"నీకేం కళ్ళు పోయాయా? ఈ చెట్టు నిండా ఈ కాయలేమిటి?"
విషయం అర్ధమైంది శాంతికి. "నువ్వు వెళ్ళు, రామన్నా నేను చెప్తాను" అంది.
రామన్న వెళ్ళిపోయినాడు. శాంతి, వదినవేపు తిరిగింది. "వదినా, రామన్న నౌకరేనేమోకాని ఆ సంగతి ఈ యింట్లో ఎవరికీ గుర్తు ఉండదు. అతడు మాలో ఒకడు. తేలికగా మాట్లాడకు. మమల్నందర్నీ ఎత్తుకు పెంచినదతడు."
"ఏమిటీ?" శివమెత్తిపోయింది శ్యామల. "నౌకర్ల కాళ్ళు కడుక్కు త్రాగుతారా మీరు? అయితే వాడిని 'మీరూ', 'అండీ' అని గౌరవించాలా నేను? నాకెప్పుడూ అటువంటి విషయాలు చెప్పడు."
నిర్లక్ష్యంగా నవ్వింది శాంతి. "నేను చెప్తాను; నువ్వు వినితీరాలి. తెలియని విషయాలు ఎవరూ చెప్పనిదే ఎలా తెలుసుకొంటావ్? ఈ చెట్టు కాయలు తియ్యాలని కదూ నీ ప్రయత్నం? అది సాగదు. అది మానవమాత్రులకోసం కాదు. ఆ చెట్టు కాయలన్నీ ఏడాదికోసారి రాజమండ్రీ విష్ణు మూర్తి ఆలయాని కిచ్చేస్తారు. అని భగవంతుడికోసమే. అంతేకాదు. ఈ పారిజాతముంది చూశావా? ఈ పువ్వులన్నీ దైవపూజకే. ఇవి రెండూ శాంతి వృక్షాలు - ఈ శాంతి వనానికే ప్రాణాలు. నాన్నగారికి ప్రాణాధికం. ఎవరూ వాటిని తాకనైనా తాకరాదు."
"షటప్!" తన మాట చెల్లలేదనే క్రోధంతో తనకు అవమానం జరిగిందన్న ఆవేశంలో అరిచింది శ్యామల.
శాంతికి కూడా అసహనం పెరిగిపోయింది. "ఛీ! నీలాటి వ్యక్తి ఈ యింటి కోడలై నందుకు విచారిస్తున్నాను" అంటూన్న శాంతి, "శాంతీ!" అనే శ్రీహరి గర్జనకు త్రుళ్ళిపడింది. మేడగది కిటికీలో అతడు నిలబడి ఉన్నాడన్న విషయం అంతవరకు మరిచిపోయింది శాంతి.
శ్యామలకూడ అటు చూచింది. ఆ ఇంట్లో శ్యామల కొంచెం ఎవరికైనా జంకడమంటూ ఉంటే అది శ్రీహరికే; కారణంమాత్రం తెలియదు. శ్యామలా, శాంతీ కూడ గబగబా తలలు వంచుకు వెళ్ళిపోయారు.
భిన్నవదనంతో తన దగ్గరకు వచ్చిన శాంతితో అన్నాడు శ్రీహరి: "ఎందుకు, శాంతీ? మనిషి స్వభావం తెలిసి మాట్లాడాలి."
"క్షమించన్నయ్యా. ఆవేశంలో అలా ప్రవర్తించాను" అంది మందస్వరంతో శాంతి.
"ఎప్పుడూ అలా వాగ్వాదం పెంచుకోకు. క్రొత్త మనుషులు రావడంతో క్రొత్త మార్పులు వస్తాయి. మనమేం చేయలేము. కాని, మనం కూడా ఆ స్థితికి దిగజారిపోకుండా మనను మనం కాపాడుకోవాలి. అందుకు నిగ్రహం అవసరం."
అన్నగారి సలహాను మౌనంతో ఆమోదించింది శాంతి.
రాత్రి బలరామయ్య ఆరోగ్యం విషయం చర్చిస్తూ లక్ష్మీదేవి, శ్రీహరీ, శాంతీ బలరామయ్య గదిలో కూర్చున్నారు.
"నాన్నగారు యిప్పటికి పథ్యం తీసుకుని నెలపైగా అయ్యింది. అయినా ఏమీ బలం చేకూరినట్టు లేదు" అన్నాడు శ్రీహరి.
"నాకూ అదే ఆందోళనగా ఉందబ్బాయ్. మరో డాక్టరెవరికైనా చూపెడదామా?" అంది తల్లి.
తేలికగా నవ్వేశాడు బలరామయ్య. "మరేం కంగారు పెట్టుకోకండి. నేను బాగానే ఉన్నాను, బలం అదే వస్తుంది. వార్ధక్యంలో పడ్డానుగా, మరి?"
అలా మాట్లాడుకొంటూండగానే "చిన్నమ్మా, చిన్నయ్య పిలుస్తున్నారు" అన్నాడు వంటమనిషి వచ్చి.
గబగబా లేచి వెళ్ళబోయిన శాంతికి శ్రీహరి అడ్డుపడ్డాడు - నువ్వు కూర్చో, అమ్మాయ్" అంటూ, శాంతి ఆగిపోయింది.
"వాడేం చేస్తున్నాడు?" అడిగాడు శ్రీహరి వంటవాడిని.
"ఇప్పుడే భోజనానికొచ్చారు భార్యాభర్తలు."
"సరే. అయ్యాక వాడినే ఓసారిలా రమ్మన్నానని చెప్పు."
వంటమనిషి వెళ్ళిపోయాడు.
"ఏం పనుందో? లేకపోతే వడ్డన నన్ను చెయ్యమనేమో? ఎందుకాపా వన్నయ్యా?" అంది శాంతి.
"పిచ్చిపిల్లా! నీకంతే తెలుసు. కూర్చో అదంతా వెనుక. వాడికిప్పుడు మనపై అంత అభిమానముందా? సాయంత్రం జరిగిన విషయం శ్యామల చెప్పిందేమో, అడగడానికి పిలుస్తున్నాడు."
"పోనీ, అడగనీ. భయమా?"
"ఏం చెప్పాను నీకు సాయంత్రం? మరిచి పోయావా?" చిరుకోపం ప్రదర్శించాడు శ్రీహరి. శాంతి మరి మాట్లాడలేదు.
"ఏమిటా సంగతి?" అడిగారు లక్ష్మీదేవీ, బలరామయ్యా.
శ్రీహరీ, శాంతీ వివరించారు. లక్ష్మీదేవి తన అనుభవాలు వర్ణించింది.
దీర్ఘవిశ్వాసం బయల్వెడలింది బలరామయ్య నుండి. "ఈ జబ్బువల్లా, నీరసంవల్లా నాకే సంగతులూ తెలియవు. ఇంతవరకూ వచ్చిందన్నమాట! మంచి కుటుంబంలో పిల్ల అనుకున్నాను కానీ, ఇదేం ధోరణి?" అన్నాడు.
"చాలా దురుసుస్వభావం. ఎవరితో ఎలా మసలుకోవాలో తెలియదు; చెప్తే అర్ధం చేసుకోదు. నౌకర్లముందు ఎంత సిగ్గుగా ఉంటోందో!" అంది లక్ష్మీదేవి.
"అసలు మీరేమీ మాట్లాడకండి. వినని వాళ్ళకు చెప్పి మనం కొంచెపడటందేనికీ?" అన్నాడు శ్రీహరి.
"అంతేగా, నాయనా? అలాగే నోరు మూసుకూరుకుంటున్నాను" అందితల్లి. అంతలో నారాయణ వచ్చాడు.
"రారా. ఎక్కడికెళ్ళావ్ ప్రొద్దుటినుంచీ?" నవ్వుతూ అడిగాడు శ్రీహరి.
"కాకినాడ." ముక్తసరిగా అన్నాడు నారాయణ.
ఆశ్చర్యపోయారు అందరూ.
"శ్యామల ఇక్కడుండగా నువ్వు కాకినాడ దేనికీ?" ఆశ్చర్యంగా అడిగాడు బలరామయ్య. "ఎవరికీ చెప్పనైనాలేదు."
ఇబ్బందిగా పెట్టాడు నారాయణ ముఖం. "పనుందిలే" అన్నాడు.
