"రండి. మీ సరోజ వచ్చింది."
రాజు తెల్లబోయాడు.
"నువ్విలా రా! ఒక సంగతి అడగాలి" అన్నాడు.
"ఏమిటి? అవతల అదొక్కతే కూచుంది."
"ముందు కూచుండూ నువ్వు." కుర్చీలోకి తోశాడు ఆవిణ్ణి.
"చచ్చిపోయాను. ఏమిటా సంగతి?' అంది కూలబడి.
"ఇందాక నువ్వు "మీ సరోజ " అని అన్నావు. దాని అర్ధమేమిటీ?' గమ్మత్తుగా అడిగాడు.
కుర్చీలోంచి గబుక్కున లేచింది. "ఇదడగటానికెనా? ఏమిటో అనుకున్నా. అయినా ఈ సంగతి నన్నడిగేకంటే మీ దగ్గరున్న సరోజ ఫోటో నడిగితే సరి!" సుతారంగా నవ్వి సరోజ కోసం తొందర పడుతూ వెళ్ళిపోయింది . మరీ తెల్లబోయాడు రాజు.
సరోజ విసుక్కుంది పార్వతి ఎంతకూ రాక. "బాగుంది నీ అతిధి మర్యాద" అంది రాగానే.
"క్షమించండి , డాక్టరు గారూ! ఎక్కడి కన్నా వెళ్తే గంటల కొద్ది రాకపోవడం ఒక రోగం -- తమరు దీనికేమైనా మందిప్పించాలి!"
"అలాగే ఇస్తాను కాని, ఎక్కడికి పారిపోయావ్ నేను రాగానే?"
"రాజుతో చెప్పెను, అయన గారి ప్రియమిత్రు రాలోచ్చిన వార్త."
"అంత సఖ్యత ఎడ్చిందేమిటి మీ ఇద్దరి మధ్యా!"
"ఈ మధ్యే ఏడుస్తున్నది లే. నిజంగా కోపం వచ్చిందా, సరూ?"
"నా కేందుక్కోపం ! నువ్వొక ఉత్తరం ముక్కు వ్రాయకపోతే మాకు వేరే గతి లేదనుకోకు."
"అదేనా కోపం! నేనేం చెయ్యను? ఇప్పుడేమన్నా తీరిక దొరికితే ఉత్తరాలు వ్రాయాలని పించదు. కధలో, వ్యాసాలో వ్రాసుకోవాలనిపిస్తుంది."
"అదెప్పటి నుంచి! పోనీ, ఆ సంగతైనా వ్రాసేవు కావు? నా స్నేహితురాలేనని ఎంత ఇదిగా చెప్పుకుందును అందరితో" అంది సరు కొత్తగా స్నేహితురాలి చూస్తూ.
"ఆహా! ఈ మహా రచయిత్రిని గురించి నువ్వు లోకానికి చాట నక్కర లేదు."
"పోనీ , పత్రికల్లో ఏమన్నా వచ్చాయా?"
"రెండు వ్యాసాలూ, అయిదు కధలూ పడినట్లున్నాయి. అవి మా కవిత కోక లెక్కే కాదు."
"కవిత ఎవరూ?"
"ఒక రచయిత్రి . స్నేహితురాలని తప్ప మరేమనీ చెప్పలేను. ఆమె వల్లే........."
పార్వతిని మాట పూర్తీ చెయ్యనివ్వలేదు, సరోజ. "అదా సంగతి! అవును, మరి. అంత గొప్ప స్నేహితురాల్ని చూసుకొనే నన్ను మరిచి పోవడం.
"ఫో! నీకెప్పుడూ వేళాకొళాలే, తగువులే" అంది పార్వతి.
"నీకింత భారమౌతానని తెలిస్తే మా నాన్న గారు కొత్తగా కొన్న కారులోనే వచ్చేదాన్ని తిరిగి వెంటనే వెళ్ళిపోవడానికి."
"అలా కోపంగా మింగేసేట్టు చూడటం మాని ఓసారి నవ్వవే, సరూ! ఎన్నాళ్ళ యిందో నీ నవ్వు చూసి!"
సరోజకు నవ్వు వచ్చింది నిజంగానే.
అప్పుడే వచ్చాడు రాజు. "నమస్కారం , రాజు గారూ! మీ రాణి గారి అతిధి సత్కారానికి మొహం తిరిగి పోతుంది." అంది సరు నమస్కారంతో అభినయించింది నవ్వుతూ. పార్వతి నవ్వింది.
రాజు నవ్వలేదు. మౌనంగా ప్రయత్నించి నవ్వాడు. "ఇప్పుడు జీవితం ఎలా అనిపిస్తోంది మహాశయా?" అంది సరోజ పార్వతికి తెలీకుండా ఆతన్ని పరీక్షిస్తూ.
"నువ్వూ, ఈ యక్షిణి నాకు జీవితం మీదే రోత పుట్టించేశారు. ఇంకేమనిపిస్తుంది" అన్నాడు రాజు పార్వతిని చూస్తూ.
పార్వతి కాఫీలు తెస్తానంటూ లేచి వాళ్ళకు అడ్డుగా ఉండకూడదనే వెళ్ళిపోయింది.
సరోజ ప్రశ్నించింది: "రాజూ! అప్పుడు పిచ్చివాడిలా ఆత్మహత్య చేసుకుంటానని జడిపించావు గుర్తుందా? అయిదేళ్ళు ఆగమన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? బ్రతకాలనుందా?"
"ఇంకా సంవత్సరానికి పైగా ఉంది గడువు. అప్పుడే చెప్తాను." నవ్వాడు రాజు సరూ కళ్ళల్లో కి చూసి.
"పార్వతి లో మార్పు కనుపిస్తుంది." అన్నది సరోజ. "నువ్వేమైనా చెప్పు-- పార్వతి ముమ్మాటికి మంచి పిల్ల" అంది మళ్లీ అతను మాట్లాడక పోవడం వల్ల.
"కాదన్నవారెవరు?" అన్నాడు.
"మునుపు కాదనే వాడివి."
"ఔను" అని తేలిగ్గా నవ్వేసి, "ఒకరోజు కవిత పార్వతిని గురించి ఎవరితో నో చెప్తుంటే విని నమ్మగలిగాను, నువ్వు చెప్తే ఎవడి క్కావాలి?' అన్నాడు కొంటెగా.
సరోజ మొహాన్ని కందగడ్డ లా చేసుకుంది.
రెండు రోజులు విహాయసం లో విహరించే రాజహంస లాగ పార్వతి మనస్సు సంతోషంతో రెక్కలు విప్పుకుంది. సరోజ తో వాదోపవాదాల తోనే రెప్ప పాటులో కాలం జరిగిపోయినట్టనిపించింది. సరోజ వెళ్ళిపోయే రోజు కవితకు పరిచయం చేసింది.
"నా స్నేహితురాలు . డాక్టర్రై కొత్తగా ప్రాక్టీసు పెట్టింది. ఎవ్వర్ మిస్ సరోజా దేవి." చిరునవ్వుతో చెప్పింది.
"పొరపాటు -- నాకూ ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది" అన్నది సరోజ నవ్వుతూ.
"అంతే లెండి ఎప్పటికైనా. మా పార్వతి మీ గురించి చాలాసార్లు చెప్పింది. అందువల్ల మీరు మరుపురారు నాక్కూడా" అంది కవిత.
పార్వతి ఉనికి మరిచి స్వప్నం లో విహరిస్తున్నది. కవిత తనను ప్రేమతో సంబోదించి నప్పుడంతా హృదయానికి ఎందుకో అవనుభూతమైన దివ్యత్వంసంప్రాప్తించినట్టుంటుంది. ఆమె 'మా పార్వతి" అని వేరొకరితో చెప్తుంటే -- వినగలిగితే చాలు-- శోభదరిద్రాణంగా ఉన్న వనానంతరాన చిటికే లో కోటి మల్లె తీవెలు కొల్లలై పుష్పించి నట్టు లోపించిన కళలు ప్రభవించడానికి నాంది జరుగుతుంది పార్వతి విషయం లో. కాంతికి దూరమైన హృదయ కుటీరం లోకి చిలిపి వెలుగులు ప్రసరించితే ఆ అందం వర్ణనకు అందదు. పార్వతి మానసిక ఆనందం అటువంటిది.
37
పుష్య మాసపు ప్రారంభ దివసాలు. అతి శీతలంగా వీచే గాలులు శరీరపు జడత్వాన్ని వదిలించడమే కాదు; అంతర్యపు లోతుల్లోకి ప్రవేశించి అక్కడ స్మృతుల శ్రుతులను స్పృశించి పలికించి భావాతీతమైన అనుభూతుల్ని శరీరానికి , మేధకు కలిగిస్తాయి. ప్రపంచమే జలదరించి పువ్వులు రాల్చినట్టుంటుంది. ప్రకృతి కాంతతో పాటు అవర్ణనీయానందానికి అందరూ నోచుకున్న రోజులు.
పార్వతికి ఇరవై సంవత్సరాల పైన వయసున్నా-- ప్రపంచం , కాలచక్రం , ఋతుచక్రం , సృష్టి తారతమ్యాలు , సౌభాగ్య దౌర్భాగ్యాలు వ్యసన నిర్వ్యసనాలు , జీవన్మరణాలు చిత్రంగా కనిపిస్తున్నాయి. లోకపరి వృతంగా ఉన్న అందాలన్నీ నూత్నంగా గోచరిస్తున్నాయి. పార్వతి ఏ ఆనందాన్ని అందునుంచి అనుభవించిణా, ఆశించినా ఆశ్చర్యం లేదు. తనకు తెలియని శక్తిని అన్వేషించడానికి జీవితం ఒక రహదారి అయింది. ఈ మార్గంలో ప్రయాణించగా సూక్ష్మం లో పరమంగా ను, పరమం లో సూక్ష్మం గానూ ఉన్నఅజ్ఞాత శక్తి కొంతయినా జ్ఞాతం కాకపోదు. పార్వతి కి ఇట్లాంటి విషయాల్లో కొన్ని దృడమైన నమ్మకాలు ఉన్నాయి.

సంసార జీవితం పట్ల క్రమేణా మంచి అభిప్రాయాలు కొద్ది కొద్దిగా ఏర్పడుతున్నాయి. ఒక మాదిరి ఉత్సాహం గానూ ఉంటున్నది.
అప్పుడప్పుడు నిరుత్సాహం కూడా హృదయాన్ని ఆవరించు కుంటున్నది.
అభిలాష కలిగినప్పుడంతా కలుసుకోకుండా అనివార్యంగా కవితకు కాస్త దూరం కావలసి వచ్చింది.
కాకినాడ నుంచి వెలువడే 'కవిత' అనే పక్ష పత్రికకు సహాయ సంపాదకురాలైంది కవిత, ఆ పత్రిక అదినేతల కోరిక పై.
కవిత సంగతి వదిలి పార్వతి కి మాత్రం చిరాకు పుట్టింది. ఆఫీసు కు వెళ్లి కలుసుకున్నా మాట్లాడటానికి తీరికగా నిలబడటం లేదు కవిత.
పార్వతి విసుగూ, నిరాశా గమనించి ఒక ఉదయం పది గంటల సమీపాన వచ్చి పడ్డది కవిత హటాత్తుగా.
అడుగులో అడుగేస్తూ వచ్చిన ఆమెను చూడలేదు పార్వతి. మంచం కొసను వాలి ఇంటి వాసాలు రెప్ప వాల్చకుండా చూస్తున్నది. పక్కన పుస్తకాలు పడి ఉన్నాయి.
కవిత చూచింది. శరత్ 'భైరవి' , టాల్ ఫ్తాయ్ 'రిసరేక్షన్ ' , తెలుగు పత్రికలూ, మరొక వైపు మామ్ కధలు, తన నవలలు మొత్తానికి చిందర వందరగా ఉంది ఆ భాగం.
