Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 45


                                     55

    మామగారి దగ్గరినుంచి తిన్నగా అత్తగారు ఉన్నచోటికి వెళ్ళింది పద్మ. "అత్తయ్యా, మీరంతా యింత నిశ్చింతగా ఎలా వుండగలుగుతున్నారు?"
    "ఏమిటి?" అంది లక్ష్మీదేవి అర్ధంకాక.
    "మామగారికి జబ్బుతగ్గి రెండు నెలలైంది కదా? ఇంకా అంత నీరసమేమిటి? నేను దూరం దూరంగా చూడటమేకాని అంత పరీక్షగా చూడలేదు. మరీ బలహీనంగా వున్నారు. ఆఖరికి పాపనే లేవనెత్త లేకుండా వున్నారు" నారాయణా.
    "ఆఁ. పెద్దతనం, కంగారేమిటి?" అన్నాడు నారాయణ.
    "అది కాదురా. పద్మ చెప్పినది నిజమే. నేనూ అనుకొంటున్నాను."
    "ఆయన కెప్పుడూ అసలు జబ్బూ లేదు; ఈ నీరసమూ లేదు. ఇదేమిటో మరి?" అంది లక్ష్మీదేవి దిగులుగా.
    "వీలైతే యివాళే మాట్లాడతాను. వస్తే యింటికే తీసుకొస్తాను" అన్నాడు శ్రీహరి.

               
    "చాలా ఖర్చు. రాజమండ్రినుంచి యిక్కడకు రావడమంటే యే టాక్సీమీదనో తీసుకురావాలి. ఆయనకు కారుంటే సరేసరి. ఎక్కువ బిల్లిచ్చుకోవాలి" అన్నాడు నారాయణ.
    "అయితే అవుతుంది. ఆయనకేం తక్కువ? మనమందరం వున్నాము. ధనలోపమూ, లేదు. అసలింతకాలం యెలా వుపేక్ష చేశారిందరుండి?"
    "మహా మామగారంటే నీకే ప్రేమ యెక్కువైపోయింది. డబ్బు విలువ తెలియడానికి డబ్బులో పుట్టి పెరగాలి." ఈసడిస్తూ వెళ్ళిపోయింది శ్యామల. మొదట్లో ఆమె బావ గారికి జంకేది. కాని రానురాను శ్రీహరి ఎదుట కూడా సంకోచరహితంగానే ప్రవర్తిస్తూంది.
    అందరూ నివ్వెరపోయారు. లక్ష్మీదేవి తీవ్రంగా అంది చిన్నకొడుకుతో: "చూశావా, నారాయణా, నీ భార్య ప్రవర్తన? తన కనవసర ప్రసక్తి యెందుకు? ఆ సూటీపోటీ మాటలెందుకు? తన పుట్టింటికి డబ్బు యీనాడైతే వచ్చిందికాని, యిదివరకు సంగతి? డబ్బువుండటం ఒక యెత్తూ, ఆ హోదా నిలబెట్టుకోగలగడం ఒక యెత్తూ. పద్మ పుట్టింటి సంప్రదాయ మెటువంటిదో, పద్మస్వభావమెటువంటిదో తనకు తెలుసా? చీటికీ మాటికీ పద్మనూ, శాంతినీ నొప్పిస్తుంది. ఇటువంటివి మన యింట్లో పనికిరావు. నీ భార్యకు నచ్చజెప్పుకో. ఏమైనా అంటే మళ్ళీ కోపాలూ, తాపాలూను."
    శ్యామల మళ్ళీ సుడిగాలిలా ప్రవేశించింది. ఆమె వెళ్ళిపోలేదు. చాటుగా ఉండి వినే అలవాటు కూడా ఉందన్నమాట!
    "అయితే నాకేనన్నమాట సంప్రదాయం తక్కువ? మీకు వాళ్ళైతే  యిష్టమైతే ఔగాక. మాటలు జాగ్రత్తగా రానీండి. ఉన్న మాటంటే వులుకెందుకు?" వచ్సినంత వేగంగానూ వెళ్ళిపోయింది.
    "ఛీ! పెద్దంతరం లేదు, చిన్నంతరం లేదు" అంటూ, కంట తడిపెడుతూన్న పద్మ దగ్గరికి వెళ్ళింది లక్ష్మీదేవి. "చూడమ్మా, పద్మా. తెలివి తక్కువవాళ్ళన్నదాని కేమిటిది? ఇంటికి పెద్ద కోడలివి. గుణవంతురాలివి. నిన్నెవరూ అగౌరవపరచలేరు. ఇలా కంట తడిపెట్టవచ్చా?"
    "లేదత్తయ్యా. మీరుండగా నాకేలోటూ లేదు." కళ్ళు తుడుచుకొంది.
    ఇక శ్రీహరి మౌనంగా ఉండలేకపోయాడు. "తమ్ముడూ, ఏమిటిది? ఇంత జరిగినా అలా చూస్తూ వూరుకోవడానికి నీకెలా ఒప్పుతోందిరా? నువ్విలా అలుసివ్వబట్టే శ్యామల యీ యింటి నిలా నరకంగా మార్చుతోంది."
    "ఓహ్! నువ్వుకూడా సమర్ధిస్తున్నావే? అయితే వదినమాట నీకు సమంజసంగా వుందా?"
    "అందులో తప్పేముంది?"
    "అందులో తప్పు లేకపోతే యిందులోనూ లేదు. ఇందరుండి యేంచేస్తున్నారంటే తప్పులేదా? తనకే శ్రద్ధ వున్నట్టూ, ఎవరికీ లేనట్టూను?" తీవ్రంగా అడిగాడు.
    "ఊఁ." బరువుగా నిట్టూర్చాడు, శ్రీహరీ. "నువ్వు చాలా మారిపోయావురా. ఇలాగై పోతావని ఎప్పుడూ అనుకోలేదు. సరే. ఒకనాడు నువ్వే నీ అంత మారతావు. మేమేమీ చెయ్యలేం."
    నారాయణ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. "ఏమిటిదంతా, పెద్దబాబూ?" దిగులుగా అడిగింది లక్ష్మీదేవి.
    "ఏముందమ్మా? శాంతినిలయంలో అశాంతి రేగింది. తట్టుకోవాలి. మనమేం చెయ్యలేం" అంటూ వెళ్ళిపోయాడు భారంగా.
    
                                   56

    సాయంత్రం స్నానంచేసి మేడమీదకు వస్తూన్న పద్మకు, ప్రశాంతి గుక్కపట్టి ఏడవడం విన్పించింది. ఎప్పటినుంచి ఏడుస్తూందో మరి, గొంతు జీరకూడా పోయింది.
    "నా తల్లీ, యెప్పట్నుంచేడుస్తున్నావమ్మా?" అంటూ లేవదీసి గుండెలకు హత్తుకుంది, పద్మ. పాప కొంచెం ఊరడిల్లింది. కాని పూర్తిగా మానలేదు. సముదాయిస్తూ వరండాలోకి వచ్చింది పద్మ. ప్రక్కనే తన గదిముందు వాలుకుర్చీలో పడుకుని ఏదో నవల చదువుకొంటూంది శ్యామల. తలెత్తికూడా చూడలేదు. అంతలోనే శాంతీ, జయాకూడా అటు వచ్చారు ఆదరా బాదరాగా, "ఏం, అంతలా ఏడుస్తోంది?" అంటూ.
    "ఎప్పట్నుంచేడుస్తోందో మరి? కంఠం పొడారిపోయింది. మీ రెవరో ఒక రుంటారని నేను క్రింద పనిలో వుండిపోయాను. రామన్న కూడా లేడు. ఏమయ్యాడో మరి?"
    "మేం తోటలో వున్నాం. ఏడుపు వినేవస్తున్నాం" అంటూ జయ, పాపను అందుకొంది.
    "పాలు కలిపి తీసుకొస్తాను" అంటూ శాంతి క్రిందకు వెళ్ళిపోయింది.
    "ఛీ! వెధవరొద. ఒక్క నిమిషమైనా ప్రశాంతత లేదు. పేరుకుమాత్రం శాంతినిలయం, శాంతివనం!" విసుక్కొంటూ, కుర్చీని తన్నుకొని లేచి లోపలికి వెళ్ళిపోయింది శ్యామల.
    "ఏం? ప్రక్కనే వున్నావు. ఏడుస్తోందని చెప్పకపోగా పైగా ఆ విసుగుదల దేనికీ?" అంది జయ.
    "ఛీ! ఇంట్లోజేరి నన్నే యెదిరిస్తున్నావ్? ఎవరినో తెలుసా?" లోపలికిపోయిన శ్యామల తిరిగి యివతలికి వచ్చింది.
    "నీ యిల్లేం కాదు. మా అక్కయింటి కొచ్చాను. మాటలు తిన్నగా రానీయ్."
    "జయా!" కోపంగా పద్మ చెల్లెలి చెంప చెళ్ళుమనిపించింది. "ఎందుకా అధికప్రసంగం? నడు లోపలికి."
    గ్రుడ్ల నీళ్ళు గ్రుడ్ల గ్రుక్కుకుంటూ గబగబా క్రిందకు వెళ్ళిపోతున్న జయ పాలసీసాతో పైకి వస్తూన్న శాంతికి ఎదురుపడింది.
    "ఏమిటి, జయా? ఏం జరిగింది?" చెయ్యి పట్టుకుని ఆపింది శాంతి.
    జయ మాట్లాడకుండా చెయ్యి విదిలించుకుని వెళ్ళిపోయింది.
    శాంతి వదినకు సీసా యిస్తూ "ఏమిటి వదనా? జయ అలా ఉందేం? చిన్నవదిన ఏమైనా అందా?" అనడిగింది.
    "ప్రతిదానికీ ఆరాలుతీసి ఆర్భాటం చేయకు. వెళ్ళు" అంది పద్మ విసుగ్గా.
    విస్తుపోతూ వెళ్ళిపోయింది శాంతి. క్రింద గదిలో జయ ధారాపాతంగా వర్షిస్తూన్న నేత్రాలను ఒత్తుకొంటూ పెట్టె సర్దుకొంటూంది.
    "ఏమిటి, జయా? చెప్పవ్? నాకు చెల్లెళ్ళూ, అక్కలూ లేరు. నువ్వు వచ్చిన దగ్గర్నుంచీ ఎంత స్నేహంగా కలిసిపోయాం! నాకు చెప్పడానికేం?" అడిగింది శాంతి.
    మరింత వెక్కి వెక్కి ఏడ్వడమేతప్ప జయ సమాధానమివ్వలేదు.
    శాంతి గబగబా తల్లిదగ్గరకు పరుగెత్తింది. "అమ్మా, జయలక్ష్మి ఎందుకో యేడుస్తోంది. వెళ్ళిపోతుంది కాబోలు. పెట్టె సర్దుకుంటోంది. ఎంతడిగినా చెప్పటంలేదు" అంది.
    "ఇంతవరకూ మీరిద్దరూ కలిసే ఉన్నారేమో తోటలో?" అంది లక్ష్మీదేవి.
    "అవును. తనేవో కృతులు పాడుతూంటే నేను వింటున్నాను. అంతలో పాప పెద్దగా ఏడ్వడం విన్పించింది. మేం మేడమీదకు వెళ్ళం. అప్పటికే పెద్దవదిన వచ్చి పాప నెత్తుకుంది. చిన్నవదినకూడా అక్కడే ఉంది. మరి ఏమైనా అందేమో నాకు తెలియదు. నేను పాలసీసాకోసం క్రిందికొచ్చాను."
    "పద. నే కనుక్కుంటాను."
    "జయా, ఏమిటమ్మా?" అంటూ చుబుకంపట్టి తన వేపుకు త్రిప్పుకున్న లక్ష్మీ దేవి నిర్ఘాంతపోతూ అడిగింది: "ఆ బుగ్గ అలా కందిపోయిందేమమ్మా?"
    జయ కారణం చెప్పలేదు. "నేను వెళ్ళి పోతాను. నన్ను పంపేయండత్తయ్యా."
    "ముందు కారణం చెప్పమన్నాను. తర్వాత మిగత మాటలన్నీని" అంటూ దగ్గరకు తీసుకుంది జయను. "చెప్పు మరి. మీ అమ్మ ఒకటీ, నేనొకటీ కాదు."
    ఆ అనునయ వాక్యాలకు కరిగిపోయింది జయ. జరిగినదంతా చెప్పి, "నేను వెళ్ళిపోతాను. ఇంకొక క్షణం ఉండను" అంది.
    ఉగ్రురాలైపోయిన లక్ష్మీదేవి, "పద్మనిలా పిలువు, శాంతీ" అని ఆజ్ఞాపించింది. వెంటనే అమలులో పెట్టింది శాంతి.
    "ఏం, తెలివితక్కువగా ప్రవర్తించడమే కాక యాగీకూడా చేస్తున్నావా?" అంటూ వచ్చింది పద్మ.
    "చాల్లే. పసిపిల్లను తీసుకొచ్చి యిదేనా ఆదరణ? చెల్లెల్ని తీసుకొచ్చి అలాగేనా ఆదరించటం?"
    "కాదత్తయ్యా. అసలే అతి జాగ్రత్తగా ఉంటేనే గొడవలు లేకుండా రోజు గడవడం లేదు. ప్రొద్దున్న ఏదో యింటి గొడవకే అంతరాద్దాంతమైందా? ఇక కావాలని ఆవిడతో కయ్యం పెంచుకోవటం బుద్ధితక్కువ కాక పోతే ఏమిటి చెప్పండి?"
    జయ రోషంగా అంది: "నువ్వేం కష్టపెట్టుకోకక్కయ్యా. నేను వెళ్ళిపోతాన్లే."
    "అదే నేనూ మంచిదనుకొంటున్నాను" అంది పద్మ.
    "పద్మా!" కోపంగా అదిలించింది లక్ష్మీదేవి. "ఎదుట నేనున్నానన్న సంగతికూడా మరిచిపోతున్నావా? ఇంటికి తీసుకొనివచ్చిన పిల్లను వెళ్ళమని చెప్పడమా? ఇదెక్కడి మర్యాద? నేనింకా బ్రతికే ఉన్నాను. నా యింట్లో ఏమీ మర్యాదలోపం జరుగకూడదు" అంటూ, "జయా, నువ్వసలు ఎవ్వరితోనూ మాట్లాడకమ్మా. ఏమీ మనస్సులో పెట్టుకోకు. నాకు శాంతి ఒకటీ, నువ్వొకటీ కాదు" అంది జయను ఛుబుకం పట్టి.
    పద్మ మనస్సు ద్రవించిపోయింది, స్వపర భేదంలేని ఆ అత్తగారి ఆదరణకు. "తెలుసత్తయ్యా, మీదింత అమృతంవంటి మనస్సని. అందుకే చనువుగా నాతో తీసుకురాగలిగాను. కోపంలో కొట్టానేకాని, నాకుమాత్రం అదంటే కోపమా?" అంది చెల్లెలి చెంపలపై కన్నీరొత్తుతూ.
    "చాల్లే. ఎందుకు కోపం, చంటిపిల్లమీద? వెళ్ళి ముఖం కడుక్కో అమ్మా, జయా."
    శాంతీ, జయా తృప్తిగా వెళ్ళిపోయారు.
    "పద్దెనిమిదీ, ఇరవై ఏళ్ళొచ్చినది. అది చంటిపిల్లా మీకు?" అంది పద్మ నవ్వుతూ.
    "అదీ చంటిపిల్లే, నువ్వూ చంటిపిల్లవే నాకు. పెద్దవాళ్ళముందు అనుభవంలేని మీరు ఎంత?"
    పద్మ ముఖం వికసితపద్మమైంది. "నా పూర్వజన్మ సుకృతమత్తయ్యా, మీ కోడలి నవడం" అంది ఆనందబాష్పాలతో.
    "చాల్లేకాని, మళ్ళీ పాపను వదిలి వచ్చావు. ఏడుస్తుందో ఏమో? వెళ్ళు. నువ్వు వెళ్ళలేక పోతే, రామన్ననో ఎవర్నో పంపి ఆడించమను" అని హుందాగా వెళ్ళిపోయింది.
    
