59
శాంతీ, రాజా శ్రీహరి గదిలోకి వెళ్ళబోతూండగా ఏదో తీవ్ర వాదన విన్పించి ఆగిపోయారు.
"ఎందు కిష్టం లేదో చెప్పమ్మా, జయా." అనునయంగా అడిగాడు శ్రీహరి.
"కారణం ఉంది. కాని నేను చెప్పలేను. ఇప్పుడు వెళ్ళిపోవాలి నేను. రామన్నను తీసుకు వెళ్ళిపోతాను." అది జయ గొంతు.

"రామన్న ఎందుకు? నేనే తీసుకువెళ్తాను. కాని కారణం చెప్పనిదే మాకెలా తెలుస్తుంది? అవతల పెద్దమనిషితో వ్యవహారం" అన్నాడు శ్రీహరి.
"ఏమిటో మీకే తెలుస్తుంది. తర్వాత."
"నిన్నటికీ, ఇప్పటికీ ఏమిటి నీలో మార్పు? ఏమైనా భూతమావేశించిందా?" విసుగ్గా అడిగింది పద్మ. "ఇది చిన్నపిల్లల ఆట కాదు. చేసే పనికీ, అనే మాటకూ అర్ధం ఉండాలి" అంది తీవ్రంగా.
"లేదు. ఆవేశించినది వదిలింది. యథార్ధం తెలుసుకొన్నాను. అదృష్టవంతురాల్ని."
"అయితే రాజా విషయంలో ఏమైనా అన్మనమా నీకు, జయా?" నివ్వెరపోతూ అడిగాడు శ్రీహరి. "నా స్నేహితుడని చెప్పటం కాదు. అతడు నిప్పువంటి మనిషి. నువ్వు అదృష్టాన్ని త్రోసివేస్తున్నావు, అనాలోచితంగా మాట్లాడి."
జయనుండి సమాధానం లేదు.
పద్మ కోసం అవధులు దాటిపోయింది. "నిన్న తీరి కూర్చుని నాన్నగారికి టెలిగ్రాం యిచ్చావ్. ఏ గొడవా ఎరుగని రాజాను కదిపి అడిగించావ్. ఏ కళ నున్నాడో అంగీకరించాడు. ఇప్పుడిలా మాట్లాడతావా? అన్నిటికీ నీ యిష్టమేనా? ఇదేమన్నా చిన్నపిల్లల ఆటా? నీకసలు మనిషి విలువ తెలియకుండ ఉందనుకుంటాను. నీకూ, రాజాకూ నక్కకూ, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది, తెలుసా?"
"అక్కయ్యా!"
"అవును. ఇంటికి కాదు, ఇప్పుడు నిన్ను పిచ్చాసుపత్రికి పంపించాలసలు." కోపంగా అరిచింది పద్మ.
"రెచ్చిపోకు పద్మా." వారించాడు శ్రీహరి.
"రెచ్చిపోవడమా? మనస్సు మండిపోతోంటే. విద్యావంతుడు, రూపవంతుడు, ఐశ్వర్యవంతుడు, గుణవంతుడు! ఎక్కడ ఎవతె పూజిస్తోందో, సువర్ణ పుష్పాలతో! ఈ బుద్దిహీనులందరికీ అతడి విలువ తెలియవద్దూ?" అందులో శాంతిపైకూడ నింద నిబిడీ కృతమై ఉంది.
"అందులో మొదటి మూడే నిజం." నిర్లక్ష్యంగా నవ్వింది జయ. "చాలా తెలివిగా వెనకేసుకొస్తున్నావులే, అత్తవారింటి గుట్టు బయటపడకుండా. నీకు చెల్లెలికంటే ఆడబిడ్డ ఎక్కువై పోయింది కదూ? ఇదివరకు విని ఏమో అనుకున్నాను కాని ఇంత గ్రంథం జరిగిందని నాకు తెలియదు. శాంతికి రాజా ఈమధ్య వ్రాసిన ఉత్తరం శ్యామల దగ్గర చూచాను. చాలా? పాపం, అందరితోనూ ప్రణయం సాగించుదామనుకున్నాడు కాబోలు! ఓ ప్రక్క శశీ, ఓ ప్రక్క శాంతీ, యింట్లో నేనూ ఉంటామనుకున్నాడు కాబోలు!"
"ఛీ నోర్ముయ్." ఒళ్ళు తెలియని కోపంతో అంది పద్మ.
"అవును రహస్యం దాగినన్నాళ్ళే. బయట పడితే మీరంతా చెయ్యవలసిన పని అద్. పెళ్ళి వద్దని గీరబోయే ఆడపడుచు ఘనకార్యాలతో ఎటూ నోరు మూసుకోవాలి. మధ్యన నా జీవితం తగలెయ్యటం దేనికి? రాజా యింత నీచుడనుకోలేదు. ఒక ప్రక్క ఆవిడతో షికార్లూ, మాటలూ, నవ్వులూ ఇటు నన్ను చేసుకుంటానంటున్నాడు. శ్యామల నన్ను కాపాడింది." దురుసుగా తలుపు తీసుకుని వచ్చేసింది జయ ఈవలకు. ఎదురుగా కన్పించిన శాంతిని చూచి చీత్కారం చేస్తూ వెళ్ళిపోయింది.
గదిలో పద్మా, శ్రీహరీ నివ్వెరపోయి నిల్చుని పోయారు. బయట శాంతి స్థితీ అలాగే ఉంది. "ఎంత పని జేసింది శ్యామల కడకు?" అంటూ ప్రక్కకు చూచింది. అక్కడ రాజా లేడు! ఎవ్వరికీ ముఖం చూపలేక రెండు చేతులతో ముఖం కప్పుకు పరుగెత్తింది తన గదికి. దారిలో గోవిందు ఎదురుపడి, "అత్యవసరమైన పని ఉందట. రాజాగారు వెళ్ళిపోయారు. చెప్పి వెళ్ళనందుకు ఏమీ అనుకోవద్దు అన్నారు" అని చెప్పాడు.
"వెళ్ళి అన్నయ్యతో చెప్పు" అంటూ వేగంగా పోయి తన ప్రక్కమీద పడ్డది. ఆమె హృదయ స్థితి శబ్దస్వరూపాలకు అందనిది.
60
"ఏమిటో ఏమీ తోచకుండా ఉంది. పల్లె టూరైనా అక్కడే చాలా హాయిగా గడిచిపోయేది కదూ?" అన్నాడు నారాయణ ఒక నాడు.
"ఛీ! అక్కడ బాగేమిటి? ఓ వింత లేదు. వినోదం లేదు. క్లబ్బూ లేదు. సినీమా లేదు. నాకిక్కడే బాగుంది" అంది శ్యామల.
"అయితే ఆనందమంతా వాటిల్లోనే ఉందంటావ్?"
"అబ్బే లేదు. అడుగడుగునా మీ అమ్మా, నాన్నా పెట్టే ఆంక్షలలో ఉంది." గొంతులో హేళన ధ్వనించింది.
"ఎందుకు, శ్యామలా, అలా తేలికగా మాట్లాడతావ్? మనమే తొందరపడ్డామనిపిస్తోంది. వచ్చేముందు ఎవ్వరితోనూ చెప్పి కూడా రాలేదు మనం. రామన్న దుఃఖం మరిచి పోదామన్నా మరపుకు రావటంలేదు."
"అయ్యో, పాపం! పోనీ, అక్కడే ఉండలేక పోయారా? ఎందుకొచ్చినట్టు? ఏదో నాకే అక్కడికి యిలా రావటం యిష్టమైనట్టూ, మిమ్మల్నేదో బలవంతంగా నేను తీసుకొచ్చి నట్టూను?" ఈసడిస్తూ లేచిపోయిందక్కడి నుంచి శ్యామల.
మర్నాడు నారాయణ నిద్ర లేచేసరికి శ్యామల యింటి దగ్గర లేదు. తర్వాత పదకొండున్నరకు వచ్చిన శ్యామలను చూచి "ఎక్కడికెళ్ళావ్, శ్యామలా?" అనడిగాడు నారాయణ.
"అలా వూరు చూడ్డానికి."
"ఒంటరిగానా?"
"ఏం, పిల్లెత్తుకుపోతుందా?"
"అది కాదు. కొత్త ప్రదేశం కదా అని."
"ఏం ఫర్వాలేదు ఆ వెధవ పల్లెటూళ్ళో ఉండీ ఉండీ విసుగెత్తి పోయింది."
"అది సరేలే. కాని నిన్నా మొన్నా యిద్దరం కలిసి చూశాం కదా? మళ్ళీ యివ్వాళ దేనికీ? ఇంకేమున్నాయి చూడవలసినవి?"
"ఏమిటీ అడ్డుదిడ్డు ప్రశ్నలు? ప్రతి పనికీ మీకు సంజాయిషీ చెప్పుకోవాలేమిటి?" విసుక్కుంది.
"అంతేకాని ఎందుకడుగుతున్నావో ఇప్పటికైనా గ్రహించావ? పన్నెండైంది. ఇంత వరకూ నాకు తిండీ తిప్పలూ లేవు."
"ఏం? వంటవాడు చచ్చిపోయాడా? నేనే పెట్టాలా?"
ఆశ్చర్యపోయాడు నారాయణ. "నీ ధోరణేమిటో నా కర్ధం కావటంలేదు, శ్యామలా. ముందు యిల్లూ, వాకిలీ. ఆపైన ఊరూ, వాడా. అంతేకాని యిదెక్కడి ధోరణి? ఉదయం ఏడుగంటల కెళ్ళినదానిని యిప్పుడొచ్చావు. సిగ్గుపడవలసిందిపోయి పైగా అడిగితే విసుక్కుంటున్నావా?"
"బాగుంది. సిగ్గుపడడం దేనికి? ఊళ్ళో ఏదైనా క్లబ్బుందేమో ఆడవాళ్ళకని కనుక్కున్నాను. ఏవో ఒకటి రెండున్నాయి. ఒకదానితో జేరడానికి వెళ్ళాను. అక్కడ బాడ్ మింటన్ ఆడుతూంటే టైము తెలియలేదు."
"బాగుంది చాలా భేషుగ్గా ఉంది."
శ్యామలకు కోపం వచ్చింది. "ఏమిటా హేళన? కాకినాడలో రోజు ఆడుకునేదాన్ని, ఇంట్లోనో, క్లబ్బులలోనొ ఎక్కడో ఒకచోట. ఇన్నాళ్ళూ ఆ పల్లెలో పడవేసి ఉంచినందుకు మీరే సిగ్గుపడాలి."
"నేనూ కాదు, నువ్వూ కాదు. మీ నాన్న."
రోషంగా లేచింది శ్యామల. "మధ్యన ఆయన పేరు దేనికి? పెద్ద కట్నంతో నన్ను మీకు యిచ్చినందుకా?"
హేళనగా నవ్వాడు నారాయణ. "మీవాళ్ళ వంటే అంత కోపమొస్తోందా? మరి అడుగడుగునా మావాళ్ళ పేరెత్తుతావు దేనికీ?"
"కారణముందిగనుక. మావాళ్ళు మిమల్నేం చేశారు గనుక, మీరనడానికి?"
"వీళ్ళలో కలిసుంటే స్వేచ్చ లేదని నువ్వు దుగాడుగునా ఒక నరకం సృష్టిస్తోంటే కాదూ విడిపోయి వచ్చింది? రోజుకోరకం చాడీలు చెప్పి నా మనస్సును విరిచేసి వాళ్ళతో పోట్లాటలు పెంచావు. మీ నాన్న నోరిపోసే వన్నీ మీ నాన్న నూరిపోశాడు - విడిపొమ్మనీ, ఉద్యోగం మానేసి యింటిపట్టునుండి వ్యాపారం హస్తగతం చేసుకొమ్మనీను. అందుకేగా నిక్షేపం లాంటి ఉద్యోగం ఎవ్వరికీ చెప్పకుండా వదిలేసుకున్నాను? మీ మాటలు నమ్మినందుకు పల్లె టూళ్ళో పడవేసి ఉంచానని దెప్పుతున్నావా? సిగ్గు లేదూ?"
"ఇప్పుడసలు మీవాళ్ళనుంచి విడిపోయి వచ్చేశామానా మీ బాధంతా?" కటువుగా అడిగింది శ్యామల.
"అట్టే అడ్డు సవాళ్లు వెయ్యక ముందు భోజనం విషయం చూడు. నువ్విలా యిష్టప్రకారం తిరిగి, నన్ను ఆడించుదామనుకొంటే మాత్రం కుదరదు."
"మీరిలా వంటమనిషిని చూచినట్టు చూస్తానంటేమాత్రం అసలు కుదరదు." పెంకెగా అంది శ్యామల.
"ఇంట్లో వాళ్ళ ఆలనా పాలనా చూచే వారందరూ వంటవాళ్ళూ, దాసీవాళ్ళేనా? మా అమ్మ, వదిన, శాంతీ ఎలా ఉంటారు?"
"ఆ బ్రూట్స్ సంగతి నాదగ్గర ఎత్తవద్దు."
"శ్యామలా!" గర్జించాడు నారాయణ. "నీ హద్దుల్లో నీవుండు. జాగ్రత్త."
నవ్వుతూ నవ్వుతూ ప్రారంభించిన సంభాషణ శ్రుతి మించిపోయింది. ఇక యిద్దరూ కూడ భోజనం చేయలేదు. మౌనంగా ఎవరి గదులలో వారు పడుకున్నారు.
61
ప్రయాణంనుండి తిరిగివచ్చిన శ్రీహరి నిరాశావదనంతో చెప్పాడు: "రాజా అసలింటికి వెళ్ళలేదట. అతడి రైతులందర్నీ అడిగాను. చుట్టుపట్ల అతడికి పొలాలున్న వూళ్ళనీ వెళ్ళాను. ఎక్కడా ఆచూకీ తెలియలేదు. ఈ సాయంత్రం బయల్దేరి మళ్ళీ కలకత్తా వెళ్తాను."
"అవసరం లేదు. అక్కడా లేడట. వ్రాసిన ఉత్తరం తిరిగి వచ్చింది. బెనర్జీగారికి నువ్వు వ్రాసినట్లు వ్రాశాను. ఆయనా అలాగే వ్రాశారు" అంది శాంతి.
"ఉస్సు" రంటూ కూలబడ్డాడు శ్రీహరి. "ఇంతకూ నా పాపిష్టి స్నేహం యింతవరకూ తెచ్చింది. ఛీ ఛీ" అని నుదురు కొట్టుకున్నాడు.
"ఫర్వాలేదు. ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటాడు. నత ఉత్తముడిని దైవమే కాస్తాడు." నిండు హృదయంతో, గొప్ప ధైర్యంతో అంది లక్ష్మీదేవి.
ఒక విధమైన సంతోషంతో, సంతృప్తి తో అన్నాడు శ్రీహరి: "అవును. చల్లని తల్లివి. నీ నోటి ఆశీర్వాదమే అక్షరాలా సార్ధక మౌతుంది. ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటాడు. అంతే చాలు. ఇక మళ్ళీ ఎప్పుడూ అతనితో జోక్యం తెచ్చుకోను." రెండు చెంపలూ వాయించుకుంటూ లేచిపోయాడు శ్రీహరి.
పద్మా, శాంతీ నిశ్శబ్దంగా కళ్ళొత్తుకున్నారు.
62
నారాయణ దేవీపట్నం వెళ్ళి కొబ్బరికాయ వర్తకులతో మాట్లాడి తిరిగి వచ్చేసరికి శ్యామల ఇంటిదగ్గర లేదు. 'ఊళ్ళోకి వెళ్ళీ యింటికి వెళ్ళలేదు; ఎవ్వరితోనూ మాట్లాడలేదు' అనే బాధతో యిల్లు జేరిన అతడికి శ్యామల మరీ చికాకు కలిగించింది, ఇంటి దగ్గర కన్పించకుండా. వంటమనిషి వడ్డించగా చీకాకుతో పడుకున్నాడు, తిని. సాయంత్రం అతడు నిద్ర లేచేసరికి శ్యామల కన్పించింది. "ఎక్కడికెళ్ళావూ?" అంటూ లేచి వరండాలోకి వచ్చిన అతడికి మామగారు పద్మనాభం కూడా కన్పించాడు. "మీరెప్పుడొచ్చారు?" మర్యాదగా పలుకరించాడు.
"మూడు గంటలకి. అమ్మాయీ, నేనూ కలిసే వచ్చాము."
నొసలు చిట్లించాడు నారాయణ. "అయితే నువ్వు కాకినాడ వెళ్ళావా, శ్యామలా?"
"అవును."
"అయితే నాకు చెప్పక్కర్లేదా?"
"మీరు పనిమీద వెళ్ళారు. ఎలాగూ ఊళ్ళో లేరు కదా అని వెళ్ళాను. ఇవ్వాళే వచ్చే శానుగా? ఈమాత్రందానికి చెప్పడం దేనికి?"
"అయితే ఇలా యిష్టంవచ్చినట్టు తిరుగుతావన్నమాట?" ఎదుటనే మామగారున్నారన్న సంగతికూడ విస్మరించి తీక్షణంగా అడిగాడు.
"మీరు ప్రతిదానికీ యిలా కోపం తెచ్చుకొంటే కష్టం. ఒక్కత్తినీ యింట్లో కూర్చుని చేసేదేముంది, ఎటూ వెళ్ళక? వెధవ బస్సు మూలాన కొంచెం ఆలస్యమైంది" అని తండ్రి వైపు తిరిగి "మంచి కారు బేరం చెయ్యి, నాన్నా కొనుక్కుంటాం" అంది.
నారాయణ కోసం మితిమీరిపోయింది. "ఏఁ, అదెక్కి సినీమా స్టార్ లా తిరుగుతుంటావా? అప్పుడిక నేనే నీకు వంట చేసి పెట్టాలి!"
"చూశావా, నాన్నా, ఇదే తంతు" అంది శ్యామల తండ్రితో ఫిర్యాదుగా.
పద్మనాభం మాట్లాడటాని కవకాశం చిక్కింది. "అదేమిటయ్యా? ప్రతిదానికీ అలాగే సాధిస్తున్నావట? ఎంతో ప్రేమగా ఉండేవాడి విలాగెందుకైపోయావు? చదువు కున్న పిల్లకదా? మరీ ఎలాగో ఉండమంటే ఎలా?"
"మీ అమ్మాయి ఒక్కత్తే చదువుకోలేదు. చదువుకున్నవాళ్ళంతా యిలాగే ఉంటారా? ఇంతకూ మిమ్మల్నివన్నీ అడగమనే తీసుకొచ్సిందా?" తీవ్రంగా అడిగాడు నారాయణ.
"అబ్బే, లేదు." పద్మనాభం కంగారు పడ్డాడు. "ఏదో క్రొత్త కాపురం కదా, చూద్దామని వచ్చాను."
శ్యామలకు కోపం వచ్చింది. "మా నాన్నేమీ గతిలేక రాలేదు. అలా మాట్లాడతారేమిటి?"
"నువ్వు అందరితోనూ అలాగేగా మాట్లాడతావ్? అప్పుడుండదా ఈ విచక్షణా జ్ఞానం?"
