నారాయణ తోటలో తిరుగుతున్నాడు వికలమానసంతో. అంతలో అతడికేదో సంభాషణ వినవచ్చింది. వినసాగాడు. రాజ తోటలో ఒక చోట ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు.
"భోజనానికి రండి" అంది శాంతి కోది దూరంలో నిల్చుని.
"వద్దు, శాంతీ. మీరు వెళ్ళండి. ఇక్కడే పడుకుంటాను."
"అలా కాదు. కొద్దిగా కానిద్దురుగాని."
"వద్దు. శ్రీహరి తిననిదే నేనా? మీ అమ్మ గారు, నాన్నగారు అంత విచారంలో వుంటే నాకు విందులు దేనికి, శాంతీ? అసలు ఇటువంటి పరిస్థితులలో వచ్సినందుకే నాకు బాధగా వుంది."
"........."
"వెళ్ళండి, శాంతీ. నిల్చోవద్దు."
"ఉదయంనుండీ మీతో సరిగా మట్లాడలేకపోయాను. ఏమీ అనుకోకండి. నా మనస్సు బాగుండలేదు. ఇంట్లో పరిస్థితులూ అలాగే వున్నాయి."
"నాకు తెలుసు. ఏమీ అనుకోలేదు. కని, శాంతీ, మీరు చాలా మంచిపని చేశారు."
"ఏమిటి?" విస్మయంతో ప్రశ్నించింది.
"మీ అన్నయ్య మంచీ చెడూ చూచుకో కుండా వెళ్ళిపోతున్నాడనే సంశయం నాకూ కలిగింది. కాని, చెప్పే సాహసం లేకపోయింది. జరిగిన కలహపు సంగతులన్నీ మరిచి మీరంతగా అతడిని ప్రాధేయపడి ఆపడం చూస్తే మీ మనస్సెంత అమృతమో అని ఆలోచిస్తున్నాను."
నవ్వింది శాంతి. "మీరు మనిషే అమృతం గనుక మీకు అట్లా అన్పిస్తుంది. పూర్తి పరాయిదానివైన నన్ను, మీ ప్రేమను తృణీకరిన్చిన్ నన్ను, కించిత్తైనా కోపం లేకుండా అనేకవిధాల కాచారు. అన్నయ్య కలకత్తా నుండి వెళ్ళిపోయినా శాంతినికేతన్ లో ఉన్న నన్ను స్నేహపూర్వకంగా యోగక్షేమాలు కనుక్కుంటూ వచ్చారు, ఆ రోజు కలకత్తానుంచి మీరేగనుక నన్ను బలవంతంగా తీసుకువెళ్ళి శాంతినికేతన్ లో విడువకపోతే నీచుడైన గోవిందరావుతో ఎంతవరకు వచ్చేదాన్నో అని తలుచుకొంటే యిప్పటికీ గజగజ వణికిపోతాను. ఇంత స్వచ్చంగా, నిర్మలంగా ఉండగలుగుతున్నావంటే ఇది మీ భిక్షే."
రాజా మాట్లాడలేదు.
"ఆమధ్య మీ ఉత్తరం చూచాకనే నాకు నిజమగా మనస్సు సర్దుకుంది. దూరాన ఉన్నా స్నేహపూర్వకంగా, ఆప్యాయంగా సలహాలిచ్చే మీ నిర్మల హృదయంముందు నేనెంత, రాజశేఖరంగారూ? మీరసలు అన్నయ్యకు స్నేహితులైన ఇప్పుడు నాకు అంతకంటే ప్రాణస్నేహితులయ్యారు. మీ మార్గమే ఆచరణ యోగ్యమైంది. ఇదివరకు ఎవ్వరేమన్నా చటుక్కున కోపం వచ్చేసేది. ఇప్పూ ఎవ్వరిపైనా ఆగ్రహం రాదు. ఏ పరిస్థితులలోనైనా మీరూ, ఆగ్రహదూరమైన మీ ప్రవర్తనా గుర్తుకు వస్తాయి. అదే ఎంతో బలంగా ఉంటుంది. ఇప్పుడ చెప్పండి - మీరు పొగిడిన నా మంచితనం ఎవరికి చెందినదో."
వింటూన్న నారాయణ విచలితుడయ్యాడు. ఇదా శాంతి ప్రణయగాధ! ఎంత పవిత్రులు యిద్దరూకూడ! ఇటువంటివారి గురించి ఒకనాడు శ్యామల తనతో ఏమేమో నీచంగా చెప్పింది. తాను నమ్మాడు. అందుకే శాంతిపైనా, రాజపైనా అసహ్యం పేరుకుంటున్నది. ఆ కారణంతోనే ఇవాళ రాజా ఎదురు పడ్డా పలకరించలేకపోయాడు. శ్యామల తనకు చెప్పుతున్నవన్నీ యిటువంటి అభూతకల్పనలే నేమో?
తిరిగి రాజా కంఠం విన్పించింది. "సంభాషణ చాల దూరం పోయింది. ఇది అనువైన సమయం కాదు, శాంతీ. వెళ్ళండి. మరొకసారి మాట్లాడుకుందాం."
"అవును. వెనుక ఒకసారి నేర్చుకున్నాంగా గుణపాఠం!" శాంతి వెళ్ళిపోతున్నట్లు ఆకుల గలగలలు విన్పించాయి.
"వదినా, రాజా భోజనం చేయరట. అరటిపళ్ళూ, పాలూ తీసుకెళ్ళి ఇవ్వనా?"
కొంచెంసేపు ఊరుకుని పద్మ, "పంపించు రామన్నచేత. నువ్వు వెళ్ళకు" అంది.
"ఏం, వదినా, అలాగున్నావ్?" ఉదాసీనంగా ఉన్న పద్మ ముఖం చూచి అడిగింది శాంతి.
"ఏంలేదు." అక్కడినుంచి వెళ్ళిపోయింది పద్మ.
ఇంతకుముందు రాజా, తనూ అనుకున్న కరణాన్నే బహుశః వదినకూడ మనస్సులో పెట్టుకుని అని ఉంటుందని భావించి సరిపెట్టుకుంది శాంతి.
వదిన మాటప్రకారమే ఆ పనులు రామన్నకు ఫర్మాయించి తిన్నగా మేడమీదకు వెళ్ళింది, అన్నయ్యను మళ్ళీ బ్రతిమలాడి తలుపు తీయించటానికి. కాని, శ్రీహరి అప్పటికే తలుపుతీసి చీకటిలోనే వరండా పిట్టగోడమీద రెండు మోచేతులూ ఆనించి అరచేతులలోముఖం పెట్టుకుని ఉన్నాడు. ఆ దిగువనే సామానులతో నిండి భూతాలలా కన్పిస్తున్న మూడు లారీలను నిర్లిప్తంగా చూస్తున్నాడు. సంధ్య వాలేసరికి దీపాలతో కళకళలాడే శాంతి నిలయమూ, శాంతివనమూ ఆనాడు ఏడు గంటలైనా రాత్రి ఎక్కడా దీపపు కాంతులు లేక నిర్జీవంగా ఆ వ్యక్త శోకాంధకారం అలముకొని ఆమనస తిమిరం భీకరంగా నాట్యం చేస్తూంది.
"అన్నయ్యా!" అంది శాంతి మెల్లగా వెనుక నిల్చుని.
శ్రీహరి పలుకలేదు.
భుజంపై చెయ్యి వేస్తూ "పెద్దన్నయ్యా!" అని పిలిచింది తిరిగి.
మౌనంగానే అటు తిరిగాడు శ్రీహరి.
"అసలే నాన్నగారి ఆరోగ్యం బాగుండలేదు. చాలా వేళ మించిపోయింది. నీవు పిలిస్తే ఆయన తలుపు తీస్తారేమో?"
"అమ్మ ఎక్కడుంది?" మెల్లగా అడిగాడు.
"క్రింద గదిలో ఉంది. తనూ తలుపు తీయటంలేదు."
"శాంతీ! ఎటువంటి కుటుంబం ఏ దశకొచ్చిందీ!" అంటూంటే శ్రీహరి కంఠం వణికింది. కన్నీళ్ళు జలజలా రాలాయి. శాంతి కంఠంకూడా పూడిపోయింది. కొంతసేపటికి ఇద్దరూ తేరుకొన్నారు.
"పద, నువ్వు, నేను తీయిస్తాను తలుపు."
శాంతి వెళ్ళిపోతూంటే మళ్ళీ వెనక్కు పిలిచాడు. "రాజా ఏం చేస్తున్నాడు?"
"తోటలో ఉన్నారు. నువ్వు చేయ్యనిహే భోజనం చేయరట. ఇందాక సాయంత్రం వెళ్ళిపోవలసినవాళ్ళే చిన్నన్నయ్యా, వదినానూ. అమావాస్యపూట వెళ్ళద్దని ఆపుజేశాను నేను."
ఆశ్చర్యపోయాడు శ్రీహరి. "నీమాట విన్నాడా?"
"నాకూ అదే ఆశ్చర్యంగా ఉంది. మొదట్లో వినలేదు కాని తేలికగానే ఒప్పుకున్నాడు. వదిన మాత్రం విసుక్కుంది."
"వాళ్ళకు ఎక్కువ ద్వేషం నీమీదే. నువ్వేమో అమావాస్యనాడు వెళ్తే వాళ్ళకు కీడని బాధ పడుతున్నావ్. ఎంత చిత్రంగా ఉంటాయో చూచావా మమతలు?"
"........."
"అవునులే మరి. అందరూ పద్మలూ, శాంతులే అయితే ఈ శాంతినిలయమేనన్న మాటేమిటి. ప్రపంచమే శాంతినిలయమై పోతుంది మరి! అందుకే భగవంతుడలాగ వైవిధ్యమైన సృష్టి చేస్తాడు."
శాంతి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 'రూపమే తేడా. అన్నయ్యా, రాజశేఖరం-యిద్దరి హృదయగత భావాలూ ఒకటే. కుసుమా సౌరభమూ, తేనెసోనల మధురిమలూ, నవనీత మృదుహృదయాల నేర్పరిచి వుంటాడు దైవం. అందుకే ఇద్దర్నీ మిత్రుల్ని చేశాడు. ఒకచోట కూర్చితే ఎంత బాగుంటుంది! అవును. అలాగే కావాలి. భగవాన్! ఈ కోరిక తీర్చు. ఇదివరలో వలె విఫలం కావించకు' అనుకుంటూ వెళ్ళిపోయింది క్రిందకు.
శ్రీహరీ, లక్ష్మీదేవి, బలరామయ్యా వచ్చారు భోజనాల గదిలోకి. పెద్ద అస్వస్థత ఏదో చేసినట్టు తీసిపోయిన ఆ ముఖాలలోకి చూడటానికే భయమైంది అందరికీ. పద్మా, శాంతీ త్వరత్వరగా వడ్డించసాగారు.
"ముందు నాన్నగారికీ, అమ్మకూ వడ్డించు, పద్మా. తర్వాత నేనూ, రాజా కూర్చుంటాము" అని వెళ్ళిపోయాడు శ్రీహరి. అలాగే వడ్డించింది పద్మ.
భోజనాలు అవుతూండగా గ్రుక్కపట్టి ఏడుస్తూన్న ప్రశాంతిని తీసుకువచ్చాడు రామన్న. సాంత్ చటుక్కున అందుకుని దూరంగా తీసుకుపోయింది, అసలే చికాకుగా ఉన్న తల్లిదండ్రుల మనస్సు మరింత చికాకుపడకుండా. భుజంపై పడుకోబెట్టుకుని జోకొడుతూంటే ప్రశాంతి మెల్లగా ఏడుపు మానింది. చల్లగాలికి నిద్రపుచ్చుదామని శాంతి తోటలోకి దారితీసింది. వెళ్ళి సిమెంటు బెంచీపై కూర్చుంటూండగా స్పష్టంగా సంభాషణవినిపించింది. 'ఓహో రాజా, అన్నయ్యా కాబోలు!' అనుకొంది. కాని ఆ సంభాషణ అప్రయత్నంగానే వచ్చి చెవులను సోకింది. రాజా, శ్రీహరే కాదు మూడవ కంఠస్వరంకూడా ఉంది-శేషయ్యది! ఆయనే మరీ అందరికంటే గట్టిగా మాట్లాడుతున్నాడు.
"చూడండి, అల్లుడుగారూ, మీ స్నేహితుడి సమాధానా లెంత అందంగా వున్నాయో!" అన్నాడు శేషయ్య.
"ఏమన్నాడేమిటి? వాడిలో కొంచెం హాస్యం పాలు ఎక్కువలెండి" అన్నాడు శ్రీహరి చిన్నగా నవ్వి.
"హాస్యంకాద. నిజంగానే" అన్నాడు రాజా.
"ఇంతకూ అసలు విషయం ఏమిటీ?" ప్రశ్నించాడు శ్రీహరి.