                                                       57

    శ్రీహరి వచ్చేటపుడు ఒక డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆయన చూచి, "మీ శారీరక రుగ్మత లేదండీ. ఇంకా నీరసం తగ్గలేదంతే. వృద్ధాప్యంవల్ల త్వరగా కోలుకోలేకపోయారనుకొంటాను. కొన్ని టానిక్కులు వ్రాసి యిస్తాను. వాడి చూడండి" అన్నాడు.
    "అంతే, అంతే" అన్నాడు బలరామయ్య.
    "అదే నేను చెప్తే ప్రొద్దున మీకు బాగోలేదు" అన్నాడు నారాయణ నిష్టురంగా. ఎవ్వరూ మాట్లాడలేదు.
    "అబ్బాయ్, ఏవో పార్సెలూ, ఉత్తరాలూ వచ్చాయి నీకు. నా బల్లమీదున్నాయి. తీసుకుపో" అన్నాడు బలరామయ్య వెళ్ళిపోతున్న పెద్ధకొడుకును.    
    తీసుకువెళ్ళి శ్రీహరి తీరికగా తన గదిలో కూర్చుని కవర్లు చించాడు. సంతోషంగా "శాంతీ" అని ఒక్క కేక పెట్టాడు.
    శాంతి వచ్చి కుతూహలంగా చూచింది. పాపకు రకరకాల గౌన్లు ఒక అరడజను, చిన్న చిన్న అందమైన ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నాయి ఆ పార్సెలులో. అది రాజా పంపాడు. ఉత్తరం కూడా అతడి దగ్గరినుంచే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS