ఆ తొలిరోజు సూర్యోదయ సమయాన పద్మకు సుఖప్రసవమై అమ్మాయి పుట్టింది. అదీ శుభవార్త!
"నువ్వూ సరిగా అదే సమయంలో పుట్టా వమ్మా, శాంతీ మళ్ళీ యింకో శాంతి పుట్టింధన్నమాట నా శాంతివనానికి." ఆనంద బాష్పాలు ఒత్తుకున్నాడు బలరామయ్య. ఆ ఆనందాతి రేకం చూచిన అందరూ ఆశ్చర్యపోయారు.
"అదేమిటి, నాన్నా? నేనూ శాంతి. పాపా కూడా శాంతేనా?" అడిగింది శాంతి ఆశ్చర్యంగా.
"అవును. నువ్వు శాంతి. పాప ప్రశాంతి. ఆడపిల్ల అంటే యింటికి లక్ష్మి. మీవల్లనే నమ్మా మేము సుఖపడ్డా, సంతోషపడ్డాను." కూతురు తల నిమిరాడు ఆప్యాయంగా.
"ఓహ్ ఇంకేం? అప్పుడే నాన్నగారు నామకరణంకూడా చేసేశారు" అన్నాడు నవ్వుతూ శ్రీహరి.
"అయితే ఆపేరే పెడతావా?" అనడిగింది లక్ష్మీదేవి చిరుదరహాసంతో.
"మనం పెట్టేదేముందమ్మా? నాన్నగారు పెట్టేశారు. అంతే. అంతకంటే గొప్పపేరు పెట్టగలనా నేను?"
"నీకెంత గౌరవం, నాయనా, తల్లిదండ్రుల మీద!" ఆనందాశ్రువులు స్రవించాయి లక్ష్మీదేవి చెంపలపై.
నారాయణా, శ్యామలా విని ఊరుకున్నారు, అదేదో తమ కవసరమైన విషయంలాగా. బారసాలకు కూడ వెళ్ళలేదు. ఏదో సాకుపెట్టి తప్పించుకున్నారు. కాని శ్యామల భర్తతో అంటూన్న మాటలు శాంతి వినటం తటస్థించింది. "ఆ. వెళ్ళేదేమిటి లెద్దురూ? ఎందులో మనతో సరీ, సాటీనీ? మనం వెళ్ళి నిల్చోదగిన హోదాయే లేదు."
సమాధానంగా నారాయణ బిగ్గరగా నవ్వట, విన్పించింది.
'చీ! సంకుచిత హృదయాలు' అని అసహ్యించుకుంది శాంతి.
వెళ్ళుతూనే వదినను కౌగలించేసుకుంది శాంతి- "ఎంతకాలమో అయిపోయినట్లుంది వదినా, నిన్ను చూచి" అంటూ.
"నిన్నింత చలాకీగా, సంతోషంగా చూస్తానని అనుకోలేదు, శాంతీ." ఆడపడుచు తల నిమురుతూ పద్మ ఆనందాశ్రువులతో తడిసేసింది.
"ఏం? వదిన ఆడపడుచులకు పొత్తు లెక్కువైపోయాయి ఇక మాతో కాస్త మాట్లాడుతారా?" పరిహాసమాడాడు శ్రీహరి భార్యతో.
అందరూ నవ్వుకున్నారు.
"పాప ఎంతఅందంగా ఉంది! అంతా మా అన్నయ్య పోలిక!" అంది శాంతి.
"కాదు. మా అక్కయ్య పోలిక." సరదాగా కాస్సేపు వాదించుకున్నారు శాంతీ, జయలక్ష్మీ. లక్ష్మీ, శ్రీహరీ, పద్మా ముచ్చటగా చూచారు వాళ్ళను. లక్ష్మీదేవి ఆప్యాయంగా కోడలి ఆరోగ్యాది విషయాలు మరీ మరీ అడిగి తెలుసుకొంది.
తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు శాంతి, పద్మకు అన్ని విషయాలూ చెప్పింది. "ఈ పరిస్థితిలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది, వదినా. ఏమిటో అందరికీ ధైర్యంగా ఉంటుంది నువ్వుంటే. నువ్వొచ్చేస్తే ఇంటికి నిండుదనమే లేదు. నువ్వు మూడో నెలను రావడమే మంచిదయినా తప్పదు మరి. అక్కడి కొచ్సినా నువ్వు పెద్ద కష్టపడక్కర్లేదుగా? మేమున్నాము. నౌకర్లున్నారు."
విషయాలన్నీ విన్న పద్మకూడ చాల బాధ పడింది. "అవును, శాంతీ. తప్పక వస్తాను. మీతోనే తీసుకుపొండి" అంది.
శాంతి పైకి అనకపోయినా మనస్సులోనే అంజలి ఘటించింది, తానడగగానే అభ్యర్దనను మన్నించిన వదినకు. తాను శాంతి నికేతన్ లో ఉండగా వదిన యిలాగే అడిగితే మాత్రం తానామె మాటను మన్నించక మూర్ఖంగా త్రోసిపుచ్చింది.
51
శాంతివనంలోకి ప్రశాంతి వచ్చింది. ఆ మనుమరాలిని, బలరామయ్య ఒక్క క్షణమైనా వదిలి ఉండడు. లక్ష్మీదేవికి మరీ అపురూపం ప్రశాంతి అంటే.
శాంతి సరేసరి. ఎప్పుడు చూచినా ప్రశాంతి బుగ్గల్ని ముద్దులతో నింపేస్తూంటుంది.
"నీ పెంకితనమంతా దానిక్కూడా నేర్పేస్తున్నావమ్మా, శాంతీ" అన్నది ఒకనాడు పద్మ హాస్యంగా.
"అయితే నేను పెంకెదాన్నా? మీకందరికీ అంత కష్టంగా ఉందన్నమాట నేనంటే" అంది శాంతి బుంగమూతిపెట్టి.
"లేదు, శాంతీ. హాస్యంగా అన్నాను. నువ్వు ఈ ఇంటి వెలుగువు. శాంతీ, కాంతీ నువ్వే మాకు" అంది పద్మ ఆప్యాయంగా.
అక్కడే ఉన్న శ్రీహరి - "మరీ నీ అంత మందకొడిగా, మార్దవంగా ఉండమంటా వేమిటి అందర్నీ? కొంచెం చిలిపిగా కొంచెం అల్లరిగా ఉంటేనే బాగుంటుంది" అని భార్య్తతో అంటూ చెల్లెలితో, "మేనకోడలికి బాగా అల్లరి నేర్పవే, శాంతీ. మీ వదినకు పాపం చేతి నిండా పని ఉండక ఏం తోచడం లేదు" అన్నాడు.
శాంతి పకపకా నవ్వింది. కాని వెంటనే గంభీరమైపోయింది. "వదినా, ప్రశాంతి మనందరికీ యింత ముద్దు. అసలు పసిపాపపై ప్రేమ ఉండని దెవరికి? కాని, చిన్నన్నయ్యా, శ్యామల వదినా బొత్తిగా అలాగుంటారేమిటి? అసలు ఎప్పుడూ పాపను కన్నెత్తికూడా చూడరు."
పద్మ నవ్వింది. "అయిష్టమే అనెందుకనుకోవాలి, శాంతీ? కొందరికి పసిపిల్లలను ఎత్తుకోవడానికి సిగ్గుగా ఉంటుంది. మరీ పసివాళ్ళను, అలా మెత్త మెత్తగా ఉండిమెడైనా నిలబెట్టలేని బిడ్డలను ముట్టుకోవడానికే భయంగా ఉంటుంది. పాపం, శ్యామల ఆ తరహా వ్యక్తేమో!"
"చాలిద్దూ వదినా. నువ్వెవర్నీ పరుషంగా మాట్లాడవు. ఆవిడకేమో మన పొడే గిట్టదు." విసుక్కొంది శాంతి.
"ఏమైనా, మీ తోటికోడలికి చాలా గర్వమక్కయ్యా. ఎక్కడా మనం అననే అనం, ఆవిడ కళ్ళకు" అంది జయలక్ష్మి. ఆమె అక్కకు సాయంగా కొంతకాలం ఉండటానికి వచ్చింది.
"నోర్ముయ్, అధికప్రసంగం నువ్వూను!" చెల్లెల్ని తీవ్రంగా మందలించింది పద్మ.
శ్రీహరి ఎటూ మాట్లాడలేదు. నెమ్మదిగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. శాంతి అన్న వెనుకనే వెళ్ళింది, బయట రామన్న కంఠం విన్పించి. ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరాలు పట్టుకువచ్చాడు రామన్న. ఏవో రైతుల దగ్గర్నుంచీ, వ్యాపార సంబంధంమైనవీను. ముఖ్యమైనవి లేవు.
"అన్నట్లు మేం ఊళ్లోలేని ఈ నాలుగు రోజులలో ఏమీ ఉత్తరాలు రాలేదా, రామన్నా?"
"వచ్చాయి, బాబూ చిన్న కోడలు పుచ్చుకున్నారు. మీకివ్వనేలేదా?"
"పోయి అడిగి తీసుకురా."
శ్యామల గదిలోనుంచి నాలుగు ఉత్తరాలు తీసుకువచ్చాడు రామన్న, వాటిలో మూడు శ్రీహరికీ, ఒకటి శాంతికీ.
"అరె! రాజా ఉత్తరం తిరిగి వచ్చింది. అక్కడ లేడట!" అన్నాడు శ్రీహరి నిర్ఘాంతపోతూ.
"నేను వ్రాసినదీ తిరిగొచ్చింది. కాని, యిలా చూడు." భిన్నవదనంతో ఉత్తరం అన్న చేతిలో ఉంచింది శాంతి. శ్రీహరి కూడా ఆశ్చర్యపోయాడు. ఆ ఉత్తరం చింపి ఉంది.
"ఎవరంటావ్?"
"ఇంకెవరు? అనుమానం కూడా దేనికి?" అంది శాంతి.
"ఛీ. బొత్తిగా యింత అజ్ఞానం, మూర్ఖత్వం ఏమిటి?"
"ప్రతి విషయంలోనూ యిలా జరుగుతుంటే చాలా కష్టమన్నయ్యా."
పద్మ కూడా సంగతి విని చాలా ఆశ్చర్యపోయింది; విచారించింది.
"అడగనా?" అంది శాంతి.
"వద్దు. ఎందుకు గొడవ?" అంది పద్మ.
"అడగనీ. అన్నిటికీ ఊరుకోవడంకూడ అంత మంచిదికాదు. దాని స్నేహితుడికి అదియేమో వ్రాసుకుంది. విప్పి చూడవలసిన అవసరం తనకేమిటి? బాధ్యత ఉన్నవాళ్లు చూచినా అర్ధముంది. అడుగు, శాంతీ" అన్నాడు శ్రీహరి.
పద్మా, శాంతీ కూడ చాలా ఆశ్చర్యపోయారు. శ్రీహరికి ఎవరిమీదా ఎప్పుడూ అంత కోపం రాగా చూడలేదు వారు.
శాంతి చిన్నవదిన గది దగ్గరకు వెళ్ళింది.
"వదినా, లోపలికి రావచ్చా?"
"ఎందుకు?" అంటూ శ్యామల తానే వచ్చింది వరండాలోకి.
"ఈ ఉత్తరం ఎవరు చించారు? నువ్వేనా?"
"నేనే. ఏం చెయ్యకూడదా?"
"అందర్నీ బ్రూట్స్, యిడియట్స్ అనే నువ్వు యింత బ్రూట్ లాగా ఎలా ప్రవర్తిస్తున్నావు? 'కల్చర్ లెస్ ఎడ్యుకేషన్' ఎందుకు?" కోపంగా అంది శాంతి.
"ఆహాహా! నీ పెద్ద కబుర్ల బండారం బయటపడిందనా అంత ఉక్రోషం?"
"అదంతా నీకనవసరం. ఇటువంటి తెలివి తక్కువ పనులెప్పుడూ చెయ్యకు."
"అదే నేనూ నీకూ సలహా యిస్తున్నాను. ఎందుకీ తెలివితక్కువ నాటకాలు? పెళ్ళి వద్దనడమేమిటి? రాజాతో ఆ ఉత్తరాలేమిటి? అతఃడిని ప్రేమించావా?" హేళనగా ఉంది ధోరణి.
ఒళ్ళు తెలియని కోపంతో అంది శాంతి "అవును, ప్రేమించాను. ప్రేమించానో, పెళ్ళి చేసుకుంటానొ నీకనవసరం. ఇటువంటి అనవసర కుతూహలం ప్రదర్శిస్తే మాత్రం ఫలితాలు బాగుండవు. నీ హద్దుల్లో నీవుండు."
"షటప్. ఊరుకొన్నకొలదీ మితిమీరుతున్నావే?"
"యూ షటప్. మేనర్ లెస్ క్రీచర్" అంటూ శాంతి వెళ్ళిపోయింది.
వరండా చివరినుండి అంతా చూస్తూన్న పద్మా, శ్రీహరీ ముఖముఖాలు చూచుకున్నారు.
"ఇక ఈ యింట్లో యిలా కలిసి ఉండలేమనిపిస్తోంది. ఇంకా పెద్ద గొడవలువచ్చి మనస్పర్ధలేర్పడి అందరికీ తెలిశాక విడిపోయేదానికంటే ఇప్పుడే ఏదో దారి చూచుకోవడం మంచిది" అంది పద్మ స్వగతంలాగా.
కాని, శ్రీహరి అదిరిపడ్డాడు. "పద్మా!"
"అవును." నిర్జీవంగా నవ్వింది పద్మ.
"తప్పదంటావా?"
"నే ననేదేముంది? తప్పని పరిస్థితులు వస్తాయి."
"భగవాన్! ఎంతలో ఎంతటి మార్పులు తెచ్చావు?" నిట్టూర్చాడు శ్రీహరి నిస్సహాయంగా.
