'తోబుట్టువులు లేని ఒంటిగాడవు. తల్లిదండ్రులను కోల్పోయిన నిర్భాగ్యుడవు. ప్రేమించిన పడతిని పొందలేని దౌర్భాగ్యుడవు. రాజా! ఎందుకు నీ జన్మ యిక?' అనేది అంతరాత్మ. తనపై తనకే జాలి కలిగేది. అంతకంటే దౌర్భాగ్యపు స్థితి, విచారకరమైనది లేదు జీవికి. తనపై తనకే జాలి - సకల విరక్తు లకూ మూలం.
నిర్జీవంగా నెట్టుకువస్తున్న ఆ జీవితానికి శ్రీహరి నుండి వచ్చిన ఉత్తరమే ఒక్క క్షణం ఏదో తెహ్లియని ఊరట కలిగిస్తుంది. కాని అతి ఆశ్చర్యం కలుగజేస్తూ ఒక దినం శాంతి ఉత్తరం వచ్చింది. పున్నమరేయివాడు ఉరకలెత్తే సముద్రునివంటి హృదయంతో, కోటి కోర్కెలతో విప్పాడు ఉత్తరం.
"మిత్రులు శ్రీ రాజశేఖరంగారికి -
శాంతి నమస్కారానంతరం. మీరు ఆ మధ్య కలకత్తానుంచి స్వయంగా నాకు వ్రాసిన ఉత్తరం, మనోరమచే వ్రాయించిన ఉత్తరం అన్నీ అందాయి. నాపై మీకుగల శ్రద్దాభిమానాలకు నా మనస్సెంత ఉప్పొంగిందో మాటలలో వర్ణించలేను. మీరు భావించినట్లుగానే మొదట్లో నేనూ అనుకున్నాను. బహుశః ఈ దెబ్బనుండి కోలుకోలేననీ, నా భవిష్య త్తేమిటో నాకే తెలియకుండా ఉందనీ, ఏ క్షణాన్నైనా నిగ్రహం కోల్పోయి, ఆనాడు స్టేషన్లో మీకిచ్చిన మాటకూడా మీరిపోగలననీ భయపడే దాన్ని. కాని భగవత్క్రుపే కావచ్చు: దైవసము లైన నాన్న, అన్నయ్యగార్ల వాత్సల్యాదరణలే కావచ్చు; స్వచ్చమైన వెన్నవంటి మృదుహృదయంగల స్నేహితులైన మీరు చేసిన హితబోధా, పలికిన సాంత్వన వచ్నాలే కావచ్చు-నన్ను విషాదానికి దూరం చేశాయి. ఇప్పుడు నా మనస్సులో నీ విచారమూ, మాలిన్యమూ లేవు; సుఖంగా ఉన్నాను. బహుశః ఎవరూ కూడ నాలో ఈ మార్పు రాగలదని అనుకొని ఉండరు. అప్పటి నా అవివేకానికీ, తొందర పాతుకూ ఎంతో సిగ్గుపడుతున్నాను. ఎప్పుడూ ఆ విషయాలు గుర్తుకు రావు. గుర్తువచ్చినా ఒకనాటి పీడకలలా ఒక్క నిమిషం మాత్రం మనస్సులో మెదిలి మాయమౌతాయి. ఇదింత అల్పవిషయంగా మారిపోయినందుకు నేనే ఆశ్చర్యపోతూంటాను.
"మీరు క్రిందటిసారి ఉత్తరాలు వ్రాసి నప్పుడే వెంటనే నేనూ, అన్నయ్యా కలకత్తా జాబులు వ్రాశాం. కాని అవి తిరిగివచ్చినవాడు మేము పడిన ఆందోళన ఇంత అంతా కాదు. మళ్ళీ మీ దగ్గరినుండి ఉత్తరం వచ్చేవరకూ మనఃస్థిమితామే లేకపోయింది. మీ ఉత్తరం చూచాక కలిగిన నా సంతోషం వర్ణనాతీతం. కాని, ఉద్యోగం ఎందుకు మానేశారు? వివరాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. మీ జవాబుకూ, మీ రాకకూ ఎదురు చూస్తాను.
"అన్నట్టు, ఒక విషయం. పెద్ద అన్నయ్యకు కూతురు పుట్టింది. అన్నయ్య మీకు వ్రాయడానికి సిగ్గుపడ్డట్లున్నాడు. నేను వ్రాస్తున్నాను. పేరు 'ప్రశాంతి'. బాగుందా? నాన్నగారు పెట్టారాపేరు. ఇప్పుడు రెండోనెల. ఎంత ముద్దొస్తుందనుకున్నారు! మనోరమ దగ్గరినుండి ఉత్తరాలు వస్తున్నాయి. వెంటనే జవాబు వ్రాయండి.
మీ శాంతి."
'మీ శాంతి!' రాజా గుండె వేగంగా స్పందించింది. ఉత్తరం చివర అందంగా ఆకులతో ఉన్న గులాబి పుష్పగుచ్చం చిత్రీకరించింది. రెండు పువ్వులూ, ఒక మొగ్గా, చుట్టూ ఆకులూ, నిజంగా గులాబీని చూచినంత ముద్దుగా, అందంగా ఉందా చిత్రం.
రాజా ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. 'ఈ ఉత్తరం శాంతి వ్రాసినదా?' అనుకొని విస్తుపోయింది మనస్సు. మరీమరీ చదువుకున్నాడు. ఆ ఉత్తరం వ్రాయడం, చివర ఆ పువ్వులు చిత్రీకరించడం, ఎంత ప్రత్యేకంగా ఉంది! ఎంతైనా విద్యావంతుల, కళారాధకుల తీరేవేరు. అందులోనూ శాంతివంటి విశిష్ట వ్యక్తుల చేతలు విశిష్టంగానే ఉంటాయి. కాని, శాంతి ఇదివరలో ఒకటి రెండు ఉత్తరాలు వ్రాయడం సంభవించింది తనకు. అప్పుడిటు వంటి ప్రత్యేకతలు లేవు, మార్దవంలేదు. ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ ఉత్త్తరంలో శాంతి ఏదో చెప్పబోయి చెప్పలేకపోయినట్టు అన్పించింది రాజాకు. కాని, శాంతి యిదివరకుకంటే బాగా మారినదనడానికి మాత్రం ఆ ఉత్తరమే నిదర్శనం. ఇదివరలో ఆమె హృదయానికి ప్రేమ స్పందన లేదు. మనస్సుకు భావపరిపక్వంలేదు. అప్పుడు జీవితమంటే తెలియని మొగ్గ. ఇప్పుడు సంపూర్ణ జ్ఞాన వికసిత అయింది. అన్నీ తెలిసిన ఆరిందాలాగా వ్రాస్తూంది. అవును. ఒక్కొక్కరిని అందరు మానవుల మాదిరిగా సృష్టించడు భగవంతుడు. వారన్నివిధాలా ప్రత్యేకంగా ఉంటారు. ఏదైనా అపూర్వ సన్నివేశం వారిలో మార్పు తేవాలి! పద్మం వికసించడానికి సూర్యోదయమే కావాలి; కలువను శశాంకుడే రంజింపజేయాలి!
కోరిన వస్తువును పొందిన పసిబిడ్డలాగా రాజా కొన్నిరోజులపాటు నిత్యం ఆ ఉత్తరాన్నే చదువుకోసాగాడు. చదివినకొద్దీ అనేక నూతన భావాలు గోచరించేవి. మనస్సు పరవశించేది. కాని నిండు పున్నమరేయి నాటి నిర్మల శార్వరీ కాంతి మేఘాచ్చాదితమై మరుగున పడ్డట్లు గోవిందరావుస్మృతితో ఆ ఆనందమంతా జుగుప్సా మేఘశకలాలతో కప్పివేయపడేది. మరుగుతూన్న పాలు కమ్మని వాసనలతో చవులూరించుతున్నా వెంటనే సంతోషంగా త్రాగి ఆనందించడానికి వలనుపడకుండా ఉండి బాధపెట్టినట్లు ఉండేది. ఎందువల్ల? 'అవును. నేను పురుషుణ్ణి!' తనకు తానే ఆశ్చర్యపోయేవాడు. స్త్రీవలే సరిపెట్టు కోవలసిన కర్మ అతడికి లేదు. స్వచ్చత్వాన్నేగాని అతడాస్వాదించలేడు!
54
ప్రశాంతికి నీళ్ళు పోయించడం లక్ష్మీదేవి పని. ఆ పైన పౌడరువేసి, గౌనువేయడం శాంతివంతు. పాప ఏడ్చేసరికి సిద్ధంగా - అసలు ఏడవకుండానే శాంతి పాలసీసాతో సిద్దంగా ఉండేది.
"మరీ అతి గారాబం! బొత్తిగా నాకేపనీ లేకుండా చేసేస్తున్నాను" అంది పద్మ ఒకనాడు నవ్వుతూ.
"ఎవరైతేనేమమ్మా? మేముమాత్రం ఏం చేయాలి?" అంది లక్ష్మీదేవి. అతి అణకువగల కోడలిపై ఆమెకు కూతురిపై కంటే మమకారం అధికం.
శాంతి చిలిపిగా అంది: "నీకు పనిలేకపోవడమేమిటి, వదినా? ఇదే నీపని" అంది ప్రశాంతిని చేతుల్లో ఎగచేస్తూ.