కాని అందరూ ఊహించగలిగారు. మామ గారితో ఏదో మంత్రాంగమన్నమాట!
"అయితే, శాంతీ, ఏమిటే సాయంత్రం ఏదో గొడవపెట్టావట?" తండ్రి ఎదురుగా ఉన్నాడన్న మొగమాటమైనా లేకుండా అనేశాడు నారాయణ.
చిన్నన్నవైపు నిర్లక్ష్యంగా చూచింది శాంతి. "గొడవలుపడి గోరంతలు కొండంతలు చేసుకొనే అల్ప కుటుంబంకాదని పరాయి వ్యక్తికి తెలియకపోవచ్చు కానీ నీకు తెలియకే అడుగుతున్నావా?"
"ఊఁ. కబుర్లు నేర్చావ్ కాని, నీ గారాలు, పెంకితనం మాదగ్గర సాగినట్టు అందరి దగ్గరా సాగవు."
"నోర్ముయ్!" బలరామయ్య ఆవేశంగా అరిచాడు. "నాశాంతిని నా ఎదటే తూలనాడతావట్రా?" కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి.
శ్రీహరి కంగారుగా కూర్చున్నచోటునుంచి లేచాడు-"మీరావేశపడకండి. నాన్నా" అంటూ. "తమ్ముడూ! ఏమిట్రా యిది? మన కుటుంబంలో రావలసిన పరిస్థితేనా యిది?" అన్నాడు నారాయణ భుజంపై చెయ్యివేసి.
"కోడలు కదా అని నానామాటలూ అనడం మాత్రం మన కుటుంబంతో జరగవలసినపనా?" అరిచాడు నారాయణ.
శ్రీహరి మందస్వరాన అన్నాడు: "ఆవేశ పడకు. నేను అసలు జరిగిన విషయం చెప్తాను. అనరాని మాటలెవరూ ఎవర్నీ అనలేదు" అని విషయమంతా వివరించి చెప్పాడు. "ఇప్పుడు శ్యామలే క్రొత్తగా మనింటికి రాలేదు. ఇది వరలో పద్మకూడ అలాగే వచ్చింది, ఈయింటి కోడలై. కాని ఆమె నెవరైనా ఏమైనా అన్నట్టు విన్నావా? క్రొత్త ప్రదేశంలో పాతిన మొక్కలాగా ఈ క్రొత్త పరిస్థితులు శ్యామలకు కొంచెం క్రొత్తగా ఉండచ్చు. అంతమాత్రాన ఆమెతో పాటు మనంకూడా తొందరపడకూడదు."
నారాయణ తిరస్కారంగా చూచాడు. "నా భార్య గతిలేక రాలేదు. నలభై వేలతో వచ్చింది. తెలుసుకో. మరెప్పుడూ యిటువంటివి జరగకూడదు." దురుసుగా అనేసి వెళ్ళిపోసాగాడు నారాయణ.
'పద్మ కట్నం తేలే'దనే అవహేళన దాగిఉన్న ఆ ఎత్తి పొడుపుడు శ్రీహరి ముఖం వాడిపోయి వెంటనే తేరుకొంది. శాంత కఠిన స్వరంతో చెప్పాడు: "ఇటువంటివి యింకెప్పుడూ జరగరాదనే నేను చెప్పేదీని. ఎవరెంత తెచ్చారన్నది రూపాయణాలతో లెక్కజూచుకోవడం కాదు. ఎవరెంత శాంత సౌఖ్యాలను తెచ్చారో తెలుసుకోవాలి."
లక్ష్మీదేవి కలుగజేసుకుంది. "చిన్నబాబూ!" చాలా తీక్షణంగా పిలిచింది.
"ఏం?" వెళ్ళిపోతున్న నారాయణ గడపదగ్గర ఆగి అటు చూచాడు. దగ్గరకు రాలేదు.
"ఏమిటిదంతా? పైగా మీనాన్నగారి ఎదటేనా యిలా ప్రవర్తించడం? నువ్వెప్పుడూ దుడుకువాడనే. అయినా మాతో ఎప్పుడూ యిలా ప్రవర్తించలేదు. ఇప్పుడెందుకిలా మారిపోయారో తెలియదు. మేము లేకపోయాక మీరెలావున్నా సరే. కాని మేము ఉండగా కుటుంబంలో ఈ కలతలు సహించలేం. అందులోనూ మీనాన్నగారి నియమాలకుగాని, అభిప్రాయాలకుగాని ఏమాత్రం భంగం రాకూడదు. నీభార్యకు చెప్పుకుని అదుపులో పెట్టుకో. శాంతి ఎవరనుకున్నావ్? ఈ ఇంట్లో పుట్టి పెరిగిన ఆడబిడ్డ! ఎప్పుడూ మహారాణి మర్యాదలు జరగవలసిందే కాని ఎవ్వరూ ఏమీ అనడానికి వీల్లేదు. కూతుళ్ళ తరవాతే కోడళ్ళు. తెలుసుకో."
వికటంగా నవ్వాడు నారాయణ. "అంత బాధగా ఉంటే ఎవరి వాటా వాళ్ళకు పారేయండి. ఎవరి బాధా ఎవరికీ వుండదు" అంటూ వెళ్ళిపోయాడు.
అందరికీ నెత్తిన పిడుగులు వర్షించి నట్లైంది. బలరామయ్య గజగజా వణికి పోయాడు. క్రోధం పట్టలేకపోయాడు.
"ఓరి దౌర్భాగ్యుడా!" శక్తి కొలదీ అరిచాడు. కాని ఆపైన మాట్లాడలేకపోయాడు. ఆముప్పిరి గొన్న ఆవేశాన్ని పెద్ద దగ్గు తెర కప్పివేసింది.
"నాన్నా. నాన్నా," శ్రీహరీ, శాంతీ కంగారు పడి దగ్గరకువెళ్ళి పట్టుకున్నారు. లక్ష్మీదేవి కంటతడిపెడుతూ భర్త గుండెలను అరచేతిలో నిమరసాగింది.
అయిదు నిమిషాలకు ఎలాగైతే దగ్గుతగ్గింది. బలరామయ్య అదే పనిగా ఆయాసంతో రొప్పసాగాడు. మంచినీళ్ళు త్రాగించి పడుకోబెట్టారు.
శ్రీహరి పశ్చాత్తాప స్వరంతో అన్నాడు: "శాంతి అక్కడికి వెళ్తే నే ఏదో అని నొప్పిస్తాడనుకొన్నాను కాని ఇక్కడింత జరుగుతుందని ఊహించలేదు."
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. చాలాసేపు ఎవరి ఆలోచనలలో వారు ఉన్నారు.
రాత్రి చాలా గడిచింది. మెల్లగా బలరామయ్య అన్నాడు: "పడుకో అమ్మా, శాంతీ. చాలా ప్రొద్దుపోయింది."
"అవును, శాంతీ. పడుకో వెళ్ళి నీగదిలో. తలుపులన్నీ చూసివచ్చి నేనిక్కడే పడుకుంటాను నాన్నగారి దగ్గర. మళ్ళీ దగ్గువస్తే అమ్మ ఒక్కతీ కంగారుపడుతుంది" అన్నాడు శ్రీహరి.
శాంతి వెళ్ళిపోయింది.
"వాళ్ళేమైనా అన్నా మాట్లాడకు." వెనుక మంచి తల్లి హెచ్చరించింది.
50
వెలుగు నీడలలా ఒక్కో సంతోషం వెనుక విచారం వెన్నాడుతుంది. ఒక్కో విచారాన్ని ఆనంద సంఘటన అనుసరిస్తుంది. ఈ ఆశా నిరాశా రజ్జువులలో ఉయ్యాలలూగేదే మానవ జీవితం.
ఆ రాత్రి విచారంతో, కలతతో నిద్రపట్టక బాధపడిన బలరామయ్య దంపతులూ, శ్రీహరీ, శాంతీ తెల్లవారుతూనే వచ్చిన మనిషి తెచ్చిన శుభవర్తమానం విని ఆనందసాగరంలో ఓలలాడి పోయారు. క్రిందటిరోజు కలతనూ, బాధనూ తాత్కాలికంగా మరిచిపోయి పండగ చేసుకున్నారు.
