Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 41


    ప్రభాకరం వారిద్దరినీ వారి స్వగ్రామాలతో సహా పరిచయం చేశాడు. పరిచయం జరిగిన మరుక్షణ మే 'డాక్టరు సుందరం గారు మీకు తెలుసా?' రామాన్ని చూస్తూ ప్రశ్నించారు సుందరరామయ్య గారు.
    'తెలుసండీ ప్రస్తుతం మా ఆస్పత్రి లోనే పనిచేస్తున్నాడు. వాడు నా క్లాసు మేటు కూడా!' అన్నాడు రామం.
    శారద ఆశ్చర్య పోయింది. నీరజకు సుందర రామయ్య గారికి సుందరం తో పరిచయం ఎలా కలిగిందో ఆమెకు అర్ధం కాలేదు.
    'డా సుందరం సమయానికి నాకు చికిత్స జరిపి ఉండకపోతే నేను ఏమైపోయి ఉండేవాడినో? ఈమధ్య ఒకటి రెండుసార్లు వచ్చి వెళ్ళారు కూడా. వారిని మళ్ళీ చూడాలని ఉంది. జబ్బు తిరగ పెడుతుందేమో నన్న అనుమానం కలుగుతూ ఉంది.'
    'రేపు నేను యింటికి వెడుతున్నాను. నాతొ రండి!' అన్నాడు రామం.
    'లేదండి వీలుంటే వారినే ఒక్కసారి వచ్చి వెళ్ళమనండి.'
    'అలాగే!'
    ప్రభాకరం సుందరరామయ్య గారిని చూస్తూ 'మామయ్యా ఈరోజు జరిగిన సన్మాన సభకు నీవు రాలేదేం? చాలా ఘనంగా జరిగింది. ఆ రచయిత్రి ఎవరో తెలుసా? ఇప్పుడు నీముందు కూర్చున్న శారదే!?' సంభషణను అసలు విషయం లోకి దింపాడు.
    'అలాగా! ఆ జ్యోత్స్న వు నీవేనా తల్లీ' ఆశ్చర్యంతో అన్నారు సుందరరామయ్య గారు.
    'అవునోయ్ మన ప్రభాకరంలో మార్పు రావడానికి మన శారద రచనలే కారణ మయ్యాయి. శారదకు మేమెంతో ఋణపడి ఉన్నాము. ఆ ఋణం ఎలా తీర్చుకోగలమో ఏమో?' శ్రీపతి గారన్నారు.
    'శారద మాకు చేసిన మేలు ఈ జన్మలో మరిఛి పోలేను.' అని సుందరరామయ్య గారి వైపు చూస్తూ 'అన్నయ్యా ఇందాక నీవు మానసికంగా బాధపడుతున్నానని అన్నావు నీకు మానసిక బాధలే ముంటాయి?' ప్రశ్నార్ధకంగా తమ అన్నగారి ముఖంలోకి చూస్తూ అన్నారు అన్నపూర్ణమ్మ గారు.
    'ఆ! ఆయనకు మానసికంగా బాధలేముంటాయే? నీ పిచ్చి గాని!' అన్నపూర్ణమ్మ గారిని ఎగతాళిగా చూస్తూ అన్నారు శ్రీపతి గారు.
    'నేనిక్కడికి వచ్చేసరికి మీరంతా ఏదో విషయం లో చర్చించు కోవాలనే ఉద్దేశం తో సమావేశ మైనట్లుగా నాకు తోచింది. ఆ విషయమేమిటో తెలుసుకోవచ్చా?' అందరి ముఖాలలోకి ప్రశ్నార్ధకంగా చూస్తూ అన్నారు సుందరరామయ్య గారు.
    'అవును రచయిత్రి శారదకు మా యింట్లో కూడా సన్మానం జరిపించాలనుకొని ఆ విషయమే చర్చించాలను కుంటూ ఉండగా నీవోచ్చావు' సుందర రామయ్య గారి నుద్దేషిస్తూ అన్నాడు ప్రభాకరం.
    'చినబాబు గారూ! ఏమిటిదంతా? నాకు సన్మానం వద్దు.....ఏమీ వద్దు అసలు ఈరోజు రవీంద్ర భారతి లో జరిగిన సంమానికే మొదట నేను ఒప్పుకోలేదు. అరుమసాలు నాకు ఉత్తరాలు వ్రాసి నన్ను విసిగించారు. వారి పోరు పడలేక చివరకు ఒప్పుకోవలసి వచ్చింది. జరిగిన డానికే సిగ్గు వల్ల ఎంత గానో కుంచించుకు పోతున్నాను. అంతే కాకుండా మీరు, పెదబాబు గారు, అమ్మగారు నన్ను అనవసరంగా పొగుడుతున్నారు. ఋణ పడిందీ, తీర్చు కోవలసినది నేను. మీరంతా కాదు. 'బాధవల్ల, విచారం వల్ల శారద కు కళ్ళు చెమ్మగిల్లాయి. ఎవ్వరూ చూడకుండా తుడుచుకుంది ఆమె.
