'అమ్మా శారదా...! మీ తల్లీ బిడ్డలను ఎన్నో బాధలకు గురిచేశాను.' అంటూ ఆప్యాయంగా శారదను దగ్గరకు తీసుకున్నారు సుందరరామయ్యగారు.
'శారద గుణగణాలు మీ కందరికీ తెలియాలని కట్నం విషయం, ఆస్తి విషయం మాట్లాడాను. శారదను నా కోడలిగా చేసుకోవాలనే ఉద్దేశం నాకు ఏనాడో కలిగింది. ఆమె పేదరాలని నేనెప్పుడూ సంకోచ పడలేదు. ఆమె పుట్టుపూర్వోత్తరాలు తెలియవనే రాధ, ప్రభాకరం శారదంటేనే మండి పడుతున్నాడన్న విచారం నన్ను వేధించాయి. ఆ కారణంగా నా ఉద్దేశాన్ని నాలోనే చంపుకున్నాను. ఈ రోజు 'జ్యోత్స్న' శారదే అని తెలిసిన తర్వాత ఆమె పూర్వ చరిత్ర ఎటువంటిదైనా సరే, ఆమెను నా కోడలిగా చేసుకోవాలనుకున్నాను. రెండు మూడు రోజులుగా ప్రభాకరం, శారదల అన్యోన్యతను చూసిన నేను ఎంతో సంతోషించాను. నా కోరిక నెరవేరుతుందని ఊహించాను. అనుకోకుండా ఆమె నా మేనగోడలై కోడలు కావడానికి అర్హురాలై కూర్చుంది. ఇక ఏ సంశయాలూ, సందేహాలూ లేవు. రేపటి పుట్టినరోజునాడే వివాహ నిశ్చయం చేసుకుందాం' అని శారదను ప్యాయంగా చూస్తూ 'ఏమ్మా...! నీ అభిప్రాయ మేమిటి?' ప్రశ్నించారు శ్రీపతిగారు.
శ్రీపతిగారి మాటలకు సిగ్గుతో తల వంచుకొని మౌనంగా కూర్చుంది శారద. ప్రభాకరం ముఖంలో సంతోషరేఖలు కనుపించాయి నీరజకు.
'అమ్మాయేం చెబుతుందండీ? మీరు మరీనూ! ప్రభాకరమంటే శారదకు పంచప్రాణాలు' అన్నారు అన్నపూర్ణమ్మగారు, శారదను, ప్రభాకరాన్ని ఆప్యాయంగా మార్చి మార్చి చూస్తూ.
'హమ్మయ్య! అంతా సుఖాంతమైంది.' అని తన చేతి గడియారాన్ని చూసుకున్న రామం చాలా ప్రొద్దుపోయింది' అన్నాడు.
'అరేరే! పన్నెండున్నర దాటింది. ఇక రేపు మాట్లాడుకుందాం" అన్నారు శ్రీపతి గారు కూడా తను గడియారాన్ని చూసుకుంటూ.
'మాటల సందడిలో సమయమే తెలియలేదు' అన్నాడు ప్రభాకరం.
అందరూ నిద్రపోవడానికై అక్కడినుండి లేచి వెళ్ళిపోయారు.
* * *
మరు రోజు ఉదయం తమ ఊరికి వెళ్లేందుకై ఉద్యుక్తుడయ్యాడు రామం-
'అన్నయ్యా...! శాంత విషయమే నాకు బెంగగా ఉంది. ఇంత సంతోషంలోనూ మీ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎంతో బాధ కలుగుతూ ఉంది. నేను కూడా నీతో వస్తాను. ఒకవేళ నేను నచ్చజెపుతా వింటుందేమో?'
'వద్దమ్మా! అతకని మనసులతో జీవితాంతం బాధపడడం నాకిష్టంలేదు. మనసొకచోట మనువొకచోట అన్నట్లు ఆ జీవితం ఎంతో దుర్భరంగా ఉంటుంది.' నిరాశతో అన్నాడు రామం.
'శాంత తన మనసెందుకు మార్చుకుందో? నీతో ఏమైనా పోట్లాడిందా అన్నయ్యా?' ప్రశ్నించింది శారద.
'అటువంటిదేమీ లేదు. శాంత సుందరం ఆకర్షణలో పడింది. అంతే!'
'అదేమీ కాదన్నయ్యా ఏదో జరిగి ఉంటుందని నాకు అనుమానంగా ఉంది. సుందరం మనకు తెలియని పన్నాగమేదో పన్నాడు.' తల పంకిస్తూ, ఆలోచిస్తూ అంది శారద.
శ్రీపతిగారివద్ద శలవు తీసుకోవడానికి వెళ్ళాడు రామం-
'నే వెళ్ళొస్తానండీ!' అన్నాడు రామం శ్రీపతిగారిని చూస్తూ.
'అదేమిటి బాబూ ఈ వారం పదిరోజులకోసం వెళ్ళి మళ్ళీ వస్తావా? ఇక్కడే ఉండి పోకూడదూ?'
'ఇంటివద్ద అత్యవసరమైన పనులున్నాయి. మళ్ళీ వస్తాగా!' అన్నాడు రామం.
'తప్పకుండా రావాలి' ఆప్యాయంగా అన్నారు శ్రీపతిగారు.
'తప్పకుండా వస్తాను.' అని వెళ్ళిపోయాడు రామం.
రామం వెళ్ళిపోయిన తర్వాత సుందర రామయ్యగారుకూడా తమయింటికి బయలు దేరారు.
'బావగారూ! అమ్మాయిలతో వెళ్ళొస్తాను.'
'అదేమిటి? అమ్మాయిలతో అని అంటున్నావేం?'
'శారదనుకూడా తీసుకు వెడతాను.'
'అదేమీ వీలుపడదు. శారద యిక్కడే ఉంటుంది. అసలు శారద మళ్ళీ మాయింటికి వచ్చాకే యిల్లంతా కళకళ లాడుతూ ఉంది.
అప్పుడే లోపలినుండి వచ్చిన అన్న పూర్ణమ్మగారు 'అవునన్నయ్యా! శారదను పంపేదిలేదు. కనీసం శారదను చూడడానికైనా నీవు రోజు కొకసారివచ్చి వెడుతుంటావు' అన్నారు.
'అత్తయ్యా! అన్యాయం! అక్కయ్యను యిప్పటినుండే మీ యింట్లో ఉంచుకుంటారా?' కళ్ళు విచిత్రంగా తిప్పుతూ ఉంది.
'ఉంచుకుంటాం! నీకేమైనా అభ్యంతరమా?' అప్పుడే మేడపై నుండి దిగి వస్తూన్న ప్రభాకరం అన్నాడు.
'మేం ఉండనివ్వం...' మొండిగా అంది.
'అంతగా నీ అక్కయ్యను ఒదిలి వెళ్ళడానికి నీకు కష్టంగా ఉంటే నీవుకూడా మాతో ఉండు.' నీరజను చిలిపిగా చూస్తూ అన్నారు ప్రభాకరం.
'ఫో...బావా...! నీవు బాగా మాటలు నేర్చావు.'
'నీ కన్నానా?'
వీరిద్దరి మాటలకు అంతా నవ్వుకున్నారు-
సుందరరామయ్యగారు ఎంత అడిగినా శారదను పంపించడానికి శ్రీపతిగారు ఒప్పుకో లేదు.
'ఆడపిల్ల వాళ్ళపై అధికారం అప్పుడే చెలాఇస్తున్నారు. అక్కయ్యను బావకిచ్చి వివాహం చేయవద్దు నాన్నా!' నీరజ నవ్వుతూ అంది.
ఆమె మాటలు మళ్ళీ అందరికి నవ్వును తెప్పించాయి.
చివరకు శారదను సుందరరామయ్యగారు శ్రీపతిగారి యింట్లోనే ఒదిలి వెళ్ళిపోయారు.
* * *
రెండుమూడు రోజులు ఎటువంటి మార్పులు లేకుండా గడిచిపోయాయి. శ్రీపతి గారి యింటికి సుందరరామయ్యగారో నీరజో రోజుకొక్కసారి వచ్చి వెడుతున్నారు.
ఒకరోజు శారదా ప్రభాకరంలు యిద్దరూ కలిసి సినిమాకు వెళ్ళారు. అప్పటికింకా సినిమా ప్రారంభం కాలేదు. టిక్కట్లు తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నారు. తీరా కూర్చున్న తర్వాత ఐదు నిమిషాలకు సుందరం, నీరజతో హాలులోపలికి రావడం చూసింది శారద. ఆమె ఆశ్చర్యంతో ఒక్కొక్క క్షణం కొయ్యబారి పోయింది. తేరుకున్న మరుక్షణంలో వారిద్దరూ తనను చూడకుండా హాలు బయటికి వచ్చేసింది. విషయమేమిటో అర్ధంకాక తెల్లబోతూ ప్రభాకరం శారదను అనుసరించాడు.
'శారూ! అలా వచ్చేశావేం?'
'నీరజను ఆమె వెంట వచ్చిన యువకుడిని చూశారా?'
