Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 44

           
                              20

    తోటలో ముగ్గురూ ఓకే ఏకాంత ప్రదేశంలో కూర్చున్నారు. శారదే సంభాషణకుపక్రమించింది.
    'శాంతి! నీవేమి అనుకోనంటే నిన్నొక ప్రశ్న అడుగుతాను.'
    'అడగడమేం ఖర్మ........! నీకు నన్ను శాసించే అధికారం వుంది. ఆజ్ఞాపించవే!' చిరునవ్వుతో అంది శాంత.
    'అసద్భావం నాపై ఉన్నందుకు కృతజ్నురాలను శాంతీ! ' అని మళ్లీ 'అన్నయ్య ను కాదని సుందరం పై నీవు మమత పెంచుకోవడానికి గల కారణం అరమరికలు లేకుండా నాతొ చెప్పాలి' శాంత కళ్ళల్లో కి నిశితంగా చూస్తూ అడిగింది శారద.
    '..........'
    'చూడు శాంతీ! నీ క్షేమం ; అన్నయ్య క్షేమం కోరి అడుగుతున్నాను. అన్నయ్య పై నీకు అనుమానం కలిగినప్పుడు ముఖాముఖి ణ అడిగి తెలుసు కోవచ్చు గద! అ చనువు అధికారం ఒకరిపై మరొకరికి ఉన్నప్పుడు పరిస్థితిని యింతవరకు తీసుకు వచ్చావేం? మొదటే జాగ్రత్త పడి ఉన్నట్లయితే మీ యిద్దరి మధ్య ఈవిధంగా స్పర్ధలు ఏర్పడి ఉండేవి కావు. ఇప్పుడు సుందరం నిజ స్వరూపం బయట పడింది. ఇప్పుడిక అన్నయ్య ను అనుమానించడానికి గల కారణాలను నాకు చెబితే వాటిలో గల నిజానిజాలను తెలుసుకొని పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాను.'
    'శారూ! ఊబిలో దిగబడబోతున్న సమయం లో నీవు దేవతలా వచ్చి రక్షించావు. అలా రక్షించిన నీవు నీ చేతులతోటే నన్ను మరో ఊబి లోకి నెట్టి వేస్తావా? బావ రాస క్రీడలు నే కళ్ళారా చూశాను. ఒకరు చెప్పగా విని నమ్మడం కాదు.' ఎగిరిపడుతున్న ఆమె చాతీ వేగంగా వెలువడుతున్న ఊచ్చ్వాస నిశ్వాసలు ఆమెకు రామం పై గల ఉక్రోషాన్ని తెలియజేస్తున్నాయి.
    'ఆవేశాన్నణచుకొని జరిగిన విషయమేమిటో నెమ్మదిగా చెప్పు శాంతీ!' శాంత ననునయిస్తూ శారద.'    
    'ఆస్పత్రి భవన ప్రారంభోత్సవం నాటి నుండి బావను, తాయారును , జాగ్రత్తగా గమనిస్తూనే వున్నాను. ఆ తర్వాత నా కళ్ళ ముందు వారిద్దరిమధ్య జరిగిన ఎన్నో సంఘటనలు నాకు బావ పై ఏహ్యభావాన్ని కలిగించాయి. అవన్నీ గిట్టని వారు చెప్పారను కోవడానికి ఒకరి ద్వారా విన్నవి కావు' కన్నీటి పర్యంతమై శాంత.'
    'నేనూ ఇటువంటిదేదో జరిగి ఉంటుందనే వూహించాను. నా వూహ నిజమైంది. సరే! నీ వాదన బలంగానే వుంది. ఈ విషయం లో నేను అన్నయ్యతో మాట్లాడిన తర్వాత గాని యిందులో అన్నయ్య దోషం ఎంతవరకు ఉందొ చెప్పలేను. ఇది మొదటి నేరం. ఇక రెండవది.'
    'జీవితాలు ధ్వంసం కావడానికి ఎన్ని నేరాలు కావాలేం? ఈ నేరమొక్కటి చాలదూ? ఈరోజు తాయారు. రేపు మరొకరు. ఇటువంటివి ఎవరైనా మాత్రం  సహించగలరా?' కోపంతో ఎర్రబడిన శాంత ముఖాన్ని చూడడానికే భయపడింది శారద.
    'అలాగే శాంతీ! ఒకవేళ నీవు అన్నయ్య పై వేసిన నింద నిజమని నిరూపింపబడితే నేనూ నీతో ఏకీభవిస్తాను.'
    'నిరూపించవలసిన అవసరమే లేదు. నేను కళ్ళారా చూశాను' ధీమాతో అంది.
    'మనం చూసేవన్నీ నిజాలు కావు శాంతీ!'
    'నీతో వాదించి గెలవడం చాలా కష్టం శారూ! ఈ విషయాలు తర్వాత చర్చించుకుందాం. మాకు అతిధిగా వచ్చిన ప్రభాకరం అన్నయ్య గారిని మా గొడవలతో విసిగించడం ధర్మం కాదు.'
    'అబ్బే! నేనేమీ విసుగు పడడం లేదు. అసలు మేమిక్కడికి వచ్చిందే ఈ సమస్యను పరిష్కరించడానికి.' చిరునవ్వు ప్రభాకరం , ముఖానికి ఎంతో వెలుగును తెచ్చింది.
    'శారూ! ఇక నీ విషయం చెప్పవే? పెద్ద రాచయిత్రివి? ఘన సన్మానాలు అందుకున్నావు. నాబోటి సామాన్యురాలితో మాట్లాడుతా వనుకోలేదు నేను.'
    'ఎంత మాటన్నావే? నా సంగతి పూర్తిగా తెలిసిన నీ నోట ఇటువంటి మాట వినవలసి వస్తుందని కలలో కూడా వూహించలేదు.' శారద కళ్ళు చెమర్చాయి.
    'నిన్ను అనవసరంగా బాధించి నట్లున్నాను. మన్నించనే!'
    'ఏ ఘన సన్మానమైనా నీ సహచర్యంలో గడిపిన క్షణాలను మరిపించ లేదు. నా ప్రస్తుత ఔన్నత్యానికి నీవు కారకులావు శాంతీ! ఆ విషయాన్ని నా జీవితమంతా గుర్తుంచుకుంటాను. నీ మాటలతో నన్ను హింసిస్తున్నావు.' చెమర్చిన ఆ కళ్ళు ధారలు కట్టాయి.
    'పొరపాటు జరిగిపోయింది శారూ...! నన్ను మన్నించమని వేడుకున్నానుగా' అని శారద కన్నీటి ని తన పమిటతో తుడిచింది శాంత. కొద్ది నిముషాలతో శారద ఊరడిల్లింది.
    'శారూ! ఇక్కడి నుండి హైదరాబాదు కు వెళ్లిన తర్వాత జరిగిన విషయాలు నాకు చెప్పవూ? వినాలని ఉంది.'
    శారద అన్ని విషయాలూ వివరంగా చెప్పింది ---
    శారద చెప్పినవన్నీ శ్రద్దగా విన్న శాంత 'అదృష్ట వంతురాలిని శారదా! ప్రాణంతో సమంగా నిన్ను చూసుకొనే అక్కయ్య ను చేబట్టబోతున్నావు. గొప్ప రచయిత్రి గా పేరు సంపాదించు కున్నావు. ఆంధ్ర పఠితలను నీ రచనలతో ఉర్రూతలూగించావు. ఆ రచనలు నీవే చేస్తున్నవన్న విషయం ప్రాణ స్నేహితురాలనైన నాకే తెలుపలేదేమిటే? ఎంత చిలిపిదానవే నువ్వు?' -- శాంత సంతోషంతో పొంగి పోతూ.

                             
    'ఇదంతా నీ చలవే శాంతీ! ఈ పెదరాలీ పై నీకున్న అభిమానానికీ హద్దులే లేవు'-- చిరునవ్వుతో శారద.
    'అవేం మాటలే! లక్షాధికారి కూతురు వై లక్షాధికారి యింటి కోడలి కాబోతున్న నీ నోట వినవలసిన మాటలేనా యివి? ఎవరైనా వింటే నవ్విపోతారు'- అని మళ్లీ ఏదో గుర్తుకు వచ్చి 'శారూ నా మాట నిలబెట్టు కున్నాను. నీ వివాహం జరిగి , నీ జీవితం కుదుట పడిన తర్వాతే నేను వివాహ మాడుతానని నీకు మాట యిచ్చాను గుర్తుందా'--  అది నేరవేరింది . నా హృదయం ఎంతో తేలిక పడిందిప్పుడు .' -- శాంత తృప్తిగా నిట్టురుస్తూ.
    'ఏమో? ఎవరు చెప్పగలరు? ఇంకా నా వివాహం జరగలేదుగా! నీ వివాహమే ముందు జరగవచ్చు. నీవన్నట్లు నా వివాహం నిర్ణయం కొద్ది రోజులలో జరగబోతూ ఉంది; నా జీవితం కుదుటపడింది నీ దయ వల్ల'-- చిరునవ్వుతో శారద.
    'అది కల్ల శారూ! సుందరం అలా చేశాడు, బావ యిలా మారాడు. నాన్న నన్ను బావకు తప్ప మరొకరికిచ్చి వివాహం జరిపించనని అంటున్నాడు, ఈ గడ్డు సమస్య ఎలా, ఎప్పుడు పరిష్కార మౌతుందో ఏమో? నిరాశా నిస్పృహలు శాంత మాటలలో తొణికిసలాడాయి.
    'ఛ! అవేం మాటలు శాంతీ! ఆనాడు నీవు చేసిన వాగ్దానాన్నే నేను ఈనాడు చేస్తున్నాను. నీ వివాహం నిర్ణయమై యిప్పుడు వచ్చిన ఈ సమస్యలు పరిష్కృతమయ్యేంత వరకూ నేనూ నా వివాహాన్ని వాయిదా వేసుకుంటాను. ఆనాడు నన్ను నా కష్టాలలో ఎంతో ఆప్యాయంగా ఆదుకున్నావు. ఈనాడు నీవు సమస్యలతో సతమత మౌతూవుంటే నేను వివాహామాడి సుఖపడగలనా?' కళ్ళల్లో నీరు నిలిచి మెరవ సాగింది.
    'శారూ!'
    'శాంతీ!'
    ఒకరి భుజం మరొకరి కన్నీటితో తడిసి పోయింది -- '
    అంతవరకూ మౌనంగా గడిపిన ప్రభాకరం 'నిజమైన స్నేహాన్ని మీ వద్ద చూస్తున్నాను. ఒకరిని మించి మరొకరు త్యాగశీలురని నిరూపించబడింది.'
    అంతలో హాస్పిటలు కంపౌండరు వచ్చి శాంతను సుందరం గారు పిలుస్తున్నారని చెప్పాడు.
    'వస్తున్నానని చెప్పు ' అని శాంత అతనిని పంపించి వేసింది.
    'జాగ్రత్త శాంతీ! సుందరానికి ఎటువంటి అనుమానమూ కలగకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి' శాంత ను హెచ్చరించి పంపింది శారద.
    శాంత బరువెక్కిన హృదయం తో ఆస్పత్రి వైపు అడుగులు వేయసాగింది --
    'ఏమండీ శారద గారూ! ఈ ఊరు వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను. మీ అన్నయ్య, ఒదినల సమస్యలను పరిష్కరిస్తూ నన్ను బొత్తిగా మరచి పోతున్నారు. నేను భరించలేను' బుంగమూతి పెట్టి అక్కడ కనుచూపు మేరలో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకొని శారదను దగ్గరకు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ అన్నాడు ప్రభాకరం.
    ప్రభాకరం పట్టు నుండి విదిపించుకోవాలని వ్యర్ధ ప్రయత్నం చేస్తూ 'మీరు మరీ చిలిపి వారవుతున్నారు చినబాబు గారూ!' -- వోరగా ప్రభాకరం కళ్ళల్లో కి చూస్తూ శారద.
    'శారూ! నేనంత అదృష్ట వంతుడను? నీలాంటి భార్యను పొందగలడంనా పూర్వ జన్మ సుకృతమని భావిస్తున్నాను.' శారదను తనలో ఐక్యం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ అన్నాడు ప్రభాకరం.
    'అబ్బ! ఉందండీ! మరీ యింత చిలిపి తనమా?' సున్నితంగా ప్రభాకరం కౌగిలి విడిపించుకొని 'ప్రొద్దు పోయింది. పదండి వెడదాం ' అంది శారద.
    'అలాగే!' అని ప్రభాకరం కూర్చున్న వాడల్లా లేచి నిలుచున్నాడు.
    ఇద్దరూ తోట దాటి ఊరి వైపు నడక సాగించారు-------
    
                           *    *    *    *
    రమణయ్య గారి యింట్లో సమావేశం జరిగిన మరునాటి సాయంత్రం లక్ష్మయ్య గారి తోటలో ఒక యువతి కొబ్బరి చెట్టు నానుకొని చెదిరి దూది పింజ లాంటి మేఘాలతో ఆవరించి ఉన్న ఆకాశాన్ని చూస్తూ వయ్యారంగా నిలుచుంది.
    పేషెంట్ల తో తీరిక చేసుకొని చల్ల గాలికి కొన్ని నిముషాలు గడపాలనే ఉద్దేశంతో ఆ ప్రక్కగా వచ్చిన సుందరం దృష్టి లో పడిందా యువతి.'
    'శాంతా! శాంతా!' అని పిలుస్తూ ఆమెకు దగ్గరగా వచ్చాడు.
    ఆ యువతి అతడి పిలుపుకు వెనుతిరిగి చూడలేదు. సుందరానికి ఆశ్చర్యం కలిగింది.
    'ఏమిటి శాంతా? నాపై కోపమా? పిలుస్తుంటే పలకడం లేదు. వెనుతిరిగి చూడడం లేదు.' ఆమెకు వెనుక ప్రక్కగా నిల్చొని అన్నాడు.
    '...........'
    నేనేమైనా నేరం చేశానా శాంతా?'
    '...........'
    'అంతకోపమైతే ఎలా? నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేకనే రోజూ ఒక్కసారైనా తోటకు రమ్మని అర్ధించాను. నామాట తీసి వేయకుండా వస్తూనే ఉన్నావు. అంతవరకూ బాగానే ఉంది. మరి ఈరోజు మూగనోము పట్టావేం?'
    '............'
    'శాంతా! యింట్లో ఏమైనా గొడవ జరిగిందా? అటువంటిదేదో జరుగుతుందని నేను ఊహిస్తూనే ఉన్నాను. అందులో శారద కూడా వచ్చింది. నీవు ఏ మాత్రం గాభరా పాకు. నేను నీకు ఏ లోటూ రానివ్వను. మీ నాన్న మన వివాహానికి ఒప్పుకోడని నాకు ముందే తెలుసు. నీకు ఆరోజే చెప్పాను. ఇద్దరమూ హైదరాబాదు వెళ్లి రిజిష్టరు మ్యారేజి చేసుకుందామని! నీవు నా ఆలోచనను త్రోసి వేశావు. ఎంతకాలం గడిచినా యింతే! పాము చావదు కర్ర విరగదు అన్నట్లుగా ఉంటుంది. నీవు ధైర్యం చేస్తే తప్ప మన యిద్దరికీ యిక్కడి నుండి మోక్షం లభించదు' చిన్న ఉపన్యాసమిచ్చాడు సుందరం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS