
శాంతి సాయంకాలం నాలుగు గంటల వరకూ తండ్రి గదిలోనే గడిపివేసింది. అందుకు కారణాలు రెండు. మానసికంగా కృంగిపోయిన తండ్రిని ఆలోచనలతో బాధపడనివ్వకుండా దగ్గర నిత్యం ఎవరో ఒకరు ఉండడం అవసరం. తన పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది. దూరాన ఉన్న ఆత్మీయుడిన ఒక వ్యక్తి స్వచ్చమైన పాలవంటి హృదయంనుంచి చిలకబడిన వెన్నకోసం, వసంత సమీరంవంటి హాయినిచ్చే సందేశం కోసం స్వాతివానకొరకు ముత్యపు చిప్పలాగా ఎదురుచూచింది. లభించక నిరాశ చెందింది; అసలు స్వాతివాన పడనేలేదని సరిపెట్టుకుంది. కాని, ఆ స్వాతివాన కురిసీ తనకు అందలేదని తెలిసి ఆమె హృదయం విలవిల లాడింది. అందుకు కారణంకూడా గ్రహించ గలిగిన ఆమె అందువల్ల తనకు కలిగిన సంక్షోభం ఫలితంగా ఏర్పడిన ఆగ్రహాన్ని బహిర్గతంకాకుండా అణిచిపెట్టాలి. అందుకే శాంతి, ప్రశాంతితో పాటు సాయంత్రంవరకు తండ్రిగదిలోనే ఉండిపోయింది.
కాని అప్పుడు మరొక చిత్రమైన సంఘటన జరిగింది. శ్రీహరి మామగారైన శేషయ్య ఆదరా బాదరా ప్రవేశించాడు గదిలో. బలరామయ్య, శాంతి కూడా ఆశ్చర్యపోయారు. 'అసలే కుటుంబ కలహాలవల్ల మనస్థితి వికలంగా ఉంటే ఈ సమయంలో యీ బంధుమిత్రుల రాకపోకలేమిటి?'
బలరామయ్య నవ్వుతూనే పలుకరించ గలిగాడు. "ఏం, బావగారూ? అమ్మాయిఫైనా, మనుమరాలిపైనా - ఎవరిమీద అంత దృష్టి తిరిగింది?"
"హమ్మయ్య! అయితే అంతా బాగున్నారన్న మాట!" తేలిగ్గా నిట్టూర్చి చెమట తుడుచు కొంటూ బరువైన కాయాన్ని కుర్చీలో జేరవేశాడు ఆయన. రొప్పుతూ చెప్పాడు: "ప్రొద్దున్న పదిగంటలకు టెలిగ్రాం అందించి-జయ యిచ్చినట్లు, వెంటనే రమ్మని. అన్నం ముందు కూర్చున్నానప్పుడే. తినకుండానే లేచి పోయి, ఆపాళానే బయల్దేరి వచ్చేశాను. ఏమీ తెలియదు. ఎందుకో తెలియదు. ఒకటే భయం."
ఆశ్చర్యపోతూ విన్నారు బలరామయ్యా, శాంతీ. ఆయన రాక తెలిసి శ్రీహరి, పద్మ, లక్ష్మీదేవికూడా అక్కడకు వచ్చారు. విషయం విని వారూ విస్మయం చెందారు.
"ఏదీ, యింతకూ సూత్రధారి జయయేదీ?" అడిగారు బలరామయ్య.
గాలించగా ఆమె అక్కగదిలో ఒక మూలనక్కి కూర్చుంది.
"ఏమిటే, యిదీ?" ఆశ్చర్యంగా, కోపంగా అడిగింది పద్మ.
మెల్లమెల్లగా చెప్పింది జయ: "రోజుకో గొడవగా వుంది కుటుంబంలో. నేనుకూడా యిక్కడ దేనికీ - వెళ్ళిపోదామనీ."
పద్మకు చాలా కోపం వచ్చింది. "ఈ గొడవంతా జరిగాక నిన్నరాత్రి నేనే అడిగానుకదా, రామన్నను తోడిచ్చి మనవూరు పంపించేస్తానని? వెళ్ళనన్నావేం మరి అప్పుడు?"
"అవును. నాతోకూడా అలానే చెప్పింది, యిప్పట్లో వెళ్ళనని" అంది శాంతి.
జయ మాట్లాడలేదు.
"ఎందుకొచ్చిన యేళ్ళు, ఇంగితజ్ఞానం లేక పోయాక? వెళ్ళాలనుంటే మాతో చెప్పి వెళ్ళిపోలేకపోయావా? పెద్దవాళ్ళను శ్రమపెట్టడమూ, ఆందోళన పరచడమూ దేనికీ? కొంప ములిగిపోయినట్లు టెలిగ్రాం దేనికి? ఈ చేసింది చాలుగాని, యిక్కడి గొడవలేం ఆయనతో చెప్పకు." విసుక్కొంటూ వెళ్ళిపోయింది పద్మ.
శ్యామలా, నారాయణా సామాన్లతో పట్నం వెళ్ళిపోవడానికి మూడు లారీలువచ్చి ఆగాయి, తోటలో. సామాన్లు వాటిలోకి ఎక్కసాగాయి. బలరామయ్యా, లక్ష్మీదేవీ ఎవరి గదులలో వారు తలుపులు బంధించుకుని ద్రిగ్గుళ్ళీ ఏడవసాగారు, నిశ్శబ్దంగా. పద్మా, శాంతీ ఎంత మొత్తుకున్నా ఒక్కరిచేతా తలుపులు తీయించలేకపోయారు.
"తమ పుత్రుడు, తమ కడుపు పంట, తమ ఒడిలో, భుజాలపై ఆడీపాడీ పెరిగిన బిడ్డ - ఇవాళ తానే ఒక మనిషయ్యాడు. నాన్నా, అది కొనిపెట్టవ్?- అని అడగవలసిన అవసరస్థితిని దాటిపోయాడు. దెబ్బతగిలితే. బాధ కలిగితే 'అమ్మా' అని ఆక్రోశించే స్థితిని మీరిపోయాడు. 'ఇది యేంచేయను? అది ఎలాగ?' అని అమ్మనూ, అయ్యనూ దిగి సలహా పొందవలసిన అగత్యం లేదిప్పుడు. నాన్న వీపుపై ఆడిన బాలకుడు కాడు. ఆ ముద్దు మాటలతో, ముగ్ధ హాసాలతో అమ్మను మురిపించిన పసిబిడ్డ కాడు. 'అన్నయ్యా!', 'చెల్లాయ్!' అని ఆప్యాయంగా సంబోధిస్తూ ఆడీపాడిన శైశవావస్థలోలేడు. మనిషిగా రూపొందిన మానవుడు......స్వార్ధ పరుడైన యువకుడు! 'నేను - నా సంసారం - నా బాగు' అనే తాపత్రయంలో యుక్తాయుక్తాలనే మరిచిన పురుషుడు!" ఇదే ఆ వార్ధక్య హృదయాలలో చెలరేగిన ఘోష!
"ప్రతిదానికీ 'నీయిష్టమన్నయ్యా. అలాగే కానీయ్, అన్నయ్యా' అని దరహాసవదనంతో అంగీకరించే తమ్ముడేనా యీ తమ్ముడు? ఏ విషయంలో పొరపాటుగా ప్రవర్తించ బోయినా, ఎవరి విషయంలో తొందరపడ బోయినా 'చినబాబూ!' అని అదలించగానే ఆగి పోయి అణిగిపోయే తమ్ముడేనా ఈ నారాయణ? నాకూ పెళ్లైంది. అయినా నేను యిదివరకు లాగే వున్నాను. మరి వివహం కాగానే వీదిలో యీ మార్పేమిటి?" అదే ఆ జ్యేష్ఠ సోదరుని అంతరంగంలోని ఆవేదన!
"శాంతీ! పరుగెట్టకే, పడిపోతావ్. పువ్వులు కావలిస్తే నేను కోసిస్తాను. చెట్లెక్కకమ్మా - అంటూ అపురూపంగా చూచే చిన్నన్నయ్యేనా? నాన్నగారి ఒళ్ళో కూర్చోవటానికి తనతో చిలిపిగా పోటీపడే చిన్నన్నయ్యేనా? ఆటలలో పోటీపడి చిన్నతనపు అజ్ఞానంతో తనను కొట్టి మళ్ళీ బ్రతిమలాడి భుజాలపై ఎక్కించుకున్న చిన్నన్నయ్యేనా? గోదావరీ నదీతీర సైకతాలలో తనతో ఆడీ, పాడీ, ఆళువ చిప్పలు పొగు జేసినా చిన్నన్నయ్యేనా? నువ్వు ఒంటరిగా పయనించగలిగినా నేను వదిలిపెట్టలేను. రానాతో - అంటూ శాంతినికేతన్ నుంచి బలవంతంగా ప్రయాణంచేసి తనతో తీసుకు వచ్చిన చిన్నన్నయ్యేనా యిలా మారిపోయాడు? నిన్నటి మమతలకూ, నేటి జీవితానికీ సంబంధం లేదా? రక్తసంబంధం తెంచుకొంటేకాని వివాహ బంధం బలపడదా? రేపు నా వివాహమైతే నాకూ యీ స్వార్ధం చుట్టుకొంటుందా? నేనూ యిలాగే అయినవారికి దూరమై పోతానా? మరొకర్ని దూరంచేసి యిలాగే నేనూ మెట్టినింటిలో అశాంతి రేకెత్తిస్తానా?" అదే నా చెల్లెలి మనస్సులో ప్రజ్వలించినమంట.
"నేనూ యీ ఇంటి కోడలుగానే వచ్చాను. ఏనాడూ ఎవరినీ నొప్పించలేదు. అత్త మామలే తల్లిదండ్రులయ్యారు. ఆడపడుచు తోబుట్టువుకంటే మిన్న అయినది. పరివార మంతా స్వంత బిడ్డలలా మారిపోయారు. తన ప్రవేశంవల్ల శాంతినిలయంలో మరింత శాంతి నెలకొన్నదేకాని తరుగలేదు. మరి తనవలెనే వచ్చిన మరొక కోడలి పాదంతో యీ శాంతినిలయమిలా మారిపోయిందేమిటి? ఇంత నీచంగా, నిర్మొహమాటంగా ఎలా ప్రవర్తిస్తారు కొందరు వ్యక్తులు? ఏమై పోతున్నదీ కుటుంబం?" ఇట్లా మధనపడుతున్న దా యింటి పెద్ద కోడలు.
రామన్న కావేళ ఏ పనీ తోచటంలేదు. వింతగా మారిపోతున్న విజ్ఞానమయ ప్రపంచంలో అతడికి అన్నీ ఆశ్చర్యజనకంగానే ఉంటాయి. ఈ పట్టణాలన్నీకూడా పల్లెలుగా ఉన్న రోజులూ. గోదావరి విచ్చలవిడిగా ప్రవహించే రోజులూ, సాధారణ జనులకు చొక్కాలు లేని రోజులూ అతడికి తెలుసు. 'ఎక్కడో ఆడిన మనుషులు మనెదుట, సినీమాలో మళ్ళీ ఆడతారటా, పాడతారటా, అని విని ఆశ్చర్యపోయేవాడు. 'ఎట్టెట్టా - దొరబాబు లొచ్చి గోదారమ్మకే అడ్డుకట్టలు కట్టీసినారే, వంతెన నిలబెట్టీసినారే? ఏనాడో ఎవరో ముని తెచ్చి వాడటీ యమ్మని భూమ్మీదికి. మరీ దొరల కెట్టా లొంగింది గంగమ్మ తల్లి? ఈ ఎంగిలీ సోళ్ళు చావా మంతరగాళ్ళు!' అని అబ్బురపడే వాడు. 'సిత్రం! ఇంత సిన్నగద్దు రేడియో పెట్టెలో ఎందరు మడుసులుంటారో మరి! మాట్లాడ్తారు, పాటలు పాడతారు! ఎట్టెట్టా!' అనుకొనేవాడు. ఇన్ని విశేషాలు చూచిన అతడికి యింకా విశేషంగా తోస్తున్న దీనాటి శాంతి విలయ వాతావరణం. "ఏటిదీ? తండ్రులూ, కొడుకులూ ఏనాటి కెట్టాగుంటారో గందా? పెదబాబుకూ, చినబాబుకూ పోలికేలేదు గందా! ఒక సెట్టుక్కాసిన కాయల్లోనే ఎంత తేడా! ఏం మాయా పెపంచకం!"
"పద్మా, మీ మరిదీ, తోటికోడలూ ఉద్యోగాని కెళ్ళిపోతున్నారేమిటమ్మా?" అనడిగాడు శేషయ్య.
"ఔను, నాన్నా."
"మరైతే అలాగున్నా రేమిటి? వాళ్ళు వెళ్ళడం మీ కెవరికీ యిష్టం లేదా? అమావాస్య పూటా ఈ ప్రయణ మేమిటసలు?"
ఇక పద్మకు చెప్పక తప్పలేదు.
"అయ్యో! అయితేమాత్రం? ఇటువంటి రోజునా ప్రయాణం? అందులోనూ క్రొత్త కాపురం?" అరిచాడు శేషయ్య.
ఆ మాటలు విన్న శాంతి గుండె దడదడ లాడింది. 'అన్నయ్య! ఎన్ని జరిగినా అన్నయ్యే. అతడికి చెడు జరిగితే నేను చూడగలవా? మేం భరించగలామా?' అనుకుంటూనే పరుగెత్తింది నారాయణ గదిలోకి.
సామాన్లన్నీ లారీల కెత్తట మయ్యింది. తార్పాలిన్ లు కట్టించి, గదిలోకి వచ్చి దుస్తులు వేసుకుంటున్నాడు నారాయణ. శ్యామల ముస్తాబయ్యె ఉంది. కుర్చీలో కూర్చునుంది.
"చిన్నన్నయ్యా, చిన్న రిక్వెస్ట్." అమాంతంగా గదిలోకి పరుగెత్తుకువచ్చి రెండు చేతులూ పట్టేసుకున్న చెల్లెల్ని చూచి ఆశ్చర్యపోయాడు, నారాయణ. ఇంత గొడవ జరిగాక యిక ఎప్పటికీ పూర్వపు సబంధాలూ, మమతలూ పునరుద్ధరింపబడవని అతడనుకున్నాడు. ఆ విషయమై అతడి కే బాధా, విచారమూ లేవు. కాని ఊహ తప్పినందుకు మాత్రం అతడి కాశ్చర్యం కలిగింది. అట్లాగే నిశ్చేష్టుడై చూస్తున్నాడు.
"నువ్వేమన్నా నాకు కోపం లేదు, చిన్న న్నయ్యా, కాని, అసలే పెద్దవాళ్ళతో కలహించి వెళ్ళుతున్నావ్. వాళ్ళ ఆశీర్వాదమూ లేక, ముహూర్తబలమూ లేక ఎలాగ? మానేసెయ్యి. రేపు సాయంత్రం వెళ్దురుగాని."
మనిషిగా పుట్టిన ప్రతివారిలోనూ అంతో యింతో మానవతా, మంచితనమూ ఉంటాయి. కాని వాటిని మరుగునపరిఛే పొరలు అధికంగా ఉంటాయి.
ఒక్క అమృతమయ స్పర్శతో ఇప్పుడని మసకమసకగా కన్పించసాగాయి నారాయణలో. క్రిందటి రోజు తాను అడ్డంగా నరుకుతాననడానికి కూడా వెనుదీయలేదు స్వంత చెల్లెల్ని. ఇవాళ ఆ చెల్లెలే అంతా మరిచి ఆ అన్నకు శుభం కలగాలని ప్రార్ధిస్తూంది!
అంతా చూస్తూన్న శ్యామల చికాకుపడింది. "అమావాస్యా, పౌర్ణమీ- నాన్సెన్స్! మాకెవళ్ళూ చెప్పక్కర్లేదు. ఇక్కడికీ జరిగింది చాలు."
నారాయణ మాత్రం అలా విదిలించలేక పోయడు. మృదువుగానే, "అంత తయారయ్యాంగా? వెళ్ళనీ. ఫర్వాలేదులే" అంటూ జోళ్ళు తొడుక్కోబోయాడు.
"వద్దన్నయ్యా. నామాట విను." అన్నకాళ్ళకు చుట్టేసుకుంది శాంతి. "ఎలాగూ విడిపోతున్నాం. ఇక ఈ విడిపోయన బ్రతుకులు విడిపోవటమే. విడిగానైనా సుఖంగా వుంటే అంతే చాలు. క్రొత్త సంసారం. క్రొత్తయింట్లో ప్రవేశం. ఈవేళ - యింత దారుణమైన రోజునమాత్రం వద్దు. నీకోసమే ఈ చెప్పేది. ఇంకేమీ లేదిందులో." నేత్రాలు వర్షఋతువు లోని కొలమలయ్యాయి.
నారాయణ హృదయం ద్రవించిపోయింది.
"వెళ్ళను, శాంతీ!" అంటూ ఆర్ద్రనయనాలతో లేవనెత్తిన అన్నను చూచి ఆశ్చర్యపోయింది శాంతి. "నిజంగా?"
"నిజమే." బలవంతంగా అన్నాడు.
శాంతి ముఖం కలకలలాడిపోయింది. "చాలా సంతోషమన్నయ్యా. రేపు సాయంత్రం వెళ్దురుగాని ఆనందంతో చిన్నపిల్లలా గెంతుతూ వెళ్ళిపోయింది. "ఏమిటే మూర్ఖత్వం, యింతా తయారై? రేపటివరకూ వుంటే ఆ లారీల కెంతై పోతుందో ఏమైనా తెలుసా?" తీక్షణంగా ప్రశ్నించింది శ్యామల.
"ఫర్వాలేదులే. మహా అయితే మరో నలుగొందలు" అంటూనే అక్కడినుంచి అన్యమనస్కంగా బయటకు నడిచాడు నారాయణ.
మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి. ఇంట్లో ఎలా ఉన్నా, ఒంట్లో ఎలా ఉన్నా అతిథి మర్యాదలు తప్పవు. పద్మా, శాంతీ అతిప్రయత్నం మీద మనస్సులను నిలద్రొక్కుకుని యింటిపనులు చూస్తున్నారు.
"రాజాగారికి భోజనం వద్దట" అన్నాడు రామన్న వచ్చి,
"నేను పిలుస్తానుండు" అంటూ శాంతి వెళ్ళింది అతడికోసం.
శేషయ్యా, కూతుళ్ళూ ఒంటరిగా మిగిలారు.
భోజనంచేస్తూ శేషయ్య "అయితే ఉదయమే లేచి వెళ్ళిపోదామా, జయా?" అనడిగాడు కూతుర్ని.
జయ మాట్లాడలేదు.
"నాన్నగా రడిగినదానికి చెప్పవేం?" అంది పద్మ.
అప్పటికీ జయ మాట్లాడలేదు. భావయుక్తంగా అక్కముఖంలోకి చూచింది. పద్మ గ్రహించింది.
పద్మ ఎలాగో నిగ్రహించుకుని అంది: "పోనీ, తొందరేం, నాన్నా? వెళ్ళచ్చు తర్వాత. ఆ రాజా ప్రస్తుతం యిక్కడే వున్నాడుగా? వెనకొకసారి కదిపాం. ఎటూ తేలలేదు. ఇప్పుడు మళ్ళీ అడిగి చూస్తే ఎలాగుంటుందో?"
ఆశ్చర్యంగా చూచాడు శేషయ్య, "ఎంతటి వాళ్ళర్రా! అయితే మీ యిద్దరూ కలిసి చేసిన పనేనన్నమాట యిది! మంచిపని చేశారు. అలాగే చేద్దాం."
జయ ముఖం అరుణలాగ రంజితమైంది. పద్మముఖం గంభీరమైంది. అబద్ధం అప్పుడు అనవసరం. కాని నిజం చెప్తే చెల్లెలు చిన్నబుచ్చుకుంటుంది. అందుకే పద్మ మౌనం వహించింది.
* * *