'నీరజ సినిమాకు వచ్చిందా? అదీ ఒక యువకుడితోనా? నే చూళ్ళేదే! నీరజ ఎవరో యువకునితో సినిమాకు వస్తే నీవు బయటికి రావడం దేనికి?'
'అదంతా ఒక్క మాటలో చెబితే అర్ధమయ్యే విషయం కాదు.'
జరిగిన విషయమంతా వివరంగా ప్రభాకరానికి చెప్పింది శారద.
'అలాగా! అవుతే త్వరగా వెడదాం పద. ఒకవేళ వారు బయటికి వస్తారో ఏమో!' తమ కారువైపుకు నడుస్తూ అన్నాడు ప్రభాకరం.
శారద కారులో కూర్చున్న తర్వాత 'శారూ! ఎటు వెడదాం?'
'మీ యిష్టం!'
'లిబర్టీలో మంచి హిందీ సినిమా నడుస్తూ ఉంది వెడదామా?'
'అలాగే!'
'అదేమిటో శారూ! ప్రతిదానికీ మీ యిష్టం అంటావు. నీకు యిష్టాయిష్టాలు లేవా? 'ఉన్నాయి. వాటిని మీ యిష్టాయిష్టాలతో కలిపి వేశాను.' చిలిపిగా ప్రభాకరం కళ్ళల్లోకి చూస్తూ అంది శారద.
ఆ చూపులకు ప్రభాకరం హృదయం ఆనందంలో పులకించింది. ట్యాంకు బండు రోడ్డుపై శబ్దం చేయకుండా పరుగెత్త సాగింది ఎంబాసిడర్.
* * *
రెండు రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం శారదా ప్రభాకరంలు తాము ఆలోచించిన పధకం ప్రకారం సుందర రామయ్యగారి యింటికి బయలుదేరారు.
నీరు వెళ్ళేసరికి సుందరరామయ్య గారు యింట్లో లేరు. నీరజ తన గదిలో కూర్చుని ఎదురుగా టేబులు పై ఉన్న సుందరం ఫోటోను చూస్తూ కూనిరాగాలు తీస్తూ ఉంది.
'చిట్టి మరదలు గారు తాము ప్రేమించిన రాజకుమారిని గురించి ఆలోచిస్తున్నట్లు న్నావా?' ఎగతాళిచేస్తూ అన్నాడు.
ఆమాటలకు ఉలిక్కిపడిన శారద గది గుమ్మంవైపు చూసి ఆశ్చర్యపోయింది. 'బావ-అక్కయ్య' ఈరెండు పదాలను ఆమెపెదవులు నెమ్మదిగా ఉచ్చరించాయి.
'నీరజా! నాన్నగారెటు వెళ్ళారు?'
'ఏమోనక్కా?' ఒక్కక్షణం ఆలోచిస్తున్నట్లు నటించి' 'ఆఁ మరిచేపోయాను నిన్ను చూడడానికి మామయ్యగారి యింటికి వెళ్ళినట్లున్నారు. మీరు యిటు - నాన్న గారు అటు అయినట్లున్నారు.'
అందరూ హాలులో సోఫాలలో కూర్చున్నారు.
ప్రభాకరం కనుసైగ నందుకున్న శారద 'నీరజా! నీకు సుందరంతో ఎంతకాలంనుండి పరిచయముంది?' సూటిగా ఆమె కళ్ళల్లోకే చూస్తూ అడిగింది.
అంత సూటిప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో తోచలేదు నీరజకు. అసలు ఈ విషయం తన అక్కకు ఎలా తెలిసిందో ఆమెకు అర్ధంకాలేదు. సిగ్గుతో తలవంచుకుంది.
'సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం' ప్రభాకరం.
'.................................'
'ఏమిటమ్మా నీరజ? ఏమాలోచిస్తున్నావ్?' ఆమెకు దగ్గరగా జరిగి భుజంపై చేతులు వేస్తూ ఆప్యాయతతో అడిగింది శారద.
'మా పరిచయంకలిగి సంవత్సరం పైగా అయిందక్కయ్యా!'
'అతనిని గురించి ఏమైనా వివరాలు తెలుసుకున్నావా?'
'లేదక్కయ్యా! మన రామం అన్నయ్య గారి ఊరిలోనే డాక్టరుగా పనిచేస్తున్నారు. అంతకుమించి నాకేమీ తెలియదు.'
'సుందరాన్ని గురించి మాకు తెలిసింది చెబుతాం. భరించగలవా?' - ప్రభాకరం.
'ఏం తెలుసు బావా?' భయాందోళనలు ఆమె ముఖంలో కనుపించాయి.
