Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 53


    కబురు అందిన రాజా, నిల్చుని, వడివడిగా నడిచి తనను సమీపిస్తూన్న శాంతిమీద దృష్టి నిలిపాడు.
    "ఏమిటి?" అడిగాడు శాంతిని.
    "నదిమీదకు వెళ్తున్నారా?"
    "కాస్సేపు తిరిగివద్దామని."
    "మానేయండి ఇక్కడే కాస్సేపు కూర్చుందాం."
    "........."
    "ఏం, మాట్లాడరు?"
    "అవసరమంటారా?"
    "అవసరమౌనో, కాదో మీకు తెలుసు. ఎందుకిలా ఒకరినుంచి ఒకరు పారిపోవటం? జరిగేవి ఎలాగూ జరుగుతున్నాయి, మన వూహా వుద్దేశ్యాలకు అతీతంగా. ఇంతకాలమూ ఒక స్నేహమూ, స్వాతంత్ర్యమూ అంటూ వుండేవి. ఇకమీదట అవికూడా ప్రత్యేక పరిధులలోకి తప్పుకుంటాయి. ఇదివరలో యిద్దరిమధ్యా యేవో తెరలు ఉండేవి. ఆ తెరలు తొలగి యిప్పుడు పటిష్ఠమైన గోడ లేస్తోంది. మీరొక వలయంలో, నేనొక వలయంలో బిగించుకు పోతున్నాం. ఈ మార్పుకు ముందు కొంత మాట్లాడాలని వుంది. అందుకు అర్హమైన చనువూ, స్నేహమూ మనమధ్య వున్నాయి. మీ కభ్యంతరమైతే వద్దు."
    ఒక క్షణం ఆలోచించి అన్నాడు రాజా: "అవును. నాకూ అదే అన్పిస్తుంది."
    ఇద్దరూ మరికొంత దూరం నడిచివెళ్ళి యిసుకలో కూర్చున్నారు. మొదట రాజాయే మాట్లాడాడు.
    "శాంతీ, ఇక నాతో మాట్లాడరనుకొన్నాను. ఉదయం మీరంత ప్రఫుల్లవదనంతో యెలా అభినందించారు?"
    "ఏం? నా మిత్రులు మీరు. మీ వివాహం నాకు ఆనందదాయకం కాదా? ఏం జరిగిందని మాటలు మానుకోవాలి?"
    రాజా నవ్వులో ప్రపంచంలోని విషాదమంతా కురిసింది. "నేను పసిపిల్లవాడిని కాదు, శాంతీ, మభ్యపెట్టడానికి. ఇదివరలో నేనొక్కడినే దురదృష్టవంతుడి ననుకొనేవాడిని. కాని, మీరూ అంతే. అదృష్టవంతులమైన దురదృష్ట వంతులం మనం." విపరీతమైన బాధతో కణతలు రుద్దుకోసాగాడు.
    "విధి విలాసమో, వివేకహీనతో అర్ధం చేసుకోలేకుండా వున్నాను." నవ్వడానికి వ్యర్ధ ప్రయత్నం చేసింది శాంతి.
    "నేను చాలా స్వార్ధంతో ప్రవర్తిస్తున్నాను. ఇందుకు మీరూ, శ్రీహరీకూదానన్ను క్షమించగలగడం నా అదృష్టం."
    "లేదు. మీరు ఆత్మవంచనా రహితంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు అభినందించాలి. అదీకాక మీపై ఆగ్రహపడగల హక్కు మా కేముంది?"
    కొంతసేపు యిద్దరి మధ్యా మౌనం రాజ్యం చేసింది. కడకు రాజాయే మౌనభంగం చేశాడు. "మీ వుత్తరం అందిన తర్వాత నేను ఎంత ఆలోచించావో, ఎంత ఆవేదన చెందావో వర్ణించ లేను, శాంతీ. ఎంతగానో ఆలోచించాను. ఎన్నో తర్కించుకున్నాను. మీరు స్పష్టంగా వ్రాయకపోయినా అందులోని ప్రతి అక్షరంలోనూ మీ మనస్సు ప్రతిబింబించింది. కాని, నేను దౌర్భాగ్యుణ్ణి. ఒకసారి అమృతఫలాన్ని అందుకోలేకపోయాను. మరొకసారి వచ్చి అంజలిలో పడినా ఆస్వాదించలేకపోతున్నాను."
    నిర్వేదం నిండిన నవ్వు నవ్వింది శాంతి. "తెలుసు. అవన్నీ నేనూహించగలిగాను. మీ నిర్ణయాన్ని కూడా యిపుడూహించగలిగాను. వెనుక ఒకసారి జయ గురించిన ప్రస్తావన విషయంలో మీరొక అభిప్రాయం వెలిబుచ్చారు. అదే యిప్పుడు నా కన్వయించారు!"
    మౌనంగా తలవాల్చి కూర్చున్నాడు రాజా. అందులోనే ఉంది సమాధానం. 'శాంతి అపవిత్ర మైనది.'
    "గోవిందరావుతో నా ప్రవర్తన విషయంలో కూడా మీ కనుమానం వుండి వుండవచ్చు."
    ఉలిక్కిపడ్డాడు రాజా. "లేదు, శాంతీ, లేదు. ఆత్మసాక్షిగా లేదు. నిరాధారంగా ఎదుటి వ్యక్తి పవిత్రతకు కళంక మాపాదించేటంత హీనుడిని కాను. కాని, నేను గ్రహించింది ఒకటి. మీకు హృదయం విలువా, మనిషి విలువా, జీవితం విలువా తెలియవు. దేనికీ స్థిరనిశ్చయంలేదు మీకు. అటూ యిటూ వూగుతారు. అందువల్ల మీకూ, నాకూ సరిపడదని తెలుసుకొన్నాను."
    వినగానే శాంతి బాధపడింది. మెల్లగా అంది: "సరే. యేమైతేనేం? మీరు జీవితంలో స్థిరపడుతున్నారు. అదే నాకు సంతోషం. మీరు కలకత్తానుంచి ఎవరితో చెప్పకుండా వెళ్ళి పోయారనీ, పరధ్యాన్నంగా వుంటున్నారనీ బెనర్జీగారు వుత్తరం వ్రాసినపుడు నేనెంత క్షోభ జెందానో! ఇప్పుడిక అటువంటి బాధ వుండదు. జయకూడా వుత్తమురాలు. 'విష్ యూ గుడ్ లక్."
    "శాంతీ!" బాధగా పిలిచాడు. "దయ ఉంచి నన్ను చిత్రవధ చేయకండి. ఇక సుఖమనేది గగన కుసుమమే. మీకూ సుఖంలేదు; నాకూ సుఖం లేదు. మన జీవితా లిలా ఆవేదనాగ్నిలో దగ్ధం కావలసినవే. మనసులేని మనువుతో జీవితం శృంఖలా బద్దమై పోతుంది. అందుకే ఇంత కాలం వివాహానికి విముఖంగా వున్నాను. జయను చేసుకుంటే మరీ జీవితంలో ఆవేదన అధిక మౌతుంది. మీతో బంధం త్రెంచుకోరాని దౌతుంది. అందువల్ల మీకూ ఆవేదనే, నాకు తెలుసు. కాని తప్పదు. ఎలాగో మనసు సరి చేసుకోవాలి. జయను మోసం చేస్తున్నానేమో ననే బాధకూడా వుంది."
    శాంతి మౌనంగా వినసాగింది.
    "నేనీ వివాహం మనస్ఫూర్తిగా , సంతోషంగా చేసుకోవడంలేదు, శాంతీ. ఆ విషయం మీరు గ్రహిస్తే చాలు. అవివాహితుడిపై నిందలు వేస్తుంది సంఘం. అందుకే వివాహం అవసరమనుకొన్నాను. పాత బాధలకు తోడు క్రొత్త బాధ ఒకటి తోడౌతుంది యిందువల్ల. కాని తప్పదు. మనస్సు సరిజేసుకోవాలి. సర్దుకోవడానికి కొంతకాలం పట్టవచ్చు. లేదా జీవిత     కాలమంతా సరిపోకపోవచ్చు. భవిష్యత్తే మౌతుందో వూహించనుకూడా వూహించలేను. కాని తప్పదు. స్వేచ్చలేని మానవులం. దాని పరిధి వెలుపల ఎంత నీతిగా బ్రతికినా సంఘం నమ్మదు. తన పరిధిలో యిముడ్చుకోజూస్తుంది. లేనివారిని బాధిస్తుంది. అందుకే యీ ఆత్మ వంచనకు పాల్పడుతున్నాను."
    "ఏమిటది?"
    "అదే మీకు ఉత్తరంలో వ్రాసిన విషయం!"
    "అయితే మీరు నా మాట నమ్మలేదన్న మాట?" జాలిగా అడిగింది శాంతి. "ప్రమాణ పూర్తిగా నాకా ఉత్తరం అందలేదు. కాని నిన్న మీరు చెప్పాక ఆ ఉత్తరం ఏమైందో గ్రహించగలిగాను. అంతదూరంనుండి మీరు వ్రాసినది అందలేదనే బాధతో నిన్న నాకు దుఃఖం ముంచుకొచ్చింది. అందుకే మీ దగ్గర్నుంచి వెళ్ళిపోయాను. మీరు కోపమనుకొన్నారు కాబోలు."
    "నిజం?"
    "నిజమే, రాజశేఖరంగారూ. ఎంతైనా యితరుల విషయాలు బయటపెట్టి చిన్న బుచ్చడం ధర్మం కాదు. బహుశః యీ విష్యం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పివుండక పోదును. కాని యిపుడు మీ అనుమాననివృత్తి కొరకు చెప్పక తప్పదు" అంటూ ఆగింది.
    రాజా కుతూహలంగా ఆమె చెప్పేదానికోసం ఎదురు చూస్తున్నాడు.
    "మీరు కలకత్తానుంచి వెళ్ళిపోయినట్టు మాకు తెలియక అన్నయ్య ఒకటీ, నేనొకటీ విడివిడిగా వ్రాశాం మీకు ఉత్తరాలు. అంటే ముందు మీరు వ్రాసిన ఉత్తరాలకు జవాబులన్న మాట. మనోరమ తన ఉత్తరంతోబాటు మీరు శేఖర్ గారికి వ్రాసిన ఉత్తరంకూడ పంపించింది. అందులోనే నేను పూర్తిగా అమృతంవంటి మీ అంతరంగాన్ని గ్రహించగలిగాను. మారిపోయిన మనసుతో, యేమో నాకే తెలియని ఆశలతో మీకొక ఉత్తరం వ్రాశానప్పుడు. ఆ వెంటనే ప్రశాంతికి బారసాల జరిపి, వదినను తీసుకురావడానికి వెళ్ళి పోయాం నేనూ, అన్నయ్యా, నాన్నగారూ, అమ్మా, చిన్నన్నయ్యా, వదినా రాలేదు. ఇంటి దగ్గరే వుండిపోయారు. ఆవిడ ఎప్పుడూ మాతో కలియదు. సరే, మేము తిరిగి వచ్చాక కోటి కోర్కెలు మనస్సులో మెదులుతూండగా అడిగాను రామన్నను, ఏమైనా ఉత్తరాలు వచ్చాయా అని. ఎవరం లేకపోవడంవల్ల చిన్న వదిన దాచింది ఆ ఉత్తరాలు. ఏమున్నాయి? మేం వ్రాసిన ఉత్తర్లు మాకే తిరిగి వచ్చాయి. అంతేకాదు. బాధలో బాధ. నా ఉత్తరం తెరిచి కూడా ఉంది. అడిగితే 'తప్పా? ఎందుకు పరాయివాడికా ఉత్తరాలు?' అంటూ నానా మాటలూ ఆడింది చిన్న వదిన."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS