Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 46


    నిన్నటి నీరజ రూపం, ఇప్పటి శాంత రూపం మనసులో మెదిలిన సుందరం కంపించిపోయాడు. స్త్రీ ఎంతటి సరళ హృదయమో , సమయాను కూలంగా అంతటి భయంకర మూర్తిగా కూడా మారుతుందన్న సత్యం అతనికి విదితమైంది. మళ్ళీ సుందరం పరిస్థితి మొదటికి వచ్చింది. ఇక శాంత కు తన ముఖమెలా చూపించాలో తోచక తికమక పడసాగాడు. ఒకేసారి ఇద్దరినీ మోసం చేసిన తనను వారిద్దరూ ఒక్కరోజు తేడాతో వారికి చేసిన మోసాన్ని గుర్తించగలిగారు. 'నీరజ ఎటు వెళ్ళిపోయి ఉంటుందబ్బా! ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు నేను. హి భగవాన్! ఏమిటి నా ఈ పరిస్థితి? అతి తెలివికి పోయి యిద్దరినీ దూరం చేసుకున్నాను. శాంత తలుచుకుంటే నన్ను ఈ ఊరి పొలిమేరలలో లేకుండా తరిమి వేయించగలుగుతుంది. మళ్ళీ ఈ జన్మ లో ఈ గ్రామానికి రాలేను. ఇప్పుడు నా కర్తవ్య మేమిటి? ఈ పరిస్తితులలో యింక బొంకడానికి సాధ్యపడదు. నా తప్పు ఒప్పుకోక తప్పదు. పశ్చాత్త పము అన్ని పాపాలనూ దహించి వేస్తుందని పెద్దలంటారు. ఈ పరిస్థితి నుండి మర్యాదగా బయటపడడానికి ఒక్కటే మార్గముంది. నే చేసిన తప్పులన్నీ రామానికి చెప్పి అతనిని క్షమాపణ కోరడం కన్న గత్యంతరం లేదు. రామం....! నా బాల్య స్నేహితుడు ప్రాణ స్నేహితుడు. నా అభివృద్ధి ని క్షేమాన్ని అనుక్షణమూ కోరే అతనికి ద్రోహం తల పెట్టాను. అందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిపాడా భగవంతుడు.' అని అలోచిస్తూ నిట్టూర్చి మళ్ళీ ఏదో స్పురణ కు రాగా తిరిగి ఆలోచనలో పడ్డాడు. 'అవును! నిన్న నీరజ శాంత లా ఈరోజు శాంత నీరజలా కనుపించారు. వస్త్ర వేషధారణ లన్నీ సక్రమంగా అమిరాయి. ఇదెలా జరిగింది? నీరజ విషయం యధాలాపంగా జరిగి ఉండవచ్చని సరి పెట్టుకున్నాను. శాంత నీరజ దుస్తులలో కనుపించడం లో అనుమాన పడవలసివస్తూ ఉంది. ఇద్దరికీ పరిచయం జరిగి ఏకమై నారేమో? అదెలా సాధ్యం....? ఆ అవకాశంలేదు. ఏమో? ఎవరు చెప్పగలరు. నీరజ ను అనునయించి ఆమె కోపాన్ని తగ్గించ గలిగాను. కాని' శాంత ను అపడానికే ధైర్యం చిక్కలేదు. రేపైయినా యింతే కదా....! శాంతదే పై చేయి ఔతుంది. అదే నీరజ కొద్దిసేపు నాతొ వాదించి సమాధాన పడింది శాంత అటువంటి స్వభావం కలది కాదు' పైవిధంగా ఆలోచిస్తూ హాస్పిటలు లోని తన గదికి చేరుకున్నాడు. సుందరం.
    కుర్చీలో కూర్చొని టేబులు పై తల ఆనించి బాధతో నుదురు రుద్దుకో సాగాడు.
    అంతలో కాంపౌండరు వచ్చి "నీరజమ్మ గారు ఈ ఉత్తరం మికిమ్మనారు' అని ఒక కవరు యిచ్చి వెళ్ళాడు.
    'ఆమె ఎక్కడికి వెళ్ళింది?' అతను వేల్లిపోయినది గమనించ కుండానే అని ఉత్తరం చించి చదవసాగాడు.
    డా. సుందరం గారూ!
    బాగా అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీవంటి చపల స్వభావం గల వ్యక్తిని వివాహమాడి 'జీవితాంతం ఎలా సుఖపడ గలను? అనే ప్రశ్నకు నాకు నేనే వేసుకున్నాను అందుకు 'ఏమాత్రం సుఖపడలేను!' అనే సమాధానం రావడం తో వెళ్ళిపోయాను.
    శలవు-----
                                                                                              ఇట్లు
                                                                                               నీరజ.
    ఆ ఉత్తరం చదివిన సుందరం మరీ కృంగి పోయాడు. మళ్ళీ ఏదో ఆలోచిస్తూ అలాగే కుర్చీలో కూర్చుండి పోయాడు తన కోసం పిలుపు రాగా ఆలోచనలనుండి తేరుకొని రోగులని పరీక్ష చేయడానికి వెళ్ళాడు.
    ఆ పరిస్థితిలో , పరధ్యానం లో అతను రోగులకు ఎటువంటి చికిత్స ను చేయగలడో ఆ భగవంతుడికే తెలియాలి---

                              21

    ప్రభాకరం , శారద  శాంత , రామం , సుందరం, తాయారు, నీరజ వీరంతా లక్ష్మయ్య గారి తోటలో పచ్చిక పై కూర్చున్నారు.
    'నేను నా స్నేహితునికి ద్రోహం తలపెట్టాను.' అందుకు ప్రతిఫలం అనుభవించాను. నీరజ, శాంత యిద్దరూ నాకు బుద్ది చెప్పారు. నాతప్పు నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాను. రామానికి నేను ద్రోహం చేస్తున్నా అతను మాత్రం నన్ను బేధ భావంతో చూడలేదు. అతని గొప్ప వ్యక్తిత్వానికి ఆనందపడుతూ నన్ను క్షమించవలసిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాను.' అందరినీ చూస్తూ అని రామం వైపు తిరిగి 'రామం! నీకు నేను క్షమించరాని అన్యాయం తలపెట్టాను. శాంత నీ భార్య ఔతుందని ఆమె పుట్టినప్పటి నుండి అందరూ అనుకునే విషయం తెలిసుండి మొండిగా ఆమెను వివాహం చేసుకోవాలనే తీవ్ర కాంక్ష తో ఆమె మనసును నా కుయుక్తులతో విరిచేశాను. తాయారు సాయంతో నీపై లేనిపోని అపోహలు శాంతకు కలిగేలా సంఘటనల ను సృష్టింప జేసి నేను నా కార్యాన్ని సఫల మొనర్చు కున్నానని తలచాను. ఆ భగవంతుడు న్యాయానికి మంచితనానికి జయం ప్రసాదించాడు. నా ప్రయత్నాలు విఫల మయ్యాయి.
    'రామం! నీవు నాకు అందించ్చిన పాల గ్లాసును ఖాళీ చేసి దానికి ప్రతిగా అందులో నింపి తిరిగి నీకందించాలని ప్రయత్నించాను. నన్ను క్షమించవూ?' సుందరం కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. పశ్చాత్తాపం అతని ముఖం లో స్పుటంగా కనిపిస్తూ అక్కడ ఉన్న వారందరి హృదయాలను కదిలించి వేసింది.
    'ఒరేయ్ సుందరం! మనం మానవ మాత్రులం , పొరపాట్లు జరగడం సహజమే! కాని వాటిని గుర్తించి మానవత్వాన్ని తెలుసుకొని తప్పు దిద్దుకొనేవాడు దేవుడితో సమానమైనవాడు . నీవు నీ తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడుతున్నావు. నీ పశ్చత్తాపమే నీ తప్పులను ప్రక్షాళితం చేసింది. ఇందులో నిన్ను ప్రత్యేకంగా క్షమించే ప్రసక్తే లేదు.' అన్నాడు రామం తన నిర్మల దృష్టి ని సుందరం పై ప్రసరింప జేస్తూ .
    'రామం నీవు సహృదయుడవు. శత్రువు కైనా హాని తలపెట్ట నటువంటి స్వభావం నీది. అంటువంటి నిన్ను, ఈ గ్రామాని కంతటికీ భీష్ముని లాంటి లక్ష్మయ్య గారిని ఎంతో చిత్త క్షోభకు గురి చేశాను. ఈ విషయం గ్రామంలో నలుగురికి తెలియక ముందే నేను యిక్కడి నుండి వెళ్ళిపోతాను. తెలిసిన తర్వాత యిక్కడ తల ఎత్తుకొని తిరగలేను.' నేలచూపులు చూస్తూ నెమ్మదిగా అన్నాడు.
    "ఏమిట్రా నీ పిచ్చి! అ మాట కొస్తే ప్రపంచం లో తప్పులు చేయని వారెవ్వరు? అందరూ చేస్తారు. కాని నీలా తమ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాప పడేవారు చాలా కొద్ది మంది ఉంటారు. నీవు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. వెళ్ళనివ్వను. ఇక్కడే ఉండాలి. ఈ విషయం యిక్కడున్న మనకు తప్ప మరెవ్వరికి తెలియదు. అది నా బాధ్యత. నీవు నిశ్చింత గా ఉండు.' -- ప్రభాకరం భుజం పై చేతులు వేస్తూ అన్నాడు రామం.
    'రామం నీవు మనిషివి కాదురా....! దేవుడవు' ఆనంద భాష్పాలు రాలుస్తూ రామాన్ని కౌగలించు కున్నాడు సుందరం.
    ఆ దృశ్యాన్ని చూసిన అందరి మనసులూ కుదుట పడ్డాయి--
    ';సుందరం , బావ నిన్ను క్షమించాడు. నీవు క్షమాపణ కోరావు. కాని నాకు నన్ను క్షమించమని అడగడానికే బిడియంగా ఉంది. నీ మోహంలో పడి బావను నా చేజేతులా నాకు దూరం చేసుకున్నాను. నేను ఆవేశపరురాలనని తెలుసుకున్న నీవు నా బలహీనతను ఆసరా చేసుకొని మా యిద్దరినీ విడతీయాలని తీవ్ర ప్రయత్నం చేశావు. దాని పర్వవసానం ఈ విధంగా జరిగింది : సహృదయుడైన బావ నిన్ను క్షమించాడు. నేను మాత్రం నా కంఠం లో ప్రాణ ముండగా నిన్ను క్షమించను.....' అని వెక్కి వెక్కి ఏడుస్తూ 'నీ మాటలలో పడి దేవుడి లాంటి బావను....అనుమానించాను.....నాన్నను, అమ్మను మానసికంగా ఎంతో బాధ పెట్టాను. నా పాపాలకు నిష్కృతి లేదు....బావను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు.' శారద భుజం పై తల ఆనించి ఏడుస్తున్న శాంతను చూసి అంతా జాలి పడ్డారు.
    'ఊరుకో శాంతా....! ఏమిటిది? చిన్న పిల్లలా ఏడుస్తున్నావ్? తప్పు కదూ! అన్నయ్య నిన్నూ తప్పకుండా క్షమిస్తాడు. అపూచీ నాది. ఈ విషయంలో నీవు నిశ్చింతగా ఉండు.' శాంతను వోదార్చింది శారద.
    'శాంతా......! నీ బావను నీ వర్ధం చేసుకున్నదింతేనా? నీవు ఏ నేరం చేశావని నిన్ను క్షమించడం! ఆ పరిస్థితులలో నీ స్థానం లో మరేవరున్నా నీలాగే ప్రవర్తిస్తారు. ఇందులో నీ తప్పేమీ లేదు.' చిరునవ్వుతో అన్నాడు రామం.
    'తప్పంతా నాది. అన్నయ్య నాతొ ఈ విషయం సంప్రతించినప్పుడు అతనికి బుద్ది చెప్పవలసింది పోయి, అతను చెప్పినట్లే చేయడం యిన్ని అనర్ధాలకు మూలాకరణమైంది. రామం, శాంత యిద్దరూ నన్ను క్షమించాలి. అంతవరకూ నాకు మనశ్శాంతి ఉండదు.' అని మార్చి మార్చి తన దృష్టి ని శాంతా రామం వైపు ప్రసరింప జేస్తూ అంది తాయారు.
    'అన్నీ మరిచిపోయి అందరమూ ఎప్పటిలా మసలుకుందాం. ఇక లెనిపొని సంభాషణల తో మన అతిధులను విసిగించకూడదు.' ప్రభాకరం నీరజల వైపు చూస్తూ అన్నాడు రామం.
    తేలికపడిన మనసులతో అంతా అక్కడి నుండి లేచారు ---నడుస్తూ మళ్ళీ కబుర్లతో పడ్డారు.
    'ఒరేయ్ సుందరం! అతి తెలివికి పోయి రెంటికి చెడ్డ రేవడి వయ్యావు. మరిప్పుడెలారా?' ఎగతాళి గా సుందరాన్ని చూస్తూ అన్నాడు రామం.
    'నీవు ఊరుకో అన్నయ్యా! ఇప్పటికే శాంత, నీరజ లు సుందరం గారిని చిత్తుగా హడలగొట్టారు. చచ్చిన పామును యింకా ఏం చంపుతావు?' అని నీరజ వైపు తిరిగి 'నీరజా సుందరం గారు తమ తప్పు తెలుసుకున్నారు. పశ్చాత్తాప పడ్డారు. ఇప్పుడే మంటావ్?' ---శారద.
    'అనడానికి ఏముందకక్కా? నీవెలా చెబితే అలా నడుచుకుంటాను.' భారాన్నంతా తన సోదరి పై నిశ్చింతగా వేసింది నీరజ.

                                 
    సుందరం ఆస్పత్రి వైపు నడిచాడు. మిగతా వారంతా లక్ష్మయ్య గారి యింటి వైపు దారి తీశారు.
    ప్రభాకరం పుట్టిన రోజు పండుగ రెండు రోజులే ఉండడం వల్ల మరురోజే అంతా హైదరాబాదు వెళ్ళారు. లక్ష్మయ్య గారిని, పార్వతమ్మ గారినీ బలవంతం చేసి తీసుకు వెళ్ళాడు ప్రభాకరం. సుందరం మొదట రానన్నా, ఆ తర్వాత రామం మాట తీసివేయలేక అందరితో కలిసి వెళ్ళాడు.

                          *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS