కవిత పొడిదగ్గు వినిపించగానే కంగారు పడుతూ లేచి కూచుంది పార్వతి. తర్వాత కవితను చూస్తూ నవ్వేసింది.
"ఏమిటి విశేషం? అంతులేని ఆలోచనేమిటో అమ్మాయి గారికి?' కూచుంటూ అన్నది కవిత.
"నువ్వు పక్కను లేకపోతె ఇక ఆలోచనలే తోడు నాకు. అన్నట్టు నీ 'అగాధం' నవల నిన్ననే పూర్తీ చేశాను."
"ఎలా ఉంది?' కవిత మామూలుగానే ప్రశ్నించింది.
"ఏడ్చినట్టుందంటే ఏం చేస్తావూ?" అంది పార్వతి నవ్వుతూ.
కొద్దిసేపు ఎటో చూసి, "అభిప్రాయాల్ని తెలుసుకొనే వరకే మా రచయితల పని. అందరి అభిప్రాయాల కనుగుణం గా రచనా విధానాన్ని పద్దతిని మార్చుకోవాలని ఎక్కడా సిద్దాంతీకరింపబడి లేదు. కానైతే స్వేచ్చా వాహినిగా సాగిపోయే ప్రవాహాన్ని అదుపులోకి తెచ్చుకోవటానికి క్రమక్రామంగా ప్రయత్నిస్తాం.
"ఆ మధ్య నేను ఒక నవల వ్రాశాను. నువ్వూ చదవావేమో? అందులో అన్ని పాత్రలు దరిద్ర జీవితానికి ప్రతి బింబాలు. అలా వ్రాసిన నవల అదొక్కటే. తక్కినవేవీ అలా ఉండవు. అందుకనే ఆ పుస్తకం చదివిన ఒక పాఠకురాలు కోప్పడుతూ వ్రాసింది -- ఇంకేమీ గొప్ప ఇతివృత్తం మీకు దొరకలేదా? అల్లాంటి హీనుల గురించి వ్రాస్తే మీకేం ఒరుగుతుంది?-- అంటూ. అది చూస్తె నాకు నవ్వొచ్చింది. ఆవిడ ఉనికి ఎక్కడో తెలీలేదు కాని ఒక ప్రశ్న వేయాలనిపించింది. అసలు ప్రాకృతిక సృష్టి కి ప్రతి సృష్టి చేసే ప్రతిభ రచయిత కున్నదని ఒక పేరు. సృష్టి కర్తలన్న మాట అటుంచినా ఒకటి చెప్పగలను. భగవానుడు వాళ్ళు నీచులు, పాపకర్ములు అని వాళ్ళని వదిలి పెడతాడా? ఇదీ అంతే. భగవంతుడు సృష్టిస్తున్నాడు. మేం వ్రాస్తున్నాం. చదివినవాళ్ళు చదువుతున్నారు. ఇందులో సూక్ష్మ పరిశీలనా దృష్టి తో అర్ధం చేసుకునే వాళ్ళంటూ ఒక తెగ ఉన్నారు. సాహిత్య పరంగా చెప్పే దేనికైనా సర్వజనీసతనుఆధారంగా చేసుకున్నప్పుడు ఉన్నత సాహిత్య సృష్టి కి , అది సాధన మవుతుందని చెప్పవచ్చు." అంది గంబీరంగా.
"అబ్బ! ఎంత చెప్పావు, కవితా! నువ్వు వ్రాసినదాన్ని నేను మెచ్చుకోక పోవడం ఉంటుందా?' అంది పార్వతి.
అప్పుడే రాజు లోపలికి రాబోయి కవితను చూసి వెనక్కు వెళ్ళాడు.
ప్రేయసీప్రియుల్లాగ వాలి ఒకరూ , సోలి ఒకరు ఆవ్యాజ ప్రేమతో మాట్లాడుకుంటున్న దృశ్యం కళ్ళకు కట్టింది. పార్వతితో ఇంత హృదయ పూర్వకంగా ప్రేమించే తత్వమున్నదని ఇదివరకు అతనికి తెలీదు. అదే అనుకున్నాడు.
"కవితా! ఎప్పుడూ నన్నడగటమే కాని నువ్వు ఏయే రచయితల రచనల ఎక్కువగా అభిమానిస్తావో ఏనాడూ నాకు చెప్పనే లేదు" అంది పార్వతి.
"ఫిలాసఫిక్ గా ఉన్న రచనలు నన్నెక్కువ ఆకర్షిస్తాయి. ముఖ్యంగా రచన ప్రపంచ స్వరూపాన్ని రంగు టద్దాల్లో చూపించినా, భూతద్దం లో చూపినా హృదయాన్ని స్పందింప చేయాలి. ప్రతి ఒక్కరి చేత ఆలోచింప జేయాలి. అది ముఖ్యం, ముమ్మాటికీ" అన్నది కవిత మూడు ముక్కల్లో.
"ఒక్కోక్కప్పుడని పిస్తుంది, కవితా, ఇలా పుట్టటానికి బదులు ఏ శరత్ బాబు నవల గానో పుట్టి ఉంటె బాగుండునని , రచనలో కూడా ప్రాణం ఉంటుందంటావు కదూ?"
"నిజమే . ప్రతి నవల అమోఘ హస్తంతో వ్రాశారు శరత్ బాబు'!"
"రాధాకృష్ణ కూడా సరిగ్గా ఇలాగే అనేవాడు . నేనే మొదట్లో ఒప్పుకునేదాన్ని కాను."
హటాత్తుగా పార్వతి దగ్గర కొత్త వ్యక్తీ పేరు విని ఎవరా అతనని తబ్బిబ్బయింది కవిత.
"అన్నట్టు నీ కతని సంగతి తెలీదు కదూ? ఒకరోజు చెప్పబోతుంటే మరేవో మాటల్లోకి దించావు. ప్రప్రధమంగా నిన్ను నాకు పరిచయం చేసేడు అతనే."
రాధాకృష్ణ గురించి చాలా చెప్పింది పార్వతి. అతని నిగ్రహం, ఆత్మ విశ్వాసం, తెలివి తేటలు ఒకసారి స్మరించింది కవిత దగ్గర.
"మొన్న నే అతని ఉత్తరం వచ్చింది . తను పెళ్లి చేసుకోబోతున్నట్టు , పెళ్ళికి ఇంక రెండు నెలల వ్యవధి ఉందని వ్రాశాడు. 'వితంతువుని చేసుకునే అవకాశం కుదరలేదు, పార్వతీ! ఒక బీద కుటుంబం లోని అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాను' అంటూ తన అభిలాష నెరవేరనందుకు నైరాశ్యంతో వ్రాశాడు."
కవిత నిట్టూర్చి , "తీరా ఆచరణ లో పెట్టె సమయానికి ఆదర్శాలు ఇలాగే తగలబడి పోతుంటాయి. అదేమో చిత్రం!" అంది ఇంకేమీ అనలేక.
"మా అక్కని భార్యగా పొంద గలిగితే అతను మరీ అదృష్టవంతుడవును" అంది పార్వతి.
"ఏం? మీ అక్క అంత గొప్ప వ్యక్తా?" అని ప్రశ్నించింది కవిత.
"సౌందర్యవతి. అంతేకాక సౌజన్యవతి కూడా. మా సరస్వతి ని చూచి చాలామంది అసూయ పడేవారు. "స్మృతి పధంలో కనిపించే సరస్వతిని చూస్తూ అరమోడ్పు కళ్ళతో అంది.
కవిత పరధ్యానంగా ఉందేమో వినలేదు. శ్రావణ మేఘాల్లాటి కలహా సంఘటనలు ఎంత వేగంగా వస్తాయో ఊహించడం కష్టం.
"ద్వేషం , అసూయ లేశ మాత్రం కూడా లేని వ్యక్తీ ఎక్కడా ఉండడనే అనుకుంటాను." అంది పార్వతి. విననట్టు ఊరుకుంది కవిత.
"నీ కేవరి మీదనైనా అసూయ కలిగిందా, కవితా, ఎప్పుడైనా?"
వెంటనే తలఎత్తి "నీకు ఉందేమిటి అసూయ ఎవరి మీదైనా?' అనడిగింది కవిత కుతూహలంగా చూస్తూ.
"ఊ" అంది పార్వతి పెదవి విప్పకుండా .
"ఎవరా మనిషి?"
"ఒక స్త్రీ. కాని-- ఆమె గురించి నీకు చెప్పే అవసరం లేదు. ఎందుకో ఆమె కనిపించినా, మాట్లాడినా అదో విధమైన వికారం కలుగుతుంది. అది కోపమో, అసూయో తెలుసుకోలేక పోతున్నాను." అంది నిట్టురుస్తూ పార్వతి.
కవిత ఊహిస్తూ , "ఆమెకి సరిగ్గా నీ వయసు ఉంటుందనుకుంటాను" అంది.
"అరె! నీకెలా తెలిసింది?' అంది పార్వతి కళ్ళు విప్పార్చి.
"ఇంకా విను; నీ కన్నా తెలివి తేటలుగలదై ఉండాలి!"
"అయితే నేను శుద్ధ మొద్దావతారాన్ననా నీ ఉద్దేశం?' కోపగించుకున్నట్టంది పార్వతి.
కవిత నవ్వుతూ , "నీతో బలే తంటా ,మహా తల్లీ! పోల్చి చెప్తున్నానంతే! ఔనో, కాదో చెప్పు అల్లరి చెయ్యక. నువ్వసూయ పడుతున్న ఆ అమ్మాయి అన్ని విషయాల్లో నూ నీ కన్న ఒకటి రెండు మెట్లు అధిగమించి ఉంటుందని ణా అనుమానం........."
కవిత మాట పూర్తీ చెయ్యనివ్వలేదు పార్వతి. "ఛ! ఛ! నే నొప్పుకోను. అన్నిట్లో సమానమంటే ఏమో గాని నాకంటే హెచ్చయినదెం లేదు ఆ అమ్మాయిలో. ఆమె మాటలు నాకెందుకో వెగటు పుట్టిస్తాయి."
"అలా చెప్పు. ఆమె యాసగా మాటాడుతుందేమో" అన్నది కవిత పార్వతిని శల్య పరీక్ష చేస్తున్నట్టు.
"అది కాదు , కవీ! ఆమెను ఎప్పుడు కలుసుకున్నా ఒకటే చిక్కు. తన భర్త గారి మంచితనాన్ని తన పిల్లల చిలిపి పనుల్ని , తన సంసారంలోని సౌఖ్యాన్ని వర్ణిస్తుంది కదా! వినలేక చావాలి. అంత డాబుగా చెప్పుకోవలసిందేముందో తెలీదు. నాకే కాదు, ఎవరికైనా తలనొప్పి నిశ్చయంగా వస్తుంది."
"మనలో ఏవో లోపించినప్పుడే అవతలి వాళ్ళ పై అసూయ కలగడాని కవకాశం ఉంది. అసూయంత హీనమైంది మరొకటి లేదు" అన్నది కవిత తేలిగ్గా.
పార్వతి కవిత చేతిలో ఉంచిన తన చేతిని విసురుగా ఇవతలకు లాక్కుంది.
"అక్కడికి నేను పరమ మూర్ఖురాలి నైనట్టు నీ అభిప్రాయం కాబోలు. పోనీ, అసహ్యించుకో ఇష్టం వచ్చినట్టు." అంది ఆవేగంతో.
'అంతే మరి! కోపం కన్న ప్రమాదకరమైంది అసూయ. కోపం చలలరుతుంది కాని ఇది రగులుతుంది. అయినా అసహ్యపడి ,మనం చేసేదేముంది? మైలార్డ్ ! పార్దన్ దెమ్ -- అంటూ వాళ్ళ తరపున దేవుడి నొకసారి స్మరించి ఊరుకోవాలని పిస్తుంది నాకు."
పార్వతికి ఉచ్చ్వాస నిశ్వాసాల వడి ఎక్కువైంది. దుఃఖమూ వచ్చేటట్టే ఉంది. "మహానుభావురాళ్ళు! తమవంటి సాదు స్త్రీ రత్నాలకి అసూయ, కోపం లాంటి మానవ సహజ గుణాలు ఏ కోశానా వుండవు. అదృష్ట వంతులు" అంది తనను చూడని కవితను సూటిగా చూస్తూ.
"ణా కేవరి మీదా అసూయ లేదు. నిజమే!" అంది కవిత పార్వతి కోపాన్ని లక్ష్యం చేయక గంబీరంగా.
"మీలాంటి వారు దాచుకున్నట్టు కాకుండా నేను పైకి వెల్లడి చెయ్యడమే పొరపాటైంది" అన్నది పార్వతి కసిగా, అక్కడి నుంచి లేచి.
"దాచుకున్నా, వెల్లడి చేసినా అది తప్పే అవుతుంది, పారూ!"
ఇద్దరూ మౌనం వహించారు. పార్వతి బల్ల దగ్గర నిలబడి ఏదో పత్రికను చిత్రవధ చేస్తున్నది.
కొంతసేపటికి కవితే లేచి, "పార్వతీ! నువ్వొక కధ వ్రాసి ఇవ్వాలి. మా పత్రికలో వేస్తాం" అంది అతి సహజ ధోరణి లో మృదుత్వం ధ్వనించేటట్టు కూడా.
'అక్కర్లేదు. నువ్వే చూస్తావు కదూ ఆ కధను? చచ్చినా ఇవ్వను. నీలాటి మహా రచయిత్రి చేతిలో పడనివ్వను ణా కధల్ని. అవమానం చెయ్యటానికే కాచుకుంటారు గర్వంతో.
"నేను మహా రచయిత్రినా?" అంది నవ్వుతూ కవిత. "పిచ్చిపిల్లలా కోపం దేనికి? బాగానే వ్రాస్తావని అడుగుతున్నా."
"ధన్యురాల్ని! మహా రచయిత్రి గారు స్వేస్ లాగ నడుస్తుంటే స్వైన్ లా నేనెందుకు వెనక ? తమరు వెళ్ళచ్చు."
"కోపంతో ఏం లాభం లేదు, పారూ! హృదయ ముంటే దాన్ని అదుపులో తెచ్చుకోవడం నేర్చుకోవాలి నీకింకా వయసు కి తగ్గ అనుభవం లేదు" అన్నది కవిత వెళ్ళుతూ.
నిర్విచారంగా వెళ్ళుతున్న ఆమెను చూస్తుంటే పార్వతికి గుండెల్ని పిండుతున్నట్టనిపించింది.
'తన నిష్కల్మషమైన ప్రేమ నీమే కొంచెం కూడా తెలుసుకోదు.' ఉక్రోషంతో కళ్ళు తుడుచుకుంది పార్వతి. ఎన్నిసార్లు అవమానించినా ఆమె గారి వెంట వెంట తిరగడం వల్లే ఈ లోకువ. ఆమె మాటలు తన నేన్నిసార్లు బాధించాయి? ఒకసారి ఉత్సవాల్లో కార్యదర్శిని గారి ప్రోద్భలంతో ఒక కధ వ్రాసి చదివితే, "ఓ నవ రచయిత్రీ శతశతాభినందనలు కాని మళ్ళీ ఇల్లాటి ఘోర మైన కధలు వ్రాయకు. ఏమన్నా అంటే గురువు నని అనుమానించి నలుగురూ నన్నే దుయ్యబడతారు" అనేసింది నలుగుర్లో.
మరొకసారి షాపింగ్ కు కలిసి వెళ్ళినప్పుడు ముచ్చయైన కృష్ణ విగ్రహం కనిపిస్తే కొనుక్కున్నది తను.
"మీరాబాయ్ వైపోగలవు జాగ్రత్త" అని అక్కడా నవ్వడమే తన వైపు చూసి.
ఎందుకలా పరహసించి నట్టంటుందో తెలీదు. ఆమె ఎంత నిరసనగా చూసినా వదిలి ఉండలేని తన బలహీనతెమిటో? ఈ బంధం ఏమిటో?
రాజు రావటంతో చప్పున తల దించుకుంది పార్వతి, ఆలోచనలు కట్టి పెట్ట ప్రయత్నిస్తూ.
"నీ కవిత కాదు కాని నన్ను ప్రాణాలతో ఉండనిచ్చేటట్టు లేదు. ఆకలేస్తోంది . వంటగది కి పద తిన్నగా!"
"ఇదిగో వస్తున్నా" అంది తల దించుకునే . తన సజల నయనాలు అతనికి కనిపిస్తాయని భయం.
రాజు ఏమనుకున్నాడో! పార్వతి ముఖ వివర్ణం చూశాడు.
"కవిత ఏమన్నా అందా?" అన్నాడు పెదాలు బిగపట్టి, ఆమె చుబుకాన్ని పై కేత్తుతూ మొహాన్ని పరీక్షించాలనే ప్రయత్నంతో.
అతని చేతిని తోసి "పదండి" అని చరచర పోయింది పార్వతి, మొహం దాచుకుంటూ.
