క్లబ్బుకు వెళ్ళింది పార్వతి మధ్యాహ్నం ఉండపట్ట లేక. అనుకోకుండా కవిత అక్కడ ఉంది. ఆమె ఉండాలని వాంచిస్తుందేమో మనసులో పార్వతి. కవిత ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నది. పార్వతి వైపు చూడలేదు. లేక చూడనట్టు నటించిందో పార్వతి కవగతం కాలేదు.
"రండీ! కేరమ్సు ఆడదాం!" అంటూ కొందరు కవితను లాక్కుపోయారు అక్కణ్నుంచి. కవిత నామమాత్రంగా నైనా పిలవకుండా వాళ్ళతో వెళ్ళిపోయినా పార్వతి పెంకితనంగా అనుసరించింది ఏమంటుందో చూడాలని.
కవిత చలోక్తు లు విసురుతూ అ అమ్మాయి లతో హుషారుగా ఆడుతుంటే రెప్ప వాల్చకుండా చూస్తూ నిలబడ్డది పార్వతి.
"చూడండర్రా! ఈ కోయిన్ సూటిగా పాకెట్ లో పడకపోతే నా పేరు కవిత కాదు" అంది కవిత స్ట్రైకర్ గురి పెట్టి.
"చస్తే పడదు. ఎక్స్ పర్టు కి మల్లె ఫోజు పెట్టేస్తే సరేమిటి?' అనుకుంది పార్వతి. కవిత ఓడిపోతే వెయ్యి కొబ్బరి కాయలు కొడతానని దేవుణ్ణి మొక్కుకుందేమో కూడా ఆ క్షణంలో కోపంతో. కాని అలా జరగలేదు. అవక్ర విక్రమార్కుడి లా విజయం సాధించి ఆవిడ మరో గేమ్ కి సిద్దమయింది.
చలికాలం మాట మరిచి పార్వతి ఒళ్ళు పూర్తిగా వేడెక్కి కొద్ది సేపు నిప్పుల మీది పెనం లా కాలింది. తను కూడా కులాసాగానే ఉన్నట్టు కవిత కు తెలిసేలా ఒక సెట్టు టెన్నిస్ అడి ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రి నిద్ర కోసం గింజుకున్నదా అమ్మాయి.
మర్నాడు ఆదివారం. పక్కమీద నుంచి లేచి అద్దంలో చూసుకుంటే కళ్ళు ఎర్రనై కనిపించాయి. నిత్యకృత్యాల్లో నిమగ్నురాలైంది. కాని హృదయా న్నేవరో శరీరం నుంచి వేరు చేస్తున్నంత బాధగా ఉంది.
ఆదివారం కనుక చాలాసందడిగా ఉంటుంది క్లబ్బు లో. ఉద్యోగాలు చేస్తున్న స్త్రీ లంతా తప్పక వస్తారు. కవిత కూడా రావడాని కవకాశముంది.
అన్నిటి కన్న ఆ భావనే అక్కడి దాకా నడిపించింది ఆ యువతిని.
యువతుల క్లబ్బు సందడిగా ఉన్నమాట నిజమే కాని కవిత కానరాదు.
హల్లో ఉన్న స్త్ర్తీలలో డాక్టర్ గారి సతీమణి నవ్వుతూ, "కవిత రాలేదని అదోకలా ఉన్నారు పార్వతి గారు" అంది పార్వతిని అభిమానంగా చూసి.
పార్వతి లేని చిరునవ్వు నవ్వింది. ఫ్లోరా అందుకుని, "కవితా వాళ్ళింటికి వెళ్లాను., ఏదో నవల వ్రాయటం ప్రారంభించి నట్టుంది. మళ్ళీ ఆమె గారు మన లోకంలో పడటానికి కనీసం నెలైనా అవుతుంది." అంది పెదవి విరిచి.
పార్వతి ఏదో ఊహించే లోగా హటాత్తుగా ఊడిపడిన పద్మావతి ఏ సంగతీ చెప్పకుండానే ఆమెను లాక్కు పోయిందక్కడి నుంచి. "చూడు, పార్వతీ! మన లైబ్రరీ పెద్దది కదా? ఆ భాగాన్ని నువ్వు నిర్వహిస్తుండాలి." పద్మావతి ఇంచుమించి రహస్యంగా చెప్పింది.
"నేనా?" అన్నది పార్వతి సంశయిస్తూ.
"అవును. నీ మాట నేను మరిచి పొతే కవితే జ్ఞాపకం చేసింది. సాహిత్యాభిలాష ఉన్న కొద్ది మెంబర్ల లో నువ్వొక దానివి ముఖ్యంగా మరి! ఏమంటావు?' అనడిగిందావిడ.
"అలాగే!" అని అస్పష్టంగా చెప్పి లోపలి కెళ్ళింది పార్వతి.
అదే ఆలోచిస్తూ నడుస్తున్న పార్వతి కి కవిత పేరు వినిపించింది ఒక వైపు నుంచి. ఆ వంకకు చూచింది. సింగ్ -- పాంగ్ ఆడుతున్న కోందరమ్మాయిలు అట నిలిపి కవిత వ్రాసిన నవల గురించి చర్చించు కుంటున్నారు. మరొక వ్యక్తీ రావడం వాళ్ళు గుర్తించ లేదు. కాని నవలకు వ్యతిరేకంగా ఆ అమ్మాయిలూ అభిప్రాయ పడుతుండడం చూచి తనే జోక్యం చేసుకుంది పార్వతి.
"ఏమిటర్రా అది?' అని పార్వతి ప్రశ్నించగానే , "కవిత కొత్త నవల మాకేం నచ్చలేదండీ! దాని గురించే అనుకుంటున్నాం!" అంది అరుణ , లాయరు గారి కూతురు.
పార్వతి ఆ పిల్లల విమర్శలు ఆలకించి మళ్ళీ వివరంగా కధంతా జ్ఞప్తికి తెచ్చింది.
"సత్య దూరం కాని వస్తువే అది. పైగా జీవిత స్వరూపం అద్దం లోలా కనిపిస్తుంది . అలాటిది మీకు నచ్చలేదంటే కారణం తెలీడం లేదు" అంది.
"బలే! మీరు కూడా అలాగే చెప్తున్నారు. ఒకవిధంగా మీరన్నట్టు కధనం అంతా జీవితాన్ని ప్రతిబింబింపజేసింది కాని అసలు ఇతివృత్తమే సహజంగా లేదు. కధానాయకుణ్ణి ఘోరంగా చిత్రించి, రచయిత్రి గా అతని గతిని సూచన మాత్రంగా నన్నా నిర్ణయించ కుండా సానుభూతి మాటలతో ముగించడమా? తగలబడినట్టే ఉంది" అంది ఇవర్సీరు గారి అమ్మాయి.
పార్వతి ఉద్రేకపడుతూ అంది: "విజయా! నువ్వు మొదటేమన్నావ్? జీవితాన్ని ప్రతిబింబింపజేసింది అన్నావు. తర్వాత అర్ధం లేకుండా వాదన పెంచడం కోసం తక్కినదంతా చెప్పావు, పోనీ, నువ్వన్నది నిజం అనుకుందామంటే వీల్లేకుండా ఉంది. జీవిత స్వరూపంగా తోచిన చోట అసహజత్వానికి చోటు లేదు."
పార్వతి తో ఏకీభవించడం ఆ గ్రూప్ లో కొందరికి అయిష్టంగా ఉంది.
"ఏమైనా చెప్పు, పార్వతీ! కవిత మంచి నవలలు వ్రాసి వ్రాసి, హటాత్తుగా ఇలాటి చెత్త నవలొకటి మా ప్రాణం మీదికి వ్రాసి పడేస్తుంది. రచయిత లెప్పుడూ ఒక్క విధంగా వ్రాస్తారనుకున్నాను. రకాని కొకలా వ్రాస్తుందీమే" అంది ఒకావిడ.
"దయచేసి చెత్త అనవద్దు!' అంది పార్వతి గంబీరంగా.
రేఖ అనే కలవారి అమ్మాయి సాహిత్యం గూర్చి కాస్తయినా తెలీక పోయినా నవ్వుతూ, "మా అభిప్రాయాలు చెప్తున్నాం గాని ఆవిడా రచయిత్రి కాదని అనలేదు కదండీ!" అన్నది కవ్వించడానికి.
కాని అనుకోని సంఘటన ఎదురైంది. చటుక్కున లేచి నిలబడిన పార్వతి పెదాలు అడురుతుండగా, "మీకొక అభిప్రాయం చెప్పే అర్హత కూడా ఉందా? సూక్ష్మంగా చూచేవాళ్ళకే దేన్నీ గురించి గాని చెప్పే శక్తి ఉంటుంది. విలువ తెలీకుండా మాట్లాడేదానికి ఎంతకాలమూ చాలదు" అని కోపంతో విసురుగా వెళ్ళిపోయింది.
ఆ కొమ్మలందరూ బొమ్మల మాదిరిగా నిలబడి కూచొని ఆటే చూస్తుంటే పద్మావతి గబగబా వచ్చింది.
"ఏమిటా అమ్మాయి అలా కోపంగా వెళ్ళింది? ఎవరు కోపం తెప్పించారు?' అనడిగింది ఆత్రుతగా కంగారుగా.
మొదట మౌనంగా ఊరుకుని తర్వాత అంతా చెప్పేరు.
"ఏడ్చినట్టే ఉంది! ఆ అమ్మాయికి కవితంటే ప్రాణం కదా? ఎందుకలా అనవసరంగా వాదించారని పని లేక?" విసుక్కుందా కార్యదర్శిని.
"పోనీ, పద్మా! నువ్వే చెప్పు. ఆ నవల అసహజంగా లేదూ?' అంది విజయ.
"మన మొహాలు కూడా అసందర్భంగానే ఉన్నాయి. ముందా అమ్మాయి కోపం ఎలా పోతుందా అని నేను చస్తుంటే" అంది పద్మావతి ఏడుపు మొహం పెట్టి. తర్వాత ఏదో నిశ్చయించు కుంది.
38
పార్వతికి దేహమూ, మనస్సూ భారంగా అయిపోయాయి. క్లబ్బు లో వాగ్వివాదం జరిగి ఇంటికి వచ్చాక, కాకినాడ వచ్చిన తర్వాత ఇంత బరువుగా, సమస్యగా గడిచిన రోజు లేదు. ద్వేషాన్ని కోపాన్ని ఒకసారి బాగా చవిచూసి పర్వవసానాల్ని కూడా అనుభవించి దెబ్బ తిని ఉన్న పార్వతి మరొకసారి అటువంటి హేయానుభవాల్ని ఊహించుకోవడాని క్కూడా భయపడింది. కవితతో తనకు పంతమా? ఇది ద్వేషంగా మారుతుందేమో అనుకునేసరికి శరీరం కంపించింది.
అంతర్వేదన ఎలా ఉన్నా వెనకదీస్తున్న హృదయాన్ని ముందుకు నడిపించ లేకుండా ఉంది. ఆరురోజులు గడిచినా పార్వతి కావాలనే కవితను కలుసుకోవడానికి ప్రయత్నిచలేదు. ఆమె తన కోసం వస్తుంది అనే ఆశతో కూడిన విశ్వాసం నిలవరించింది అనుక్షణం. అదొక విధమైన పట్టుదలలో కవిత తలపు మధురమైన స్పందన కలిగించేది . 'ఇల్లాటి చెలిమి ఎక్కడైనా ఉంటుందా?' అనుకుంది పార్వతి తనను గురించి తనే ఆశ్చర్యపడుతూ. ఇంత ప్రాణాదికమైన ప్రేమ ఏర్పడటానికి కారణం ఎన్నో సంవత్సరాల స్నేహనుబంధం అనైనా చెప్పగలదా ఎవరితోనైనా తను?
ఊరికే కూచుంటే పార్వతి ఊహలు విచిత్ర మైన పోకడలు పోతున్నాయి. హృదయ సముద్రాన్నెవరో కలచి వేస్తున్నట్టయినప్పుడు ఆందోళనతో, పిరికితనంతో సరాసరి వెళ్లి కవిత పాదాల మీద పడిపోవాలనిపిస్తున్నది ఒక్కొక్కసారి.
"ఇలా ఉండలేను! వెళ్లి క్షమించమని వేడుకుంటాను' అనుకుంది పార్వతి.
పార్వతి మానసికంగా బాధపడుతూ మౌనంగా ఉండటానికి కారణాన్ని రాజు చురుకుగా అన్వేషించాడు. పార్వతి చెప్పకపోయినా ఆమెకూ, కవిత కూ ఎక్కడో బెడిసి కొట్టి ఉంటుందను కున్నాడు.
మంచి శాస్తే జరిగిందని పించిండతనికి పార్వతిని చూస్తుంటే. ఎందుకనో కవిత మీద అతనికి కోపం వస్తున్నది తరుచుగా. పార్వతి కవిత కోసం అలమటించి పోవడం చూస్తె సహించలేక పోతున్నాడు.
తనకంటే ఆమె ఎక్కువా? సాధారణంగా స్త్రీలు భర్తను ప్రేమించినట్టు మరెవర్నీ ప్రేమించలేరు. ప్రేమించినా ఆ తర్వాతనే. తన కర్మానికి ఈవిడ తత్వం ఇటువంటిదైనది . ఛ-- ఏం బ్రతుకు? కాని మనసులోని సంగతెలా ఉన్నా పార్వతి ఒకప్పుడు తనంటే ఎక్కువ ఇష్టాన్ని కనబరిచేది . ఇప్పుడిలా మారిపోవాలెందుకని?
ఒక పట్టాన పూర్తయ్యేది కాదు రాజు స్వగతం.
ఒకసారి "నాకంటే కవిత నీ కెక్కువా?" అని రాజడిగినదానికి సమాధానంగా నవ్వుతూ "చెప్తే సిగ్గు పడిపోతారు తమరు" అంటూ అతను చెప్పమని బలవంతం చెయ్యక పోయినా, "ఆమె మీదున్న అభిమానంలో సహస్రాంశం కూడా మీమీద లేదు నాకు" అన్నది తిరిగి . అల్లాటి సంఘటన లెన్నో జరిగాయి.
ఏదెలా జరిగినా పార్వతి పట్ల ప్రేమ లాటి భావం, కవిత పై అసూయ వంటి భావం ఒక్కసారే మొలకెత్తాయి అతనిలో.
సాయంత్రం డ్రెస్ వేసుకుని , "అలా ఉన్నావెం?' అన్నాడు పార్వతి ని చూస్తూ. ఆమె మ్లానతను తను గుర్తించినట్టు తెలియాలని అతని ఉద్దేశం.
"ఎలా ఉన్నాను?' అంది అంతవరకు ఊరికే పట్టుకు కూచున్న మేగజైన్ పేజీలు తిప్పుతూ.
"నీకేం పనిలేదేమో -- అలా షైరు వెళ్లోద్దాం రా!" అన్నాడు.
"ఉహు-- రాను" అంది ఎప్పటి మాదిరి గానే.
రాజు ఏదో అనడానికి సిద్దమై మళ్ళీ ఏమనుకున్నాడో తనదారిని నడవ బోయాడు.
"పోనీ..........వస్తాను , రాజూ!" అని చప్పున నాలుక కరుచుకుంది.
"వస్తానుండండి!" రాజు వెనక్కి తిరిగి ఆమె కళ్ళల్లో కి చూచి నవ్వాడు.
తర్వాత, "ఇలాగేనా రావడం?' అన్నాడు ఆమె చెదిరిన జుత్తు నూ, నలిగిన బట్టల్నీ చూస్తూ.
"ఫర్వాలేదు , పదండి" అంది పార్వతి , బయటి కెళ్ళాలంటే పెద్ద ఆర్భాటంతో గాని కదలని పార్వతి.
అతని వెంటనంటే వెళ్ళింది ఉదాసీనంగా. ఆకుపచ్చ చీరే కట్టిన భూమాత ఒడిలో కూచున్నారిరువురూ. పార్కులో సందడి తక్కువగా ఉన్నది కాని సంకోచంగా అతని పక్కన కూర్చున్నది పార్వతి. ఈ అనుభవం మరీ కొత్త గాను, కాస్త చిరాకు గాను ఉంది.
ఒకరోజు రాజు దగ్గర ఇలా సరోజ కూచుంటే తనకు కోపం వచ్చింది. ఎందుకనో?
మెలకువ వచ్చిన దానిలా అయింది పార్వతి రాజు పలకరింపుతో.
"పదండి . వెళ్ళిపోదాం. ఇక్కడేం బాగులేదు నాకు" అంది విసుగ్గా.
'అప్పుడేనా? అసలు రాకపొతే బాగుండేది" అన్నాడు ఆశ్చర్యపడినాక కోపం తెచ్చుకొని.
"నేను వెళ్తాను. మీరుండండి." అతను వినిపించుకోలేదు. "పార్వతీ, నన్ను 'మీరు' అంటూ పిలవడం ఎందుకు ప్రరంభించావు?" అడిగాడు ఎలా అన్నా ఆమె నక్కడ ఉండేటట్టు చెయ్యాలని. "నాయిష్టం" అన్నది. మామూలు ధోరణే అమెది. "నువ్వలా పిలుస్తుంటే అదోకలా ఉంది ఎందుకో. 'బావా' అని పిలుపు! సంతోషిస్తాను." అన్నాడు పరీక్షగా ఆమెను చూస్తూ.
పార్వతి నవ్వింది. కాని కవిత గురించిన బాధ మనసులో లేకపోతె ఇంకా నిండుగా నవ్వేదే.
"ఉహు. బావా అని పిలవడం ఎప్పుడో మరిచిపోయాను. ఇప్పుడలా పిలిచినా బాగోదు వినడానికి" అంది.
"ఎందుకు బాగుండదు? పోనీ, నా పేరుతోనే పిలుస్తుండు ఎప్పట్లా" అన్నాడు రాజు చేతి వెళ్ళు పరిశీలించు కుంటూ.
"ఇప్పుడు నిలదీసి మిమ్మల్ని ఎన్నయినా అడగగలను. పోనివ్వండి. అసలు సంగతేమీటంటే -- మా అక్క మిమ్మల్నిఇలా పిలవమని చెప్పింది . పిలుస్తున్నాను. అంతే!" అంది సూటిగా.
"ఈమె నిలదీసి అడిగేది ఏమిటో" అనుకున్నాడు రాజు రహస్యంగా.
"ఎవరు?సారస్వతా చెప్పింది?' అన్నాడు పైకి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ.
"ఔను. అది వెర్రిది. పైగా చచ్చిపోయింది. దాని మాట ఎలా కాదంటాను? జీవితాంతం వరకు నాకోసమని తపన పడింది."
రాజు కొద్ది సేపు ఊరుకొని అన్నాడు: "నువ్వలా పిలిస్తే నా కిష్టం అనుకున్నదేమో మీ అక్క. కాని నేను స్వయంగా చెప్తున్నాను కదా? ఇక నుంచి అలా పిలవడం మానేసి "రాజూ" అనే పిలుపు."
"అసలు మిమ్మల్ని పిలిచే అవసరమేముంది నాకు? అంత అగత్యం ఎప్పటికీ రాదనే అనుకుంటున్నా. అందులో మీ అజ్ఞాలంటే నాకు మంట, మీ అందరి దగ్గరా గెలిచెను గాని కవిత నన్ను ఓడించింది" అంది అతన్ని లెక్క చెయ్యకుండా వ్యంగ్యంగా.
"పారూ!" అని ఆమె చేతిని పట్టుకు నొక్కాడు . "వెళ్దాం " అంది చెయ్యి అలానే ఉంచి.
