క్షమార్పణ
పి. రామలక్ష్మీ

గబుక్కున వెలిగాయి స్ట్రీట్ లైట్లు. మసక వెలుతురు చీల్చుకుంటూ కాంతి వంతమైన కిరణాలు కొన్ని ఇంట్లోకి ప్రసరించాయి.


వంట చేసుకుంటున్న శారదమ్మ ధ్యాస కొడుకు మీదకు పోయింది.
"అమ్మా వేడి వేడి కాఫీ కావాలి! "అంటూ దూసుకు వచ్చాడు కమలాకరం.
"నూరేళ్ళ యిష్షు " అని పైకే దీవించేసిందావిడ. "అయినా ఇంత ప్రొద్దుపోయి రావడమేమిట్రా? నీ వంతు కాఫీ ఎక్కడికి పోతుందనీ ?--"
ఏదో హుషారు మీద వున్నాడు కుర్రవాడు. పసిపిల్లాడి లా అమ్మ భుజాలు పట్టుకు వేలాడి, ఆమె తలను తన తలకాయ కు జోడించాడు.
"అయినా నీకీ మధ్య ఇంటి ధ్యాస పట్టకుండా వుంది. దిక్కుమాలిన తల్లిని ఇంట్లో వంటరిగా పడి ఉంటానని ఇప్పుడే మరిచి పోతున్నవాడివి -- రేపు పెళ్ళాం, పిల్లలు కలిగాక -------"
కమలాకరం బుంగమూతి పెట్టుకుని, కాఫీ కప్పు ఆవిడ చేతిలోంచి లాగేసుకున్నాడు.
కొడుకు అవతలికి వెళ్ళాక, "వీదిచేత ఆ మూడు ముళ్ళూ వేయించాలి" అనుకుంటూ. ఆ మధురమైన క్షణాల ఊహలలో తేలిపోయింది శారదమ్మ.
శారదమ్మ కు నడి వయసులోనే వైధవ్యం ప్రాప్తించింది.
పురాతన స్త్రీ లా కనిపిస్తుంది. శారదమ్మ చూడటానికి. కాని ఆమె మారుతున్న ప్రపంచాన్ని చాలామటుకు తెలుసుకుంది. పురాతన పద్ధతుల్నే పూజించి , వాదించి నెగ్గుదామనే తత్వం ఆమెకి లేదు. పైగా లౌక్యం తెలిసిన స్త్రీ. భర్త పోయేనాటికి గర్బవతి. కమలాకరాని కప్పుడు పదేళ్ళు. సెకండు ఫారం లో ఉన్నాడు. రెండవ కాన్పు ఆమెకు దక్కలేదు. "అందుకే శారదమ్మ కు ఉన్న ఒక్క కొడుకు మీదా జాగ్రత్తా, ఆప్యాయతా ఎక్కువై పోయాయి.
ఆలోచిస్తూనే యిల్లంతా కలయ జూసింది ఆవిడ. ఆ మహా ఊర్లో నాలుగు గదుల దట్టమైన యిల్లు అది. మురికి కాలవల వీధి అయినా ఎలక్ట్రిక్ దీపాల వెలుగు అమిరిన వాడే మరి ఇంటి తీరులో పాత పద్దతులే కానవస్తాయి. మారుతున్న ప్రపంచంలో మారలేకపోయినా మనిషిలా ఆ వీధిలో వెలసిన కొన్ని క్రొత్త డాబా ఇళ్ళ వరుసలో వెలవెల బోతున్న యిల్లు అయినా ఆ ఇంటి యజమానురాలి ఆత్మ స్థైర్యం లాగ చెక్కు చేదరిని కొంప. పై భాగాన గోడకు బెత్తెడు వెడల్పున అంచు ఉన్నది. శారదమ్మ భర్త ఫోటో . లక్ష్మణ హనుమసమేతులైన సీతారాముల చిత్రపటం అందు మీదనే అమర్పబడ్డాయి. మాటలో మాట శారదమ్మ భర్త పేరు కూడా సీతారామయ్యే.
చూడగా చూడగా ఆధునికత లోపించిన ఆ యింటిని కుమారుని పెండ్లి నాటికి మార్పించి, అదునాతని సౌఖ్య రూపంలోకి తీసుకు వద్దామా అని ఊహ కలిగింది శారదమ్మ కి.
