శ్రీపతి గారి ఇల్లు బంధువులతో, పుర ప్రముఖులతో కళకళ లాడుతూ ఉంది. ప్రభాకరం పుట్టిన రోజు పండుగకు ఏర్పాట్లు భారీ ఎత్తున చేయించారు శ్రీపతి గారు. ప్రసాద్ రవీంద్ర భారతి లో శారద కు సన్మానం జరిగిన మరురోజు యింటికి వెళ్లి మళ్ళీ వచ్చాడు.
పుట్టిన రోజు పండుగ ముగియగానే శ్రీపతి గారు శారద ను తన మేనకోడలుగా ఆహూతులందరికీ పరిచయం చేసి తనకు కాబోతున్న కోడలుగా ప్రకటించారు. ఈ విషయం అందరికీ సంతోషాన్ని కలిగించింది. ఆమె గొప్ప రచయిత్రి అని తెలిసిన వారంతా ప్రభాకరం అదృష్ట వంతుడిని అనుకున్నారు. కొందరు ఆమాటే పైకి కూడా అన్నారు.
శారద కు రవ్వల నక్లేసు, ఎంతో విలువైన చీరెలు అందరి సమక్షంలో అందజేశారు శ్రీపతి గారు. ఆవిధంగా వారు తమకు కాబోయే కోడలిని సన్మానించారు.
అతిధులంతా 'వుడ్ బి కపుల్' ను ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ విందు ముగిసిన తర్వాత వెళ్ళిపోయారు.
రెండవరోజు శారద, నీరజ ల వివాహాలకు ముహూర్తాలు నిర్ణయించేందుకు పురోహితునికి కబురు పంపి, అతని రాక కోసం ఎదురు చూస్తూ హాలులో కూర్చొని కబుర్లలో పడ్డారు.
'అంతా బాగానే ఉంది. కన్యాదానం ఎవరు చేస్తారోయ్? ఈ ఆలోచన యింత వరకూ తట్టనే లేదు.' విస్మయంతో సుందరరామయ్య గారిని చూస్తూ అన్నారు శ్రీపతి గారు.
'నిజమే సుమండీ! పెద్ద చిక్కే వచ్చిందే! మీరు అనేంత వరకూ , ఆ ఆలోచన నాకు తట్టనే లేదు . ఎలాగబ్బా......? పెద్ద సమస్యే నే?' సందిగ్దావస్త లో పడి అన్నారు సుందరరామయ్య గారు.
'ఎలా మరి?' ....అన్నపూర్ణమ్మ గారి ఆందోళన.
'గట్టి చిక్కే!' శ్రీపతి గారి అభిప్రాయం.
అంతా ఆలోచనలో పడ్డారు---
కొన్ని నిముషాల తర్వాత శ్రీపతి గారు తల పంకిస్తూ 'ఒక్కటే మార్గముంది, అందుకు మన రామం సహాయం కావాలి.' ఆప్యాయంగా రామాన్ని చూస్తూ అన్నారు.
'నా సహయమా.........! అందుకు నేను సిద్దం......చెప్పండి. ఏం కావాలంటే అది చేస్తాను.' చిరునవ్వు ముఖాన చిందిస్తూ అన్నాడు రామం.
'ఏమీ లేదు వెంటనే శాంతను వివాహమాడి సతీ సమేతంగా నీవే కన్యాదానం చేయాలి. శారద, నీరజలకు అన్న వరుస అయ్యే బంధువులు ఉన్నారు. కాని నాకు యిష్టం లేదు. శారదను ఆదుకొని స్వంత చెల్లెలి కన్న మిన్నగా చూసుకున్నావు. అందుకే నీవే అర్హుడవు ' లక్ష్మయ్య గార్ని చూస్తూ 'మీరేమంటారు? ముందు మీ అమ్మాయి వివాహం రామంతో జరిపించిన తర్వాత శారద, నీరజల వివాహాలు జరిపించాలి.'
'అంతకన్నానా....!' రామాన్ని ప్రశ్నార్ధకంగా చూశారు లక్ష్మయ్య గారు.
'నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సదవకాశం నాకు లభిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నాకు చెల్లెళ్ళు లేని కొరతను శారద, నీరజలతో తీర్చుకుంటాను. కాని సుందరరామయ్య గారి కేమైనా అభ్యంతరం ఉం.......'
రామం వాక్యం పూర్తీ కాకుండానే 'ఎంత ,మాటన్నావు బాబూ! నాకు అభ్యంతర ముంటుందా? నా కన్నతల్లి కి నీవే అన్నవు తండ్రివీ కూడా! పేరుకు మాత్రమే నేను కన్న తండ్రిని. నాకు ఎంతో సంతోషంగా ఉంది......' భరించలేని సంతోషంతో అన్నారు సుందరరామయ్య గారు.
అంతలో పురోహితుడు వచ్చాడు. ముందుగా శాంతా రామం ల వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. ఆ ముహూర్తానికి నాలుగయిదు రోజుల తర్వాత శారదా, నీరజల కు ముహూర్తాలు కుదిరాయి. అవకాశం ఎక్కువగా లేనందు వల్ల మరురోజే అంతా రామం ఊరికి బయలుదేరి వెళ్లి, అక్కడ పెళ్లి ప్రయత్నాలలో నిమగ్నులయ్యారు.
* * * *
అంతకొద్ది వ్యవధిలోనే శాంతా రామం ల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. చాలా మంది పేదలకు అన్నదానం జరిపారు లక్ష్మయ్య గారు. ఆ చుట్టుపట్ల గల గ్రామాలలో శాంతా రామం ల వివాహ ప్రసక్తి నే చర్చించుకోసాగారు. ప్రభాకరం సుందరం యిద్దరూ పెళ్లి పెద్దలై ఎక్కడా చూసినా వారే కనుపించారు.
సుందరం నీరజను వివాహ మాడుతున్నాడని తెలిసి రంగయ్య తాత ఎంతో సంతోషించాడు. వారి కుటుంబం లోని వారంతా సుందరం వివాహానికి తమ హర్షాన్ని వెలిబుచ్చారు.
రేపు హైదరాబాదు వెడతారనగా నీరజ సుందరం లు హాస్పిటల్ లో సుందరం రూములో కూర్చొని కబుర్ల లో పడ్డారు.
'నీరూ! నన్ను క్షమిం....'
సుందరాన్ని వారిస్తూ అతను తన మాటలు పూర్తీ చేయకుండానే ' 'మీరలా మాట్లాడకండి. జరిగినదంతా ఒక పీడ కలగా మరిచిపొండి.' ప్రేమతో నిండిన చూపులతో సుందరాన్ని కలవర పెట్టింది నీరజ.
'నీవెంత మంచిదానావు నీరూ! నా తప్పుల నన్నిటినీ క్షమించావు'
'నేనే కాదు స్త్రీల హృదయాలన్నీ అటువంటివే డాక్టర్! ఎంతో సున్నితంగా గాజువలె ఉంటాయి. పురుషులు తమ కఠిన హృదయాలతో వాటిని చిట్లగొడతారు. ఆ చిట్లిన హృదయాలతో టే పురుషుల శ్రేయస్సు కోరుతూ జీవితాంతం బాధపడతారు. మా అక్కయ్య ను, ఆమె తల్లిని అందుకు తార్కాణంగా తీసుకోవచ్చు. బావ ప్రధమం లో అంత కఠినం గా ప్రవర్తించినా అక్కయ్య యిసుమంతైనా బాధపడకుండా తుదకు అతనిలో వచ్చిన మార్పుకు కారకురాలై చివరకు వివాహం చేసుకో బోతూ ఉంది. ఆనాడు మా పెద్దమ్మ మా నాన్నగారి పేరును ఎక్కడా బయట పెట్టలేదు.' సగర్వంగా స్త్రీ జాతిని సమర్ధిస్తూ, సుందరం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది నీరజ.
'అవును నీరూ! నీ వన్నది నిజమే! అందుకే అంటారు స్త్రీ కి భూదేవికి ఉన్నంత వోర్పు ఉంటుందని.' అని మళ్ళీ 'ఇంతకూ నీవు నన్ను క్షమించి నట్లేనా?' అడిగాడు సుందరం.
'పొరపాట్లు అందరూ చేస్తారు. మీరు చేసిన ఆ పొరపాటును ఒప్పుకున్నారు. అందరి చేతా క్షమించబడ్డారు. 'అంది నీరజ చిరునవ్వుతో.
నీరజను దగ్గరకు జరుపుకుంటూ ఆమె శ్వాసలోని వేడికి తన్మయుడయ్యాడు సుందరం ------
అదే సమయంలో ప్రభాకరం శారదలు ఏకాంతంగా లక్ష్మయ్య గారి తోటలో కూర్చొని కబుర్లలో పడ్డారు.
'శారూ! నీ తెలివి తేటలతో పరిస్థితిని ఎంతో మెరుగు పరచావు. లేకపోతె అటు నీ చెల్లెలి జీవితమో, ఇటు శాంత జీవితమో గంగాపాలై ఉండేది. నీ తెలివి తేటలకు రెండవసారి నిన్నభినందిస్తున్నాను.'
'నా తెలివి తేటలకు మీరు సంబరాపడాల్సిందే ' చిరునవ్వుతో అని మళ్ళీ 'మొదటి సారి ఎప్పుడు' అని ప్రశ్నించింది. '
'నీవు జ్యోత్స్న వని తెలిసినప్పుడు.'
'అలాగా -- ప్రభాకరాన్ని చిలిపిగా చూస్తూ శారద.
'అవును! భార్యగానే కాకుండా మంత్రిగా కూడా పనికి వస్తావు. ఇప్పుడే నిన్ను ఆ పదవికి నియమిస్తున్నాను.'
'జీతమెంతీస్తారో?'
