"డియర్ శ్రీహరీ,
నీ ఆదరణకు కృతజ్ఞుడిని. ఎవ్వరూ లేక పోయినా నాకు నీవున్నావనే ఈ తృప్తి గుండెకు ఎంత దైర్యాన్నిస్తోందో ఎలా వర్ణించను! ఇది నిజంగా నువ్వన్నట్టు జన్మజన్మాంతర సంబంధం, శ్రీహరీ. పాప కలిగినట్లు తెలిసింది. నా ముద్దులు, ఆశీస్సులు. మీ అమ్మగారికి, నాన్నగారికి, అక్కగారికి నా నమస్కారాలు చెప్పు. శాంతి సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించాను. మంచివారిని భగవంతుడెప్పుడూ పాడుజేయడు.
నేను త్వరలో రావడానికి పయత్నిస్తాను. ఎలాగూ ఒకసారి ఆ ప్రాంతాలకు రావలసిన అవసరం ఉంది నాకు.
నీ రాజా."
"నీకు వేరే ఏమైనా ఉత్తరం వ్రాశాడనుకుంటాను?" అన్నాడు శ్రీహరి.
"అవే అనుకున్నాను. కాని నాకేమీ వేరే వుత్తరాలు రాలేదు" అంది శాంతి చిన్నబుచ్చుకుని.
"అడిగావా?"
"అడిగాను. మనోరమ ఒకటి వ్రాసింది. ఇంకేమీ లేవు నాకు. రామన్నే తెచ్చిచ్చాడు."
"అలా జరగదే! నీకు వేరే వ్రాసి వుండకపోతే ఇందులోనే నీగురించి మరికొంచెం వ్రాసివుండును. అదీకాక అతడలా జవాబివ్వకుండా వుండడు" అంటూ "రామన్నా" అని పిలిచాడు.
"ఇవాళ పోస్టు తీసుకున్నది నీవేనా?"
"అవును బాబూ ఏం?"
"ఉత్తరాలన్నీ యింతేనా?"
"లేదు, బాబూ ఇంకా వచ్చాయి. చిన్న కోడలుగారికీ, బాబుగారికీ. శ్యామలమ్మగారు నా చేతిలో వుత్తరాలన్నీ పుచ్చుకుని ఆరివి ఆరు తీసుకుని మిగిలినవిచ్చేశారు."
"సరే. వెళ్ళు."
రాజా ఉత్తరం వ్రాయకపోవటం శాంతికి తీరని అవమానంగా తోచింది. 'ఎందుకు వ్రాయనట్టు? ఏమైనా కోపమా? లేక చిన్నచూపా? బహుశః కొద్ది రోజుల్లో వస్తున్నాను కనుక ఉత్తరం అనవసరమనుకున్నాడేమో? లేకుంటే అస్తమానూ పరాయిపిల్లకు వ్రాయటం బాగుండదనుకొని వుండివుండవచ్చు' అని సరిపెట్టుకుంది.
అదే ఆలోచనలతో గదిలోకి వెళ్ళింది. టేబుల్ మీద అతడిచ్చిన 'ఫేర్ వెల్ మై ఫ్రెండ్' కన్పించింది. ఇదివరలో అతడి ఆలోచనలు వచ్చినా ఒకటి రెండు నిమిషాలలో సమసిపోయేవి. ఇప్పుడు అలా కాదు. అతడిచ్చిన పుస్తకాలూ, చిత్రాలూ రోజుకోసారి తీసి చూడనిదే తోచటంలేదు. అతడి సుందరరూపమే కండ్లలో మెదులుతుంది. సౌమ్యవర్తనమే మనస్సుకు హత్తుకుపోయి మరపుకు రాదు. తరుచు మనోరమ హితబోధలు గుర్తుకు వస్తాయి. విచ్చలవిడిగా విహరించి పరుగులెట్టే ఈ ఆలోచనా స్రవంతులన్నిటినీ సమన్వయ పరిచి ఆనకట్ట నిర్మించడానికి విఫలయత్నం చేస్తుంది శాంతి. అదేమిటో - తన మనస్సేమిటో - తన ఆలోచనలకు మూలమేమిటో తనకే తెలియదు! ఇంకా ఆలోచనలు సాగితే యింకా వ్యర్ధమైన ఆలోచనలూ, గోవిందరావూ గుర్తుకు వస్తారు. మనస్సు కలుషితమై పోతుంది. అందుచేత ఆ ఆలోచనలు రాగానే, వాటినుండి పలాయనం చేయటానికి తోటలోకి వెళ్ళి విహరించడం అలవాటు శాంతికి.
ఆరోజుకూడా ఎప్పటి మాదిరే తిరుగు తూంటే పద్మ వచ్చింది. "అబ్బ! మూడోనెల వచ్చింది. నాకు విముక్తి దొరికింది. ఇన్నాళ్ళూ 'చలిగాలి సోకుతుంది. తేమగా వుంది' అంటూ అత్తగారు బయటికే రానిచ్చేవారు కాదు" అంది నవ్వుతూ.
"అవును. మనుమరాల్నిచ్చినందుకు మరీ గారమై పోయావ్" అంది శాంతి హాస్యంగా. ఇద్దరూ నవ్వుకున్నారు.
అంతలో రామన్న ప్రశాంతిని ఎత్తుకు తీసుకువచ్చాడు. ఇపుడు మెడ నిలబెట్ట గలుగుతూంది ప్రశాంతి. విశాలనేత్రాలతో అందర్నీ పరీక్షగా చూస్తుంది. బోసినవ్వులతో పలకరిస్తుంది. చూపరుల్ని ఆకర్షించి మురిపింప జేయగల రూపం.
"పాప అంతా చిన్నమ్మ పోలికే" అన్నాడు రామన్న మరీమరీ ముద్దుపెట్టుకుంటూ.
శాంతి గర్వంగా చూచింది. శ్యామలకూడా అటువచ్చింది షికారుగా. శాంతి ముఖం త్రిప్పుకుంది. పద్మ మాత్రం "రా, శ్యామలా" అంటూ పలుకరించింది.
రామన్న అన్నాడు: "పెద్దబాబు నా కోరిక తీర్చేశాడు. ఇక చిన్నమ్మా, శ్యామలమ్మా ఎప్పుడు తీరుస్తారో నా ముద్దు!"
శాంతి నవ్వింది, "ఈ ముసలాళ్ళ కింకో లోకమే లేదు" అంటూ.
శ్యామల చీదరించుకుంది, "కూలివాడికీ పెద్దమాట లేమిటో నాకు బోధపడకుండా వుంది" అని.
పద్మకూ, శాంతికీ కష్టమైనా మాట్లాడలేదు. ముసలి రామన్నకా సణుగు డర్ధంకాలేదు.
"రామన్నా, పాలేళ్ళ నిద్దరినిలా పిలువు" అని అరిచింది శ్యామల దూరంగా వెళ్ళి.
శాంతి అంది పెద్ద వదినతో: "నువ్వు పలకరించడమే కాని, నీతో మాటే ఆడలేదు. చూశావా?"
"పోనీలే. మన లోపం లేకపోతే అంతే చాలు" అంది పద్మ అతి సాధారణంగా.
శ్యామల ఆజ్ఞ కనుక్కొనేందుకు యిద్దరు పాలేళ్ళు హాజరయ్యారు. కొంతమేర చదరం చూపి, "ఇదంతా యీ అనవసరపు మొక్కలు త్రవ్వి పారేసి చధునూ చేయండి. రెండు రోజులలో అయిపోవాలి పనంతా" అంది శ్యామల.
"ఇక్కడా?" వాళ్ళు నీళ్ళు గారిపోతూ నోరావలించి శ్యామలదెస చూస్తూండిపోయారు.
"అవును. ఏం? ఇక్కడే. అలా దయ్యం పట్టినట్టు చూస్తారేం?" ఉరిమింది శ్యామల.
రామన్న కలుగజేసుకొన్నాడు. "ఏటో శ్యామలమ్మా. నీ యవ్వారం ఏమీ బాగుండలేదు. ఇక్కడ చదునుచేయటమెందుకు, చెప్పు? ఈ పువ్వుల మొక్కలన్నీ సరేసరి. ఈ పారిజాతం వుందిక్కడ. దీన్ని త్రవ్వడం కాదుకదా, దీని ఒక్క ఆకు మేం ముట్టుకొంటే అయ్యగారు మా ప్రాణాలు లాగేస్తారు" అన్నాడు తలగుడ్డ దులిపి చుట్టుకొంటూ.
తన మాటకు నౌకరు అడ్డం చెప్పడంతో ఒళ్ళు తెలియని కోపంతో అరిచింది శ్యామల: "ఏం? అందులో నీ అయ్యగారి ప్రాణముందా?"
దానితో శాంతి ఉగ్రురాలైపోయింది" అవును. వుంది. అది శాంతివృక్షం. అది తెలుసుకో. మరి మాట్లాడకు. ఊరుకున్నకొలదీ నీ ఆగడం మితిమీరుతోందే!"
"నీ కనవసరం. నువ్వు మాట్లాడకు. ఇదఐ నా యిల్లు. నా యిష్టం" అంది శ్యామల.
హేళనగా నవ్వింది శాంతి. "ఎవరి యిల్లో తెలుసుకునే రోజూ ముందు వస్తుంది. ప్రస్తుతం మరి మాట్లాడితే బాగుండదు."
"శాంతీ, వూరుకో. నువ్వు లోపలికి నడు" అని సర్ధబోయింది పద్మ.
"ఉండు, వదినా. ఊరుకొంటే మరీ మితిమీరిపోతోంది. మనలో మనం ఎన్నైనా అనుకుంటాం. నాన్నగార్ని దేనికి? నాన్నగారి చల్లని అండన బ్రతుకుతూ ఆయనను అనడం దేనికీ? నిన్న వచ్చిందో లేదో - తన యిల్లట! నేను యిక్కడ పుట్టి పెరిగినదానను! ఆ సంగతి మరిచిపోకు. ఒరేయ్ రామన్నా, గోవిందూ, కిష్టయ్యా-పొండీ యిక్కడినుంచి. మీపనేం లేదిక్కడ."
వాళ్ళు వెళ్ళిపోయారు.
"ఎంత కండకావరం! ఇదేమిటో ఇప్పుడే అంతు తేలుస్తాను. నా మాట చెల్లనిచోట నేను దేనికీ?" పౌరుషంగా సెగలు గ్రక్కుతూ ఇంట్లోకి నడిచింది శ్యామల.
"ఇదేమిటి, శాంతీ? నాకేమిటో దడగా ఉంది. ఉండు. పాపను లోపల పడుకోబెట్టి అత్తగారితో చెప్పివస్తాను" అంటూ గబగబా పద్మకూడా లోపలికి పరుగెత్తింది.
అప్పటికప్పుడే ఏదో సినీమా జరుగబోతూన్నట్లుగా నౌకర్లంతా పోగడిపోయారు. అంతలోనే సినిమా ఘట్టంలోలాగా శ్రీహరి స్కూటర్ శబ్దం వినిపించడం, మరుక్షణంలోనే వనంలో ప్రవేశించడం జరిగింది.
"ఏమిట్రా యీ కోలాహలం? అంతా యిక్కడ పోగడ్డారేమిటి?" అన్నాడు, కాలునేలమీద ఆనుకొని, యింజను ఆపకుండానే. ఎవ్వరూ చెప్పలేదు.
"నువ్వలాగున్నావేమిటే, శాంతీ? ఏం జరిగింది?" అడిగాడు తిరిగి.
అంతలోనే పెద్ద పెద్ద రంకెలు పెట్టుకుంటూ నారాయణా, ఆ వెనుకనే శ్యామలా ప్రవేశించారు.
నారాయణ వస్తూనే రామన్నను వంగదీసి రెండు గ్రుద్డులు వేశాడు. శ్రీహరి ఆశ్చర్యంతో, క్రోధంతో స్కూటర్ స్టాండువేసి వచ్చేలోగానే నారాయణ, గోవిందును ఆ లెంపా యీ లెంపావాయించాడు. అది చూచి మిగతా వాళ్ళుదూరంగా పారిపోయి నించున్నారు.
"ఏమిట్రా, తమ్ముడూ? ఏమిటీ గొడవ?" శ్రీహరి తమ్ముడి చెయ్యి పట్టుకున్నాడు.
"వదులు చెయ్యి. మీరంతా ఒక్కటే. మేమే పరాయివాళ్ళం." రొప్పుతూ చెయ్యి వదిలించుకున్నాడు నారాయణ,
వార్ధక్యంతో ముడుతలుపడిన చెంపలపై జాలువారుతూన్న కన్నీటిని తుడుచుకొంటూ రామన్న చెప్పాడు: "ఇక్కడంతా చెట్లుకొట్టి వేల చదును చెయ్యమంది శ్యామలమ్మ. ఆ శాంతివృక్షాలు తాకరాదని నేను చెప్పాను. అందుకే యింత గొడవ. పోనీ, ఈ చేతులలో, ఈ భుజాలమీద ఆడుకున్న చిన్నబాబు నా కిచ్చిన కానుక యిది! పోనీలే పెదబాబూ." ఒక్కొక్క మాటలో నిబిడీకృతమన తీవ్ర వేదన, గుండెలలో పెల్లుబికిపోతున్న బాధకు చిహ్నంగా ఆగకుండా జారిపోతున్న ఆ అశ్రుధారలు అందరి హృదయాలూ కలచివేశాయి కాని, ఆ రాతి హృదయాలు రెంటిలోనూ ఏ మార్పూ తీసుకురాలేకపోయాయి.
"ఎంత నీచుడవైపోయావురా! రామన్న నా నువ్వు కొట్టినది? ఛీ! నా కడుపున చెడబుట్టావ్" అంది అప్పుడే పెద్ద కోడలితో కలిసి అక్కడకు వచ్చిన లక్ష్మీదేవి.