    'సన్మానించవలసిన అర్హత గలవారిని ఎవరు వద్దన్నా అగరు. ఆ అర్హత లేని వారిని కోరి ఎవ్వరూ సన్మానించరు. నీకేమమ్మా అన్ని విధాల అందుకు తగిన దానవు. ఎంతో అనుభవ ముండి, కాకలు తీరిన సంఘ సంస్కర్తల కన్న నీవే ఈ సంఘానికి ఎక్కువగా సేవ చేశావు. ముఖ్యంగా మా కుటుంబాన్ని ఎంతో పెద్ద విపత్తు నుండి కాపాడావని నొక్కి చెప్పవచ్చు.' ఆప్యాయత ఆదరణ శ్రీపతి గారి ముఖంలో ఉట్టి పడుతున్నాయి.
    'పెదబాబు గారూ! దీని కంతటి కి మూల కారణం నేను కాదు. చినబాబు గారే! వారి దుడుకు ప్రవర్తనను, వారికి పెద్దల ఎడ గల నిర్లక్ష్యాన్ని , భారతీయ సంస్కృతీ సభ్యతల పట్ల గల ఏహ్యభావాన్ని దృష్టి లో ఉంచుకొని తీరిక సమయాలలో కాలక్షేపానికి వ్రాసిన కధలు వ్యాసాలు యింతమందిని ఆకర్షించి యిటువంటి చైతన్యాన్ని ప్రజలలో తీసుకు వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు. జన్మతః సద్వంశం లో ఉద్భవించిన చినబాబు గారు వారి ప్రవర్తనను మార్చుకోవడం లో అంతగా ఆశ్చర్య పడవలసిన అవసరమేమీ లేదు. అమాయకత్వంతో, చెడు స్నేహాల వల్ల చెడును ఆచరణ లో పెట్టారు. అది చెడు అని వారి మనసుకు నచ్చే విధంగా చెప్పగలిగిన వారు వారికి యిక్కడ ఉండి చదువుకున్నంత కాలం తటస్థ పడలేదు. మొదట నేనూ అందుకు ప్రయత్నించి విఫలం పొందాను. నీరజ కూడా నాలాగే భంగ పడిందని విన్నాను. కేవలం  నారచనల వల్లే వారిలో యిటువంటి మార్పు రాలేదు. ఎవరి జీవితంలో నైనా మలుపు రావాలంటే బలీయమైన ఒక సంఘటన జరగాలి. ఆ సంఘటన చినబాబు గారి జీవితంలో రోజా ద్వారా జరిగింది. చినబాబు గారిలో వచ్చిన ఈ మార్పుకు ప్రధమ కారకురాలు రోజా! విషం కూడా ఒక సమయంలో మందుగా ఉపయోగ పడే విధంగా ఆమె తన చెడుప్రవర్తనతో చినబాబుగారి మనస్సును చెడు నుంచి మంచి మార్గానికి తిప్పివేయగలిగింది. ఈ విషయంలో ఆమె పాత్ర ఎంతవరకో నాదీ అంత వరకే! చినబాబుగారు ఈ విధంగా మారగలరని ఆమె ఊహించలేదు. నేనూ ఊహించలేదు. ముఖ్యంగా మీరు ఇప్పుడు చేయవలసిన సన్మానం నాకు కాదు ప్రసాద్ గారికి చేయాలి. వారి సహచర్యంలోనే చినబాబుగారు పూర్తిగా మారిపోయారు. ఈ విషయంలో నా అసమర్ధత మొదటే వెల్లడైంది' గంభీరంగా అంది శారద.
    ఆమె మాటల్లోని నిరాడంబరత్వము అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
    'మీరలా అనకూడదు. మీ వ్యాసాలు చదివిన తర్వాతే మన భారతీయ సంస్కృతి సభ్యతలలో గల విశిష్టత నాకు అర్ధమయింది. నేను ఎన్ని చెప్పినా చెవిన బెట్టని ప్రభాకరం మీ వ్యాసాలు చదువుతూ క్రమంగా మారాడు. మీరు ఎన్ని సన్మానాలకైనా అర్హులే! ప్రభాకరం చేసిన సన్మాన ప్రతిపాదనను నేను బలపరుస్తున్నాను' సౌమ్యంగా అన్నాడు ప్రసాద్.
    'అలా బలపరిచేవారిలో నేను కూడా ఒకడిని' చిరునవ్వుతో అన్నాడు రామం.
    'అమ్మా! అంతా ఉబలాట పడుతున్నారు. కాదనకు. ఏదో మా శక్త్యానుసారం ఒక చిన్న వేడుక జరుపుకుంటాం' తన కుమారునిలో మార్పు తీసుకొచ్చిందన్న కృతజ్ఞత వారిముఖంలో కన్పించింది.
    'కాదనకమ్మా! అన్నారు శ్రీపతిగారు.
    'అక్కయ్యా! నీవు వొప్పుకుని తీరాలి' అంది నీరజ ఎంతో ఆప్యాయంగా|
    'అమ్మా శారదా! నీవు రాసిన కొన్ని వ్యాసాలు 'అబల నిస్సహాయత' అనే కథానిక చదివాను ఆ వ్యాసాలు కథానిక నా చెంపను చెళ్ళు మనిపించేటట్టుగా వున్నాయి. గతంలో నేను చేసిన నేరాన్ని నిలదీసి ప్రశ్నించాయి. నా ప్రవర్తించేవారందరికీ అవి సింహస్వప్నాలుగా మారాలని అటువంటి శక్తివంతమైన రచనలు చేయగల సామర్ధ్యాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించాలని దీవిస్తున్నాను.' సుందరరామయ్యగారు గత స్మృతులు స్పురణకు తెచ్చుకుంటూ కన్నీరు కార్చారు.

                                *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS