'అన్ననైవుండీ యీమె సంతోషాన్ని తుడిచి వేసే పని యీ చేతులతోనే చేశాను. నాకు నిష్క్రుతి ఉందా?' అని బాధపడసాగాడు శ్రీహరి. 'ఏ క్షణంలోనైనా సంగతి తెలియవచ్చు. ఏమై పోతుంది, శాంతి? నన్నూ, నా చెల్లెల్నీ ఎంత అసహ్యించుకొంటుంది!' అని భయపడజొచ్చింది పద్మ. కాని అ నదరి భయాందోళనలను ఆశ్చర్యంగా మార్చివేసే సంఘటన ఆ వెంటనే జరిగింది. తండ్రితో కలిసి అక్కడికి వచ్చిన జయను ఉద్దేశించి, "కాఫీ తీసుకుందురుగానీ, వెళ్ళి పెళ్ళికొడుకుగారిని కూడా పిల్చుకురా" అంది హాస్యంగా శాంతి.
జయ సిగ్గుపడిపోయింది. పద్మా, శ్రీహరీ ఉలిక్కిపడి ముఖముఖాలు చూచుకున్నారు.
శాంతి, తండ్రి గదిలోకి ప్రశాంతిని తీసుకువెళ్ళడానికి వచ్చింది పద్మ గదిలోకి. "శాంతీ!" అన్నాడు అక్కడే ఉన శ్రీహరి మెల్లగా చెల్లెల్ని సమీపిస్తూ.
"ఊఁ."
"అంతా తెలుసా?"
"ఏమిటీ?" ముఖమెత్తి చూచింది శాంతి. అంతలో గ్రహించుకుంది. తలవాల్చి మెల్లగా అంది: "అంతా తెలుసు."
"శాంతీ!"
"అవునన్నయ్యా. ఆయన నీకు ప్రాణ స్నేహితుడు. నాకూ ప్రాణ స్నేహితుడే అయ్యాడు. అందుచేత స్నేహితులుగా మనం ఆయన క్షేమం కోరాలి. అంతే. నా కేవిచారమూ లేదు. సంతోషంగా ఉంది."
"అంతేనా! రాజాతో యేమీ మాట్లాడవద్దా?"
నిర్జీవంగా నవ్వింది. "వద్దు. బాగుండదు. అయినా వెర్రిగాని, మన మాటలూ, ప్రయత్నాలూ యేపాటివిలే అన్నయ్యా. జరిగేదేదో జరుగుతుంది. ఇదివరలో మాటలు జరగలా? అదృష్టం అందర్నీ వరించదు!"
ఎగసివచ్చే నిట్టూర్పు నణుచుకొంటూ త్వరత్వరగా వెళ్ళిపోయాడు శ్రీహరి. వెళ్ళి పోతున్న అన్నను చూచి పిచ్చి నవ్వు నవ్వుకుంది శాంతి తనలో తాను. 'తనకు బాధ లేదని, అన్నయ్యకు ఆశ్చర్యం! కాని, తనలో ఎన్ని అగ్నిశిఖలు ప్రజ్వరిల్లుతున్నాయొ, ఎన్ని పెను తుఫానులు వీస్తున్నాయో చూడగల దివ్యమానసచక్షువులు అన్నయ్యకున్నాయా?'
శాంతి వదనంలో అణగి ఉన్న విషాదమూ, లోతుకుపోయి అరుణిమ దాల్చిన నేత్రాలూ, ఏదో ఒకటి మాట్లాడేస్తున్న ధోరణీ- శ్రీహరికి విషయమంతా వివరంగా బోధించాయి. చెల్లెలెప్పుడూ అలా అల్పసంతోషిలా పైకి నవ్వుతూ, ప్రేలుతూ ఉండేదికాదు. చాలా గంభీరంగా ఉండేది. ఎప్పుడూ అతిగా మాట్లాడని ఆమె యివ్వాళ అన్నిమాటలు మాట్లాడుతూ, హడావుడిగా తిరగడంలో ఆంతర్యం ఒకటే - తన్ను తాను మరువ ప్రయత్నిస్తూంది. తాను సంతోషంగానే ఉన్నట్లు తమను భ్రమింపజేయాలని నటిస్తూంది.
విషయం తెలిసిన బలరామయ్య లోలోపల బాధపడ్డాడు. లక్ష్మీదేవి చాటుగా ఏడ్చింది. రాజావంతి అల్లుడిని పొందగల అదృష్టం ఎంతటివాళ్ళకు!
"శాంతీ, నీతో మాట్లాడడానికి ముఖం చెల్లటం లేదు. నిన్న ఉదయమే నిన్ను అదృష్టవంతురాలిగా ఆశీర్వదించాను. అది యిలా పరిణమించింది" అంది పద్మ.
ఒక కళలేని నవ్వు నవ్వి ఊరుకొంది శాంతి.
"నాపై కోపమా, శాంతీ? దధైవసాక్షిగా యిందులోనా ప్రమేయం యేమీ లేదు."
"ఎవరి ప్రమేయ ముంటే మాత్రం యేం జరగగలదు వదినా? చేసుకునేవారి యిష్టా యిష్టాల్ని బట్టిగాని? అయినా యిప్పుడు నా అదృష్టానికేమొచ్చింది? నువ్వేం బాధపడకు."
58
సాయంత్రం వెళ్ళేముందు అందరికీ చెప్పి రమ్మన్నాడు శ్యామలను భర్త. "నాకెవళ్ళకీ చెప్పవలసిన అవసరం లేదు" అంది నిర్లక్ష్యంగా శ్యామల.
"చెప్పిన మాట కొంచెం విను" అన్నాడు నారాయణరావు.
"అనవసరం. మనం హాయిగా వెళ్తోంటే ఎవరో చచ్చినట్టు గోలెత్తేవాళ్ళ కిక నేను చెప్పేదేమిటి?"
నారాయణ మరి మాట్లాడలేదు.
శోకావేశాల ప్రథమోద్వేగాలు క్రిందటి రోజునే బహిర్గతమైనాయి. ఆనాడు నిరాశా, నిర్లిపతలే కాని శోకసూచనలు లేవు. తుఫాను వచ్చి వెలిసినట్టు నిర్వేద నిశ్శబ్దత అలముకొన్న వాతావరణంలో ఒక్కో లారీ పెద్ద శబ్దంతో స్టార్టయి, బయ్ న దూసుకుపోతూంటే, అవి తమ గుండెల మీదనుండి పోతున్నంత బాధ పడ్డారు ఒక్కొక్కరే. శాంతిమాత్రం వాళ్ళు టాక్సీ ఎక్కబోతూంటే వెళ్ళి దగ్గర నిల్చుంది.
"అన్నయ్యా, గొడవలు రావడం సహజం. ఈ కోపం దీర్ఘకాలం మనస్సులో వుంచుకోకు. వస్తూ పోతూ వుంటావుకదూ?" అంది చెయ్యి పట్టుకొని.
ఎంత దురుసువాడైనా, ఎంత కోపంతో ప్రవర్తించినా పుట్టి పెరిగిన వాతావరణాన్నీ, ఆత్మీయులనూ విడిచిపోయే క్షణం వచ్చేసరికి తీవ్రంగా కదిలిపోయింది హృదయం. అనిర్వచనీయమైన ఆవేదనతో గుండెలు బరువెక్కాయి. పెదవి కదల్పలేకపోయాడు.
"బహుశః యిందుకు కారణం చాలావరకు నేనేనేమో? నన్ను క్షమించన్నయ్యా" అంది శాంతి
తిరిగి.
నారాయణ మనస్సు ద్రవించిపోయింది. రాత్రి తోటలో విన్న సంభాషణ గుర్తువచ్చింది. "శాంతీ, ఒక్కమాట" అన్నాడు.
"ఏమిటి?"
"రాజా విషయం......."
గ్రహించింది శాంతి. ఆవేదనాపూరితమైన చిరునవ్వు నవ్వింది శాంతి. "నీకెప్పుడూ యింటి విషయాలు పట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు కలిగిందీ కుతూహలం?"
"నిజమే. ఏమిటో అంత తేలికగా బ్రతికేస్తున్నాను. నాకే ఆశ్చర్యంగా ఉంది" అన్నాడు.
అన్నలో కలిగిన ఈ మార్పుకు ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ నిలబడింది శాంతి.
"వెనకొకసారి నిన్నతడి కివ్వటానికి ప్రయత్నాలు జరిగినట్టు అన్నయ్య చెప్పాడు. శ్యామల కూడా ఒకసారి యేమిటో చెప్పింది."
భారంగా నిట్టూర్చింది శాంతి. "నన్ను మీరంతా ఎంత బాగా చూచారు! ఎలా పెంచారు! అటువంటి నామీదే నీకు కోపం రాలేదూ? అలాగే. నేను దురదృష్ట వంతురాలినన్నయ్యా. అంతకంటే యేం చెప్పలేను" అంది తలవాల్చి.
ఎందుకో నారాయణకు కూడా తెలియని బాధ కలిగింది. చుట్టూ చూచాడు. దూరంగా చెట్లక్రింద చేతులు కట్టుకు నిలబడి చూస్తున్నారు నౌకర్లూ, పాలేళ్ళూ అందరూను. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, పర్సుతీసి తలో నాలుగు రూపాయలూ యిచ్చాడు. వాళ్ళల్లో మొన్న దెబ్బలు తిన్నవాళ్ళుకూడా ఉన్నారు. అందరూ మాట్లాడకుండా పుచ్చుకొన్నారు. అందరి వెనుకా ఉన్న రామన్నకుకూడా యివ్వబోయాడు. రామన్న చెయ్యి చాపలేదు.
చూడలేక చూడలేక ముఖంవంక చూచాడు నారాయణ, "తీసుకోవేం?" అంటూ.
"అదా, చిన్నబాబూ, నువ్వు నాకిచ్చే బహుమానం?" అక్షరం అక్షరంలోనూ ఆవేదన చిందింది. కండ్లలో అశ్రువులు చిందాయి. నాలుగూ పర్సులో పెట్టేసి పది రూపాయల నోటు తీశాడు నారాయణ, "సరే. ఇది తీసుకో" అంటూ.
కరకరా నవ్వాడు రామన్న. "అదికాదు, బాబూ. దాచుకో నీ డబ్బు నువ్వు. నేను డబ్బు కోసమే యీ యింట్లో నౌఖరీ చేశానా? డెబ్బై యేళ్ళ ముసిలోడిని. పాతికేళ్ళప్పుడు పెద్దబాబు దగ్గర కూలోడిగా వచ్చాను. ఆయనే నాకు పెళ్ళి చేశారు. ఇంట్లో పెట్టుకొన్నారు. ఇంట్లో నేను చెయ్యని పని లేదు. నాకు తెలియని సంగతిలేదు. ఆ బాబుకు మీరంతా కడుపున పుట్టారు. నేను చేతిలో పుట్టాను. అంతే తేడా. బాబుతో పాటే ఇక్కడికొచ్చాను. ఈ శాంతినిలయాన్ని నేను తీర్చిదిద్ధాను, చిన్నబాబూ-నేను." ధనా ధనా అరచేతితో గుండెమీద బాదుకున్నాడు. "ఈ శాంతివనం పెంచటంలో నా నడుము వొంగిపోయింది. ఈ శాంతినిలయానికి దీపాలైన మిమ్మల్ని పెంచటంలోన్, మీ సంరక్షణలోనే నా తల నెరిసిపోయింది. మీ ఆటపాటలు చూస్తూనే మురిసిపోయాను. పెద్ద చదువులు చదివి వుద్యోగాలు చేత్తన్నారని గాలిలో తేలి పోయాను. మీ పెళ్ళిళ్ళుచూచి యెంత సంబర పడిపోయానో ఆ పరమాత్ముడికే ఎరుక.
"మీకు చిన్నతనంలో జబ్బులు చేత్తే, రాత్రింబగళ్ళు కంటికి రెప్పలా కాచుకున్నది - అమ్మా, అయ్యా కాదు - నేను......నేను, చిన్న బాబూ. అలాటి నేను నౌఖరోడినే నంటావా? నువ్వు నాలుగు దెబ్బలు కొడితే కోపం తెచ్చుకొని ఎల్లిపోటానికీ, పది రూపాయిలిత్తే సంబరపడటానికీ నేను మామూలోడిని కాను. నేనూ మీలో ఒకడినే, చినబాబూ." జలజలా కారే కన్నీటిని తుడుచుకొన్నాడు.
నిర్ఘాంతపోయి చూడటం మినహా ఏమీ మాట్లాడలేకపోయాడు నారాయణ. అస్థిరంగా ఉన్న అతడి మనస్సు ఒక్కొక్క సంఘటనకే తీవ్ర బలహీనతతో కదలిపోసాగింది.
తెల్లబోయి చూస్తున్న అతడిని చూచి తల పంకించాడు రామన్న. "తెలియటంలేదు కదూ, చిన్న బాబూ? అవును, తెలియదు. చూడు-ఈ మామిడిచెట్టును నా చేతులతో పెంచాను. ఇంత చిన్నమొక్క అంత అయింది - ఆకాశంలోకి పెరిగి. ఇప్పుడు దానికి నా సంరక్షణ అనవసరం. ఎపుడైనా దాని నీడను నేనే పడుకోవచ్చు; దాని పండు తినవచ్చు. తప్పులేదు. కాని, పండు తీసుకోబోయిన నామీద, ఆ చెట్టు నడుం విరిగేట్టు కొమ్మ విరిచి పడేసినా నేను ద్వేషించను. నిండుగా ఉన్నదానిని చూచి మురవడం మానను. దాని క్షేమం కాంక్షించక మానను. కాని యిది దానికేం తెలుస్తుంది, చిన బాబూ? దానికీ తెలవదు; నీకూ తెలవదు. ఉడుకు రక్తంలో తెలవదు. యెళ్ళిరా. సుఖంగా ఉండు బాబూ." భోరున ఏడుస్తూ అక్కడి నుంచి వేగంగా నడిచి పారిపోయాడు రామన్న. నారాయణ చేతిలో కాగితం గాలిలో ఎగిరి పోయింది.
నీరసంగా వచ్చి కారెక్కి కూర్చున్నాడు. అప్పుడే శ్యామలకూడా మేడదిగి వచ్చింది కారు దగ్గరకు. ఆ వెనుకనే జయలక్ష్మి కూడా ఉంది ఎంతో ఆప్యాయంగా సాగనంపుతూ.
ఆశ్చర్యపోయింది శాంతి -'ఈ యిద్దరికీ ఎప్పుడింత సఖ్యత ఏర్పడిందీ?' అని.
"అమ్మతోనూ, నాన్నగారితోనూ చెప్పు, శాంతీ. అన్నయ్యకూ, వదినకూ కూడ చెప్పు" అని నారాయణ బలహీనంగా అంటూంటే టాక్సీ కదిలింది. శాంతితో శ్యామల ఒక్క మాటకూడా మాట్లాడలేదు. మాట్లాడాలను కున్న సాహసం చాలక ఊరుకుంది శాంతి.
కారు తోటను దాటి, గేటును దాటి, బాట పట్టి దుమ్మ్జు రేపుకుంటూ పోయింది. శాంతి కనుకొలకుల్లో ముత్యాలవంటి నీటి బిందువులు జేరి దృశ్యాన్ని మసకపరుస్తూ మెల్లగా చెంపల మీదుగా జారిపోయాయి.
"పద, చిన్నమ్మా. లోపలికి నడు. ఎందుకా విచారం?" అనునయిస్తూ మెల్లగా అన్నాడు రామన్న వచ్చి. కళ్ళు తుడుచుకుని చుట్టూ చూచింది శాంతి. జయ ఆకాశంలోకి సాలోచనగా చూస్తూంది.
"అంతా విచారంగా ఉంటారు. ఆ వాతావరణంలోకి వెళ్ళి, ఆ ముఖాలు చూడలేం. ఒక్కసారి అలా పోయి వస్తాం, రామన్నా, నువ్వు వెళ్ళు" అంది శాంతి.
"అటుగైతే త్వరగా వచ్చెయ్యండి మరి చీకటిపడకుండా. పడవలూ, గిడవలూ ఎక్కమాక" అంటూ వెళ్ళిపోయాడు రామన్న.
"జయా, అలా నది వొడ్డుకు వెళ్దామా?" అంది శాంతి.
జయ ఒక్కసారి శాంతి ముఖంలోకి చూచి మాట్లాడకుండా వెనుకకు నడిచి యింట్లోకి వెళ్ళిపోతూంది.
"జయా, విన్పించలేదా? ఒక్కసారి అలా వెళ్ళివద్దాం రా" అంది మళ్ళీ శాంతి.
"నేను రాను." వెనుదిరిగైనా చూడకుండా ముందుకు సాగిపోయింది జయ.
శాంతి ఆశ్చర్యపోయింది. 'జయ ఇక్కడకు వచ్చినప్పటినుంచీ చాలా సఖ్యంగా మెలగుతూంది తనతో. అంత విసుగ్గా ఉందేం యిప్పుడు? ఏమో యీ మానవప్రకృతి - చిత్రవిచిత్ర మైనది. ఏ క్షణంలోనైనా, యే విధంగానైనా మారవచ్చు.' అంతే. అంతకంటే అధికంగా తర్కవితర్కాలు సల్పగల స్థితిలో లేదు ప్రస్తుతం, ఆమె మనఃస్థితి. ఒంటరిగానే నడక సాగించింది.
రాజాకు నదీతీర విహారమంటే చాలా యిష్టం. సంతోష సమయాలలో, విచారస్థితిలో - ఎల్లప్పుడూ ఆ విహారంలోనే ప్రశాంతి పొందుతూంటాడు.
నది ఒడ్డున నడుస్తూన్న శాంతికి దూరాన పడవమనిషితో మాట్లాడుతూ రాజా లీలగా కన్పించాడు. ఇద్దరికీ చాలా దూరముంది. పిలుపు వినబడదు ఎలా? అక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఆడుకొంటున్న బెస్తవాళ్ళ పిల్లలు కనిపించారు. ఒక పిల్లవాడిని పిలిచి "చూడు. ఆ తెల్లబట్టలాయనను గట్టిగా కేక వేసి పిలువు బాబూ" అని దిగింది. చ్ప్పిందే తడవుగా వాడు పరుగు లంకించుకున్నాడు.
ఎంత నిర్మలానందమయ జీవితం! ఆ బాల్యావస్థలో ఏమీ అక్కరలేదు. ఎందుకు పుట్టామన్న మీమాంస ఉండదు. అసంతృప్తి ఉండదు. ధ్యేయం ఉండదు. వాడూ, వాడి పరుగూ శాంతినికేతన్ లోని రాధూను స్ఫురింపజేశాయి. వాడిచేత ఎన్ని పనులు చేయించుకొనేది! ఇలాగే చెప్పినదే తడవుగా బంతిలా పరుగెట్టేవాడు. అదంతా ఒక స్థితి; ఒక ఆవేశం. అయిపోయింది. ఒక ఆవేదననుమాత్రం కలిగించి అంతమైపోయింది. ఒక విషాదఘట్టంగామాత్రం మనస్సులో ముద్రింపబడింది. ఇంకా ఆ ఘట్టం మనస్సునుంచి చెదిరీ చెదరకముందే, ఆ గాయం నుండి కోలుకోకముందే మళ్ళీ మరొక విషాద సంఘటన. ఎందుకో జీవితం యిలా ఆడుకొంటూంది తనతో?