"ఇదివరలో ఒకసారి అడిగాంకదా, జయను యిస్తామని? అప్పుడసలు పెళ్ళే వద్దన్నారు. ఇప్పుడేమో 'ముందు జయకు ఇష్టమౌనో, కాదో అడగండి. ఆమె సంతోషంగా అంగీకరిస్తే తప్పక చేసుకుంటాను' అంటున్నారు. ఇది విడ్డూరం కాదూ? ఆడపిల్లకు నచ్చడమేమిటి?"
ప్రత్యక్ష, అజ్ఞాత శ్రోతలు యిరువురి నెత్తినా పిడుగులు పడ్డాయి. కళ్ళు మసకగ్రమ్మాయి. కాళ్ళక్రింద భూమి కంపించింది. క్షణకాలం కాలమే స్థంభించింది. 'ఏమిటీ? రాజా వివాహానికి సుముఖుడుగా వున్నాడా? జయ అంగీకరిస్తే చేసుకుంటాడా?' భీకరమైన తుఫాను చెలరేగింది అన్నా చెల్లెళ్ళ హృదయంలో.
"అలాగన్నావా, రాజా?" అడిగాడు శ్రీహరి ఎలాగో లేని ఓపిక తెచ్చుకొని.
"అవును, శ్రీహరీ." మెల్లగా అన్నాడు రాజా. "ఇదివరలో వివాహం చేసుకోకపోతే ఏమిటని మొండితనం వుండేది. కాని యీమధ్య రెండు మూడు సార్లు జ్వరం వచ్చి తగ్గింది. రాయివంటి నా శరీరానికి యిదివరకెప్పుడూ జ్వరాలూ, రోగాలూ లేవు. అప్పుడుఅనిపించింది-'నా అనే వా'ళ్ళుండాలని. జయకు పూర్తిగా అంగీకారమైతే నాకూ అంగీకారమే. ఆడపిల్లకు యిష్టా యిష్టాలు లేవనే మూర్ఖత్వంతో బలవంతం మాత్రం సహించలేను."
పకపకా నవ్వాడు శేషయ్య. "సరే. ఇంతవరకూ వచ్చింది గనుక చెప్పేస్తున్నాను. ఇక పెళ్ళి కుదిరి పోయింది. ముహూర్తమే తరువాయి. ఇందుకు పద్మా, జయా కలిసే నన్ను రప్పించారు టెలిగ్రాం యిచ్చి. చాలా?"
శాంతి హృదయగతస్థితి వర్ణనాతీతం. గబ గబా అక్కడినుంచి తన గదిలోకి పారిపోయింది. శ్రీహరి నివ్వెరపోయాడు 'పద్మ మాట మాత్రమైనా నాతో చెప్పింది కాదు. అడ్డు పెడతానని భయపడిందా? శాంతి హృదయ పరివర్తన ఆమెకూ తెలిసిందేకదా? అయినా యింత స్వార్ధంతో ప్రవర్తించిందా? అవును! తన చెల్లెలు తనకెక్కువ; నా చెల్లెలు నాకు ప్రాణం!' మనస్సులోనే నిర్లిప్తంగా నవ్వు కున్నాడు. ఒకవంక ప్రాణస్నేహితుడు, మరొక వంక ప్రాణాధికమైన సోదరి. వేరొకవంక ప్రాణప్రియమైన భార్యకు సహోదరి. ఎవరిని కాదన గలడు? ఎవరిని నొప్పించగలడు? ఏమిటీ అగ్నిపరీక్ష? ఎవరి ప్రమేయమూ అక్కరలేని, ఎవరికీ హానిచేయని తన చెల్లెలి కేమిటీ శిక్ష? దెబ్బమీద తగులుతూన్న ఈ దెబ్బకు ఆమె సుకుమార హృదయం తట్టుకోగలదా? అందరికీ శాంతి ప్రసాదించే శాంతి జీవితమే యింత అశాంతిపూరితమై పోతూందేమిటి? బాధగా కళ్ళు మూసుకున్నాడు. నిండు హృదయంలో భగవంతుని స్మరించాడు. 'అన్నిటికీ నీవే వున్నావు. నీముందు మేమెంత? నీనిర్ణయం ముందు మా కోరిక లేపాటి? నీవే దిక్కు!' అనుకొని దైర్యంగా కళ్ళు తెరిచాడు.
"అంగీకారమైనట్టేకదా, రాజా?" అనడిగాడు పరిపూర్ణ హృదయంతో.
రాజా మాట్లాడలేదు.
"సిగ్గు పడుతున్నారా?" అని నవ్వాడు శేషయ్య.
"చెప్పు, రాజా. ఇంకేమైనా వున్నాయా మాట్లాడవలసినవి?" అడిగాడు శ్రీహరి.
"ఏం లేవు. మీ అందరి ఇష్టమే" అంటూ లేచి వెళ్ళిపోయాడు రాజా.
"మరి కట్నం అదీ......" అర్దోక్తిలోనే వదిలేశాడు శేషయ్య.
"ఏమీ తీసుకోడు. అత డటువంటివాడు కాదు. జయ అదృష్టవంతురాలు" అన్నాడు శ్రీహరి.
"నాబిడ్డ లిద్దరూ అదృష్టవంతులే. పద్మకు మీరు దొరకలేదూ?" తృప్తిగా నిట్టూర్చుతూ అన్నాడు శేషయ్య.
పద్మ భోజనానికి పిలుస్తూన్నా వినిపించుకోలేదు రాజా. "పళ్ళూ, పాలూ తీసుకున్నాను" అని తన గదిలోకి వెళ్ళిపోయాడు.
శాంతి అసలు తలుపు తీయలేదు. "ఆకలి లేదు" అంది లోపలినుంచే.
శ్రీహరిని పిలిచింది పద్మ. "వద్దు, పద్మా. కడుపు నిండిపోయింది. నా స్నేహితుడు రాజా ఒక ఇంటివాడవుతున్నాడు. నీ చెల్లెలు అదృష్టవంతురాలు. ఆ తృప్తే చాలు" అన్నాడు.
ఉలిక్కిపడింది పద్మ. "రాజా ఒప్పుకున్నాడా?"
"ఒప్పుకున్నాడమ్మాయ్. రేపు ఇంటికి వెళ్ళి మీ అమ్మతో కూడా చెప్పి ముహూర్తం పెట్టిస్తాను. ఉత్తరం వ్రాస్తాను. మొత్తం మీద చాలా తెలివైనపనే చేశారమ్మాయ్! నీ పెళ్ళిలాగే జయపెళ్ళికూడా చాలా తేలికైపోతుందని ఎప్పుడూ అనుకోలేదు."
తండ్రి వెళ్ళిపోయాక పద్మ సజలనేత్రాలతో అంది: "రాజా యింత తేలికగా యిలా ఒప్పుకుంటాడని నేననుకోలేదు. శాంతి ఏమైపోతుందో!"
హేళనగా నవ్వాడు శ్రీహరి. "ఎవరేమై పోతేనేం? నీకు నీ చెల్లెలికంటే ఎక్కువెవరున్నారు?" శాంతివిషయమైన బాధలో, భార్యతో ఎప్పుడూ మాట్లాడనంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు శ్రీహరి.
కాని ఆ మాటలు శూలాల్లా తగిలాయి పద్మకు. "ఇందులో నా ప్రమేయ మేమీలేదు. నేనూ మీలా తర్వాత తెలుసుకున్నదాననే. కాని నాన్న ఎదుట జయను చిన్నబుచ్చట మెందుకు అని అలా అంగీకరించవలసి వచ్చింది. పాపమీద ఒట్టు పెట్టి చెప్పుతున్నాను" అంటూ వెళ్ళిపోయింది.
ఆ రాత్రి శాంతినిలయంలో తృప్తిగా భుజించినవారూ, సుఖంగా నిద్రించినవారూ ముగ్గురే ముగ్గురు - జయా, శేషయ్యా, శ్యామలా. మిగిలిన అందరూ చిత్రవిచిత్రమైన బాధలతో సతమతమైనవారే.
శాంతి కింకా విషయం తెలియదనుకున్న శ్రీహరీ, పద్మా ఆమె గదిలోనుంచి వినవచ్చిన వెక్కిళ్ళతో తమ అభిప్రాయం తప్పని తెలుసుకున్నారు. ఓదార్చడానికి వెళ్ళబోతున్న పద్మను వారించాడు శ్రీహరి. ఏడవనీ. అదే మంచి ఉపశమనం. శాంతి ఎంతో అదృష్టవంతురాలనుకొనేవాడిని. ఏమిటో, దాని జీవితం అలా సుడిగుండాల పాలైంది."
