Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 51


    కొంతసేపైన తర్వాత కన్నీరుకూడా కరవౌతుంది. కేవలం మనస్సులో వ్యథే మిగులు తుంది. శోకపు ప్రథమవేగం తగ్గిన తర్వాత శాంతి మనస్సును చిత్రమైన నిర్వేదం ఆవరించింది. కిటికీ దగ్గరజేరి చెక్కిట చేయిజేర్చి కూర్చుంది.
    అమవస తిమిరం జగమంతా ఆవరించింది. వెన్నెలలో తళతళలాడుతూ కన్పించే గోదావరీ స్రవంతి, చిత్రవిచిత్రమైన అందాలు ఒలక బోస్తూ చూపట్టే సుమవనము ఈ నిబిడాంధకారంలో ఇప్పడు కన్పించటంలేదు. నదీ తరంగాల ఘోషమాత్రం విన్పిస్తూంది. 'ఎప్పటికప్పుడు సిద్దాన్నానని కాలదన్నుకొంటూన్న నిర్భాగ్యురాలివి, శాంతీ!' అని నాదించసాగింది హృదయం.

                        
    'అవును. తనకై తాను నిష్కళంక నిర్మల ప్రేమను అందివ్వబోయాడు. ప్రపంచమంటేనే తెలియని ఆ రోజుల్లో, రాయికీ, రత్నానికీ భేదం తెలియని ఆ రోజులలో, ఆ గగనకుసుమాన్ని వివేకరహితంగా తృణీకరించాను. నాలో మార్పు కోసం హృదయకవాటాలను తెరిచి ఉంచి సహనంతో ఎదురుచూచాడు. అయినా నేను కన్నెత్తి చూడలేదు. కడకు ఉన్నత సౌధాన్ని వదిలి, ఏదో ఉందని భ్రమించి హీనమైన పూరింట్లో ప్రవేశించబోయిన నన్ను చూచి హేయపడి ఆ అందాల సౌధకవాటాలు మూసుకుపోయాయి. ఆ పూరిల్లు కూడా దూరంగా గెంటివేసింది. నిన్ను నేను తలెత్తి విస్పారిత నేత్రాలతో తిలకించి తన్మయమందగలనే కాని నీకు ప్రవేశ మిచ్చి శాశ్వతంగా భరించలేను- అని క్షమాపణ చెప్పుకుంది సౌధానికి పూరిల్లు, పూరి కొంపచే తృణీకరింపబడిన మహారాణికి అప్పుడు తనవిలువా, సౌధం విలువా తెలిసి వచ్చాయి. కాని సమయం మించిపోయింది. తిరిగి తనవైపు చూచిన ఆమెకు సౌధం సాంత్వన పలికి సానుభూతి చూపిందేకాని స్వాగతమిచ్చి స్థానమివ్వలేదు.
    ఒకసారి మలినమైన మనస్సుకు గౌరవం యివ్వలేకపోయింది. పొరపాటునైనా బురదలో పడిన బుద్ధికి అందలమెక్కగల అర్హత శాశ్వతంగా దూరమైనదని అన్యాపదేశంగా చెప్పింది. జయ నలుగు రోజులనాడు వెళ్ళిపోతానంటే వెళ్ళవద్దని తానే ఆపుజేసింది. తెలిసీ, తెలియకా ఎప్పటికప్పుడు తనకు తానే అపకారం చేసుకొంటూంది.'
    ఠంగు ఠంగున రెండు కొట్టింది. శాంతి యింకా గవాక్షం దద్దరే ఉంది. మూడైంది. ఇంకా గవాక్షం వదలలేదు. నాలుగైంది. క్రమంగా పశువుల కొట్టాలలో, పొలాలలో అలికిడి ప్రారంభమైంది. నిదురించిన ప్రకృతి మేల్కొనసాగింది. దూడల అంబారవాలు, పాలుతీస్తున్న చిత్రమైన ధ్వని, పాలేళ్ళు మేట్లనుండి గడ్డి పీకుతున్న శబ్దం, పొలాలకు రాకపోకలు ప్రారంభించిన రైతుల కిర్రుచెప్పుల చప్పుళ్ళూ, చేతికర్రల టకటకలూ, బళ్ళ ఎడ్ల మెడలలో మువ్వల చప్పుళ్ళూ, నదిలో పడవలకు సరుకు ఎగుమతి చేస్తే కూలీల ఆర్భాటం వినవస్తున్నాయి. తోటలో నూతిగిలక శబ్దం ప్రారంభమైంది.
    'పాలేళ్ళు లేచారన్నమాట! తండ్రి లేవలేదు ఇంకా. అవును. ఆయన ఆత్మవిచారం అన్నిటినీ అధిగమించిపోయింది. ఎంత అధిగమించిందంటే శాంతివృక్షాల సంరక్షణ బాధ్యతకూడ ఆయన దూరమయ్యారు. శాంతినికేతన్ నుండి వచ్చి నప్పటినుంచీ తానూ, తండ్రీ కలిసి చేస్తున్నారు ఆ పనులు. ఇప్పుడిక ఒంటరిగా చేయాలి.' మార్పుచెందిన ఆలోచనలతో మెల్లగా తోటలోకి వెళ్ళింది.
    పారిజాతాలు, మాలతులు పరిమళం వెదజల్లుతున్నాయి. మలయసమీరం మంద మందంగా వీస్తూంది. అన్ని చెట్లకూ నీళ్ళు వెళ్ళుతున్నాయి. క్రమంగా చీకట్లు అంతరించి తూర్పుదిక్కున అంబరం ధవళదీప్తిమంతం కాసాగింది. పక్షుల కిలకిలారావాలు ప్రారంభమయ్యాయి. శ్వేతాంబరంపై లేత అరుణ వర్ణపు కిరణాలు పరుచుకున్నాయి.
    అంధకారబంధురమైన శాంతి మానసికా కాశంలో కూడ వెలుగురేఖలు పొడచూపాయి. భారహృదయం తేలిక కాసాగింది. 'ఆనాడు రాజాకూడా నే నతడిని తృణీకరించినందుకు ఇంత బాధా పడి ఉంటాడు. అందుకే నాకీ శాస్తి. ఇప్పుడతడి గురించి ఏడవడానికి, బాధపడటానికి నాకేం అధికారముంది? గోవిందరావు విషయంలో అతడేమైనా బాధపడ్డాడా? మనసారా ఆనందించాడు. పైగా ఒకసారి తాను జయ లక్ష్మిని చేసుకోమని సలహా యిచ్చింది కూడా. అతడి క్షేమాన్ని కోరాలి. అతడి సుఖాన్ని చూచి సంతోషించాలి. మనసారా ఆనందించాలి. అవును. అంతే. నాజీవితం ఏమైతేనేం? కళ్ళు మూసుకుంటే రోజులు ఇట్టే దొర్లిపోతాయి. నాకు సంబంధించిన అందరూ సుఖంగా ఉంటే అంతే చాలు. నేనేమైనా ఫర్వాలేదు.'
    తేలికైన సంతోషహృదయంతో త్వర త్వరగా ముఖం కడిగి స్నానంచేసి దుస్తులు వేసుకొని తోటలోకి నడిచింది. సంతోషంగా పువ్వులు కోసుకువస్తున్న ఆమెకు జయ ఎదురు పడింది, టూత్ బ్రష్ తీసుకుని నూతిదగ్గరకు నడుస్తూ.
    "అభినందనలు, జయా" అంది భుజం తట్టుతూ. జయ సిగ్గుపడుతూ అక్కడినుండి వెళ్ళిపోయింది.
    మేడమీదకు వెళ్ళుతూంటే అప్పుడే తన గదిలోంచి వచ్చి స్నానానికి వెళ్తూన్న రాజా కన్పించాడు. విస్తుపోయి చూచినట్టు చూచాడు రాజా. రాత్రంతా నిద్రలేనట్టు ముఖమంతా వాడిపోయిం నేత్రాలు అరుణిమ దాల్చి ఉన్నాయి.
    శాంతిని చూచి తలవంచి తప్పుకుపోయాడు రాజా.
    "హార్టీ కంగ్రాచులేషన్స్, రాజశేఖరంగారూ" అంది ప్రఫుల్లవదనంతో శాంతి. ముఖంలో అవ్యక్త ఆవేదన ప్రస్ఫుటమవుతూంది.
    "థాంక్స్." క్షీణస్వరంతో అని తలపంకించి వడివడిగా సాగిపోయాడు, రాజా.
    అక్కడే వరాండా చివర ముఖం కడుక్కుంటూ భార్యతో ఏమేమో మాట్లాడుతున్న నారాయణ అది చూచాడు.
    "శాంతీ, కంగ్రాట్స్ ఎందుకే? ఏదైనా పరీక్ష పాసయ్యాడా?" అనడిగాడు చెల్లెల్ని.
    "కాదన్నయ్యా. అతడికి పెళ్ళి కుదిరింది. పెళ్ళికూతురెవరో తెలుసా? జయ!" అంటూ వెళ్ళిపోయింది.
    శ్యామల ఆశ్చర్యపోయింది. "ఓహో! ఈవిడ గారితో ప్రణయకలాపాలైపోయాయి కావాను. ఇక ఆమెను పెళ్ళిచేసుకుంటాడు!" అంది.
    "శ్యామలా!" గద్దించాడు నారాయణ. "అటు వంటి తేలికగా మాట్లాడే నైజం మార్చుకో. శాంతి నా చెల్లెలని మరిచిపోకు" అంటూ వెళ్ళిపోయాడు.
    వివాహమైన క్షణంనుండి తన కనుసన్నలలో మెలగుతూన్న భర్తలో ఈనాటి మార్పుకు ఆశ్చర్యపోయింది శ్యామల.  
    నారాయణ నిర్ఘాంతపోయాడు. 'రాత్రి విన్నదేమిటి? ఇప్పుడు వింటూన్న దేమిటి? శాంతి కేమాత్రమూ అతడిమీద ప్రేమ లేదా? అతడు కేవలం స్నేహితుడేనా? అతడి వివాహమని ఎంత సంతోషంగా చెప్తోంది! కాని ఆ యిద్దరికీ చక్కటి జోడు కుదురుతుంది.' ఎన్నడూ లేనిది ఈనాడు నారాయణ ఆలోచనలు పెద్దతరహాలో సాగుతున్నాయి.
    అతి ఉల్లాసంగా తిరుగుతూన్న శాంతిని చూచి పద్మా, శ్రీహరీ ఆశ్చర్యపోయారు. 'ఆమె యింత చలాకీగా ఎలా ఉండగలుగుతూంది? రాత్రి వెక్కివెక్కి ఏడుస్తూన్న ఆమెకు తెల్లవారియింత ధైర్యం, సంతోషం ఎలా లభించాయి? బహుశః విషయం తెలియదేమో! ఆ విషయం తెలిస్తే ఈ ఆనందంలో ఆవగింజంతైనా ఆమె ముఖంమీద వుండబోదు. అది నిస్సంశయం.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS