Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 55


    "నా జీవితానికీ, వాటికీ తేడా లేదనిపించింది. సమాచారంకోసం- సమస్య పరష్కారంకోసం నా జీవితానికే పరీక్ష పెట్టాను. వెంటనే నదివైపుగా నడిచాను. రామన్నకూడా వచ్చాడు. ఇద్దరం పడవలో ఎక్కి కొంతదూరం వెళ్ళడం, నా ఊహకు తగ్గట్టుగానే పెనుగాలి రేగడం జరిగింది. మేఘాలతో చీకటైపోయి, మెరుపు లతో, ఉరుములతో భయంకరంగా మారిపోయింది వాతావరణం. నది అలలు ఆకలితో ఎగసి పడుతున్నాయి. ఏ క్షణాన్నైనా ములిగిపోయేటట్లుంది నావ. రామన్న ఏడ్చే పర్యంత మైపోయాడు. పడవవాడూ, రామన్నా కలిసి శత విధాల ప్రయత్నించినా ఎక్కడా లొంగటం లేదు. ముగ్గురం నిర్ధారణ చేసుకొన్నాం - మునిగి పోవటం తథ్యమని. ఆ సమయంలో నాకు అమ్మా, నాన్నగారూ, మీరూ, అన్నయ్యలూ, గోవిందరావూ- అందరూ కళ్ళెదుట నిల్చారు. అందర్నీ సుఖంగా వుండేట్లు ఆశీర్వదించమని ఆఖరికోరికగా భగవంతుడిని ప్ర్రార్ధించాను. మరణానికి సిద్దమయ్యాను.
    "ఆశ్చర్యంగా, అంతలో ఒక లాంచీ అటుగా వచ్చింది. అందులో పెద్ధన్నయ్య వున్నాడు!"
    "ఏమిటిదంతా, శాంతీ!" భయాందోళనలతో అడిగాడు రాజా.
    నిశ్చలంగా అంది శాంతి: "జరిగిపోయిన యదార్ధగాధ. ఎందుకంత ఆవేశపడతారు? ఇప్పుడు కంగారు పడక్కర్లేదు. సరే. ఆతర్వాత ఏం జరిగిందో చెప్పనక్కర్లేదేమో! లాంచీలో ఎక్కించుకు వెళ్ళిపోయారు, పడవ లాంచీకి కట్టేసి.
    "రోజూ స్కూటర్ పై వచ్చే అన్నయ్య ఆవేళ లాంచీమీద వస్తున్నాడు. ఏమిటంటారు? అన్నయ్యే లేకుంటే ఆ లాంచీ డ్రైవరు మా దగ్గరకు రాకపోవటం. అన్నయ్యకూడా మీలాగే చలించిపోయాడు అంతా విని. కాని నా మనస్సు అప్పటినుంచీ ప్రశాంతంగా వుంది. దైవంపై భారంవేసి, మానవప్రయత్నం పూర్తిగా వదులుకోవటం మంచిదని నిర్ణయించుకున్నాను. ఏం జరిగినా విచారించను. ఆ ఆత్మస్థైర్యంతోనే గోవిందరావు తర్కించినా అంత దైర్యంగా వుండగలిగాను. ఇప్పుడింత జరిగినా యింత నిశ్చలంగా మాట్లాడగలుగుతున్నాను. ఒకవేళ బాధ కలిగినా అది తాత్కాలికావేశం మాత్రమే. మనస్సు నే బాధలూ అంటటంలేదు. ఎవరిపైనా కోపం రావటం లేదు."
    రాజశేఖరం మనస్సులో కలిగిన తీవ్ర సంచలనం విపరీతంగా చలించుతూన్న అతడి నేత్రాలలో, ముడిపడిన అతడి కనుబొమలలో ప్రత్యక్షంగా కన్పించింది. కొంతసేపటి వరకూ ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత క్షీణ స్వరంతో అన్నాడు: "అంతటి అతీతావస్థను పొందగలగడం ఒకవిధంగా అదృష్టమే. కాని అందులో అతిప్రమాదం కూడ వుంది, శాంతీ. అవధులు మించిన ఆవేదనకూ, నిరాశకూ చిహ్నం అది. అందువల్ల మనస్సు నావరించే నిర్వేదం ఎంత బాధాకరమైనదో గ్రహించలేకపోతున్నారు మీరు."
    ".........."
    "దీనికి నేనే కారణం కాకపోయినా ఒక విధంగా నేనూ కారణమే అని బాధగా ఉంది."
    "కాదు. ఎవరూ కారణం కాదు. కేవలం స్వయంకృతం."
    "ఇంకెప్పుడూ అలా చెయ్యరు కదూ?"
    "....."
    "చెప్పండి, శాంతీ. లేకపోతే ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నాకు శాంతి ఉండదు."
    "ఇదివరకే చెప్పాను. మరిచిపోయారా? కలకత్తాలోనే మీకామాట ఇచ్చివచ్చాను."
    "ఆ వాగ్దానం ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా కృతజ్ఞుడిని."
    "మీకూ మాట యిచ్చాను; పెద్ధన్నయ్యకూ వాగ్ధానం చేశాను. నాన్నగారితోనూ అన్నాను - ఆయన కోరిక తీరుస్తానని. ఇంకెక్కడికి పోతానులెండి. అందరికోసమే నా జీవితం. అందరి ఆనందమే నా ఆనందం."
    శాంతి చెక్కిళ్ళమీదుగా జలజలా రాలిపోతున్న కన్నీళ్ళను తుడవటానికి ఆవేశంగా ముందుకు వచ్చిన రాజా చెయ్యి మళ్ళీ విచక్షణా జ్ఞానం మేల్కోవద్మ్తో చటుక్కున వెనక్కు పోయింది.
    "ఏడ్వవద్దు, శాంతీ. ఏడ్చినందువల్ల పోయే సామాన్యమైన బాధ కాదు ఇది" అన్నాడు. ఆ మాటలలోనే అతడి బాధంతా వ్యక్తమౌతూంది.
    "ఏడవను." కళ్ళు తుడుచుకుంది శాంతి. "అయినా నాకీ శాస్తి కావలసినదే. మీ హృదయ మంతా నింపి యిచ్చిన చిత్రాలలోనైనా మీ ప్రేమను తెలుసుకోలేకపోయాను. కడకు మీకు తిరిగి ఏమైనా బహుమతి యివ్వాలనే జ్ఞానంకూడ లేకపోయింది. ఇప్పుడనుకుంటున్నాను-అంత మూర్ఖంగా ఎలా ప్రవర్తంచగలిగానా అని! మీరెంత బాధపడతారో అని కూడా యోచించక గోవిందరావు తో నా వివాహం గురించి మీతో చర్చించాను. పైకి అంత నిర్మలంగా ఉన్నా మీలో ఎంత బాధ చెలరేగగలదో యిప్పుడిప్పు డూహించుకోగలిగాను. ఇందుకు నా కిదే తగిన శిక్ష."
    "లేదు, శాంతీ. తెలియక అలా ప్రవర్తించారు కాని, అందులో బుద్దిపూర్వకంగా మీరు చేసినది మాత్ర మేముంది? ఎందుకు మిమ్మల్ని మీరే అలా నిందించుకుంటారు?"
    "ఉండండి, రాజశేఖరంగారూ. ఈనాటితో మన ప్రేమగాధ సరికదా! మనస్సు విప్పి మాట్లాడనివ్వండి. మీ మార్దవ హృదయాన్నర్ధం జేసుకోలేని నా మూర్ఖ ప్రవర్తనకు క్షమాపణలు చెప్పుకోనివ్వండి. ఇక ఎప్పటికీ తిరిగి యిలా మాట్లాడుకొనగల స్వేచ్చ ఉండదు కదా! మీరు సదుద్దేశ్యంతో యిచ్చిన సలహాలనూ, ఉన్న్థతమైన మీ ప్రవర్తననూ అర్ధం చేసుకోలేకపోయాను. ఇప్పు డర్ధం చేసుకొన్నాను. కాని, సమయం మించిపోయింది. అయినా నాకు బాధ లేదు. ఒక ఉత్తమ స్నేహితుడుగా ఎప్పుడూ నా హృదయంలో అగ్ర స్థానం ఉంటుంది మీకు. ఎటువంటి పరిస్థితులలోనైనా గర్వంగా మిమ్మలి తలుచుకొని ఠీవిగా నిలబడగలను."
    "అంతేకదా, శాంతీ! కడకు మిగిలేవీ జ్ఞానకాలేగా?" బాధగా అన్నాడు. "చిత్రకళలోనైనా మనల్ని మనం మరువ ప్రయత్నించాలి."
    నిర్జీవంగా నవ్వింది శాంతి. "అదే ఆశ్చర్యం. కొంతకాలం యీ చిత్రాలు తప్ప లోకం ఉండేదికాదు నాకు. రాత్రింబవళ్ళు అదే ధ్యాస. అవే ఆలోచనలతో, పరిశ్రమతో గడిచిపోయేది. ఇపుడు అనేక బాధలనూ, విషాదాలనూ రేపే ఆ చిత్రాలను ప్రయత్నపూర్వకంగా మరిచి పోయి దూరంగా పారిపోవలసి వస్తోంది.  ఏ శాంతిని కోరుకొన్నావో అదే గగనమైంది. పన్నెండేళ్ళ ప్రాయంనుంచీ చూడకుండానే కలలుగని మురిసిపోయిన శాంతినికేతన్ విద్యాభ్యాసం ఫలించనేలేదు. పూతలోనే మాడిపోయింది. ఆ శాంతినికేతనాన్ని తలుచుకొంటేనే మనస్సు అశాంతిస్థావరమైపోతోంది."
    "అవును, శాంతీ. కొన్ని కలలు కలలుగా నిలిచిపోతేనే తృప్తిగా ఉంటుంది. యదార్ధంలో వూహాలోకపు రామణీయకతా, సౌఖ్యమూ లభించవు. హృదయంలో లేని శాంతిని ఎక్కడా పొందలేము. అందుకే చెప్పాను నేను, మీరు కలకత్తాలో ప్రథమంగా మా యింటికి వచ్చినప్పుడు - జీవితసత్యాలు కఠోరమైనవని. ఎదలో భావానికి రూపకల్పన చేయనిదే నిద్ర పట్టదన్న మీ మాటకు సమాధానంగా అన్నా నా మాట. గుర్తుందా?"
    "ఉంది."
    "రామన్న అటు వచ్చాడు, "మిమ్మల్ని పెదబాబు పిలుస్తున్నారు" అంటూ.
    "సరే, ఫద." ఇద్దరూ లేచి గృహాభిముఖులయ్యారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS