
52
రాత్రి తాతగారి ప్రక్కలో నిద్రపోతున్న ప్రశాంతిని తీసుకువచ్చి వదిన దగ్గర పడుకో బెట్టి జోకొట్టింది శాంతి. శ్రీహరి యింకా మేలుకొనే ఉన్నాడు, ఆఫీసు కాగితాలు చూచుకుంటూ.
మెల్లగా శాంతి, అన్నదగ్గరజేరి టేబుల్ వెయిట్ లు సర్దసాగింది.
"ఏమిటి?" తలెత్తాడు శ్రీహరి.
"ఏంలేదు" అంది శాంతి సంకోచిస్తూ.
"ఏమిటి చెప్దూ? చెప్పాలని వచ్చి మళ్ళీ దాపరికం దేనికీ?"
"రాజా......."
"ఊఁ. ఏమిటి? ఎక్కడికి వెళ్ళాడనా?"
శాంతి మాట్లాడలేదు.
శ్రీహరి కూడా కుర్చీనుంచి లేచాడు. "ఏమిటో నాకూ తెలియకుండా ఉంది, శాంతీ. కాని, అతడు నాకు ఉత్తరం వ్రాయకుండా ఉండడు. ఎక్కడికి వెళ్ళాడో, ఏమిటో?"
శాంతి అలాగే మౌనంగా నిలబడింది.
చెల్లెల్ని పరీక్షగా చూచాడు శ్రీహరి. "ఇంకో నాలుగు రోజులు చూచి ఉత్తరం రాకపోతే నేను ఆరా తీస్తలే. బెనర్జీ అనీ, మోహన్ అనీ యింకా ఎవరెవరో స్నేహితులున్నారతడికి కలకత్తాలో. వాళ్ళకు వ్రాసి కనుక్కుంటాను."
"ఏమీ ప్రమాదం జరిగి ఉండదు కదా?"
"జరగకూడదు మరి! అయినా అతడేమీ అఘాయిత్యాలూ అవీ చేసేంత తెలివితక్కువ వాడు కాదు. నాకా ధైర్యముంది."
శాంతి మరి మాట్లాడలేదు. మౌనంగానే అక్కడినుంచి వెళ్ళిపోయింది. చెల్లెలికి ధైర్యం చెప్పాడేకాని శ్రీహరికి మధ్యాహ్నంనుండీ మనస్సేమీ బాగుండలేదు. 'రాజా ఏమయ్యాడు? ఏమయ్యాడు?' అనే కలవరంతోనే కలగిపోతున్నాడు. 'ఏం జరిగింది? ఏం చెయ్యను?' అని ఆలోచించసాగాడు. సంతోషంగా ఉన్నంత కాలమూ సంతోషమే. కష్టాలు ఆరంభమైతే మాత్రం ఇక అదే ప్రవాహం. అన్నీ విచారాలే. స్నేహితుడు చూస్తే అలా. కుటుంబ పరిస్థితి చూస్తే యిలా. ఛ!
"ఏం? ఆవిడగారికంత ఆరా వచ్చింది రాజా గురించి?" అంది పద్మ.
"ఏమో? నాకూ అదే ఆశ్చర్యంగా ఉంది. ఇందాక శ్యామలతో ఘర్షణ పడినప్పుడు చూచావా, ఏమందో?"
"అవును. ఏదో ఆవేశంలో అనేసిందని అనుకున్నాను. కాని ఎలాగైనా కొంత మార్పు వచ్చిందనుకుంటాను."
"ఏమో!"
శాంతి తన గదిలోకి వెళ్ళిందేకాని ఎక్కడా కుదురులేదు మనస్సుకు.శ్యామలతో ఘర్షణ, గోవిందరావుతో పరిచయం, రాజా స్నేహం- ఏమేమో గుర్తుకువచ్చి చీకాకు పైపోతూంది మనస్సు. ఎందుకో రాజా ఉత్తరం తిరిగి వచ్చేసినందుకు అనిర్వచనీయమైన వ్యధ కలిగింది. 'అతడ్కకడ ఉద్యోగం చేస్తున్నాడు. స్వంత యిల్లుంది. అటువంటివాడు ఎక్కడికి వెళ్ళిపోయినట్లు? ఒకవేళ నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్ళినా ఉత్తరాలు నౌకర్లు తీసుకొని ఉందురు. అలా కాకుండా శాశ్వహంగా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఇందుకు నేనే కారణమా?' అనే బాధ దొలిచివేయసాగింది.
ఇదివరలో అసలు రాజా గురించిన ఆలోచనలే వచ్చేవి కాదు. ఇప్పుడు ఎందుకో అతడి గురించి బాధా, పశ్చాత్తాపమూ కలుగజొచ్చాయి. రాయిలా ఏ స్పందనామూ లేక ఉండే గుండె యిలా వివిధరకాల ప్రేమాభిమానాలతో నలిగిపోతూంది. చిన్నదారి ఉంటే చాలు. రకరకాల స్రవంతులకు రహదారి అయిపోతుంది ఈ గుండె!
'నన్ను తొందరపడవద్దని సలహా యిచ్చి నానుంచి మాట తీసుకున్న వ్యక్తి అంత తొంధర పడతాడా?' అని సరిపెట్టుకుంది కడకు. 'అతణ్ణి క్షేమంగా ఉండేటట్టు దయగా చూడు' అని దైవాన్ని ప్ర్రార్ధించింది.
ఆందోళన అవసరం లేదన్నట్టు మర్నాడే వచ్చింది శ్రీహరికి రాజానుండి ఉత్తరం. సారాంశం - ఉద్యోగం వదిలేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. 'ప్రశాంతంగా ఉండాలని ఉంది. అదీకాక భూములూ అవీ చూచేవాళ్ళు లేక రైతులు ఆడింది ఆటగా ఉంది. అందుకు కాస్త పల్లెపట్టున ఉండి బాధ్యతతో ప్రవర్తిద్ధామని!'
అది అసలైన కారణంగా తోచలేదు శ్రేహరికి. బెనర్జీకి వ్రాశాడు, రాజా విషయం వివరంగా వ్రాయమని. బెనర్జీ వ్రాశాడు - 'రాజా తఃరుచు పరధ్యానంగా ఉంటూన్నాడు. అనేక పర్యాయాలు సీనియర్ ఆఫీసర్ హెచ్చరించాడు, కాగితాలలో వ్రాస్తున్న తప్పులు చూచి. కడకు ఒకనాడు రాజా ఎవరికీ చెప్ప కుండానే ఉద్యోగానికి రాజీనామా యిచ్చి వెళ్ళిపోయాడు. కలకత్తాలో ఇల్లు అమ్మ జూపాడట. కాని ఎవరూ యింకా కొనలేదు-- అని.
శ్రీహరి హృదయం ఏదో అవ్యక్తమైన ఆవేదనతో ఊగులాడింది.
"నిన్ను శ్రమపెట్టడం భావ్యంకాదు కాని తప్పదు. ఒక్కసారి వచ్చి చూచిపో, రాజా. నేనే వద్దును కాని ఇక్కడ కుటుంబ విషయాలంత బాగుండలేదు. నా అభ్యర్ధన మన్నిస్తావు కదూ? నీకోసం ఎదురు చూస్తూంటారు" అని వ్రాశాడు రాజాకు. పోస్టు చేయడానికి పంపించేముందు చెల్లెలికి చూపాడు ఆ ఉత్తరం.
"బాగుంది. అలా వ్రాయమనే నేనూ చెప్పాలనుకున్నాను" అంది సంతోషంగా, శాంతి.
'త్వరలోనే రావడానికి ప్రయత్నిస్తాను. నాగురించి ఆందోళన చెందవలసినదేమీ లేదు. క్షేమంగా ఉన్నాను - రాజా' అని జవాబు వచ్చింది. చెల్లెల్ని పిలిచి ఆ ఉత్తరం చూపి, "ఇందులో కొత్త అడ్రస్ ఉంది" అని ఇచ్చాడు. ఉత్తరం వ్రాయమన్న సూచన ధ్వనించింది ఆ మాటలలో గ్రహించిన శాంతి మౌనంగా ఆ ఉత్తరం అందుకుని వెళ్ళిపోయింది.
ఈసారి రాజాకు వ్రాసిన ఉత్తరం ఇది వరకువలె ముక్తసరిగా వ్రాయలేకపోయింది. తనకు తెలియకుండానే అందు అనేక విషయాలు దొర్లాయి. మనస్సంతా మాటల రూపంలో పత్రంపై పరుచుకుంది. తిరిగి చదివి చూచుకున్న శాంతి, 'నా మనస్సు యిదా!' అని తనకు తానే ఆశ్చర్యపోయింది.
53
పూర్వులు నివసించిన ఆ పెద్ద యింటిని బాగుచేయించి యిప్పుడు రాజశేఖరం ఉంటున్నాడు. భగ్నప్రణయానికి తోడు, కలకత్తాలో ఉద్యోగం వదిలివేయడానికి కారణమైన సంఘటన ఒకటి అనుక్షణం అతడిని దహించి వేయసాగింది. అందమైన పుష్పాన్ని చూడగానే అందులో వికసితపద్మంవంటి శాంతివదనం దోబూచులాడుతుంది. మంచి చిత్రం చూడగానే మనోజ్ఞ. చిత్రప్రతిమవంటి శాంతిమూర్తి మనోనేత్రం ముందు గోచరిస్తుంది. ఉత్తమ నవల చదవగానే అందులో నాయిక మనోఫలకంపై హత్తుకుపోయిన తన ప్రణయ జీవితనాయికను మేల్కొలిపి తెచ్చి కండ్ల ఎదుట నిలుపుతుంది. కోయిల కూతలో హృదయ సామ్రాజ్ఞి కంఠం వినవస్తుంది. మయూరి నాట్యంలో మనోహరిణి నడకల హోయలు కన్పించి కవ్విస్తుంది. అందమైన స్త్రీ కన్పించగానే శాంతి గుర్తు వస్తుంది. ఏ విధంగానూ అతడి హృదయానికి శాంతి లేకపోయింది. ప్రశాంతదూరమైన అంతరంగాన్ని పట్టణవాసాలకు దూరమైన ఈ పల్లెప్రకృతిలో జోకొట్టాలన్న అతడి ఆశ అడియాసే అయింది. పుస్తకాలు చదవడం పూర్తిగా మానుకున్నాడు. పూలమొక్కల సంరక్షణ విరమించుకున్నాడు. ఏకాంతంనుండి పారిపోయి పొలాలలో పాలేళ్ళమధ్య నిత్యం గడపసాగాడు. అక్కడ కూడా అతడు కోరిన ఫలితం గగనమే అయింది. కూలిపడుచు ప్రియునితో ఆడే సరససల్లాపాలు చూచీ, కర్షక యువకులు పాడే పల్లెపదాలలోని ప్రణయగాధలు వినీ అతడి అంతరంగం అశాంతినిలయ మైపోయేది. తన తెలివితక్కువకు తానే నవ్వుకొన్నాడు. 'హృదయంలో లేని ప్రశాంతతను ఏ పరిసరాలూ తీసుకురాలేవు. హృదయంలోగల ప్రశాంతత కణకణలాడే నిప్పులమధ్య నిలిచినా తొలగి పోజాలదు. భగవాన్! ఎప్పుడు ప్రసాదిస్తావిక నాకు శాంతిని? నా జీవితమిలా దిగులుతో నశించిపోవలసినదేనా?' అని అలమటించిపోయే వాడు.
