Previous Page
అర్పణ పేజి 47


    "నన్ను వెళ్ళనివ్వండి." అతన్ని పక్కకు తొలగించబోయింది.
    రాజు చప్పున పార్వతి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని బిగించి పట్టుకున్నాడు.
    "నిన్ను ప్రేమిస్తున్నాను, పారూ! నన్ను....." అతని గొంతు బొంగురుపోయి ఆపైన మాట వాలేడు.
    పార్వతి పడగ విప్పిన నాగులా విసురుగా తలెత్తి చూచిందతన్ని. ఆమె ఊహించని సంఘటన. అతని కళ్ళల్లోని సౌమ్యాన్ని, దైన్యాన్ని గుర్తించగలిగే స్థితి కాదామెది. ఆవేశం పొగలు కక్కుతూ వచ్చి ఏవగింపులో శరీరం నిప్పు రవ్వల్ని కురిసింది.
    "ఛీ!" అదిరిపడేటట్టు విదిలించుకుంది. దూరంగా నిలబడింది.
    "రాజూ! మీరు వట్టి మూర్ఖులు! కళ్ళు మూసుకుపోయి ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తారని ఏనాడూ ఊహించకపోవడం నా తప్పు. ప్రేమ అనేది ఇంత చంచలంగా ఉంటుందా ఎక్కడైనా! ఆ నాడు నన్ను ప్రేమించడం లేదని ఖచ్చితంగా చెప్పారు. చెయ్యాలంటే అన్నీ జ్ఞాపకం చెయ్యగలను. నన్ను ప్రేనిస్తున్నట్టు చెప్పడానికి సిగ్గు గాని, అభిమానంగాని అడ్డురాలేదా మీకు?"
    "పార్వతీ!"
    "మీది తృష్ణ. లాలన. వాంఛ. అంతేగాని ఇది ప్రేమ అనుకుని మిమ్మల్ని మీరు వంచించు కోకండి. ఆవేశంతో తాత్కలికంగా పరవళ్ళు తొక్కేది ప్రేమకాదు. మీలాంటి చంచల హృదయులకి మనస్సు, శరీరం అర్పించుకోవడంకన్న బ్రతుకంతా భగవంతుడికి అంకితం చెయ్యడం లోనే సుఖమూ, శాంతీ ఉంటాయి. నా సర్వ స్వాన్ని భగవానుడు తీసుకున్నాడు. నన్ను వేధించ కండి. కావాలంటే కొద్దిరోజుల్లో మీదారికి అడ్డు తొలగిపోతాను."
    "పార్వతీ!"
    వినిపించుకోలేదు పార్వతి. ఎగసిపడే గుండెతో కవిత సన్నిధిలో వాలిపోయింది.
    "ఏం జరిగిందిరా, రాజూ!" అని ప్రశ్నించిన జానకమ్మకు సరైన సమాధానం లభ్యంకాలేదు. ఆమె ఆశించనూలేదు. పార్వతి కేకలు వినిపించి పనిచేసుకుంటున్న ఆమె వచ్చేసరికి అంతా జరిగి పోయింది. వింత ఏమిటంటే రాజు కంఠం గట్టిగా వినిపించలే దామెకు. పైగా "ఏం లేదమ్మా!" అంటూ వాడిన పూగుత్తిమీద తుషార జలంలా మొహంమీద చిందిన చిరుచెమటల్ని తుడుచుకుని వెళ్ళాడు ఎటో.
    "కవితా! నన్నెవరూ బ్రతకనివ్వడం లేదు. నీ చల్లని నీడ నాకియ్యి, కవీ!"
    "ఏం? ఏం జరిగింది? అదొక మాదిరిగా ఉన్నావేమిటి?" తీక్ష కిరణాల తాకిడికి సోలిపోయిన సుకుమార ముకుళంలా కనిపిస్తున్న పార్వతిని చూస్తూ అడిగింది కవిత.
    "నిన్ను నానుంచి వేరుచెయ్యాలని చూస్తున్నారు కవీ, శత్రువులు. పోనీ, నువ్వెందుకు పిలిపించావో చెప్పు" అంది అలసట ఇంకా అణగక ముందే.
    "ఏదీ! నువ్విస్తానన్న వ్యాసం గురించి అడగటానికే. నేనూ, మా ఎడిటర్ గారూ ఆ పత్రిక భవిష్యత్తుకోసం నానాకలలూ కంటున్నాం."
     "అందుకేనా పిలవడం? తెచ్చాను. ఆ బాగ్ లో ఉంటుంది-తీసుకో. ముందు నాకు మంచినీళ్ళిచ్చి కాస్త పడుకోడాని కేదైనా పక్క చూపించు. ఏమిటో, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది."
    "అదేం? ఏమయింది, పారూ?" కవిత కంగారుగానే నారింజరసం తయారుచేసి ఇచ్చింది.
    అప్పటినుండి మూడురోజులవరకు పార్వతి మనఃస్థితి ఒక్కలాగే ఉంది. రాజు ప్రవర్తన అందుకు సహకరించి మరింత కలవరపెట్టింది ఆమెను. చిత్రమైనది మనసు. అది ఒక్కొక్కప్పుడు ఎందుకు బాధపడుతుందో బాధకు లోనౌతున్న వాళ్ళకే తెలియదు. ఇతరుల కేం అవగతమౌతుంది?
    రాజు పార్వతిని తప్పుకొని తిరుగుతున్నాడు. అతను ఆ విధంగా మసలడం కొత్తేమీకాదు. కానీ ఆ గాంభీర్యంలో మ్లానతను గమనించాక కూడా తనకేమని ఊరుకోలేకపోతున్నది. జీవన వ్యామోహం, తీరని తమి చేసే విచిత్ర లాస్యానికి రూపకల్పన కష్టసాధ్యం. చెట్లను, గుట్టల్ని దాటుకువచ్చే పర్వతవాహినిని పోలి అంతశ్శరీరపు గతుకుల్లోంచి ఎగసిపడే ప్రవాహానికికూడా అడ్డులేదు.
    "పార్వతీ, ఈ మంచినీళ్ళు కాసిన్ని తీసుకెళ్ళి బావ కిచ్చేసిరా అమ్మా!"
    "ఉండత్తయ్యా! నువ్వొకదానివి! నువ్వే ఇచ్చి రాకూడదూ?" పార్వతి బిగదీసుకు పడుకుంది. కాని నిజానికి పడుకోలేదు.
    అదేదో పని తనే పూర్తి చేసుకు వచ్చిన జానకమ్మ తన దురదృష్టాన్ని పునఃస్మరించుకోకుండా ఉండలేకపోయింది.
    "నా చేతులతో పెట్టగా వాడింత అసంతృప్తిగా ఎప్పుడూ భోజనం చెయ్యలేదు. నేను వచ్చినరోజు బాగానే ఉన్నాడు. ఇంతలో ఏమైందో వాడికి? ప్చ్! అంత కర్మ అంటారు. ఎవరి కర్మ కెవరు కర్తలు? గీతలోనో మరెందులోనో 'ఈ పిల్లలు నీ పిల్లలు కారు, ఈ సంసారం నీ సంసారం కాదు' అన్నాడు దేవుడు...." జానకమ్మ తన ధోరణిలో మాట్లాడుకుంటూ నిద్రపోయింది గాని తన ఒక్కొక్కమాట ఒక్కొక్క రాయిగా పార్వతి గుండెల్లోకి దూసుకుపోయి పట్టు ఆమె కెలా తెలుస్తుంది?
    అది నిశీధి. నిశీధ గుణాన్ని ఎన్ని దీప్తులూ తీసివెయ్యలేవు. బెడ్ లైటు సన్నని కాంతులు జల్లుతున్నది.
    పార్వతి లేచి కూచొని జానకమ్మ మొహం చూచింది. చెప్ప శక్యం కాని విధంగా బరువు నిండింది అంతర్యాన. స్త్రీ ఎంత ఉన్నత స్థితుల్ని పొందినా ఆవేదన అనేది పుట్టింటి వారిచ్చిన సారెలా ఆమెను వెన్నంటి వస్తుంది. కోరని వరంగా ఇచ్చాడేమో జగదీశ్వరుడు?
    పార్వతి కళ్ళు అశ్రుసిక్తాలై గవాక్షంలో నుంచి వెన్నెల చాలుల్లోకి చూశాయి. ఆ తర్వాత అనంత ఆకాశమూ - ఈ చూపు, అర్దపూర్ణమైన ఈ చూపు విశ్వాంతరాళాన్ని చీల్చుకుని ఔన్నత్యపథాల్లోకే ఆగకుండా సాగిపోతున్నది.
    "భగవాన్! అన్ని ప్రేమల్లోకి నీ ప్రేమ గొప్పదని తెలుసుకున్నాను. మానసికంగా నీ ప్రేమను అనుభవించాను. కాని చివరికి-చివరి కిప్పుడు నాలాగ జీవిస్తున్న ఒక వ్యక్తిని అభిమానిస్తున్నాను. ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రాపంచిక బంధాల సంబంధాలు, ఐహిక సుఖాలు అనుభవాలు పూర్తయితేగాని ఆధ్యాత్మిక భావపూర్ణత సిద్ధించదని మాపట్ల నిర్లిప్తత వహిస్తావు కాబోలు. నీ ఆంతర్యాన్ని అర్ధం చేసుకోవాలనే ప్రయత్నం ఎంతటిదో నువ్వు చూపించిన దారిలో మారుపలుకకుండా నడిచిపోవడం అంతటిది.'
    "అమ్మాయ్! నిద్రపోలే?" జానకమ్మ లేచి వింతగా అడిగింది.
    "నాలుగు రోజులనుంచి నిద్ర రావడంలేదు, అత్తయ్యా!" కళ్ళు తుడుచుకోకుండానే జానకమ్మ ఒడిలోకి వాలిపోయింది.
    తెల్లవారిన తర్వాత పార్వతికి రాజు కనిపించలేదు. ఆమె లేవకముందే అతనెటో వెళ్ళిపోయాడు.
    తిరిగి అతను నాలుగు గంటల ప్రాంతాన వచ్చినప్పుడు జానకమ్మ బాధపడుతూ, "ఈ పిల్లవాడితో నేను బాధపడలేకుమా ఉన్నాను, ఈశ్వరా! 'భోజనానిక్కూడా రాకుండా ఈ తిరుగుళ్ళేమిట్రా తండ్రీ' అని గద్దించి అడిగితే, 'హోటల్లో భోజనం చేశావమ్మా!' అని నెమ్మదిగా చెప్పడమా? నా ప్రాణానికి వెర్రికాలం వచ్చిపడ్డది" అనుకుంది.   
    పార్వతి ఆ స్వగతాలన్నీ వింటూనే ఉంది. ఆవిడ చేతిలోని కాఫీకప్పు తను తీసుకుంటూ, "నే నిచ్చి వస్తానత్తయ్యా!" అంది. విస్మయపడుతున్న ఆవిడవైపు తలెత్తి చూచే సాహసం లేకపోయింది ఆ సమయంలో.
    కిటికీలోనుంచి వచ్చి నుదురును వెచ్చగా స్పృశిస్తున్న సూర్యకిరణాలు కళ్ళల్లోకి ప్రవేశించబోతున్నా లెక్కచెయ్యకుండా రాజు ప్రపంచ చైతన్యాన్ని చూస్తున్నాడు.
    'జీవితమంతా చీకటేరా మానవాధమా!' అని ఒక రేడియో పాట క్రిందిగదుల్లో ఎక్కడినుండో అమంద ధ్వనితో వినవస్తున్నది.
    'నిజమే. బ్రతుకందరికీ నందనవనంకాదు!' అనుకున్నాడు రాజా.
    కాని జీవితం అరణ్యమైనా పూర్తిగా కంటక మయంకాదని రాజు కెప్పుడు తెలుస్తుంది? అక్కడా తప్తహృదయాన్ని తాత్కాలికంగా చల్లబరిచే సుందర సరోవరాలు ఉంటాయి. శీతల తరుచ్చాయలు ఉంటాయి.
    తల్లి అనుకొని తలతిప్పి చూచిన రాజు ఉలిక్కిపడ్డాడు. దేవీమూర్తిలా నిర్మలంగా, నిరాడంబరంగా, నిశ్చలంగా నిలబడి ఉంది పార్వతి. రాజు తడబడి లేచాడు.
    "తీసుకోండి!"
    పొగలుకక్కే కాఫీని రెండు గుక్కల్లో మింగిఖాళీ కప్పు అక్కడే కిటికీ దగ్గరుంచి అదొక మాదిరిగా వెళ్ళబోయాడు.
    "రాజూ!" పార్వతి పిలుపుతో మార్దవ గాంభీర్యాలు మిళితమై ఉన్నాయి.
    "ఏం కావాలి, పార్వతీ?' కొద్దిగా వెనక్కు వచ్చి అడిగాడు.
    "మీరు కావాలి!" నిస్సంకోచంగా చెప్పింది.
    రాజు సిగ్గుపడ్డాడు.
    "క్షమించు, పార్వతీ! నిన్ను చిన్నప్పుడు తెలుసుకోలేక పోయాను. ఇప్పుడూ తెలుసుకోలేదు. మూర్ఖంగా నిన్ను బాధపెట్టాను కూడా అవన్నీ మరిచిపోలేదు."
    అతని సమీపానికి వచ్చేసింది పార్వతి.
    "లేదు, రాజూ! నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమించినంత కాలమూ ప్రేమిస్తాను. మీరు ప్రేమించకుండా నేను ప్రేమించడం బానిసత్వం అనిపిస్తుంది నాకు..." అంది అతని చేతిని పట్టుకుంటూ.
    రాజుకు కళ్ళల్లో సైతం ఘర్మజలం చిమ్ముతూంది.
    "సారూ!" అన్నాడు మరేమీ అనలేక ఆమెను దగ్గరికి తీసుకుంటూ.
    ఇరువురిలోను తెలియరాని ప్రేమాను స్పందన. అధికారయుతమైన ప్రేమలాలన. అనురాగ వేగ సంచలిత హృదయాలతో ఒకర్నొకరు ఆరాధించుకున్నారు ఆ క్షణం. ఇక విడిపోయి బ్రతకలేమనుకున్నారు.
    హృదయంలో పదిలపరుచుకున్నాడు రాజు పార్వతిని.
    "పారూ! నన్ను క్షమిస్తావా?"
    "ఎప్పటికీ క్షమించను." నవ్వింది.
    ఉలిక్కిపడింది పార్వతి.    
    "పార్వతీ! పార్వతీ!....." కవిత పిలుస్తున్నది.
    "కవిత!"
    వివశురాలైంది. పరుగెత్తి వెళ్ళింది. కాని కవిత ఇక తనను మరీ అర్ధం చేసుకోదు అన్న ఆందోళన ముఖంలో ప్రస్ఫుటమవుతున్నది.
    "ఎప్పుడొచ్చావు, కవితా?" కంపించేస్వరంతో అడిగింది. "అరగంట ఐంది తల్లీ! భగవంతుణ్ణి జపిస్తూ కూచున్నాను."
    "నువ్వు పిలవటం వినిపించలేదు, కవితా?"            
    "అదే చెప్తున్నానేమో? దేవుణ్ణి ప్రార్ధిస్తూ కూచున్నాను. మా పార్వతి జీవితం బాగుపడితే సంతోషమే కాని ఆమె నన్ను మరిచిపోకుండా మాత్రం కాపాడు భగవాన్ అంటూ."
    "కవీ!" ఆమెనింక మాట్లాడ నివ్వలేదు పార్వతి. "నిజంగా ఈ హృదయార్పణ ఎవరికి జరిగిందో నీక్కూడా తెలీదు, కవితా!" కవిత భుజం మీదకు వాలిన పార్వతి పెదవులు కంపించాయి. కాని మాటలు వాటి వెనుకనే అణిగిపోయాయి.
    భావాతీత హృద్వేదన కవితకు తెలియనిది కాదు. ఆమె వీనులతో వీక్షించగలదు. కన్నులతో ఆకర్షించగలదు.
    అక్కడకు వచ్చిన రాజు చిరునవ్వుతో కవితకు నమస్కరించి బయటకు వెళ్ళిపోయాడు.
    జానకమ్మ ఏదో పనిమీద వస్తున్నదంతా, "అమ్మాయ్! దీపాలు వెలిగించుకోకుండా నిలబడ్డారా సందెచీకటిలోనూ..." అన్నది ఆ పనికి తనే పూనుకుంటూ.
    "హృదయ జ్యోతి వెలిగినాక ఇతర దీపాలతో అవసరం ఉండదు, పిన్నిగారూ!" అంది కవిత.

            
            
                         ------:సమాప్తం:------


 Previous Page

WRITERS
PUBLICATIONS