"ఫో. కొంటీ." పద్మ, శాంతిని కొట్టబోయింది.
ప్రశాంతిని పక్కపై వదిలేసి శాంతి పరుగెట్టింది. పద్మ వెనుకబడింది. కాని శాంతి అందలేదు. పద్మ పరుగెట్టలేక కొంతదూరం పరుగెత్తి వదిలేసింది, "సరే. ఇంకెప్పుడూ నాచేతికే దొరకనా?" అని.
పువ్వులు కోసుకువస్తున్న జయలక్ష్మి ఎదురై "ఏమిటి సగం"తని అడిగింది.
పద్మ ఏమో చెప్పేలోగా శాంతి, "ఏం లేదు, జయా. మీ అక్కయ్యలాగే నువ్వుకూడా పెళ్ళిచేసుకుని ఏడాదికో ఎడిషనల్ మెంబర్ని తయారుజెయ్యాలంటున్నాను" అని పకపకా నవ్వసాగింది శాంతి.
"ఏదీ. మళ్ళీ అను" అంటూ జయ, శాంతి కూడాపడింది. ఇద్దరూ సరిసమానులు కావడంతో యిల్లంతా దే తోటలోకూడ ప్రవేశించారు. ముందు శాంతీ, తర్వాత జయా ధన ధనా పరుగులూ, కిలకిలా నవ్వులూ!
"జయ వచ్చిన తర్వాత శాంతి మరీ మారిపోయింది" అంది లక్ష్మీదేవి వికసిత వదనంతో. అత్తాకోడండ్రు యిద్దరి ముఖాలనూ సంతృప్తి ఆవరించింది.
శాంతీ, జయా యిద్దరూ పరిసమానులు కావడంతో యిల్లంతా దాటి తోటలో కూడ ప్రవేశించారు. ముందు శాంతీ, తర్వాత జయా. కాలిబాటలన్నీ పరుగెట్టి, చెట్లచుట్టూ తిరిగి తెగ కవ్వించిందే కాని జయకు దొరకలేదు శాంతి. కడకు అలసి అలసి ఇద్దరూ పకపకా నవ్వుకుంటూ ఒకచోట కూర్చుండి పోయారు.
"చాలా అలసిపోయారు కాని, నాలుగు కొబ్బరి బొండాల నీళ్ళు త్రాగండి." నారాయణ గొంతు విని య్ద్దరూ ఉలిక్కిపడి అటు చూచారు. మామిడిచెట్టు క్రింద నారాయణ కూర్చుని ఉన్నాడు, శ్యామల కొద్దిదూరంలో చామంతి మడిదగ్గర నిలబడి పువ్వులు కోస్తూంది.
మళ్ళీ ముగ్గురూ నవ్వుకొన్నారు. ఆరోజు ఘర్షణ తర్వాత శాంతి మళ్ళీ చిన్నన్నతో మాట్లాడడం యిదే మొదలు. కాని, లోపల కొంచెం ఆశ్చర్యపోయింది. అతడి కళలు ఏ సమయాని కెలాగ ఉంటాయో అర్దంకాదు. ఇదివరకూ అంతంత మాత్రమే అయినా వివాహమయ్యాక నారాయణ మరీ మారిపోయాడు. ఎవరితోనైనా సరసంగా మాట్లాడడమే అరుదైంది. చకా నడచిపోయింది. జయ అనుసరించింది చిన్నబోయిన ముఖంతో.
"వాళ్ళు నవ్వుకొంటే నీకేం? గంతులేస్తే నీకేం? మరీ అనవసరమైన గొడవలెక్కువ నీకు." నారాయణ సన్నసన్నగా భార్యను మందలించడం, శాంతి, జయల చెవుల బడింది.
"మీ అన్నయ్య కొంచెం నయమే. శ్యామల మరీని" అంది జయ మెల్లగా.
"ఎలాగో ఏడవనీ" అంది శాంతి విసుగ్గా.
తనగదిలోకి వెళ్ళిపోతున్న శాంతికి తండ్రి పిలుపు విన్పించి, అటు వెళ్ళింది.
"ఏమమ్మా, ప్రశాంతి యింకా లేవలేదా యివ్వాళ?"
అప్పుడు గుర్తు వచ్చింది శాంతికి. నీళ్ళు పోయించి, పౌడరు వేయగానే ప్రశాంతిని తీసుకువచ్చి తాతగారి కివ్వ్దడం అలవాటు రోజూ. ఇవ్వల చెణుకులు విసురుకోవడంలో కార్యక్రమం కొంచెం ప్రక్కదారులు పట్టింది.
శాంతి అందుకేమీ సమాధానం చెప్పలేదు. "ఈవిడకోసం అప్పుడే తాతగారు తపించి పోతున్నారు" అంటూ ప్రశాంతి నెత్తుకొని వెళ్ళిపోయింది.
జయ చెప్పిన మాటలు అప్పుడే స్నానంచేసి అటు వచ్చిన శ్రీహరి విన్నాడు. "మనం శాంతిని ప్రాణంగా, ముద్ద్గుగా చూసుకోవడం ఆవిడకు యిష్టంలేనట్లుందసలు. శాంతిపై అసూయ అనుకొంటాను" అన్నాడు భార్యతో.
"అదీ ఒక కారణమే కాని అదే కారణం కాదు" అంది పద్మ.
ప్రశాంతిని బలరామయ్యగారి కుర్చీ ప్రక్కన చిన్న కుర్చీలో చిన్న పరుపువేసి పడుకో బెట్టింది శాంతి. అంతలో గదిబయట పద్మ కంఠం విన్పించింది. "శాంతీ" అని మెల్లగా పిలుస్తూంది.
"ఏం, వదినా?"
"పాపకు పాలు పట్టలేదు" అంది పద్మ మెల్లగా.
బలరామయ్య సమాధానం చెప్పేడు. "పద్మా లోపలికి రా అమ్మా నువ్వే పట్టిపో."
పద్మ పలుకలేదు.
"రా తల్లీ. శాంతి ఎంతో నువ్వూ అంతే నాకు. అలా దూర దూరంగా ఉండిపోకమ్మా." ఇదివరలో ఆయనకు కోడలి విషయం అంతగా పట్టేదికాదు. కాని యిప్పుడు చిన్నకోడలి ప్రవర్తనతో పెద్దామెను పోల్చి చూచుకోవడంలో క్రమంగా ఆమెమీద్ అభిమానం అధికం కాసాగింది. సాధారణంగా పద్మ మామగారి ఎదుటపడదు. మాట్లాడదు. ఒకవేళ తప్పనిసరి అయిన ఆయన ఎదుట చాలా నమ్రతగా ఉంటుంది. ఇప్పుడు మామగారి పిలుపుతో పద్మకు యిక తప్పలేదు. గదిలోకి వెళ్ళింది. బలరామయ్య మనుమరాల్ని లేవనెత్తబోయాడు, కోడలికివ్వటానికి. కని నీరసంవల్ల అలా సాధ్యపడలేదు.
"అలా ఉంచండి. మీరు శ్రమపడవద్దు" అంటూ పాలసీసా పాప నోట్లో ఉంచి, శాంతిని చూస్తూండమని చెప్పి వెళ్ళిపోయింది పద్మ.
ఏమ్మా, ఇవ్వాళ యింత ఆలస్యం చేస్తున్నారు? రోజూ యీ తతంగమంతా అయ్యాక కదా నా గదికి తీసుకొచ్చేవారు?" అన్నాడు కూతుర్ని.
శ్యామల మాటలు మదిలో మెదులుతూండగా శాంతి మౌనం వహించింది. పాప పాలు త్రాగడం పూర్తి అయింది. సీసా ప్రక్కన ఉంచి ఒత్తుగా ఉన్న పాప ముంగురులను సవరిస్తూ, "ఉంగరాల జట్టు కదూ, నాన్నా?" అంది శాంతి. ఆ పాలబుగ్గలు నిమురుతూ మైమరచిపోయాడు బలరామయ్య.
అంతలో లక్ష్మీదేవి గదిలోకి వచ్చింది. "ఇక్కడున్నావా? ఏం, నువ్వు కాఫీ తీసుకో లేదు? మీ నాన్నగారికివ్వలేదు" అంది కూతుర్ని, యిద్దరికీ చెరోగ్లాసూ అందిస్తూ. శాంతి మాట్లాడలేదు.
ఆమె వెళ్ళిపోయాక బలరామయ్య అడిగాడు: "ఏమమ్మా, యివాళ అంత పరాకు? ఒంట్లో బాగుందా?"
తప్పనిసరిగా ప్రసక్తి మార్చవలసి వచ్చింది శాంతికి. "చూడు, నాన్నా. పాప నవ్వుతోంది" అంది.
ఆయన దృష్టి కూతురుమీది నుంచి మనుమరాలిపైకి మరలింది.
తండ్రి భుజాలపై చేతులువేసి గోముగా అడిగింది: "నీకసలు నాకంటే ప్రశాంతి ఎక్కువైపోయింది, నాన్నా."
ఆయన తృప్తిగా నవ్వాడు. "లేదు, తల్లీ. శాంతీ, ప్రశాంతీ నాకు దేహమూ, ప్రాణమూ - నా రెండు కళ్ళూ. ఇద్దరూ ముఖ్యులే." ఇద్దరి నేత్రాలూ చెమర్చాయి.
