"సరేగాని, నువ్వు లోపలికి పో, శ్యామలా" అన్నాడు కూతుర్ని పద్మనాభం. శ్యామల విసవిసా వెళ్ళిపోయింది.
"అయితే వ్యాపారం బాగుందా, నాయనా?" పద్మనాభం మెల్లగా మాటలలోకి దించప్రయత్నించాడు అల్లుడిని.
"ఆఁ. ఏదో." ముక్తసరిగా అన్నాడు నారాయణ.
"పంపకాలుకూడా అయిపోయాయట!"
"ఊఁ."
"ఎంతొచ్చిందేమిటి మనకి?"
"ఇరవై ఎకరాలూ, ఈ మేడానూ."
"మరి శ్యామల కిచ్చిన కట్నం నలభై వేలూను?"
"ఎవరూ తినెయ్యలేదు. భద్రంగా బాంకిలో ఉంది." విసుగ్గా అరిచాడు నారాయణ. "తెలుసు. కట్నాలు పుచ్చుకున్నవాళ్ళు మళ్ళీ ఈ లెక్కలడిగించుకోవాలని."
"అయ్యో! అలా విసుక్కోకయ్యా. నీక్షేమం కోరేవాడినేగా? పంపకాలయ్యే టప్పుడు కావలసినవాళ్ళు నలుగురూ ఉంటారు. మరి యింత రహస్యంగా జరిగిందంటే - చిన్నపిల్లాడివి, నీకు అన్యాయం జరిగిందేమో నని."
"సక్రమంగా జరగనినాడు నలుగురి ప్రమేయమూను. మాకా అవసరంలేదు. మా నాన్నగారు ఎవ్వరికీ అన్యాయం చెయ్యరు. ఇక కన్నబిడ్డలకు చేస్తారా? వారికా భేదదృష్టి లేదు. ఆయన తండ్రి. మేం బిడ్డలం."
"అహఁ. కాదు మరీ? నేను మరో విధంగా అనలేదు. కానీ చూడు మరీ, అంత ఆస్తిలో ఇరవయ్యేనా నీకు వచ్చిందీ?"
"ఎంత రావాలంటారు?" తీక్షణంగా అడిగాడు నారాయణ.
"ఆడపిల్ల పెళ్ళికి ఓ ఏడెనిమిది వేలు కేటాయించినా యింకా చాలా ఉండాలే భూమీ, రొక్కమూనూ?"
"షటప్!" పొగరుగా నేలను కాలితో తన్నుతూ లేచాడు నారాయణ. "ఆడపిల్ల పెళ్ళికి ఏడెనిమిదివేలా? నువ్వు కూతురికి నలభై వేలిచ్చి చేసేవాడవూనూ -- మేము ఏడెనిమిదితో సరిపెట్టేవాళ్ళమూనా? లక్ష యిచ్చి చేస్తాం మా చెల్లెలికి. తెలుసా?"
"ఆఁ!"
"అవును. మర్యాదగా బయటకు నడు, అట్టే వాగక. నన్ను యుక్తిగా నావాళ్ళనుంచి విడదీయడమే కాకుండా మళ్ళీ ఈ కలతలు రేపాలని వచ్చావా? కడుపునా బుట్టిన ఒకర్నొక లాగా, ఇంకొకర్నొకలాగా చూచే బుద్ధిహీనులు కారు మా నాన్నగారు. ఆడవాళ్ళను ఆస్తికి దూరం చేసే మీబోటివాళ్ళకు బుద్ధి చెప్పడానికే గవర్నమెంటు ఆడవాళ్ళకు కూడా ఆస్తి హక్కులిచ్చింది. ఎవడి దయా ధర్మభిక్షమూ లేదు. కొడుకులతో సమంగా కూతుళ్ళూ చెక్కా ముక్కా పంచుకుపోతారు."
"కానీ, బిల్లు వచ్చినంతమాత్రాన..."
"గెటౌట్, నాకేం చెప్పకు. చూస్కో. ముందు నీపనే పట్టిస్తాను, నువ్వు నేర్పిన విద్యతో. అంత ఆస్తి పెట్టుకుని కూతురికి నలభై వేలే యివ్వదమేం? నీ ఆస్తిని నలుగు వాటాలు చేసి చూస్తే మాకు నువ్విచ్చినదికాక మరో నలభై రావాలి. త్వరలో మర్యాదగా ఇచ్చేయటానికి ప్రయత్నించు."
శ్యామల వచ్చింది మళ్ళీ. "అదేమిటి మా నాన్న నంత తేలికగా మాట్లాడుతారు?"
"అవును. ఇప్పుడు తెలిసింది, ఎవరి కెంత గౌరవమివ్వాలో. నువ్వైనా అంతే. నీ హద్దుల్లో ఉండు. లేకుంటే దయచెయ్యి."
"వెళ్తున్నానమ్మా. చాలు మర్యాద." కండువా దులిపి భుజాన్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు పద్మనాభం. రౌ ద్రాకారుడైన భర్తను చూచి జంకి కిక్కురుమనకుండా ఊరుకుంది శ్యామల.
"మాకు రావలసినది మర్యాదగా పంపేయ"మని అరిచాడు నారాయణ వెనుకనుంచి.
నారయణ మనస్సు రాజమండ్రి వచ్చి నప్పటినుంచీ కుదురుగా లేదు. ఏదో అవ్యక్త ఆందోళన నిరంతరం తినివేయసాగింది. ముఖ్యంగా శాంతి విషయంలో, శాంతి వృక్షాల విషయంలో తన అనుచిత ప్రవర్తన మాటిమాటికీ జ్ఞప్తికి వచ్చి సిగ్గిలచేస్తూంది. 'అపురూపంగా పెంచుకున్న చెల్లెల్ని, అల్లారుముద్దుగా చూచుకునే చెల్లెల్ని బొత్తిగా అంత దురుసుమాటలతో ఎలా నొప్పించగలిగాను? అయినా శాంతికి కోపం లేదు. నా క్షేమంకోరి దుర్మ్జుహూర్త ప్రయణం అపుజేసింది. వచ్చేటప్పుడుకూడా సాగనంపింది. అంత మంచి చెల్లెలు నాకు గనుక ఉంది - ఇంకెక్కడైనా ఉంటుందా?
'వదిన! ఎప్పుడూ నవ్వుతూ సహోదరిలాగా మాట్లాడి ఆదరించేది. ఆమెను ఎంత అల్పంగా మాట్లాడాను! అసలెందుకిలాగైపోయాను? ఎన్నడూ దూషించక, శిక్షించక అతి గారాబంగా పెంచిన అమ్మనూ, నాన్నగారినీ ఎంత అవివేకంగా ఎదిరించాను?
'నాన్నగారికంటే అధికంగా ప్రేమించి ఆదరించి లాలించే అన్నయ్యను చెయ్యి చేసుకున్న హీనుడిని. ఒక్కనాడైనా అన్నయ్య కూతుర్ని ముద్దుగా చేతులలోకి తీసుకోలేదు; ఏ బహుమానాలూ యివ్వలేదు. ఇంత పాషాణంగా ఎప్పుడు మరిపోయాను నేను?
'నాలాగే శాంతికూడా ఆ యింటి బిడ్డ. ఆ తల్లిదండ్రుల పట్టి. దానికి ఆస్తి యిచ్చి నందుకు కోపగించుకున్నాను. కాని అది ఇంట్లో అందరి ఎడలా చూపించే ప్రేమానురాగాలకూ, ప్రసాదించిన శాంతి సౌభాగ్యాలకూ యివ్వగల ప్రతిఫల మేముందసలు? న్యాయంగా నా ఈ చేతిలో ఉన్న వ్యాపారమంతా దానికి చెందాలి. నేను అన్యాయంగా ప్రవర్తిస్తున్నాను.
'ఇచ్చేస్తాను. దాని భాగం దాని కిచ్చేస్తాను. అన్ననై ఉండి చెల్లెలికి ఏమైనా యిచ్చేదిపోయి దాని ఆస్తి అఫహరించడంకంటే నైచ్యముందా?'
* * *
అందమైన ఏ దృశ్యం చూచినా శాంతికి చిత్రలేఖనమూ, రాజా, చిత్రాలూ అనేకం గుర్తు వస్తాయి. మనస్సంతా విషాదంతో నిండిపోతుంది.
నదీ ప్రవాహాల గలగలలలో ఏదో సందేశం వినవస్తుంది. నదీతీర విహారంలో దక్షిణేశ్వరమూ, గంగానదీ, రజతో తొలిపరిచయం, మనస్సును కట్టివేసే అతడి మధుర సంభాషణా, చిరుదరహాసమూ గుర్తుకువస్తాయి. అప్రయత్నంగానే నేత్రాలు బాష్పపూరితమౌతాయి. కలకల కూజితాలతో తోటలో విహరిస్తూన్న పక్షులనూ, తోటలోని పూలనూ చూస్తూంటే రాజా గృహప్రాంగణంలోని పూలమొక్కలూ, తెల్లగులాబీల విషయంలో తమ యిద్దరి మధ్యా జరిగిన హాస్య ప్రసంగమూ మనస్సులో మెదిలి ఆ చింతనలో పరిసరాలే మరిచిపోతుంది. మరుక్షణమే అదంతా గత గాధగా గుర్తించి అంబరానవిహరించే ఆనందడోలాయమానసం అతి విషాద పూరితమై అధఃపతనమౌతుంది.
'ఆకసాన విహరించే ఆ మేఘాలు బహదూరంనుండి పయనించి వచ్చిన బాటసారులు ఎన్ని ఊళ్ళు చూచాయో! ఎన్ని నదీనదాల నధిగ మించి పయనించాయో! ఎందరు వ్యక్తుల్ని చూచాయో! రాజానుకూడ చూచి ఉంటాయి; అతడి విషయాలు వాటికీ తెలుస్తాయి. కాని ఆ భాష్ నాకు అపరిచితమే!' అని మనస్సు ఆక్రోశిస్తుంది. నదీగర్భాన తిరుగాడే నావలు నౌకా విహార ప్రియుడైన ఆ మిత్రుడిని కట్టెదుట సాక్షాత్కారింపజేసేవి. ఆ వెనువెంటనే అనేక ఆలోచనలు, బాధలు, అశ్రువులు! 'భగవాన్! ఎంతకాల మీ కన్నీటి పరంపర? ఎన్నాళ్ళీ చింతా మగ్న జీవితం? ఎప్పటికి ఈ విషాదగాధకు నిష్కృతి? నిరంతరం అలమటించే ఈ నిరాశా హృదయానికి ఉపశమన మెప్పుడు ప్రసాదిస్తావు? ఎప్పుడు? ఎప్పుడు??'
ఆ ఆక్రోశించే అంతరంగాన్ని అలరింపజేయగలిగినది ఒక్కటే - ప్రశాంతి పరిచర్య. ఆ పసిపాప ముగ్ధహాసం!
"శాంతీ! మరీ అంత చిక్కిపోతున్నావేమిటి?" అనడిగాడు శ్రీహరి ఒకనాడు.
"లేదన్నయ్యా. బాగానే వున్నాను."
"నీ మనస్సులో బాధ నాకు తెలుసు, శాంతీ. కాని యిలా కృశించిపోతే ఏం ప్రయోజనం చెప్పు?"
"......."
"బొత్తిగా స్నేహితులూ లేక, ఏమీ వ్యాపకమూ లేక అదే దృష్టిగా వుంటున్నావనుకుంటాను. పోనీ యేమైనా పరీక్షలకు కట్టకూడదూ ప్రైవేట్ గా?"
నవ్వింది శాంతి. "ఇప్పుడింకా చదువేమిటి నాకు? అయినా నాకు పని లేకపోవడమేమిటన్నయ్యా? ప్రశాంతి సంరక్షణా, నాన్నగారి సేవా, తోటపనీ......"
"ఏమో, శాంతీ? నాకీ ఉద్యోగంలో ఆ వూరూ, ఈ వూరూ తిరగడంతోనే సరిపోతుంది. మీ ఎవ్వరి సంగతీ పట్టించుకోవటంలేదు. అమ్మకు యిటువంటి వేమీ తెలియవు. నాన్నగారి మట్టుకు నాన్నగారూ, నీమట్టుకు నువ్వూ యిలా లోలోపల కృశిస్తున్నారు. ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు. నాకూ బాధగానే వుంది మరి. రాజా విషయమై ఆరాలు తీస్తూనే వున్నాను. అతడెక్కడో ఒకచోట క్షేమంగానే ఉంటాడని నా గట్టి నమ్మకం."
కన్నీరాపుకుంటూ అధోముఖియై నిల్చుంది శాంతి మౌనంగా.
పద్మవచ్చింది, "శాంతికి చెప్పారా?" అంటూ.
"ఏమిటి?" అంది శాంతి తలెత్తి.
శ్రీహరి చెప్పాడు: "ఆఫీసులో స్నేహితుడొకడు కారు అమ్మేస్తూంటే నేను తీసుకుంటానని చెప్పాను, శాంతీ. నల్లరంగు. ఓపెన్ టాప్. మంచి కండిషన్ లో వుంది. చాలా బాగుంది. అమ్మా, నాన్నగారూ సరేనన్నారు. నీకుకూడా చెప్దామనీ."
చిన్నగా నవ్వింది శాంతి. "పెద్దవాళ్ళు. మీ అందరి యిష్టప్రకరం కానీయండన్నయ్యా. నాకేం తెలుస్తుంది? అయినా బాగానే వుంటుంది, నువ్వు రాజమండ్రి వెళ్ళతనికీ, రావటానికీ."
"నాకోసం కాదు, శాంతీ. నాకు స్కూటర్ వుండనే వున్నదిగా? నీకోసమే. కాస్త సాయంత్రం వేళల అలా షికారుగా ఎటైనా తిరగడానికీ, టౌనుకు పోయి అప్పుడప్పుడు ఏ పిక్చరైనా చూడటానికీ వీలుగా వుంటుంది. నీతో నాన్నగార్ని కూడా తీసుకువెళ్తే కాస్త ఆలోచనల మార్పు కలుగుతుంది. ఆరోగ్యంగానూ వుంటుంది."
శాంతి ఆశ్చర్యం అవధులు దాటిపోయింది. నేత్రాలు చెమర్చాయి. "నీకెంత ప్రాణమన్నయ్యా నేనంటే?" అంది అతడి గుండెలపై వాలి.
