39
ప్రాచీన శిలా నిర్మాణ కౌశల్యాన్ని వైభవాన్ని విలోకిస్తూ చిహ్న మాత్రంగా మిగిలిన వాటి శిధిలగతికి వాపోయారు కవిత, పార్వతీను. అలసటగా అందాకా ఒక రాళ్ళ గుట్ట మీది కెక్కి కూచున్నా రిద్దరూ.
తామిద్దరూ తప్ప మరెవ్వరూ వెంట రాకూడదన్న పార్వతి నిబంధనను తు,ఛ తప్ప కుండా పాటించింది కవిత.
దూరానికి అందంగా కనిపిస్తున్న శిధిల దేవాలయ ప్రాంగణాన్ని చూస్తూ, "శిధిలాల యమ్ము లో శివుడు లేడోయి" అంది రాగ సహితంగా పార్వతి.
"కానీ, దేశంలోని అక్రమ వ్యవహరాల్నీ చూచినప్పుడూ , చెయ్యవలసిన మహా ద్రోహులు చేసి వరాలు పొందడానికి వచ్చేవారిని చూసినప్పుడు ఇలాటి శిదిలాల్లోకే పారిపోవాలని పిస్తుంది పరమాత్ముడిక్కూడా" అన్నది కవిత.
"ఇలాటి తియ్యని కబుర్లు చెప్తాననే నిన్ను నేను ప్రేమిస్తున్నాను" అంది పార్వతి కవిత కళ్ళల్లోకి చూస్తూ.
"అందుకనే నేనూ నిన్ను ప్రేమిస్తున్నా నోయ్!" పార్వతి చెంపను ముద్దు పెట్టుకుంది కవిత.
పార్వతి నవ్వుతూ, "నిన్న రాత్రి నాకో కల వచ్చింది." అంది.
"ఏమిటది?' యధాలాపంగా ప్రశ్నించింది కవిత.
"శౌర్య సాహస గంబీర్య వితరణాది ధీరగుణసంపన్నుడైన రాజకుమారుడినట నేను. ఒక రోజు దేశ సంచారార్ధం బయల్దేరాను. వెళ్ళగా వెళ్ళగా ఒక ఊరు వచ్చింది.......ఊరు కాదు, రాజ్యం."
"సరి , ఇక నువ్వాగు. నేను తక్కిన భాగం చెప్పగలను. ఆ నగరాన్నేలే రాజవ్య శేఖరుడికి లేక లేక ఒక కుమారిక కలిగి తక్షణం పెద్దదైంది. ఆవిడ సంగీత సాహిత్య నృత్య చిత్రకళాదుల్లో కడు ప్రవీణురాలు కావున ఏ కవితా సుందరి అనో, సాహిత్య సుందరి అంటూనో పెరు పెట్టిరి అనుకుందాం. ఆ తర్వాత స్వయంవర సభలోకి హటాత్తుగా వచ్చి నిలబడిన మారు వేషధారి అయిన రాజపుత్రుడి మెడలో హారం వేసి ఊరుకుంది. అదీ కధ! కానీ, ఇందులో రాజకుమారుణ్ణి నేనైతే రసవత్తరంగా ఉండును,"
"ఎల్లా తలక్రిండులైనా ప్రేమకి అర్ధం ప్రేమే! కాని నిజంగా నాకొక చక్కని కల వచ్చింది ఆరోజు-- నీ దగ్గర కొచ్చిన రాత్రి' పార్వతి అంతా చెప్పి, "ఆ సమయంలో ప్రాణాల నిజంగా నన్ను చీల్చుకుని సర్వేశ్వరుడి తో కలిసి పోతున్నట్టే అనిపించింది, కవితా!" అంది.
"నా పార్వతేప్పుడూ అదృష్టవంతు రాలే , మరి!' అన్నది కవిత పార్వతి బుగ్గలు నొక్కుతూ.'
ఎందుకో పార్వతి కళ్ళు చెమర్చాయి. గొంతు లోకి జీర వచ్చింది. వెంటనే రెప్పలు అర్పెసుకుంది కవితకు కనిపించకుండా.
"సరే, అలా విహరించి వద్దాం. ప్రేయసీ రా!' అంది కవిత తను లేస్తూ.
"చిత్తం!" అంటూ పార్వతి ఉత్సాహంగా అనుసరించింది.
శిదిలంగా చెదురు మదురుగా పడి ఉన్నా శిల్పకారుడి నైపుణ్యాన్ని వేవిదాల చాటుతున్న శిల్పాలు గుండెల్లో బండల్ని దించుతున్నాయి . ఇద్దరూ కళాదృష్టి కలవారే. ముగ్ధులై చూస్తున్నారు. చైతన్య శూన్యమైన ఆ ప్రదేశంలో ఆ స్త్రీ లిద్దరి ఉనికి వింత శోభ తెచ్చింది. గుట్టల వెనక మైదాన మార్గంలో పశ్చిమాద్రికి పరుగెడుతున్నాడు దినకరుడు.
పువ్వుల రధంగా చెక్కబడిన ఒక శిల్పాన్ని చూచి ఎంతటి కళా ఖండం అనుకున్నారు ఆ యువతులు.
"ఆ శిల్పి హాస్యాన్ని నేనై ఉంటె ఎంత ధన్యురాలి నై ఉందును!" అంది కవిత సహజ మైన కవితా ప్రకర్ష వల్ల.
"అప్పుడా హస్తానికి సేవ చేసి ఆరాధించి ఉండేదాన్ని నేను" అన్నది పార్వతి గంబీరంగా.
"నీ మొహం! బస్సు వేళ అవుతున్నట్టుంది. బయల్దేరదాం ఇక."
"అబ్బ! ఉండు, కవితా! ఎప్పుడూ తొందర నీకు. చూడు, ఇదంతా ఆనందవనం లా లేదూ? ఇలా నిర్జనంగా ఉన్న చోట, ఏ వేళకూ సంబంధించని వేళ నీతో ఒంటరిగా కూచుంటే -- ఆ అనుభూతి అని చెప్పలేని అనుభూతి కలుగుతోంది. నువ్వు నాదానివేనని పిస్తుంది , కవీ!"
"నీదాన్నే! మరేం చెయ్యను?' పాడుపడి ఒంటరిగా నిలబడిన ఒక స్తంభాన్నానుకుని కూర్చుంది కవిత. ఆమెకు దగ్గరగా పార్వతీ చేరింది.
"ఒకటడగనా?' అంది హటాత్తుగా కవిత.
"ఏమిటది?" పార్వతి ఆత్రుతగా చూచింది ఆమె వైపు.
"ఆరోజు నా మీద ఎందుకంత కోపం వచ్చిందట నీకు?"
"తెలీనట్టడుగుతున్నావు. నన్ను బొత్తిగా మూర్ఖురాల్ని చేసేశావుగా?"
కవిత నవ్వి, "నామీద కూడా నీకు అసూయ ఉన్నదని అందామను కున్నాను ఇంకా" అన్నది.
"పోదూ! ఇలా అర్ధం చేసుకోనట్టు మాట్లాడితేనే నాకు బాధ. ఎంతైనా ప్రేమించబడే వాళ్లకి ప్రేమించే వాళ్ళు లోకువట."
"కాదు పారూ! నాలో కూడా ఒక సమయంలో అల్ప భావాలు లేచి సంచలనం తెచ్చేవి కాని పసి మనసుల మెత్తదనాన్ని కనుగొనడం , మహా పురుషుల మాటల్లోని నిర్మలత్వాన్ని గ్రహించడం, భగవంతుని పక్ష పాత రాహిత్యాన్ని ఊహించడం నేర్చుకున్న తర్వాత మనిషి తేలిక స్వభావాల్ని ప్రయత్నం లేకుండానే విడనాడి ఔన్నత్యా పధాల దరిదాపులకి చేరగలడు."
"నువ్వన్నది నిజమే! పోనీ గాని ఆ దృశ్యం ఎంత సుమనోహరంగా ఉందొ చూడు, కవితా! కొండల అంచుల నెప్పుడు స్పృశిస్తానా అంటూ పరుగెత్తే దివాకరుడు. అతని పరుగుకి కందిపోయి ఎర్రబడుతున్న ఆకాశము. మళ్ళీ ఆ వెలుగు కిరణాలను చూచేది ఎప్పటికో అన్నట్టు అచేతనంగా నిలబడి పోయి ఆ దిక్కుకే చూస్తున్న సమున్నత వృక్ష రాజాలు......."
తక్కిన భాగాన్ని కవిత పూర్తీ చేసింది.
"తమ విభులు అన్యమనస్కులై నారనే వైమనస్యంతో నన్నట్టు ఆ మహా వృక్షాలను మరింతగా పెన వేసుకుంటున్న సుమలతికలు మానసాన్నే నందనం చేస్తున్నాయి."
"నీ వర్ణనేం గొప్పగా లేదు" అంది పార్వతి కవితను చూస్తూ పెంకి తనానికి.
"ఏది నచ్చలేదు? వృక్షాలను తీగలల్లుకోవడమేనా? నువ్వెంత కొత్త దనాన్ని ఆశించినా సరే, పురుషుణ్ణి స్త్రీ ఎలాగో అలా అల్లుకుని ఆధారపడటం వాటి నైజం. అతి అసహజమైన గుణం."
పార్వతి చిరాకు పడ్డది. "ఇంకొక సంగతి తెచ్చావు. ప్రతి స్త్రీ పురుషుడి కి దాసోహం అనేయ్యాలని ఎక్కడా లేదు. సమాన హక్కులు, లభిస్తున్నప్పుడు ఎందుకని ఆధారపడాలి?' గడ్డి మొక్కలు ఏరుతూ అడిగింది.
"ఆధారపడకపోయినా అల్లుకోవాలి."
"ఏడ్చినట్టుంది. ఇంత నవనాగరికురాలివీ ఇదీ చెప్పేది" అంది పార్వతి మొగం చిట్లించి.
కవితతో ఇటువంటి సంభాషణ ఎంతవరకు పోయిందో గమనించలేదు ఆ అమ్మాయి.
కవిత చిద్విలాసంగా వింటూ, "ప్రకృతి సిద్దంగానే స్త్రీ కి కొన్ని బలహీనతలున్నాయి. వాటిని తలోదరులు తలదాల్చక తప్పదోయ్!" అంది.
"ఏమిటో అవి సెలవివ్వండి."
"ముఖ్యంగా పిల్లల్ని కనడమనే సృష్టి బాధ్యలోకటి."
పార్వతి తెచ్చి పెట్టుకున్న గంబీర్యంతో "అదే నేనూ అనుకుంటున్నా! ఈ యుగం పూర్తీ కానియ్యి. తిన్నగా దేవుడి దగ్గరి కెళ్ళి మగవాళ్ళు మగ పిల్లల్ని కనేటట్టు, ఆడవాళ్ళు ఆడపిల్లల్ని కనేటట్టు ఒప్పందం చేసుకుంటాను" అంది.
"నేను కూడా నీతో వస్తాన్లె. ఒక రచయిత్రి నంటూ. కాని దేవుడు కూడా మగవాడే కాబట్టి కోపం వచ్చి లోకమంతా ఆడపిల్లల్నే చేశాడంటే అప్పుడు మనకి మరీ తంటావచ్చి పడిందన్న మాటే!"
సెలయేటి గలగలల్లాగ నవ్వుకున్నారిద్దరూ.
"పాత జోకే గాని నువ్వంటుంటే విపరీతంగా నవ్వొచ్చింది." అంది కవిత. కాని వెంటనే గంబీరంగా మారిపోతూ, "ఏమైనా అను గాని స్త్ర్టీ ఒక పురుషుడి కి తనను తానర్పించుకోవడం లోనే బ్రతుకు అనే పదానికి సరైన అర్ధం ఇమిడి ఉందను కుంటాను నేను" అంది.
పార్వతి కళ్ళు కాస్త కిందికి వాల్చింది.
"పురుషుడి కే స్త్ర్టీ తన సర్వస్వాన్ని అర్పించు కోవాలనేముంది? నిష్కామంగా నిర్వ్యాజ ప్రేమతో స్త్రీ కి అర్పించు కోకూడదా? కాకపోతే భగవంతునికి పవిత్రంగా అర్పణ కాకూడదా?" ఎన్నాళ్ళ నుంచి కవితను కూడా అడగకుండా హృదయ కుహరం లో దాచిన సమస్యను అడిగి బరువు తీర్చుకుంది.
"కొంచెం ఆలోచించ వలసిన ప్రశ్నే వేశావు. స్త్రీ కి స్త్రీ అర్పించుకోవడం అనగా అది మానసికమైన ఆరాధన కి చెందినది. ఇక రెండవది -- భగవంతునికి ప్రియమైనదే. అయితే నేం? ఈ రెండు లక్ష్యాలకి గొప్ప తేడా ఉన్నదను కొను. ఉన్నా అది స్వల్ప మాత్రమని ణా అభిప్రాయం. ఐహిక సుఖాల్ని, బాధల్ని, ఆవేదనల్ని అన్నింటినీ అనుభవించి వాటి పై విముఖులైన తర్వాత ఆద్యాత్మిక భావ పూర్ణత తో, ప్రేమార్ధ్రహృదయంతో నిలిచిన వారిని కూడా భగవానుడు సులభంగా స్వీకరిస్తాడు."
పార్వతి ఏమీ అనలేదు కొంతసేపు.
ఇంకొంచెం సేపట్లో ఇద్దరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఊళ్ళో కి నడిచారు. సూర్యుడు క్రుంగి పోయినా వెలుగు తగ్గలేదు. ఊళ్ళో దీపాలు కనిపిస్తున్నాయి.
40
"ఇవాళ మా పుట్టిన రోజని విన్నారా?' అన్నాడు రాజు అద్దంలో చూసుకుని తల దువ్వుకుంటూ.
"ఓహో! అందుకేనా ఇంత వేగంగా తెల్లవారింది? పాపం! పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల కొచ్చింది మరి పుట్టిన దినం!" అంది పార్వతి.
"ఇలాటి వట్టి చప్పని మాటలు నా దగ్గర పనికి రావు. ధైర్యం ఉంటె నేనడిగిన దాన్ని ప్రజంట్ చెయ్యి" అన్నాడు.
"ఏం కావాలో అడగండి. శక్తి మేరకు చూద్దాం." అంది పార్వతి సవాలు చేస్తున్నట్టు నిలబడి పోయి.
"ఆ తర్వాత ఏడ్చుకుంటావేమో?"
"ఎందుకూ ఏడ్చుకోడం? అంత ప్రమాదకరమైనాదైతేనేనివ్వనని ముందే చెప్తున్నాను" అంది నవ్వుతూ.
"పోనీయ్! ఇవలేనిది కోరి తిప్పలు పెట్టడమెందుకు లే నిన్ను. అదిగో, ఆ ఉంగరం ఇస్తే చాలు. ఊ, క్విక్!"
"బాబోయ్! ఇది కవిత నా కిచ్చింది. ఇంత తేలిగ్గా ఇచ్చేయ్యడమే? నా వల్ల కాదు. పోనివ్వండి! ఇంకా మీకు మూడుసార్లు అవకాశం ఇస్తున్నాను. ఏది తేలికని తోస్తే దాన్నిస్తాను."