శ్రీహరి అగ్రహామంతా అణుచుకొంటూ, "ఏమిట్రా తమ్ముడూ? ఎందుకిక్కడ చదును చేయటం?" అన్నాడు.
"ఏం, నీకు చెప్పి చెయ్యాలా ఎందుకో? ఇక్కడ టెన్నిస్ కోర్టు తయారుచేయాలి" అంటూ పాలేళ్ళవైపు తిరిగి "ఊఁ. ఒక్కొక్కడే పని కానిస్తారా? ఒక్కొక్కడినే నరికి పారెయ్యనా అడ్డంగా?" అంటూ మళ్ళీ వాళ్ళ మీదకు కోపంగా వెళ్ళబోయిన తమ్ముడిని గట్టిగా పట్టుకున్నాడు శ్రీహరి. "ఏమిట్రా యిదంతా? నీ కే భూతమూ ఆవరించలేదు కదా? అని నాన్నగారికి ప్రాణసమం. నాన్నగారి కేమిటి - ఈ శాంతినిలయం లోని వ్యక్తులందరికి ప్రాణమే. క్రొత్ట్వాడిలా ప్రవర్తిస్తున్నావేమిటిలాగ?"
"నాన్సెన్స్! ఎన్నాళ్ళీ ముసలివాళ్ళ అధికారం? శాంతి వృక్షాలూ, గాడిదగుడ్డు వృక్షాలూను."
"పెద్దన్నయ్యా!" శాంతి చాలా మెల్లగా పిలిచింది. "వదిలెయ్యి. అంత తాపత్రయం దేనికి? రా, చిన్నన్నయ్యా. చిన్నవదిన ఈ ప్రయత్నం ఎందుకు తలపెట్టిందో నాకు తెలుసు; ఇందుకే. ఈ వృక్షాలు, నేను - మేం ముగ్గురం కవలలమే. నన్ను నరికితే ఎంతో వాటిని నరికినా అంతే. ముందు నన్ను కానిచ్చి ఆపైన
వాటిమీద చెయ్యి వెయ్యి" అంది పారిజాతం మొదట్లో నిలబడి.
"శాంతీ!" పద్మ గాద్గదికంగా అరిచింది.
నారాయణలో పైశాచికత్వం విజ్రుంభించింది. "ఇవ్వాళా నాకు కోపం తెప్పించిన అందరికి అంతే జరుగగలదు. అక్కడినుంచి మర్యాదగా లే."
"నేను లేవను."
గలభా విన్న బలరామయ్య ఆయాస పడుతూ జేరుకున్నాడు చేతికర్ర సాయంతో. సంగతంతా తెలుసుకున్న అతడు "ఓరి దౌర్భాగ్యుడా, ఏం పొయ్యేకాలం వచ్చిందిరా నీకు? ఈ యింట్లో సుఖశాంతులిలా ఉండనీయవా? పెళ్ళి చేసినందుకు అది ఆడించినట్లల్లా కోతిలా ఆడుతున్నావా?" అన్నాడు.
"మాటలు తిన్నగా రానివ్వండి" అంది శ్యామల.
"ఛీ! నోర్ముయ్! సిగ్గు లేదా? ఇంటినీగతికి తెస్తున్నావ్" అంది లక్ష్మీదేవి, కోడల్ని.
"ఇంత చిన్నవిషయానికింత రాద్దాంత మెందుకురా, తమ్ముడూ? పోనీ కోర్టు తయారుచేసుకోవాలంటే ఇంత తోటలో ఇంకెక్కడైనా చేసుకోకూడదూ? ఇక్కడే దేనికి? ఇది నీకేమైనా బాగుందా?"
"నేనడిగేదీ అదే. ఇంత చిన్న విషయంలో కూడా నా భార్యమాట, నామాట చెల్లకూడదా? అదేం గతిలేక వచ్చిందా? నలభైవేల కట్నం తెచ్చింది!"
"ఛీ, నీచుడా! నలభై వేలకు అమ్ముడుపోయానని పదే పదే చెప్పుకోవడానికి సిగ్గు లేదా?" అన్నాడు శ్రీహరి క్రోధాసహ్యాలు పెనవేసుకుపోగా.
వెంటనే నారాయణ, శ్రీహరి చెంపను చెళ్ళున కొట్టాడు. "నువ్వెవడవు నాకు నీతులు చెప్పటానికి? ఇందులో సగం ఆస్తి నాది."
దూరంగా ఉన్న పాలేళ్ళందరూ "పెద్ద బాబూ" అంటూ దగ్గరకు పరుగెత్తుకు వచ్చారు.
శ్రీహరి నివ్వెరపోయాడు.
