18
ఆ దృశ్యం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. శారద ఆలోచనలో పడింది. తను వ్రాసిన ఆ కథానికలో తన తల్లికి జరిగిన అన్యాయం ఆమె పడిన పాట్లు ఆ తర్వాత తను పడిన బాధలు వీటన్నింటినీ హృదయవిదారకంగా చిత్రించింది. ఆ కథానిక చదివిన సుందరరామయ్యగారు ఆ విధంగా మాట్లాడడం శారదలో ఏదో అనుమానాన్ని రేకెత్తించింది.
'అలోచించకుండా ఈ సన్మానానికి ఒప్పుకో తల్లీ...!' అర్ధిస్తున్నట్లుగా అన్నారు సుందరరామయ్యగారు తను కన్నీరు తుడుచుకుంటూ.
'శారదా! నా మాటకు ఎదురు చెప్పగలిగావు. ఇప్పుడు వీరందరి మాటా ఒకటై నిలిచింది. నీవు కాదంటే ఈ ప్రతిపాదన తీసుకువచ్చిన నన్ను అవమాన పరచినదానవౌతావు.' శారదను మెరిసే కళ్ళతో చూస్తూ అన్నాడు ప్రభాకరం.
ఆ చూపులలోని అంతరార్ధాన్ని నీరజ ఒకర్తె మాత్రమే గ్రహించగలిగింది-
'చినబాబుగారూ! ఎంతమాటన్నారు? మీ మాటకు ఎదురు చెప్పగలనా? మీరు అవమానాన్ని భరిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలనా? అంతా బలవంతం చేస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను.' అంది శారద సిగ్గుతో తల దించుకుంటూ.
'చాలా సంతోషం...!' అన్నాడు ప్రభాకరం.
'పదిహేను రోజులలో ప్రభాకరం పుట్టినరోజు వస్తూ ఉంది. ఆ రోజే శారదకు సన్మానం చేద్దాం.' అన్నాడు శ్రీపతిగారు.
అంతా సంతోషించారు. రాత్రి పది దాటడంవల్ల సుందరరామయ్యగారు నీరజతో తమ యింటికి వెడతామన్నారు. కాని శ్రీపతిగారు అందుకు ఒప్పుకోలేదు. వారు బలవంతం చేయడంవల్ల ఆ రాత్రికి అక్కడ ఉండడానికి ఒప్పుకున్నారు సుందర రామయ్యగారు.
శారద సుందరరామయ్యగారిని చూస్తూ 'బాబుగారూ! కథానికలోని సంఘటనకూ, మీ జీవితంలో జరిగిన యదార్ధ విషయాలకూ ఏదో సంబంధమున్నట్లు మీ మాటల వల్ల తెలుస్తూ ఉంది. నేను వ్రాసిన ఆ కథ కల్పితమైనది కాదు. యథార్ధంగా జరిగినటువంటిది.' అంది.
'నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు నా లక్ష్మికి నేనెంతో అన్యాయం చేశాను. నాన్నగారిని ఎదిరించే ధైర్యం లేక ఆమెను దూరం చేసుకున్నాను. నాలక్ష్మి ఎన్ని యిబ్బందులు పడుతూ ఉందో? ఎక్కడ ఉందో?' కళ్ళు ధారలుకట్టి సుందర రామయ్యగారి చెంపలను తడిపేశాయి.
లక్ష్మిపేరు వారినోట వెలువడగానే తన గది లోపలికి పరుగెత్తింది శారద. ఆమె వెళ్ళిన విషయం గమనించకుండానే సుందర రామయ్యగారు తమ ధోరణిలో చెప్పుకు పోసాగారు.
తిరిగి వచ్చిన శారద తనచేతిలోని ఫోటోను సుందరరామయ్యగారికి అందిస్తూ 'బాబు గారూ...! మీ లక్ష్మిని మీరు గుర్తుపట్టగలరేమో చూడండి' ఆమె కంఠంలో కాఠిన్యత నిండి ఉంది.
ఆ ఫోటో చూసిన సుందరరామయ్య గారికి మతి పోయినంత పనైంది. తను కూర్చున్న సోఫా ఎంతోవేగంతో గుండ్రంగా తిరుగుతున్నట్లు అనిపించసాగింది వారికి. వణుకుతూన్న చేతులతో ఆ ఫోటోను తన గుండెల కదుముకుంటూ 'లక్ష్మి... నాలక్ష్మి....!' అంటూ వలవల ఏడ్చారు.
వారి ఆ పరిస్థితి శారదకు ఏమాత్రం అర్ధం కాలేదు. అయోమయావస్తలో పడి పోయింది. తన తల్లిపై అంతప్రేమ ఉన్న వారు ఆమెపట్ల అలా నిర్దయతో ఎందుకు ప్రవర్తించారో అర్ధం కాలేదు. వీరి వాలకం చూస్తే నిర్దోషులేమో ననిపిస్తూ ఉంది. మరి చేసిన అన్యాయానికి ఏం సంజాయిషీ చెబుతారు? ఈ విధంగా ఆలోచిస్తూ కూర్చుంది శారద.
విషయమేమిటో అర్ధం కాక అక్కడున్న మిగతావారంతా తెల్లబోయి శారదమ్మ సుందరరామయ్యగారినీ వింతగా చూడసాగారు.
కొద్దిగా తేరుకొన్న సుందరరామయ్యగారు మళ్ళీ ఆ ఫోటోను చూస్తూ 'లక్ష్మీ! నీకు అన్యాయం చేశాను. దాని ఫలితాన్ని భగవంతుడు నాకు ఈ జన్మలోనే కలిగింపజేస్తున్నాడు. దీర్ఘరోగంతో రేయింబవళ్ళు నీకు చేసిన ద్రోహం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎంతగానో బాధపడుతూ జీవచ్చవంలా బ్రతుకుతున్నాను.' అని దీర్ఘంగా నిట్టూర్చి శారదను చూస్తూ 'ఈ ఫోటో నీ వద్దకు ఎలా వచ్చిందమ్మా?' ప్రశ్నించారు సుందర రామయ్యగారు.
'ఎక్కడినుండీ రాలేదు. వారసత్వ ఆస్తిగా నాకు సంక్రమించింది.' నిర్లిప్తతతో అంది శారద.
'అవుతే...శారదా...నీవు....నీవు.... నా...'
'అవును! మీ కుమార్తెనే! ఈ ఫోటో నా కన్న తల్లిదండ్రులది. మీరు నాకు కనుపించిన తర్వాతే ఆ కధ వ్రాయాలనిపించి వ్రాశాను. ఆ కధ చదివిన తర్వాత మీ అంతట మీరే బయటపడతారని ఊహించాను. నా ఊహ నిజమైంది. మిమ్ములను చూసిన రోజే మీరు నా తండ్రిగారేమోనన్న అనుమానం కలిగింది. నా అంతట నేను మీ కుమార్తె నని చెప్పుకోవడం యిష్టంలేక నా చరిత్రనంతా కధగా వ్రాశాను.'
'నన్ను... నన్ను.....క్షమించగలవా తల్లీ! నా లక్ష్మి యిప్పుడు కూడ ఉన్నట్లయితే నన్ను తప్పకుండా క్షమించి ఉండేది.' ఆందోళన, ఆవేదన వారి మాటలలో వ్యక్తమౌతూ ఉంది.
'నేను ఆమె కూతురినే నాన్నా...!'
'నాన్నా...!' అన్న పిలుపు చెవిన పడేసరికి సుందరరామయ్యగారి శరీరం సంతోషంతో పులకించిపోయింది.

'అమ్మా శారదా! నీవు నన్ను క్షమించావు' అని అందరివైపు చూస్తూ 'శారద నా కన్నకూతురు' ఆ భగవంతుడు కరుణా మయుడు. లక్ష్మిని నాకు శాశ్వతంగా దూరం చేసినా ఆమె చిహ్నాన్ని నావద్ధకు సురక్షితంగా చేర్చాడు.' తడబడుతూ, గద్గదస్వరంతో అన్నారు సుందరరామయ్య గారు.
శారదే జ్యోత్స్న అవడం, ఆమె సుందర రామయ్యగారి ప్రధమ సంతానం అని తెలియడంతో అందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు.
'అక్కయ్యా!' అంటూ నీరజ శారద ఒడిలో తల దాచుకుంది.
ఆమె తలను ఆప్యాయంగా నిమురుతూ 'చెల్లీ...!' అంటూ మరీ దగ్గరగా తీసుకుంది శారద.
'ఏమిటి మామయ్యా యిదంతా? ఈరోజు జరుగుతూన్న వింతలు చూస్తూ ఉంటే మతిపోతూ ఉంది.' చిరునవ్వుతో అన్నాడు ప్రభాకరం.
'అన్నిటికన్న గొప్ప విషయం నా తల్లి శారద నన్ను మన్నించడమే! శారదకు అన్నీ లక్ష్మి పోలికలే!' అని ఒక్క నిట్టూర్పు విడిచి మళ్ళీ 'లక్ష్మి గుణగణాలను అందచందాలను చూసి, నా యౌవనదశలో ఆమెను నేను ప్రేమించాను. మా యింటికి నాలుగిండ్ల అవతలి యింట్లోనే తన తండ్రితో ఉంటూ ఉండేది. వారు నిరుపేదలు. లక్ష్మికి తల్లి లేదు. వయసులో ఉన్న మేమిద్దరము ఒకరిని మరొకరం ఆకర్షించుకున్నాము. ఆకర్షణ పరిచయంగా, పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు తెలియని ఆవేశంతో తప్పుచేశాం. ఆమెకు నెల తప్పిందని తెలిశాకగాని నా తప్పిదం యొక్క ఘోరపరిణామం నాకు తెలిసి రాలేదు. అప్పుడిక విచారపడి చేయగలిగేదేముంటుంది? ఈ విషయాలన్నీ నాన్నగారికి వివరించి చెప్పాను. నా మాటలు విన్నవారు ఉగ్రులై లక్ష్మిని, ఆమె తండ్రిని నానా మాటలు అన్నారు. పాతికవేల రూపాయలు కట్నం యిస్తేగాని వివాహానికి ఒప్పుకోనని మొండికెత్తారు. నిరుపేదలైనవారు పాతికవెలు ఎక్కడ తేగలరు? నేను ఎదురు తిరిగాను. కాని వారి దృఢ నిర్ణయానికి చేయగలిగేదేమీ లేక తల ఒగ్గ వలసి వచ్చింది. నేను వారు నిర్ణయించిన అమ్మాయిని చేసుకోకపోతే, బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటామన్నారు. విధిలేక ఒప్పుకోవలసి వచ్చింది. నాకు రెండురోజులలో వివాహం జరుగుతుందనగా లక్ష్మి యింటినుండి ఎటో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె తండ్రి నెలతిరగకుండానే మంచంపట్టి మరొక నెల పూర్తవకుండానే మరణించాడు. లక్ష్మి కుటుంబం ఉసురు కొట్టినందువల్ల నేనేమో నీరజ తల్లి నీరజను ప్రసవించిన రెండవరోజే ధనుర్వాతంతో మరణించింది. ఆ తర్వాత నాకు మళ్ళీ వివాహం జరిపించాలని ఎంతో ప్రయత్నం చేశారు. ఎంతోమందితో నాకు చెప్పించారు. ఎంతమంది ఎన్ని విధాల చెప్పినా నేను వినలేదు. వారంతా విసిగి వేసారి ఊరుకున్నారు. అంతేకాకుండా శారద కుటుంబ మంతా మా కారణంగా నాశనమైందనే విషయం బైటికి పొక్కకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. అందుకే ఈ విషయం బావగారికి, చెల్లెమ్మకు కూడా తెలియదు. ఇంతెందుకు? మా అమ్మగారికి కూడా ఈ విషయం తెలియనీయకుండా వ్యవహారాన్ని ఎంతో జాగ్రత్తగా చక్కబరచారు. లక్ష్మి నలుగురిలో మా కుటుంబాన్ని రచ్చకీడుస్తుందేమోనని నాన్నగారు ఎంతగానో భయపడ్డారు. కాని అలా జరగలేదు. ఆమె ఔదార్యం చూసిన నేను ఆమెకు జరిగిన అన్యాయానికి మరీ కృంగిపోయాను.
'నాన్నగారు మరణించిన తర్వాత శారద తల్లి లక్ష్మిని నాలుగైదు సంవత్సరాలు స్వయంగా వెదికాను. వెదికించాను. ఎక్కడా ఆమె విషయం తెలియలేదు. నిరాశతో జీవితం గడపసాగాను. నీరజ పెరిగి పెద్ద దైన తర్వాత ఇక ఆ పరిసరాలలో ఉండడం యిష్టంలేక, నా రోగానికి సరియైన వైద్య సదుపాయాలు ఆ కుగ్రామంలో అమర నందువల్ల యిక్కడికి వచ్చాను. ఆ తర్వాత జరిగిన విషయాలు మీ అందరికీ తెలిసి నవే!' అని అలసటవల్ల కుర్చీలో వెనుకకు వాలి నీరసంతో కళ్ళు మూసుకున్నారు సుందరరామయ్యగారు.
'అవుతే శారద మా పెద్దకోడలా!' ఆశ్చర్యంతో అన్నారు అన్నపూర్ణమ్మగారు.
'అవును...! అందుకే ఆ భగవంతుడు ఆమెను మీ వద్దకు చేర్చాడు. మీ సొత్తు మీ వద్దకే చేరింది.' అన్నారు సుందర రామయ్యగారు.
'ఏం బావా? ఏదో ప్లాను వేస్తున్నట్లు న్నావే? మీ సొత్తు మీ వద్దకు చేరిందని చేతులు దులుపుకుందామనుకుంటున్నావేమో? అదేమీ కుదరదు. మీరు లక్షాధికారులు. మీ నాన్నారు మా నాన్నగారిని మభ్యపెట్టి తక్కువ కట్నంతో మీ చెల్లెలిని నాకు ముడి పెట్టారు. ఇప్పుడు ఆ పప్పులేమీ ఉడకవు. మా ప్రభాకరానికి ఖచ్చితంగా లక్షరూపాయలు కట్నంగా యివ్వవలసిందే!' నవ్వుతూ వేళాకోళంగా అన్నారు శ్రీపతిగారు.
వారి నవ్వులో అంతా శృతికలిపారు. ఒక్క క్షణం హాలంతా నవ్వులతో మారుమ్రోగింది.
'అంతకన్నానా బావగారూ.......? మీరు కోరాలేగాని నేను వెనుకాడుతానా?' ఆనందంతో అన్నారు సుందరరామయ్యగారు.
'నాన్నగారూ! మీ డబ్బు నాకవసరం లేదు. ఈ డబ్బువల్ల వచ్చిన సమస్యే నా తల్లి జీవితాన్ని నాశనం చేసింది. నేనిలాగే జీవితాంతం పేదరాలుగా గడుపుతాను. తండ్రెవరో తెలియదన్న అపఖ్యాతిని పోగొట్టారు. నాకంతే చాలు. నావంతు కట్నం కూడా నీరజకిచ్చి దానిపెళ్ళి ఘనంగా జరిపించండి. అసలు కట్నం కోరేవారి సంబంధాన్ని నేనసలే ఒప్పుకోను.' ఆమె మాటలలోని గాంభీర్యం, దృఢత్వం అందరికీ విస్మయాన్ని కలిగించింది.
'నవ్వులాటకన్నానమ్మా! అంత కోపమైతే ఎలా? అయినా మీ నాన్న విషయంలో ఆ సమస్యే రాదు. ఆస్తంతా మీ యిద్ధరిదే కదా!' అన్నారు శ్రీపతిగారు శారద మనసు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో.
'పెదబాబుగారూ! వారు నలుగురిలో నాకు తండ్రినని ఒప్పుకున్నారు. నాకంతే చాలు. వారు నా కోసం ఎటువంటి యిబ్బందులూ పడనక్కరలేదు. వాళ్ళ ఆస్తిలో చిల్లి గవ్వకూడా నా కవసరం లేదు.'
'అదేమిటమ్మా? నన్ను మామయ్యా అని చనువుగా పిలువు' అని సుందరరామయ్య గారిని చూస్తూ 'ఏమోయ్! మీ పెద్దమ్మాయి మాటలు వింటున్నావా?' అన్నారు శ్రీపతిగారు.
'అవును. లక్ష్మి ధనానికి పేదరాలైనా గుణానికి పేదరాలు కాదు. ఆమె గుణాలే శారదకు వచ్చాయి.' అని శారదనుద్దేశిస్తూ 'అమ్మా! యింకా నాపై కోపం పోలేదా? నీ తల్లి ఆ విధంగా ఎన్నో బాధలకు గురి కావడానికి కారకున్ని నేనే! నీవు విధించే ఏ శిక్షనైనా సంతోషంతో అనుభవిస్తాను. నన్ను మాత్రం మాటలతో హింసించకు' అని బాధతో దుఃఖిస్తూ తమ నుదురు కొట్టుకోసాగారు.
వారిని ఆ స్థితిలో చూసిన శారద యిక ఉపేక్ష చేయలేక పోయింది. వారి ప్రక్కన కూర్చొని వారి కన్నీటిని తన పమిట చెంగుతో తుడుస్తూ 'నాన్నగారూ! నన్ను మన్నించండి. ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడను. తప్పైంది.' అని దీనంగా వారి ముఖంలోకి చూడసాగింది.