భర్త ఫోటో , అసరసనే ఆ శ్రీరమ కృష్ణ మూర్తి ఫోటో కానరాగానే ఆమె ఉలిక్కి పడ్డది. ఒద్దు ఒద్దు అనుకుంది వెంటనే. ఈ యిల్లు ఎంత మాత్రం మార్చ వీలులేదు. కలిసి వచ్చిన యిల్లు. వీరికి నెలవైన యిల్లు. కొడుకు ఒక్కసారైనా తప్పకుండా పాసవుతున్నాడు. ఆస్తిని దాయాదులు గాని, ఆత్మీయులు గాని కాజెయ్య లేకపోయారు. ఒక అన్నగారు చెల్లెలిని చేరదీయాలను కోలేదు. కానీ చీటికి మాటికీ అవసరాలు గడపమనీ, మనియార్డరు చెయ్యమని కోరుతుండేవాడు . అతన్ని లెక్కచెయ్యలేదు శారదమ్మ. మరో అన్న గారు చెల్లెల్ని వెంటనే వచ్చి తన పంచన చేరమన్నాడు. కలో గంజో కలిసే త్రాగుదామని తన భావాన్ని వెల్లడి చేశాడు. అన్నగారి లౌక్యాన్ని పుణికి పుచ్చుకున్నట్లే పుట్టిన శారదమ్మ అందుక్కూడా ఒప్పుకోలేదు. వితంతువు కాగానే అన్నగారి కొంప చేరే ఆచారాల కిది పాత ప్రపంచం కాదు నాయనా అనుకున్నది మాత్రం.
సీతారామయ్య పనుల మీద పరాయి ఊళ్ళో వుండగా అనుకోకుండా మృత్యువు వచ్చింది ఆ క్షణాలలో అయన ఆ ఇంట వుండి వుంటే, మృత్యువు కి చిక్కకుండా తనకు దక్కేవాడని శారదమ్మ నమ్మకం.
భర్త తలపుతో ఆవిడ కళ్ళు చెమ్మగిల్లాయి. కొంగు తీసి నెమ్మదిగా ఒత్తుకున్నది.
* * * *
లోపల తల్లి ఏడుస్తున్న అదే సమయంలో అవతల కమలాకరం నవ్వుకుంటున్నాడు. బరువెక్కిన తల్లి గుండె సంగతి తెలీని అతని హృదయం ఊహ నియత్తులో తేలికగా విహంగ సదృశం గా తెలిపోతున్నది.
ఇంకొక్క సంవత్సరంలో కమలాకరం చదువు పూర్తవుతుంది. శారదమ్మ బలవంతం వల్లనే అతను లా చదువు తున్నాదంటే అతిశయోక్తి కాదు. ఆశ్చర్యపడనక్కర లేదు, కొంతసేపు మొరాయించినా తల్లి మాట జవదాటలేదు కమలాకరం. ఆస్తి పాస్తుల విషయం తన బిడ్డ ఎక్కడ తెలివి తక్కువగా అయిపోతాడో నని ఒకానొక నాడు బెంగపడిన శారదమ్మ అలోచించి అలోచించి చివరి కోక కొలిక్కి వచ్చింది. లా చదవమని కొడుకుని శాసించింది.
ఇప్పుడిప్పుడు లా చదవడం తన అదృష్టం అనుకుంటున్నాడు కమలాకరం.
లేకపోతె వసంత పరిచయం తనకి లభ్యమయ్యేదేనా? స్నేహం దృడ పడేదేనా?
అలా అనుకోడాని క్కూడా ఇష్టపడలేదు. అతని మనసు. తానూ వసంత ఒకరి వెనుక ఒకరు పుట్టాడ మేమిటి, కలుసుకోకుండా వుండడమేమిటి?--
కమలాకరానికి వుండి ఉండి రెండు చిలిపి కన్నులు కనిపిస్తున్నాయి' కొంటె పెదాలు కవ్విస్తున్నాయి. రరెండు జడలు మెరుపు తీవేల్లా కళ్ళకు కొడుతున్నాయి.
ముప్పాతిక వంతు మగవాళ్ళు సౌమ్యాన్నే ప్రేమిస్తారేమో-- కాని కమలాకరం చైతన్యాన్ని ప్రేమించాడు. వసంత ఒక చైతన్య స్రవంతి కాకపొతే చైతన్య జగతికి ప్రతినిధి. అందుకామె ఆకారం ఎంతగానో సహకరించింది. అలంకరణకు అనుగుణంగా నడుచు కుంటుంది. ఆ సంగతిని సంభాషణా తనుత్క్రుతి ధ్రువ పరుస్తుంది.
కాసేపు కమలాకరం ఆకాశ రాజ్యాన్ని ఏలుతూ వుండిపోయాడు. షికారుకు బయల్దేరాడు కూడా.
బ్రతుకులో రకరకాల భిన్న విభిన్న సంఘటనల గుంపులలాగ రంగు రంగుల మేఘ శకలాలు ఆకాశాన్ని హత్తుకుని వున్నాయి.
2
వసంతతో పరిచయమై ఒక ఏడాది అయింది అయినా అది చాలా స్వల్పం. ఒకానొక వసంతోదయాన ఆమె యిచ్చిన అసాధారణ మైన స్వతంత్రాన్ని అందుకున్న తర్వాత గానీ వూహల్లో సృష్టించుకున్న చదువును ప్రదర్శించలేక పోయాడు. ఆరోజు అతని మనసు మీద ప్రత్యేకించి రంగులు చల్లింది వసంత.
వసంత గురించి మధుర జగత్తులో విహరిస్తున్న అతన్ని తల్లి పిలుపు అదరగోట్టింది. పిలవడమైతే గట్టిగా పిలిచింది గాని, మృదువుగా మెత్తగా మందలింపు లతో సహా తన కోరికల్ని , ఉద్దేశాల్ని కమలాకరం ముందు ఏకరువు పెట్టింది శారదమ్మ.
ఆవిడ పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి జడుసుకున్నాడు కమలాకరం. ఆవిడ యధాలాపంగా అనలేదు ఈసారి. పరీక్షలు రాశాక పెళ్లి చూపులకు వెళ్ళ వలసినది ఎవరి యింటికో నిశ్చయంగా చెప్పింది. ముఖం లోంచి చిరుచెమటలు లేచాయి కమాలాకరానికి.
ఆవిడతో ఎలా చెప్పాలి ?-- ఏమిటి చెప్పాలి?-- " అని గుటకలు మింగాడు. ముఖ్యమైన సంగతి -- తీరా తాను ప్రేమించిన సంగతి వింటే ఎంత అల్లకల్లోలమౌతుందో ? క్షణాల మీద అలాటి రభస రప్పించు కోవడ మెందుకు?
"ముందు వసంత తో తేల్చుకుని రావాలి" అనుకుని ఎలాగో బయట పడ్డాడు.
కాలేజీలో వసంత ని కలుసుకుని, సాయంత్రం బీచికి రమ్మన్నాడు. వింత కళ్ళతో క్షణం చూచి విప్పారిన నవ్వుతో సరేనంది వసంత. ఇలాంటి ఆహ్వానం కొత్త కాదు ఆ అమ్మాయికి.
అలలు ఎగసి పడుతున్న సాగర సౌందర్యాన్ని అవలోకిస్తూ తన పరిస్థితిని ఆమూలాగ్రం నివేదించాడు.
వసంత ఇసుకలో గీతాలు గీస్తూ ఎంతకూ మాట్లాడలేదు. ఆ మౌనాన్ని చూశాక "నీకు నా పట్ల అంతగా అనురక్తి లేకపోతె స్పష్టంగా చెప్పెసేయ్యి. నేను బాధపడను." అన్నాడు బిగుసుకుంటూ
"అది కాదు........." అంటూ గొంతు సవరించుకుంది. "మా యింట్లో నేను ఇంత త్వరలో ఒప్పించడ మంటే సామాన్యం కాదు. కమల్! ఒక్క అమ్మనైతే ఒప్పిస్తాను. ఒక్క నాన్ననైతే ఒప్పిస్తాను. అన్నయ్యలూ, వదినలూ, అక్కయ్య లూ, బావలు మొదలైన వారి సంగతలా వుంచగా బాబాయిలు, పిన్నులూ కూడా వున్న సమిష్టి కుటుంబం మాది. నేనందుకి ఎలా జరిగినా సర్దుకు పోయే వుద్దేశం తో వున్నాను."
ఆమె మాటలు పూర్తీ కానిచ్చాడు కమలాకరం. ఆ పైన అందుకున్నాడు. "నువ్వు చెప్పింది అక్షరాల నిజం వసంతా! " అతని కంఠం లో ఎగతాళి ధ్వనింపు విని ఆశ్చర్యపడిన వసంత తలవంచి వినసాగింది.
"ఎటొచ్చీ -- బాహ్యంగా కనిపించే చొరవా, తెలివి తేటలూ చూసి మనుషులు భ్రమ పడకూడదని బాగా గడ్డి తినిపించావు లే. అలాటి వాళ్ళే అసలు సిసలైన మొద్దులు, పిరికి పందలూ అని ఈ క్షణాన్నే తెలిసి వచ్చింది. మన్నించు యిక వెళ్లి వద్దామా?' ఆఖరు మాట చెప్పమన్నట్టు చూశాడు.
వసంత అదోలా తలెత్తి నవ్వి, 'అంతగా ఏకిపారేస్తే ఎలా చెప్పు నాకు కొంత అవకాశ మిచ్చి ఆలోచించ నియ్యి. నేను నా ప్రయాత్నాలు చేస్తుంటాను. ఈలోగా మీ వాళ్ళ దగ్గర కార్యం సాధించు ." అంది.
కమలాకరం గట్టిగా వూపిరి పట్టి విడిచి "హమ్మయ్యా!" అన్నాడు నవ్వుతూ.
"మరో మాట?...."
వసంత తిరిగి చూచింది.
"మేము కూడా మీతో సరి తూగ గల ధనికులమే. అలాటి కులమే. ఎటొచ్చీ మీ యింటి ఆడంబరాలు, ఆధునిక సౌకర్యాలు అక్కడ ఉండక పోవచ్చు...."
"తెలివి తక్కువ" అని కొట్టి పారేసింది వసంత. "మనం కూడా అంత సంకుచితంగా ఆలోచిస్తే యిక యువ జనులకి భవిష్యత్తు వుంటుందా కమల్?--"
అక్కడితో కమలాకరానికి ఒక బరువు తీరినట్టయింది. హాయిగా వూపిరి పీల్చుకుని ఇల్లు చేరాడు.