శారద తనకు చెప్పిన విషయాల నన్నింటినీ ప్రభాకరం క్లుప్తంగా నీరజకు వివరించి చెప్పాడు-
'అక్కయ్యా! ఇదంతా నిజమేనా?' ఏడుపు ముఖంతో వారిద్దరినీ దీనంగా చూడసాగింది.
'అక్షరాలా నిజమమ్మా! మొన్న వచ్చి నప్పుడు రామం అన్నయ్య చెప్పాడు.' నీరజను జాలిగా చూస్తూ అంది.
'ఇంత మోసం చేస్తారనుకోలేదు. ఇష్టం లేకపోతే స్పష్టంగా చెప్పవచ్చుగా?-' నిష్ఠూరపడుతూ నీరజ.
'ఇప్పుడు మీ సుందరంగారు యిక్కడ లేరండీ! మీ ప్రశ్నకు సమాధానమివ్వడానికి!' -నీరజను ఉడికిస్తూ ప్రభాకరం.
అర్ధంలేని తన అసందర్భమైన ఆవేశానికి సిగ్గుపడింది నీరజ-
'చూడక్కా ! బావ నన్నెలా పీడిస్తున్నాడో?' కళ్ళల్లో ఉబికిన నీరు క్రిందకు జారడానికి సిద్ధంగా ఉంది.
'మగవారందరికీ ఆడవారిని ఏడిపించడమంటే ఒకటే సరదా!'- ప్రభాకరాన్ని కోపంగా చూస్తూ శారద.
'బాబోయ్! అక్క చెల్లెళ్ళిద్దరూ ఏకమయ్యారు'-బిగ్గరగా నవ్వుతూ ప్రభాకరం.
'ఆయనగారితో మనకేమిటే సరదా.... అటు శాంత మోసపోకుండా యిటు నీ సుందరం నీకు దక్కేటట్లు నేను, నీ బావ గారూ కలిసి ఒక ఉపాయం ఆలోచించాం. ఆ విధంగా చేస్తే మన ప్లాను విజయ వంతమౌతుంది'-శారద.
'ఏమిటక్కయ్యా ఆ ప్లాను.' మొదట ఉత్సాహంతో అని ఒక్క క్షణం ఆలోచించి 'లాభం లేదక్కయ్యా! అటువంటి చపల స్వభావంగలవాణ్ణి వివాహం చేసుకొని ఏం సుఖపడతాను?' నిరుత్సాహపడుతూ అంది నీరజ.
'అలా నిరుత్సాహపడతావేమమ్మా? అటు వంటివారినే మనం సంస్కరించాలి. అదంతా నేను చూసుకుంటాను. నీవు మాత్రం నేను చెప్పినట్లల్లా వింటూ మాతో డా. సుందరం గారు పనిచేస్తున్న గ్రామానికి రావాలి'- శారద.
'అలాగే! నే వెలా చెబితే లా చేస్తానక్కయ్యా!-నీరజ.
శారద నీరజకు తమ ప్లాను వివరించి చెప్పింది.
'చక్కని ఆలోచన! ఫలితా లెలా ఉంటాయో చూడాలి.'
అంతలో సుందరరామయ్యగారు వచ్చారు. శారదను ప్రేమతో చూస్తూ 'నీవు యిక్కడికి వచ్చావా అమ్మా! నీకోసం బావ గారింటికి వెళ్ళాను. మీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళారని చెల్లెమ్మ చెప్పింది.' అన్నారు.
'అవును నాన్నారూ! నీరజతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాము.'
'ఏ విషయాలు తల్లీ!'
'నీరజ ఆ తర్వాత నీతో చెబుతుంది.' అని తండ్రికి సమాధానం చెప్పి 'వెడదామా?' ప్రభాకరాన్ని ప్రశ్నించింది.
'ఈ పూట యిక్కడ ఉండి రేపు వెళ్ళండి. నాకు తృప్తిగా ఉంటుంది.' వారి మాటలలో ఆప్యాయత ఉట్టిపడుతూ ఉంది.
'ఎందుకు మామయ్యా? వెళ్ళొస్తాం. అక్కడ అమ్మ మా కోసం ఎదురు చూస్తూ 'ఉంటుంది' - ప్రభాకరం.
'లేదు. ఈ పూట మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఈ సంగతి బావగారికి ఫోనులో చెప్పి వస్తాను' అని బయటికి వెళ్ళిపోయారు ఫోను చెయ్యడానికి.
వారి ఆదరణకు ముగ్ధుడయ్యాడు ప్రభాకరం.
* * *
