రసక్తి ఏం వచ్చింది? ఎందుకు పంపాడు? అయినా అతడు రావడానికేమభ్యంతరం?"
"రావడానికి ముఖం చెల్లలేదటండి" అన్నాడు గుమాస్తా సవినయంగా.
"అటువంటి సంకోచా లేమీవద్దు. రమ్మన్నామని చెప్పండి."
"చిత్తం."
"అంతా బాగున్నారా?"
"చిత్తం."
చిన్నకొడుకు దగ్గరినుండి మనిషి వచ్చాడని తెలియగానే లక్ష్మీదేవి, ఆ వెనుక పద్మా వచ్చారు ఎంతో సంతోషంగా.
"ఇద్దరూ బాగున్నారా? అబ్బాయి ఏం చెప్పాడు?" అంటూ ఆత్రుతగా అడిగింది లక్ష్మీదేవి. గుమాస్తా వివరించాడు.
"ఏం, ఒకసారి రాకపోయినాడా? మొన్న ఊళ్ళోకి వచ్చాడట. ఇంటికి రాకపోయాడు. ఈ తల్లిదండ్రు లెంత ఏడుస్తారో గ్రహించలేకపోయాడా?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది లక్ష్మీదేవి. బలరామయ్య ఏమీ మాట్లాడకుండా గోడవైపు తిరిగి పడుకున్నాడు.
"ఇవి చంటి అమ్మాయిగారి కిమ్మన్నారు" అని బిస్కట్ల పొట్లం, రెండు గౌన్లు ఉన్న కాగితపు చుట్ట యిచ్చాడు గుమాస్తా.
"ఇన్నాళ్ళకు వాడికి మర్యాదలు తెలిసి వచ్చాయన్నమాట!" అంది లక్ష్మీదేవి. చిన్నకొడుకు సంసారం సంగతి తరిచి తరిచి అడిగి తెలుసుకుంది. ఆ వచ్చిన వ్యక్తికి భోజనంపెట్టి, "పట్నవాసం. అన్నీ కొనుక్కోవాలి. ఏరోజు కారోజు మనిషిని పంపమనండి; అన్నీ యిస్తాను" అంటూ పాలూ, పళ్ళూ, పెరుగూ, కూర గాయలూ యిచ్చి సాగనంపింది లక్ష్మీదేవి. "చిన్న వాడు, తొందరపడ్డాడు. మేమేమీ అనుకోలేదు. వస్తూండమనండి. శ్యామలను అడిగానని చెప్పండి" అని మరీ మరీ చెప్పింది.
"ఏం? వాడిని చూచినంత మైమరిచి పోయారు?" ఆగంతకుడు వెళ్ళిపోయాక తీవ్రంగా ప్రశ్నించాడు బలరామయ్య భార్యనూ, కొడుకునూ.
"బాగుంది! ఇక ఈ దూరాలిలాగే వుంటాయేమిటి?" అంది లక్ష్మీదేవి.
"కలతలు వస్తేమాత్రం మనం మనం ఒకటి కాకపోయామా? బొత్తిగా అలా మాట్లాడకుండా ఊరుకున్నారేమిటి, నాన్నా?" అన్నాడు శ్రీహరి.
"అదివేరు." గర్జించాడు బలరామయ్య. "వాడంతట వాడు దారిలోకి వచ్చి యిక్కడకు వస్తే తప్ప ఎవ్వరూ ఏవిధమైన రాకపోకలు, రాయబారాలు, సరఫరాలు చేయకూడదు. ఏమంటారు?"
ఎవ్వరూ మాట్లాడలేదు.
"ఏం?" గర్జించాడు బలరామయ్య.
లక్ష్మీదేవి అశ్రువుల నదిమిపెట్టుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
శ్రీహరి ఉదాసీనవదనంతో "నేనెప్పుడూ మీమాట జవదాటలేదు. దాటను" అంటూ వెళ్ళిపోయాడు.
"నాన్నా!" శాంతి యేమో చెప్పబోయింది.
"వద్దమ్మా, శాంతీ, వద్దు. ఏమీ చెప్పకు నాకు. ఈ ఒక్క విషయంలో నే నీమాట కాదంటున్నాను. ఈ తండ్రి బాధ నీకు తెలియదు. నువ్వేమీ చెప్పకు." రెండు చేతులతో ముఖం కప్పుకున్నాడు బలరామయ్య.
అందరి అనుమానమూ నివృత్తి అయింది. ఆ ఆజ్ఞకు కారణం ఆగ్రహం కాదు. ఆవేదన! తండ్రి ఆవేదన తండ్రి హృదయానికే తెలియాలి!
66
గుమాస్తాను దేవీపట్నం పంపించి తిరిగి వచ్చేవరకూ ఏమీ తోచకుండా, ఏమీ చేయకుండా అతడి రాకకోసమే ఎదురుచూస్తూ కూర్చున్నాడు నారాయణ. ఆ గుమాస్తా చెప్పిన విషయాలన్నీ విని అతడికి ఆవేదన మరీ ఎక్కువైంది. 'నాన్నగారికి తప్ప తనపై ఎవరికీ ఆగ్రహం లేదు! ఎంతగా తృణీకరించినా ఆ తల్లి తనపై అమృతాశీర్వాదమే కురిపిస్తూంది! తాను చెయ్యి చేసుకున్నా ఆ సోదరునికి ద్వేషం లేదు. ఈ నీచుడిపై ఆ చెల్లెలికి కోపం లేదు. తానైతే మాటకు మాట చెపి, చేతకు ప్రతిచేతచేసి ఆ బాంధవ్యాన్ని శాశ్వతంగా దూరం చేసుకుని ఉండును. ఇప్పుడైతే మాత్రం, ఏం మించిపోయింది? వెళ్ళి ఒక్కసారి కాళ్ళమీద పడితే? ఊహూఁ. అలా చేయడానికి అహం అంగీకరించదు. ఇంకా ఏమూలో దురభిమానం ఉంది.'
