"ఉహుఁ. అదేం కుదరదు. కోరినదివ్వక పోయాక ఇంకేం లాభం? స్వార్ధం వదిలిపెట్టి మాట నిలబెట్టుకోవోయ్, అమ్మీ!" చిలిపిగా పార్వతివంక చూశాడు అతను.
"బాగుంది, ఇది స్వార్ధమా? కానేకాదు. ఇంకెవరైనా అయితే ఏమోగాని నా కవిత ప్రేమతో ఇచ్చిన వస్తువు నెప్పటికీ ఇంకొకరికి ఇవ్వలేను."
"కవిత నీకంత ఎక్కువా? మా అందరికంటే?" తృణీకరిస్తున్నట్టుగా అన్నాడు.
"అవును. నిజమే!" నిశ్చలంగా అంది.
"నవ్వొస్తోంది" అన్నాడు రాజు నవ్వుతూ.
"ఎందుకని?"
"మీ మూడునాళ్ళ ప్రేమాభిమానాలు చూస్తుంటే."
"మూడునాళ్ళ ప్రేమెందుకౌతుందీ?"
"నాకు ట్రాన్స్ ఫర్ ఆరర్సు వచ్చినప్పుడు తెలుస్తుందిలే. తొందరపడకు."
పార్వతి గతుక్కుమన్నది. వెంటనే ఏమాటా అనలేకపోయింది.
రాజే మళ్ళీ అందుకొని, "కావాలంటే నేనే కోరి ట్రాన్స్ ఫర్ చేయించుకోగలను ఇంకో ఏడాదికంతా" అన్నాడు సగర్వంగా.
ఏమనాలో తోచలేదు పార్వతికి. రాజు నోటితో విన్న తర్వాతనే ఆ ఆలోచన రేగింది ఆమెలో కూడా.
అతన్ని బ్రతిమాలాలనిపించింది, ఆ ప్రయత్నాన్ని కిప్పుడప్పుడే పూనుకోవద్దని. కానీ అది కూడా లాభంలేదనిపించింది. కవితకు దూర నువ్వాలిక తను. అమ్మయ్యో! ఆమెను విడిచి తనను తాను భరించగలదా?
రాజు అందంగా నవ్వుతూ, "అందుకే నన్ను బ్రతిమాలుకో" అన్నాడు.
"బ్రతిమాలుకుంటే ఏమవుతుంది?" ప్రశ్నించింది.
"కనికరించి నీకోసమని ఏ బిజినెస్ లోకి దిగ టమో, వేరే ఏదైనా పోస్టులోకి ప్రవేశించడమో చేస్తాను. మనం కూడా ఎప్పటికీ ఇక్కడే ఉండి పోవచ్చు."
పార్వతి కళ్ళు విచ్చుకున్నాయి. "నిజంగానా? ధన్యురాల్ని. అయితే ఈ ఉంగరం తీసుకోండి."
వేలినుంచి తియ్యబోతున్న పార్వతిని ఆపి "ఉహుఁ-అదికాదు. ఇంకొకటి అడుగుతా నుండు...." అన్నాడు రాజు వేలితో తలకాయ గీక్కుంటూ.
అంతలో వాకిట్లోనుంచి చప్పుడు, రిక్షా గంట, మాటలు ఒక్కసారే వినిపించి ఒక్కసారే ఆత్రంగా వెళ్ళి చూశారిద్దరూ.
జానకమ్మ వాకిట్లో నిలబడి తనతో వచ్చిన అబ్బాయితో ఏదో చెప్తున్నది.
అతను, "తర్వాత వస్తానండీ మళ్ళీ, నాన్న మా అన్నయ్యతో అర్జెంటు విషయం ఒకటి చెప్పమన్నాడు" అని మొగమాటంగా నాలుగు ముక్కలు చెప్పి వెళ్ళిపోయాడు.
నిజానికి జానకమ్మ గాభరాపడి తన కొడుకూ, మేనకోడలూ సంవత్సరంనుంచి కంటిచూపుకి కరువైపోయారు అనే కంగారుతోనే వేసవికి రావాలనుకున్న మనిషేమో వసంతాగమనంతోనే వచ్చేసింది.
"ఏ సెలవలకీ రాకపోతిరి! ఆయనకి పట్టక పోతే నా మనస్సూరుకుంటుందా? ఆఖరుకు మనవాళ్ళ అబ్బాయి వస్తుంటేనూ-ఉండబట్ట లేక వచ్చేను" అందావిడ తన గొడవలోనే.
కొడుకుతోపాటుగా పార్వతి కూడా నిశ్శబ్ధంగా ఉండటం చూసి జానకమ్మ మరింత ఆశ్చర్యంగా, "అదేమిటే, పార్వతీ! చెక్కబొమ్మలా అలా నిలబడిపోయావు! అయ్యో! ఎంత సన్నబడి పోయావే! అంతేమరి. మునుపెప్పుడైనా ఒక పూచికపుల్లపనిచేసిన పాపానపోతేకదా?" అన్నది నొచ్చుకుంటూ.
"అవును. నేను కనిపిస్తేగా నీ కళ్ళకి!" రాజు చిరునవ్వుతోనే కోపం ప్రదర్శించాడు.
కొడుకుమీది ముద్దుకొద్దీ జానకమ్మ నవ్వుతూ, "తల్లి దిష్టి కాకపోతే-నువ్వు కాస్త బొద్దుగానే ఉన్నావురా, రాజూ! ఇదే బొత్తిగా చిక్కిపోయింది. పెద్దవాళ్ళ పోషణ లేకపోతే పిల్ల లిట్లాగే అయి పోతారు కదా! చిత్రం!" అంది చివరికి నిట్టూర్చి.
పార్వతి నవ్వి, "నేనిలా సన్నబడి పోవడానికి కారణం ఎవరనుకున్నావత్తయ్యా! చెప్పనా?" అంది.
"ఎవరే?" అంది పరధ్యానంగా ఆవిడ.
"మీ కొడుకుగారే! అస్తమానం దుక్కలా ఉన్నానని దిష్టివేస్తుంటే ఏమవుతుంది మరి!"
"నిజమేన్రా?" కోప్పడుతున్నట్టు అడిగింది జానకమ్మ లోలోపల వాళ్ళ మధ్య మార్పు వచ్చినట్టు గమనించి మురుస్తూ.
"లేదమ్మా! నే నెంత మంచివాన్నో నీకు తెలీదూ?" అన్నాడు.
"సరేకాని-ఉండత్తయ్యా! నీకోసం కాఫీ తయారు చేస్తాను" అంటూ పార్వతి వెళ్తుంటే ఆపుచేసి, "అదేమిటే? నేను చేసుకోలేనూ? మేం ఉక్కు మనుషులమే, అమ్మాయి! ఎంత శ్రమన్నా పడగలం" అంది జానకమ్మ లేచి ఆ విశాల భవనంలో వంటి ఇల్లు వెతుక్కుంటున్నట్టు వెళ్తూ.
అయినా పార్వతి కూడా ఆమెను వెంటనంటివెళ్ళింది.
"ఇద్దరికోసం ఇంత ఇల్లా!" నివ్వెర పోయింది జానకమ్మ. ఆమె అక్కడ సతమత మవుతుండగానే పార్వతి తన పనుల్లోనూ, ఆలోచనల్లోనూ మునిగింది.
ఎనిమిది గంటల ముఫ్ఫయ్ నిమిషాలకు సైకిల్ మీద ఒక కుర్రవాడు వచ్చి పార్వతితో, "కవితగారు మిమ్మల్ని వాళ్ళింటిదగ్గర ఇప్పుడే కలుసుకోమన్నారు. వీలవకపోతే పదింటికి ఆఫీసులోనన్నా తప్పక కలుసుకోవాలన్నారు" అన్నాడు తొందరగా.
పార్వతి ఆతృత పడింది. "అంత అవసరమా? అయితే ఇప్పుడే వస్తున్నాను. నువ్వెళ్ళ వోయ్!" అంది గబగబా గదిలోకి వెళ్తూ.
రెండు నిమిషాలో తెమిలి కవితకోసం బయల్దేరబోతున్న ఆమెకు ఎదురు వచ్చాడు రాజు.
"ఈ హడావిడేమిటి?" అన్నాడు తాపీగా ద్వారబంధంమీదికి చెయ్యి చాస్తూ.
"కవిత రమ్మని కబురు చేసింది" అంది బీర్వాలోని వ్రాసిన కాయితాలు మడిచి కవర్లో పెడుతూ.
"ఆ సంగతి నాకు తెలుసు. అంత అవసరమేమిటా అని?" గుంభనంగా అన్నాడు.
"అవసరం లేకపోతే రమ్మంటుందా? ఏదో కారణం ఉంటుంది" అంది.
"పార్వతీ, ఇప్పుడు వెళ్ళద్దు!"
ఆశ్చర్యపడ్డది పార్వతి ఇంతలోనే వచ్చిన మార్పుకి. వింతగా, పరిశోధనగా చూచింది అతనివైపు. "అత్యవసరంగా పిలిపిస్తే వెళ్ళక పోవడమేమిటి? ఆమె ఏమనుకుంటుంది?"
"ఏమనుకుంటేనేం? అసలు ప్రతిక్షణం ఆవిడకోసం నువ్వు పరుగెత్తడం మెచ్చుకోదగ్గవిషయంకాదు."
పార్వతి నవ్వింది. "నన్ను మెచ్చుకోమని ఎవర్నీ వేడుకోవటం లేదే!"
"ఏమైనాసరే! నువ్విప్పుడు వెళ్ళటానికి ఒప్పుకోను. నీ స్వేచ్చకు ఇన్నాళ్ళూ నేను అడ్డు చెప్పలేదు. ఇకముందు కూడా అపరంజి పంజరంలో చిలుకలా పడి ఉండమని శాసించను. కాని నామాట నువ్వు వినాలి."
"ఏవిటీ సొద? అటు ఆలస్యమవుతోంది." రెండడుగులు ముందుకు వేసి విసుక్కుంది. కాని రాజు తప్పుకోకుండా అలాగే నిలబడ్డాడు.
"కవిత ఎక్కడికీ పారిపోదు, పారూ! ఈ ఒక్కరోజు నువ్వెక్కడికీ వెళ్ళవద్దని మాత్రం కోరుతున్నాను. అంతేకదా? నాకోసం ఆమాత్రం నిగ్రహించుకోలేనా?" సాత్వికంగా అడిగాడు.
"మీకోసమా? ఏమిటో కొత్తగా ఉంది నాకు. ఆమె పిలుపును అతిక్రమించి నిలవరించు కునే సామర్ధ్యం లేనేలేదు నాకు. దారి వదలండి. తొందరగా వెళ్ళాలి."
"పెద్ద మాటలు ఉపయోగించి హడల గొట్టేస్తున్నావు. కాని నువ్వు అబలవేనని గుర్తుంచుకుంటే మంచిది." రాజు పేలవంగా నవ్వుతూ అన్నాడు.
పార్వతి సహనం మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది. "అబల మాత్రమే కాదు, శక్తి కూడా స్త్రీయే."
"మగవాడు తలుచుకుంటే స్త్రీని ఏమైనా చెయ్యగలడు."
"హుఁ మీరంటున్నది కేవలం బలాబలాల గురించి. శక్తి ప్రదర్శించి ఆడదాని ఆత్మశక్తిని గెలవలేదు మగవాడు." చరచర అతన్ని దాటి పోవాలనుకుంది పార్వతి.
కాని ఆమె ప్రయత్నం సాగనివ్వకుండా మరింత అడ్డు నిలబడ్డాడు రాజు.
పార్వతి ఎంత కోపోద్రిక్తురాలవుతున్నా రాజుకు ఆమెమీద అనురాగమే కలుగుతున్నది.