'అడగినంత ఇప్పుడు మాత్రం అడ్వాన్సు....' అంటూ శారదను అకస్మాత్తుగా తన బాహుబంధం లో బిగించి గులాబీలతో పోటీ పడుతున్న ఆమె చెక్కిలి పై తన పెదిమ లతో సున్నితంగా ముద్ర వేశాడు.
'అబ్బ! ఒదలండి. ఎవరైనా చూస్తారు! రోజురోజు కి మీరు మరీ కొంటె వారై తున్నారు.' ఆ కౌగిలి లోని హాయిని అనుభవిస్తూ, కౌగిలో మరీ ఒదిగిపోతూ పైకి మాత్రం అలా అంది శారద. వీరిద్దరి ప్రణయాన్ని చూసిన చిలుకల జంటోకటి కొన్ని క్షణాలు మాట్లాడు కొని ఆ తర్వాత ఒకదాని చేరువకు మరొకటి చేరుకుంది.
* * * *
శారద నీరజల వివాహాలు హైదరాబాద్ లో సుందర రామయ్య గారి ఇంట్లో ఎంతో ఆడంబరంగా జరిగాయి. శాంతా రామం లు వారిద్దరికీ కాళ్ళు కడిగి ఆ పిన్న వయస్సు లోనే కన్యాదాన ఫలితాన్ని దక్కించు కున్నారు.
పెళ్లి పందిరిలో పసుపు గుడ్డలతో వింత కాంతితో మెరుసిపోతున్న అనూతన వదూవరూ ద్వయాన్ని చూసిన ప్రతి వారి హృదయమూ సంతోషంతో పొంగి పులకించింది.
శ్రీపతి గారు, సుందర రామయ్య గారు ఆ నూతన వధూవరులను తనివి తీరా దీవించి తన ఎవ్వరూ చూడకుండా తమ ఆనంద భాష్పాలను తుడుచుకున్నారు.
ప్రభాకరం తన వివాహానికి రోజాను ఆహ్వానించాడు. ఆమె తన భర్తతో వచ్చింది. వివాహ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రభాకరం రోజాను పలకరించాడు.
'రోజా! కులాసాగా ఉన్నావా?' అని,
'కులసాగానే ఉన్నాను. ఆరోజు క్లబ్బు లో జరిగిన సంఘటన నా జీవితాన్ని పూర్తిగా మార్చి వేసింది ప్రభాకరం!' కృతజ్ఞత నిండిన చూపులతో ప్రభాకరాన్ని చూస్తూ అంది రోజా.
'ఆసంఘటన నిన్ను, నన్నూ కూడా మార్చి వేసింది. ఒక్కొక్కసారి చెడు సంఘటన నుండి మంచి ఉద్భవిస్తూ ఉంటుంది. అందుకు తార్కాణం మన విషయమే!' అని తన భార్యను రోజాకు పరిచయం చేసాడు ప్రభాకరం.
ఇద్దరూ చిరునవ్వుతో పరస్మరం నమస్కారాలు చేసుకున్నారు--
రోజా తన భర్తను ప్రభాకరానికి పరిచయం చేసింది -- ఇద్దరూ ఆప్యాయంగా ఒకరి ముఖంలోకి మరొకరు చూసుకుంటూ కరచాలనం చేసుకున్నారు.
బంధువులతో, అతిధులతో కిటకిట లాడుతూ ఉంది సుందరరామయ్య గారి యిల్లు. పెళ్లిరోజు రాత్రి భరతనాట్యం లలిత సంగీత జానపద నృత్యాలను ఏర్పాటు చేయించారు సుందర రామయ్య గారు.
ఇంత సందడి లోనూ పార్వతమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారూ శారద తమ కుటుంబాలకు చేసిన ఉపకారాలను తమ తమ బంధువులకు వివరించి చెప్పసాగారు. అందరూ శారద ను వేనోళ్ళ పొగుడుతూ ఉంటె సుందరరామయ్య గారి హృదయం ఆనందంతో పొంగి పోసాగింది. సంతోషం పట్టలేక పోయారు.
ఆ సమయంలో వారికీ లక్ష్మీ గుర్తుకు వచ్చి కనుల నిండా నీరు తిరిగింది. అప్పుడే అక్కడికి వచ్చి వారిని ఆ స్థితిలో చూసిన శారద వారి ఆందోళన కు కారణం త్రేలియక తికమక పడుతూ 'ఇదేమిటి నాన్నారూ? ఏం జరిగింది....?' అని ప్రశ్నించింది.
శారదను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆమె తల నిమురుతూ 'మీ అమ్మ గుర్తుకు వచ్చింది తల్లీ! ఇదంతా చూసుకొనే భాగ్యం ఆమెకు లేదన్న విషయం తలపుకు వచ్చి బాధ కలుగుతూ ఉంది.' కండువాతో కళ్ళ నద్దుకుంటూ అన్నారు సుందరరామయ్య గారు.
