ఆ రాత్రి కలత నిద్ర పోయింది పార్వతి. తన కిష్టం లేని పనేదో జరిగిపోతున్నది. ఆ అక్రమతిమిరావాహంతో రెండే రెండు దివ్య పాదారవిందాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. అంతవరకూ అగుపించని ఆచరణ ద్వయం ఆకస్మికంగా దృశ్యం కావటమే ఆశ్చర్యం. తన మనస్సును చీల్చి వేసే ఓజస్సు లా దృడ గాంబీర్యాలతో అలరారుతూ పవిత్రతకు ప్రతి రూపాలైన పాదాలు . ఎవరివి? ఏమిటది? ఆపాదద్వయం ఎక్కడి నుండి అగుపిస్తున్నట్లు? మనసు ఊహిస్తున్నది. పెదమలు పలుకలేక పోతున్నాయి. సువర్ణ రత్న స్తగితాలై వజ్ర కాఠిన్యాన్ని స్పురింపచేసినా అధమాధముల ఆక్రందనలకు సైతం కరిగి మృదుత్వాన్ని వహించే సర్వేశ్వరుని చరణ కమలాలు.
పార్వతి ఆ పాదాలపై తల ఉంచింది. తనకు కలుగుతున్న అపరిమితమైన సుభానుభూతిని విపరీతమైన అశాంతి నాశనం చేస్తుంది. ఆ శాంత్యశాంతల పోరాట మధ్యంలో పెదవులు ఏదో నామోచ్చరణ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. కాని పరమాత్ముడికి వినిపించేది హృదయ వినిర్గతమయ్యే ఆవేదనే.
'ఈ జన్మ నీకే అర్పణ' అని ఘోషించింది పార్వతి గుండె. తన నుండి ప్రాణాలు వేరు చెయ్యబడుతున్నట్టనిపించింది. కరుణ విలసిత ప్రసన్న వదనంతో భగవానుడు తన ప్రాణాల్ని పరిపూతం చేస్తున్నాడు. కాని ప్రాణోత్ర్కమణ సమయం యాతనామాయం. శూన్యమైపోతున్నది శరీరం. మనస్సు స్తంభించి పోయింది. ఊపిరందడం దుస్సాధ్యంగా ఉన్నది.
గింజులాటలో పార్వతి కళ్ళు విచ్చుకున్నాయి. చటుక్కున లేచి ఏకేకా వెయ్యలేదు ఆమె. మధురమైన కల. మళ్ళీ రాని కల. మనః ఫలకం మీద తిరిగి కనిపించింది. కళ్ళు ధారలు కట్టాయి. ఆ సమయంలో ఆ అశ్రువులు సుఖ స్పర్శ నిస్తున్నాయి. ఆ కల నిజ మవ్వ కూడదా? పోనీ, ఆ కలతోనే తను ఉండి పోకూడదూ? పోనీ, ఆ కలలోనే తను ఉండిపోకూడదూ? అనుకుంది పార్వతి.
బెడ్ లాంప్ గుడ్డి వెలుగులో వాచీ చూచింది. ఆగిపోయిందది . కళ్ళద్దుకుని లేచి డ్రాయరు లో రిస్టు వాచీ చూచింది. పన్నెండు గంటలు . ఇంతేనా? అర్ధరాత్రి దాటి పోయినట్టుగా ఉంది నిశ్శబ్దంగా.
'నిద్ర మళ్ళీ రావడం కల్ల. తిరిగి ఆ మధుర స్వప్నం రాగలదనే ఆశ ఉంటె బలవంతం గానైనా నిద్రపోతుంది తను. కాని------'
వీధి వాకిట్లో కి వెళ్లి నిలబడ్డది. చిరు చలికీ, చీకటి కి బెదరకుండా నిబ్బరంగా ఉంది మనసు. కల కలిగించిన ఉద్వేగం ఇంకా తగ్గలేదు. హృదయాన్ని చీల్చి దైవానికి అంకితం చేసేయ్యాలన్నంత త్రుణీ కారంగా ఉన్నది శరీరం మీద. మమత లన్నీ పాపాల్లా తోచి కలత పెట్టాయి.
'ఛీ!' అనుకున్నది. శీతభానుడి కాంతి కిరణాలు చీకటిని పూర్తిగా తరమ లేకపోతున్నాయి. గుడ్డి వెలుగుతో నే మహా చిత్రకారుడి చిత్ర పటం కనిపిస్తున్నది. మహా గాయకుడి గానం విశ్వ వ్యాపకమై వినిపిస్తున్నది. 'గగనానిల తెజోజ్వల భూమయ సృష్టి లో , మృగ ఖగనగతరుకోటు లలో పరమాత్ముడు వెలిగే ముచ్చట' అది.సూక్ష్మాతి సూక్ష్మా ణువుల నుంచి కూడా వినిపించే పరమార్ధం. ' భువన మెల్ల నీవై యుండి నన్నొకని బ్రోవ భారమా' అని గాయకుని నిరవధిక గంబీర మధుర కంఠం తో ఊళ వేసే గాలిలో ఏకమయి గానం చేసే మానవాళి మనస్సు......
కాని పార్వతి మనసు కొన్ని దినాలై భగవద్విషయాల్లో నిశ్చలంగా నిలవడం లేదు.
కవితను తక్షణం చూడాలనిపించింది పార్వతికి. ఎన్ని భావాలు పరుగులేత్తినా ఆగలేక పోయింది. ఆలోచించే నిగ్రహం పోయింది.
తలుపు దగ్గరకు వేసి నడవ సాగింది. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలు, నిశీధ స్థలాలు అప్పుడు పార్వతిని భయపెట్టలేదు. కవిత నివాసం దగ్గరేమీ కాదు. కాని ఏదో శక్తి నడిపించింది ఆ అమ్మాయిని.
తీరా ఇంటి దాకా వెళ్లి రెండు సార్లు తలుపు తట్టినాక సంకోచం కలిగింది. 'ఇంత రాత్రి వేళ రావడమేమిటి తను? ఎవరైనా ఏమనుకుంటారు' అనుకుంది.
కరుణాకరం తలుపు తెరవగానే ఉలిక్కి పడి ఏమని చెప్పాలో తోచక నిలబడింది.
"లోపలికి వెళ్ళండి. కవిత వ్రాసుకుంటోంది" అన్నాడతను. అప్పుడు ధైర్యం వచ్చింది.
మెల్లగా వెళ్లి ఏకదీక్ష గా వ్రాస్తూన్న కవిత పరవశాత్వాన్ని చూచింది, ఆమెకు తెలీకుండా.
ఆమె రచయిత్రి. ఆమె వర్చస్సు , వాగ్ధాటి -- ప్రకాశించడం, ప్రవహించడం ఆ హస్తంలో నుండే.
అక్కడ అహంకారానికి, అధః కారానికి తావు లేదు. ప్రాచీనమని, అధునాతనమని భేదం ఉండదు. ప్రకృతికి ప్రతి కృతి జరిగే ఆ సమయంలో ఒకటి ఉన్నతం గాను, మరొకటి అధమం గాను కనుపించదు. ఒకరు ఉత్తములని, మరొకరు అధములనే తారతమ్య భావం నశిస్తుంది. సుమనో విమనో వృత్తుల సూక్ష్మీకరణ తరుణం లో సృష్టి కర్త మనస్సే అయిపోయి కరుణ గంబీర్యాలు నిండుతాయి. అదొక వింతైన మానస విహృతి. అంతర్నేత్ర బలంతో ఆ విహరణం లోనే రకరకాల జీవిత మర్మాలను భేదించడమైన , భిన్న విభిన్న మానవ ప్రవృత్తుల్ని చిత్రించడమైన జరుగుతుంది. ఏదో ఒక దేయంతో సాగేది రచన.
"కవితా!" అనే మృదువైన పిలుపుతో కవిత తదేకతకు భంగం వాటిల్లింది. ఆవేళప్పుడు పార్వతి రాకను ఊహించ లేదామే.
"పారూ!' అని చిరునవ్వుతో చేతిని అందుకుంది ప్రేమగా.
"కవితా! ఇంత రాత్రిలు కూడా వ్రాస్తున్నావా?" అంది పార్వతి బొంగురుగా.
"అదిగో , అప్పుడే దేబ్బలాటకు అరంభించావు" అంది కవిత మనసారా నవ్వుతూ. "ఈ నవల ముగింపు ఇప్పుడే అయిపోవాలని పట్టు దలగా కూర్చున్నాను, పారూ! నువ్వలా కూచో. ఇంత రాత్రి వేళ నన్ను చూడాలనిపించిందా?"

"ఉహు. నువ్వలా వ్రాస్తూ కూచుంటే నేనిలా నిలబడి కదలను. అర్ధరాత్రులు మేలుకుంటే ఆరోగ్యం చేడిపోదూ?"
"కొంచెమే ఉంది. వ్రాయనియ్యి, పారూ!"
"వద్దు. వ్రాయద్దు. ఇంకా ణా మాట వినకపోతే ఆ కాయితాలు లాక్కుంటాను , మరి!" అంది పార్వతి వినిపించుకోకుండా.
కవిత నవ్వి, "నీకు తెలీదు, పారూ! నాలా కొంత అనుభవం అయ్యాక ఏ భయాలూ మనల్ని చేరవు రాటు దేరిపోయి ఏ క్షణాని కేమౌతుంధన్నా అనుభవించడానికి సిద్దంగా ఉంటాం" అంది.
కవిత చెప్తూ ఎవైపో చూస్తున్నది. కాని వెచ్చని నీటి చుక్కుల శరీరాన్ని తాకేసరికి ఉలిక్కిపడి గాభరాగా లేచింది కుర్చీలో నుంచి.
"ఏమిటది, పారూ?" దగ్గరకు తీసుకుంటూ ఆత్రుత పడింది కవిత.
"ఇల్లాటి మాటలు ణా దగ్గరనకు కవీ! నీకు ఈ ధైర్యం ఉంటె నీ మనసులోనే దాచుకో. నువ్వు లేకుండా నేనీ ప్రపంచంలో ఉండలేను. ఎక్కడి కెళ్ళినా నన్నూ తీసుకెళ్తావా?' పార్వతి కంఠం లో దుఃఖం ధ్వనించింది.
"పిచ్చిపిల్లా!" అంది కవిత. ఈ వేదన అర్ధం కానిది. కాని అనంతం. పార్వతి లోని సంక్షోభాన్ని తెలుసుకుంది. దాన్ని ఏ ఒడార్పూ వెంటనే తగ్గించడాని తెలుసు.
"చెప్పవ్? నేనూ నీతోనే వస్తాను ఎక్కడి కెళ్ళినా...." పార్వతి కవిత హృదయం లో తల దాచుకుంది బరువుగా.
"పిచ్చిదాని వేమిటి? నేను మాత్రం నిన్ను విడిచి ఇప్పుడెక్కడి కి వెళ్తున్నాను?' కసురుకుంది కవిత. "నీ మనసు బాగులేనట్టుంది. నేను ఉత్తరదేశంలో ఒక ప్రాంతానికి వెళ్ళాలి. నిన్ను కూడా తీసుకు పోతాను" అన్నది మళ్ళీ ఆమె.
కొద్దిసేపు కవిత మాటలు విని, "ఇంటికి వెళ్తాను కవితా!" అంది పార్వతి కులాసాగా.
"ఓహో! అర్ధరాత్రి మళ్ళీ ఇంటి కేల్తావా? నేను పంపిస్తాననుకునే వచ్చావా? వీల్లేదు ఈనాటి కిక్కడే నీ నిద్ర. కావాలంటే నేను తోడు పడుకుంటాన్లే."
"మహద్భాగ్యం! కాని తలుపులు సరిగ్గా వెయ్యకుండా వచ్చాను."
"మరేం భయ్యం లేదు. మీ రాజు గారు పరాక్రమవంతులే! దేవుడి మీద ఆ బరువేదో వేసి పడుకో" అన్నది కవిత నిశ్చింతగా.
